Previous Page Next Page 
మనసు పొరల్లో పేజి 30

 

    గబగబా పన్లన్నీ చేసుకుని వేడి వేడి నీళ్ళతో తలంటుపోసుకుని భోజనం చేసింది ఝాన్సీ. శరీరం తేలికపడిందేమో నిద్ర ముంచుకొచ్చింది. వెంటనే వెళ్ళి మంచం మీద వాలిపోయింది.
    కళ్ళు తెరిచేసరికి గడియారం మూడు గంటలు కొట్టింది. అలసట తీరిపోయి లేచి కూర్చుంది. ఏమీ తోచడం లేదు. నిమిషం గడవడం కష్టమనిపించింది. వెంటనే స్నేహితురాలు హంసిని జ్ఞాపకం వొచ్చింది. గబగబా ముస్తాబై కాస్సేపు స్నేహితురాలిని కలుసుకుందామని బయలుదేరింది.
    హంసినీ, ఝాన్సీ క్లాస్ మేట్స్ బి,కాం వరకూ . ఝాన్సీ బి.కాం లో ఉండగానే హంసినీ పెళ్ళయిపోయింది. ఒక బ్యాంక్ ఆఫీసర్ తో .అప్పటినుంచి ఆమె హైదరాబాద్ లోనే ఉంది. తనూ హైదరాబాద్ కె వస్తోంది పెళ్ళయ్యాక అని తను చెప్పినప్పుడు హంసిని ఎంత సంతోషించిందో! ఝాన్సీ! నీ పెళ్ళికి రాలేను. సరిగ్గా అదే సమయంలో మా బావగారి అమ్మాయి పెళ్లుంది బందరులో, అయితేనేం? మనిద్దరం హైదరాబాద్ లోనేగా ఉండేది . తరచు కలుసుకోవచ్చు. మళ్ళీ మన కాలేజీ రోజుల్ని జ్ఞాపకం తెచ్చుకోవచ్చు. సో నైస్!" నడి సంబరపడిపోతూ. ఝాన్సీ కూడా ఎంతో మురిసిపోయింది. తోబుట్టువులకీ , కన్నవారికీ దూరంగా ఉన్నా తన వూరి అమ్మాయి, అందులోనూ తన క్లాస్ మేటు తనకి దగ్గరగా ఉంటుందని, కానీ, ఆ ఆశంతా నిరాశే అయింది. హైదరాబాదులో తను జైల్లో ఉన్నట్టుగానే ఉంటోంది తప్ప, వీధి గడపదాటి ఎరుగడు. పానకాలుతో ముద్దూ ముచ్చటా తీరలేదు. పెళ్ళంటే ఒక బందీగా, పెళ్ళంటే ఒక దాసిగా పడుండడం తప్ప , పెళ్ళంటే ఒక భయంకర స్వప్నంగా చెదు అనుభవాలనే చూసింది తప్ప , పెళ్ళంటే స్త్రీ పురుషులు తీపి కలయిక అని గానీ, పెళ్ళంటే ఒక సుందర జీవనం అని గానీ పెళ్ళిలోని మాధుర్యాన్ని చవిచూడలేకపోయింది. ఒకటి రెండు సార్లు హంసిని భర్తతో పాటు తనింటికి వచ్చినా తన భర్త వాళ్ళను గౌరవించలేదు. సరిగా పలకరించనైనా లేదు. దాంతో వాళ్ళు రావడం మానేశారు.
    ఆరోజు ఝాన్సీ స్నేహితురాలిని కలుసుకుని తీరాలనుకుంది. తనివి తీరా మాట్లాడాలనుకుంది. ఇంటికి తాళం పెట్టింది. ఆటోని పిల్చి అడ్రసు మరొకసారి చూసుకుని "శ్రీనగర్ కాలనీ పోనియ్" అంది.
    వాళ్ళనీ వీళ్ళనీ అడుగుతూ గుర్తుల ప్రకారంగా వెళ్ళి ఎలాగో ఇల్లు పట్టుకుంది. ఝాన్సీని చూసిన హంసిని సంతోషంగా "మైగాడ్! ఇవాళ సూర్యుడు ఎటు పొడిచాడు? దారి తప్పి వచ్చావా?" అలాంటి ఆప్యాయమైన నిష్టురాలతో స్వాగతం పలికింది.
    "ఏయ్ హంసినీ! గుడ్ న్యూసా? ఎన్నో నెలా?" అంది ఆప్యాయంగా పొట్ట మీద చెయ్యి వేసి ఝాన్సీ. "ఆరు" అంది సిగ్గుపడుతూ హంసిని. ఒక రకమైన నిండుధనంతో , నిగనిగ లాడుతూ మరింత అందంగా కనిపించింది హంసిని. ఆమె మోహంలో కనిపిస్తున్న తృప్తి. అనందం చూసి, 'హంసిని ఎంతో అదృష్టవంతురాలు' అనుకుంది. చక్కటి ఇల్లు, పనివాళ్ళూ , ఎంతో ప్రేమగా హంసినిని గురించి మాట్లాడే అత్తగారూ! ఆ ఇల్లు ఒక దేవాలయంలా అనిపించింది ఝాన్సీకి. తన ఒంటిమీద సిగరెట్టు పీకలతో కాలిన మచ్చలు తనని చూసి నవ్వుతున్నట్టు అనిపించాయి. "ఏమిటీ ఈ మచ్చలు?" కంగారుగా అడిగింది హంసిని. స్నేహితురాలికి అబద్దం చెప్పడానికి నోరు రాని ఝాన్సీ "మా వారి ప్రేమ గుర్తులు' అంటూ శ్రావణమేఘాల్లా ముసురుకున్న విషాద సంఘటనలన్నీ ఒక్కొక్కటీ గుర్తు కొస్తుంటే , ఉన్నదున్నట్టు అంతా చెప్పేసింది ఝాన్సీ.
    "విడాకులిచ్చేయ్, అతడు పరమ శాడిస్ట్ లా ఉన్నాడు" అంది హంసిని.
    "నో!" అంటూ నవ్వింది ఝాన్సీ . అయోమయంగా చూస్తున్న హంసినిని చూసీ "హంసి! నేను విడాకులిస్తే మా నాన్నా అమ్మ బతకరు. చెల్లెళ్ళకి పెళ్ళిళ్ళు కావు . సరే, ఆ సంగతంతా నీకు తెలుసుగా! నేను చస్తే ఇతడు మళ్ళీ పెళ్ళి చేసుకుంటాడు. కౌసల్య పొతే నన్ను చేసుకున్నట్టు హిస్ట్రీ రీపీట్స్! అందుకని నేనాపని చెయ్యను.'
    "మరి?" ఆశ్చర్యంగా అడిగింది హంసిని.
    "అతడితో ఉంటూనే అతడి భరతం పడతాను. నేనే అతడికి సింహస్వప్నమై నిలుస్తాను. నా పేరు ఝాన్సీ లక్ష్మి కదూ!" నవ్వింది.
    హంసిని కంగారుగా "అయితే ఏం చేస్తావ్?" అంది.
    "మీ వారికీ చెప్పి నాకేదైనా ఉద్యోగం వేయించవే. నీ మేలు జన్మ జన్మలకి మర్చిపోను" అంది.
    "అరె, మొన్నే అడ్వర్ టైజ్  చేశారు వాళ్ళ బ్యాంక్ లో ఖాళీలున్నయనీ ఉండు" అంటూ ఆ పేపరు తీసుకొచ్చి చూపించింది 'టైముంది అప్లై చెయ్యి" అంది. "థాంక్యు" అంటూ ఆ పేపరు అందుకుంది ఝాన్సీ. స్నేహితురాలిద్దరూ ఎంత సేపో కబుర్లు చెప్పుకున్నారు. హంసిని అత్తగారు కాఫీ, పకోడీలు పంపించింది. హంసిని సంసారాన్ని చూసి మురిసిపోతూ ఆనందంగా ఇల్లు చేరుకుంది ఝాన్సీ.

 Previous Page Next Page