అతడు నిర్లక్ష్యంగా తలూపి వూరుకున్నాడు.
'ఇక్కడుంటే విషయం వీడికి తెల్సిపోతుంది. కాస్త దూరంలో వుండా'లనుకుని- "ఆభీ ఆతాహై!" అంటూ హాస్టల్ కి దూరంగాపోయి వెయిట్ చేయసాగాడు. వచ్చేపోయే అమ్మాయిల్ని చూస్తున్నాడు.
రాజుని చూసిన కళ్ళతో మొగుడ్ని చూస్తే మొట్ట బుద్దేస్తుందన్న సామెతలా- మనస్విని ఫోటోలో ఆమె అందాన్ని చూసిన తనకి, వారందరూ సూర్యుని ముందు దివిటీల్లా అనిపించసాగారు.
సమయం ఆగిపోయిందా అన్నట్టు భారంగా కదులుతోంది. అన్నింటికంటే దుర్భరమైనది కోరుకున్న వారి కోసం నిరీక్షించడమే అన్న సత్యం మొదటిసారిగా తనకి తెలిసివచ్చింది.
సమయం సాయ్మత్రం అయిదున్నర అవుతోంది. తను దీర్ఘంగా విశ్వసించాడు. ఇంతలో దూరంగా వస్తూ కన్పించిందామె. లక్షమంధిలో వున్నా ఇట్టే పోల్చుకోగల ప్రత్యేకత ఆమెలో ప్రధాన ఆకర్షణ.
తనకి ఎగ్జయిటింగ్ గా వుంది. ఉద్యోగరీత్యా యింతకుముందు ఎందరో అమ్మాయిలతో మాట్లాడినప్పుడు అప్పుడేం ఫీలింగ్స్, నెర్వస్ నెస్ ఎదురుకాలేదు. కానీ ఇంకొన్ని క్షణాల్లో ఆమెతో మాట్లాడబోతున్నానని అనుకుంటే ఏదో తత్తరపాటు, అదే మనసు చేసే గారడీ!
ఆమె తనని సమీపిస్తోంది!
కూర్చున్న బైక్ మీంచి దిగి నిల్చున్నాడతను.
మరింత దగ్గరైందామె. ఆమె నడకలోని హోయలుకి మయూరాలు సైతం సిగ్గుపడతాయేమో అన్పించింది.
మొహంలో ప్రసన్నత, నిలుచున్న తీరులో బుద్దిమంతుడి లక్షణాలు, చేతుల్లో మర్యాదలతో ఆమెని పిలవటానికి సంసిద్దుడయ్యాడతను.
ఆమె తన పక్కనుంచే వెళుతోంది.
"మనస్వినిగారూ" పిలిచాననుకున్నాడతను.
అయితే గొంతుదాటి మాటలు బయటకు రాలేదని ఆమె ఆగక ముందుకు సాగిపోవడంతో తెలిసింది.
తన అవస్థని గమనిస్తున్న ఎదురుగా వున్న ఇంట్లోని పదేళ్ళ పాప కిసుక్కున నవ్వింది.
'వెధవ టీ.వీ.లు, సినిమాలు చిన్నపిల్లలక్కూడా అన్నీ తెలిసిపోతున్నాయి' ఆ పిల్ల నవ్వటం చూసి కసిగా అనుకున్నాడతను. అప్పుడే తనలో పట్టుదల వచ్చింది. గుండెనిండా గాలి పీల్చుకున్నాడు. కాస్త ధైర్య మొచ్చినట్లయింది.
"మనస్వినిగారూ!" ఈసారి కాస్త గట్టిగా పిలిచాడు.
ఓ అపరిచిత స్వరం తన పరుని పలకతమతో, ఆమెశ్చర్యంగా వెనుదిరిగి చూసింది.
అల్లరి చేయడానికి పిలిచాడనుకుందేమో- ఒక్కక్షణం అనుమానంగా చూసింది. అయిదడుగుల పదంగుళాల ఎత్తుతో, కోటేరు ముక్కుతో, బొద్దుమీసాలతో మర్యాదస్తుడిలానే కనిపించి వుంటాడు. "ఏమిటి?" అన్నట్టు నావైపు ప్రశ్నార్ధకంగా చూసింది.
నా మతిమరుపుకి నాకే చిరాకొచ్చింది. 'ఆమె పర్సు చేతిలో రెడీగా పట్టుకుని పిలిస్తే ఇంత సీన్ క్రియేట్ అయ్యేది కాదు కదా' అనుకుని చటుక్కున జేబులోంచి ఆమె పర్సుతీసిస్తూ- "జూబ్లీహిల్స్ రోడ్ మీద దొరికింది" మర్యాదగా అందించాను.
ఆమె నా చేతిలోంచి పర్సు అందుకుని ముందు బస్ పాస్ నీ, తరువాత డబ్బుల్నీ జాగ్రత్తగా లెక్కపెట్టుకుంది. 'డబ్బు లెక్క చూసుకోండి' అని తనంటే ఆమె ఫర్వాలేదండీ' అని అంటుందని వూహించుకున్నాడు కానీ తనా మాట చెప్పకముందే తనని హర్ట్ చేసేలా ఆమె డబ్బు లెక్క పెట్టుకోవడంతో మనసులో బాధ పడ్డాడు తను.
"చాలా థాంక్సండి!" లెక్క సరిపోయింది కాబోలు ముక్తసరిగా అని వెనుదిరిగిందామె.
"ఒక్క నిమిషం" తనామెను ఆపాడు ఆమె ఆగింది.
"ఇందాక మీ హాస్టల్ గూర్ఖాతో మాట్లాడుతూ నన్ను మీ కజిన్ గా చెప్పాను. అసలు విషయం చెబితే ఆ పర్సు తీసుకుని డబ్బు కాజేస్తాడని అలా చెప్పాను. అతను మీ కజిన్ వచ్చి వెళ్ళాడని అంటే కంగారుపడకండి" అన్నాడతను.
"అలాగా! మీరనుకుంటున్నట్టు నా గూర్కా అటువంటివాడు కాదు. మీరతనికి పర్సు ఇవ్వకపోవటానికి కారణం నాకు తెలుసు. పర్సు ఇస్తూ నాతో పరిచయం చేసుకుందామని ఈ ఫోటోలో అమ్మాయి ఎలా వుంటుందో తెలుసుకోవాలనే అలా చేశారు...." తన మొహంమీద కొట్టినట్టు చెప్పిందామె.
దాంతో తన మొహం మ్లానమైంది. ఆమె హాస్టల్ వైపు కదిలింది. 'తానొకటి తలిస్తే, ఆ పైవాడొకటి తలిచాడన్నట్లు ఇలా అయిందేమిటి?' అనుకున్నాడతను. ఎందుకో తన దుస్థితినెవరో గమనిస్తున్నారనిపించింది.
చటుక్కున ఇందాకటి పాప జ్ఞాపకం వచ్చి అటు చూశాడు, ఇందాకైతే కేవలం పాప మాత్రమే వుంది. ఇప్పుడు చూస్తే పాపతోబాటు ఆమె బామ్మా, తాతలు కూడా కనిపించారు. హతవిధీ అనుకుని బైక్ స్టార్ట్ చేశాడు. వెళ్ళిపోయే ముందు వినిపించాయి నవ్వులు.... పాపతోపటు తాతా, బామ్మలవి కూడా.
* * * * *
ఆ సంఘటన జరిగిన వారం తర్వాత!
తను షేవింగ్ క్రీమ్, ఆఫ్టర్ షేవింగ్ లోషన్ లు తీసుకుందామని ఓ డిపార్ట్ మెంటల్ స్టోర్ లోకి నడిచాడు.
"ఏం కావాలి సార్?" అడిగాడు సేల్స్ బాయ్.
చెప్పాడతను. అతడు తను కోరినవి తీసుకొచ్చి యిచ్చాడు! బిల్ చెల్లించి బయటకు నడచి- బైక్ స్టార్ట్ చేయబోతుంటే ఎదురుగా కన్పించింది మనస్విని- ఒక్కక్షణం ఆమెని చూసిన తను నిర్వికారంగానే మళ్ళీ కిక్ కొట్టాడు. ఆమె మొహం తిప్పుకుని,
"ఒక్క నిమిషం" అందామె.
తను ఓ క్షణం ఆశ్చర్యపోయాడు.
ఆమెకి హెల్ప్ చేసినపుడు మొహంమీద కొట్టినట్టు మాట్లాడిన మనిషి ఇప్పుడెంత సౌమ్యంగా మాట్లాడుతోంది? ఏమిటో ఈ ఆడవాళ్ళు అస్సలర్ధం కారు. అందుకనే "క్షణక్షణముల్ జవరాండ్ర చిత్తముల్" అని నిందపడ్డారు అనిపించింది.