అయినా బయటపడకుండా "ఏమిటండీ?" అన్నాడు తను మర్యాదగా.
"ఆరోజు మీరు నా పర్స్, బస్ పాస్ తెచ్చి యిచ్చినప్పుడు కాస్త పరుషంగా మాట్లాడాను. తీరా రూమ్ కెళ్ళి ఆలోచిస్తే- నా విపరీతమైన ప్రవర్తన నాకే నచ్చలేదు. నాకోసం వెదుక్కుని, నేను పారేసుకున్న వాటిని తెచ్చి యిచ్చిన వ్యక్తిని మనసు గాయపడేలా చేశానే అని చాలా ఫీలయ్యాను. ఒక్కక్షణం పాటు నేను మీరై ఆలోచించాను.
అప్పుడు తెలిసింది.... మీ పరిస్థితిలో నేనున్నా అలాగే చేస్తానని, అప్పుడనిపించింది మీరు చేసినదాంట్లో తప్పులేదని.
ఆ క్షణం నుంచీ మీకు సారీ చెబుదామని అనుకుంటూనే వున్నాను. కానీ ఎలా? మీ పేరు తెలియదు. అడ్రస్ తెలియదు.
నా తప్పుని నేను తెలుసుకుని సరిదిద్దుకునేదాకా నిద్రపోని మనస్తత్వం నాది.
ప్రతిరోజూ ఆఫీసుకి వెళుతూ, వస్తూ గమనించేదాన్ని మీరు ఎక్కడైనా కనిపిస్తారని కానీ కనిపించలేదు. వారం రోజులైపోయింది.
లక్కీగా ఇవాళ మీరీ షాపులోకి వెళ్ళడం చూసి డ్రైవర్ ని బ్రతిమాలి బస్సు ఆపించి దిగాను. ఆరోజు నా ప్రవర్తనకు నేను చాలా సిగ్గుపడుతున్నాను. అయామ్ వెరీసారీ" మనస్ఫూర్తిగానే అందామె.
"అయ్యయ్యో! ఎందుకలా అంటారు? ఫర్వాలేదండి" అన్నాడు తను. ఆ సమయంలో కలిగిన ఆనందం ఏమాత్రం బయటికి కన్పించనివ్వకుండా.
"ఇప్పుడు నా మనస్సు తేలికైంది. వస్తాను" అనేసి వడివడిగా ముందుకెళ్ళిపోయిందామె.
ఆమె రూపమే కాదు, వ్యక్తిత్వమూ, మాటతీరూ ఆకట్టుకున్నాయి తనకి. తృప్తిగా ఫీలయి బైక్ స్టార్ట్ చేసుకుని ముందుకు సాగిపోయాడు.
ఆ తరువాత మా పరిచయం పెరగడానికి జరిగిన సంఘటనల్ని మనస్వినితో చాలాసార్లు చెప్పించుకుని ఆనందించాను.
అవి గుర్తువచ్చి ఆనందరాగం ఆలపించాలనిపిస్తోంది... మరోసారి అవి గుర్తొస్తున్నాయి.
* * * * *
"డిపార్ట్మెంట్ స్టోర్ దగ్గర కన్పించిన తర్వాత ఆఫీసుకి వెళుతూ, వస్తున్నప్పుడు నీ గురించి చూసేదాన్ని నేను సారీ చెప్పిం ఆదరంగా మాట్లాడినా నువ్వు మళ్ళీ నాకు తారసపడలేదు.
అదే ఇంకొకరైతే జెట్ స్పీడుతో దూసుకెళ్ళి తెగ కటింగులిచ్చేస్తారు. కానీ నువ్వలా చేయలేదు.
సారీ చెబుదామంటే మీ పేరూ, అడ్రస్ తెలియని నేను డిపార్ట్ మెంటల్ స్టోర్ దగ్గర అన్నప్పుడు మరొకరైతే తమ వివరాలూ, ఘనతలూ, వగైరా వగైరా చెప్పేసి డబ్బా వాయించేసుకుంటారు. కానీ నువ్వలా ఏమీ చేయలేదు. "నిజమైన జెంటిల్ మేన్ లా వుందతని ప్రవర్తన" అనిపింపజేశావ్. అప్పట్నుంచీ నాకు తెలియకుండానే నీ గురించి ఆలోచించేదాన్ని.
ఓ రోజు ఆర్.టి.సి.వాళ్ళు స్ట్రెయిక్ చేయడంతో బస్సులు తిరగలేదు. ఉదయం ఆటోలోనే ఆఫీసుకి వెళ్ళాను. స్ట్రెయిక్ మధ్యాహ్నం అయిపోయి సాయంత్రానికి బస్సులు తిరుగుతాయట అనుకుంటున్నారు ఆఫీసులో. కానీ అలా ఏం జరగలేదు. బస్సులు సాయంత్రం కూడా తిరగలేదు. ఆటోయే శరణ్యం అనుకుని వాటిని వెదుక్కుంటూ నడుస్తున్నాను.
బేగంపేట ఫ్లైఓవర్ బ్రిడ్జ్ మీద నడుస్తుండగా జరిగిందా సంఘటన. నా ముందు నుంచే నడిచివెళుతున్న ఓ యాభై ఏళ్లతను గుండెని పట్టుకుని ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. నేను భయంగా చూశాను. 'హార్టె టాక్!' నాకేం చేయాలో తోచలేదు. హడావుడిగా జనాలు గుమిగూడి పోయారు.
నేనో వారగా నిలబడి ఇతన్నెవరాయినా హాస్పిటల్ కి తీసుకెళితే బాగుండును అనుకుంటున్నాను.
"అయ్యయ్యో హార్టెటాక్"
"చాలా ప్రమాదం."
"ఇదెన్నో సారో?"
"ప్రాణం వుందా పోయిందా?"
"ఏమో?"
రోడ్డంతా మోటార్ సైకిళ్ళూ, స్కూటర్లతో నిండిపోయింది. అందరూ చోద్యం చూస్తూ నిల్చున్నారు. నాకు కోపం నషాళానికి అంటుకుంది.
"చావుబతుకుల మధ్యనున్న మనిషికి వెంటనే వైద్య సహాయం అందించాలనీ, సాటి మనిషిగా అది మన కనీసకర్తవ్యమని తెలీని వీళ్ళేం మనుష్యులు?" అనిపించింది. అక్కడున్న వాళ్ళంతా ఎవరికి వారు ఎవరో వచ్చి సాయం చేస్తార్లే అనో, మనకెందుకులే అన్నట్టుగా వుండిపోయారు.
నాలో పట్టుదల పెరిగింది. ఆటో ఏదైనా వుంటే నేనే అతన్ని వైద్యుడి దగ్గరకు తీసుకెళ్ళాలని ఒక్క అడుగు ముందుకు వేశాను. అదే సమయంలో బైక్ ఆపి దిగుతున్నావు నువ్వు. నిజాయితీగా నా పర్సు తెచ్చిచ్చి నిందలు పడిన నిన్ను అప్రయత్నంగానే మళ్ళీ అక్కడ చూశాను.
"ఏమయింది?" అడిగావు నువ్వు.
"పాపం గుండెపోటు" అన్నారెవరో.
"మరి వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్ళకుండా సినిమా చూస్తున్నారా?" అంటూ అతన్ని భుజాలకెత్తుకుని పరిగెడుతున్నట్టు వేగంగా కదిలి పోయావ్.
"ఏమిటి మనమీద విరుచుకుపడతాడు?"
"బహుశా వాళ్ళ బంధువు అయివుంటాడు."
"అంతే! లేకపోతే అతనికంత ఖర్మేం పట్టింది."
ఏదో జరుగుతుందని ఊహించిన వారందరినీ ఏమీ జరగక పోవటంతో నిరుత్సాహంగా వెనుదిరిగారు. తుపాకీ పేలిన వెంటనే కొమ్మ నొదిలి ఎగిరిపోయిన పక్షుల్లా ఎవరూ లేరక్కడ. నేనూ, నీ బైక్ తప్ప!
"పైగా హడావుడిలో నువ్వు బైక్ కి లాక్ చెయ్యనూలేదు. కనీసం ఆ లాక్ ని బైక్ నుంచి తీసేయనూలేదు. లాక్ చేసిన బళ్ళకే దిక్కులేని ఈ రోజుల్లో అరటిపండు వలిచి చేతికిచ్చినట్లు అలా లాక్ తో సహా బండి కన్పిస్తే ఇంకేమైనా వుందా? నువ్విక్కడికి తిరిగి వచ్చేవరకైనా వుండటం నా కనీస ధర్మం!
మొదటిది.... నువ్వు చేసిన హెల్ప్ కి ఋణం తీర్చుకునేట్టవుతుంది, రెండవది గుండెపోటాయన పరిస్థితీ తెలుస్తుందని నీ బండి దగ్గరికి నడిచాను.
నలభై నిముషాల తర్వాత వచ్చావు నువ్వు. నీ బండి దగ్గరున్న నన్ను చూసి ఆశ్చర్యపోయావు"
"నేనే! మీరు బండికి తాళం వేయకుండా హడావుడిగా వెళ్ళిపోయారు. కాపలాగా వున్నాను" చిన్నగా నవ్వుతూ అన్నాన్నేను.