Previous Page Next Page 
జీవాత్మ పేజి 32


    "చాలా థాంక్సండీ. అప్పట్నుంచీ ఇక్కడే వున్నారా మీరూ?" అని అడిగావు.
    
    "అవును!"
    
    "సారీ! కంగారులో మిమ్మల్ని గమనించలేదు" నొచ్చుకున్నట్లు అన్నావు నువ్వు.
    
    "ఆ క్షణంలో వుండవలసింది అదే! ఇంతకీ ఆ హార్టెటాక్ పేషెంట్ ఎలా వున్నాడు?"
    
    "కోలుకున్నాడు'        
    
    "హమ్మయ్య!" నేను తేలిగ్గా నిట్టూర్చాను.
    
    నువ్వు నావంక అబ్బురంగా చూశావు.
    
    "ఎవరికివారే చోద్యం చూస్తున్నారు కానీ ఎవరూ అతనిని వెంటనే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళరే" చిరాకు ప్రదర్శిస్తూ అన్నాను నేను.
    
    నువ్వు మౌనంగా తలూపి వూరుకున్నావు.
    
    "చివరికి నేనే అతన్ని ఆటోలో హాస్పిటల్ కి తీసుకెళదామని అనుకున్నాను. ఇంతలో దేవుడిలా వచ్చి అతని ప్రాణాల్ని కాపాడారు మీరు" అన్నాన్నేను.
    
    దానికీ నువ్వు సమాధానం చెప్పలేదు.
    
    చూస్తుండగానే చీకటైపోయింది.
    
    "నన్ను మా హాస్టల్ వరకూ దింపండి ఆపద్బాంధవా!" నేనలా అడగ్గానే ఆశ్చర్యంగా చూశావు.
    
    "అలా ఆశ్చర్యపోకండి మీ పేరు తెలియక అలా సంబోధించాను. బస్సులు తిరగడం లేదు. ఆటోల కోసం నడిచి సగం, ఇక్కడ నిలబడి మొత్తం శక్తి ఎటో ఎగిరిపోయింది. మళ్ళీ ఆటోల కోసం వేట మొదలు పెట్టలేను..." అన్నాన్నేను.
    
    దాంతో బైక్ స్టార్ట్ చేశావ్. స్లోగా జాగ్రత్తగా డ్రైవ్ చేస్తూ మా హాస్టల్ దగ్గర్లో దింపావ్" చాలా థాంక్స్ ఇప్పటికైనా మీ పేరు చెబుతారా?" అన్నాన్నేను.
    
    "అయ్యో అదేమైనా భాగ్యమా చెప్పకపోవటానికి....మహదేవ్" అన్నావు నువ్వు.
    
    నేను మీకు 'బై' చెప్పి హాస్టల్ వైపు నడిచాను. నువ్వు వెనుదిరిగావ్. ఆ తరువాత జరిగిన సంఘటనలు తమని మరింత దగ్గర చేసిన వైనం గుర్తుకొచ్చి అతని కళ్ళు కాంతిపుంజాలయ్యాయి.
    
    మళ్ళీ పదిహేను రోజుల వరకూ ఆమె కలువలేదు. ఓరోజు హఠాత్తుగా రవీంద్ర భారతిలో ఏదో ప్రోగ్రాముంటే అక్కడ కలిసింది. ప్రోగ్రామ్ చూడకుండా ఊసుల ఊయలలూగారిద్దరూ.
    
    మళ్ళీ ఓ వారం గ్యాప్ ఈసారి ప్రపంచ తెలుగు మహాసభల్లో ఒకరికొకరి పునర్దర్సనం.
    
    మునుపటికంటే ఫ్రీగా, ఆత్మీయంగా మనసులోని భావాలు పంచుకుంటూ తీయగా సరళంగా ఎదపొదల కబుర్ల కలనేతలు వేశారు.
    
    తనతో మాట్లాడుతున్నంతసేపూ ఆమె కళ్ళల్లో తనమీద పెంచుకుంటున్న ప్రేమ మలయమారుతంలా తన అణువణువునీ స్పృశిస్తూ నూతనాను భూతులకి గురిచేస్తోంది. అది ఆకర్షణలోంచి పుట్టిన ప్రేమ కాదనీ తనకు తెలుసు. పరిణితి చెందిన బుద్దితో అవతలి వ్యక్తి మనస్సూ వ్యక్తిత్వాన్ని పరిశీలించిన తరువాత పుట్టిన ప్రేమిది.
    
    ఆ తరువాత తరచూ కలుసుకోవటం, మనసు తలుపులు తీసి తలపులు ఏకం చేసుకోవటం, వెన్నెల వానల్లో నిండారా తడుస్తూ గుసగుసల సరిగమలతో హృదయాలను మీటుకోవడం, గుప్పెడు గుండెలో బుద్దిగా ఒదిగిపోయిన ఒక్కొక్క జ్ఞాపకం ఒక ఖజురహో శిల్ప భంగిమై అతన్ని పరవశుడ్ని చేస్తోంది.
    
    'టంగ్!' ప్రియురాలి ధ్యాసలో పడి తన ఉనికిని మరిచిపోయాడని ఉక్రోషమేమో వాల్ క్లాక్ ఒంటిగంటయిందన్నట్లు కరుగ్గా మోగింది.
    
    'ఉదయం ఫస్టు బస్సుకే అమ్మ దగ్గరకెళ్ళి మనస్విని విషయం చెప్పాలి. ఇక పడుకుంటే మంచిది' అని బలవంతంగా కళ్ళు మూసుకున్నాడు అతను.
    
                                                            *    *    *    *    *
    
    అభిరాం గదిలోని ఫోన్ రింగయింది.
    
    మంచి నిద్రలో వున్నాడతను.
    
    అప్పుడు సమయం సరిగ్గా ఆరున్నర అయింది.
    
    అప్పటికే మెలకువ వచ్చేసిన వరప్రసాదం ఫోనెత్తాడు.
    
    "హలో" అన్నాడు.
    
    ... ...
    
    "అవును"
    
    ... ...
    
    "ఇంకా లేవలేదు! ఆ విషయం గురించి నాకు తెలియదు. నేను గెస్ట్ ని" అన్నాడు.
    
    ... ...
    
    "అలాగా! ఎప్పుడు జరిగిందట?" ప్రశ్నించాడతను.    

    ... ...
    
    "లేకపోతే లేపి చెప్పమంటారా?"
    
    ... ...
    
    "అలాగే! తప్పకుండా వుంటాను" అని ఫోన్ పెట్టేసి కాలకృత్యాలు తీర్చుకున్నాడు వరప్రసాదం.
    
    సుమతమ్మ ఇచ్చిన కాఫీ తాగి అభిరాం గదిలోకి వెళ్ళాడు.
    
    ఇంకా లేవలేదతను.
    
    అతను లేచేదాకా ఎదురుచూస్తూ కూర్చున్నాడు. అయిదు నిముషాలు తక్కువ ఏడవుతుండగా లేచాడతను. "శుభోదయం" అన్నాడు వరప్రసాదం.
    
    "గుడ్ మార్నింగ్" చిన్నగా నవ్వి అన్నాడు అభిరాం.
    
    అతను కూడా కాలకృత్యాలు తీర్చుకుని కాఫీ తాగాక తను ఫోన్ లో విన్న సంగతి చెప్పటానికి నిశ్చయించుకున్నాడు వరప్రసాదం. అభిరాం లేచి బాత్ రూంలోకి నడిచాడు.
    
    వరప్రసాదం ఆరోజు దినపత్రిక చదువుతూ వుండిపోయాడు హాల్లో.
    
    ఓ పావుగంట తర్వాత అభిరాం ఫ్రెషపయి హాల్లోకి వచ్చాడు.  
    
    అమ్మమ్మ అందించిన కాఫీ తాగుతూ సిటీ ఎడిషన్ చూస్తున్నాడు.
    
    వరప్రసాదం మెయిన్ ఎడిషన్ కూడా అతనికే ఇచ్చేసి, కొంచెం సేపు కళ్ళు మూసుకు కూర్చున్నాడు.

 Previous Page Next Page