Previous Page Next Page 
యమదూత పేజి 31


    
    ఆ 'అన్న' అనేవాడు ఒక మంత్రి అని తెలుసు జలీల్ కి.
    
    ఒకసారి నిశితంగా నాగేందర్ వైపు చూసి, మాట్లాడకుండా డైరీ రాయడం మొదలెట్టాడు జలీల్.
    
    అది చూస్తున్న నాగేందర్ కి ఒళ్ళు భగ్గున మండినట్లయింది. తన అనుచరుడివైపు తిరిగి, "జల్దీ వెళ్ళి అన్నకి చెప్పు! ఆడికెళ్ళే ఫోన్ చెయ్యమను" అన్నాడు.
    
    లేవబోయాడు అనుచరుడు.
    
    తను యాక్షన్ తీసుకోవాల్సిన సమయం ఆసన్నమయిందని గ్రహించాడు జలీల్. ఒక్క ఉదుటున లేచి, ఆ అనుచరుడిని కాలర్ దగ్గర పట్టుకుని, ఇనపసుత్తిలాంటి తన పిడికిలితో ఫట్ ఫట్ మని నాలుగుసార్లు దవడలు పగిలేటట్లు కొట్టాడు.
    
    వాడికి కళ్ళు తేలబడ్డాయి.
    
    ఒక కానిస్టేబుల్ని పిలిచి, "యాదగిరీ! వీడ్ని లాకప్ లో పడేయ్!" అన్నాడు జలీల్.
    
    సంశయంగా చూశాడు యాదగిరి. అతనికి తను సంపాదిస్తున్న జీతం కంటే ఎక్కువ 'హఫ్తా' (వారం వారం సమర్పించుకునే మామూలు) దొరుకుతుంది నాగేందర్ మనుషుల దగ్గరనుంచి.
    
    ఆ సంగతి తెలుసు జలీల్ కి.
    
    తటపటాయిస్తున్న కానిస్టేబుల్ తో కఠినంగా అన్నాడు జలీల్ "ఏం చెప్పింది వినబడ్డం లేదా?"
    
    ఉలిక్కిపడి అయిష్టంగానే ఆ అనుచరుడి చెయ్యి పట్టుకుని, లాకప్ రూమ్ వైపు తీసుకెళ్ళాడు కానిస్టేబుల్.
    
    తర్వాత నాగేందర్ వైపు వతిరిగాడు జలీల్.
    
    "ఏమిరా! మీ అన్నతో చెబుతావా? అన్నతో కాదు! మీ తాతతో చెప్పుకో! మీ ముత్తాతతో చెప్పుకో! నేను పబ్లిక్ కి సేవచేయడానికి సర్కారు పైసలు తింటున్నానురా! నీలాంటి లఫంగి వెధవలకు ఊడిగం చేయడానికి కాదు. అర్ధమయిందా? వెళ్ళు! ఈసారి మళ్ళీ ఈ స్టేషన్ లోకి వచ్చావో! మర్యాదగా బయటికి పోలేవు!" అన్నాడు నాగేందర్ కి అర్ధమయ్యే భాషలో పరుషంగా.
    
    కసిని దిగమింగుతూ, నెమ్మదిగా అన్నాడు నాగేందర్. "జలీల్ సాబ్! ఇవాల చాలా పెద్ద తప్పు చేసినవ్ నువ్వు! అన్నకు తెలిస్తే ఊర్కోడు!"
    
    "నన్నేం చేస్తాడురా మీ అన్న?" అన్నాడు జలీల్ చులకనగా. "మహా అయితే సిటీ నుంచి ట్రాన్స్ ఫర్ చేయించి ఏ నక్సలైట్ ఏరియాకో ట్రాన్సుఫర్ చేయిస్తాడు. అంతేనా? అండమాన్స్ కయినా పంపమను. నేను తయార్! ఎక్కడయినా ఉద్యోగం చేసి జీతం తీసుకోవడమే! నాకా ఫికర్ లేదు" అన్నాడు.
    
    "అవ్ చలో నాగేందర్ సాబ్! బాద్ మే దేఖ్ సక్తే!" అంటూ నాగేందర్ అడుగుకి మడుగులొత్తుతున్నట్లు మర్యాదగా బయటకి తీసుకెళ్ళాడు కానిస్టేబుల్.
    
    "నిన్ను అందరూ చూస్తుండగా పెట్రోలుపోసి తగలబెడతా!" అని గొణుక్కుంటూ వెళ్ళాడు నాగేందర్.
    
    నాగేందర్ బయటికి వెళ్ళీ వెళ్ళకముందే ఒక మనిషి లోపలికి వచ్చాడు. సన్నగా పొడుగ్గా వెదురు బొంగులాగా వున్నాడతను.
    
    ముళ్ళపొదలాంటి జుట్టు, నిరంతరంగా తాగుతూ వుండడం వల్ల నిప్పుకణికలలా ఎర్రగా కనబడుతున్న కళ్ళు.
    
    వస్తూనే వినయంగా వంగి దణ్ణం పెట్టాడు అతను జలీల్ కి.
    
    "ఏమిటి?" అన్నాడు జలీల్.
    
    మళ్ళీ ఒకసారి వంగి దణ్ణం పెట్టాడు అతను. "నా పేరు శివరాం సాబ్!"
    
    "అయితే?"
    
    "నేను జైల్లో కూకుంటా సాబ్!"
    
    "జైల్లోనా? ఎందుకు?" అన్నాడు జలీల్ ఆశ్చర్యంగా.
    
    ఒక్క గుటక మింగి, తర్వాత కానిస్టేబుల్ వైపు తిరిగాడు శివరాం "నువ్వే చెప్పు!" అన్న అభ్యర్ధన కనబడుతుంది అతని కళ్ళలో.
    
    కొంచెం సందేహించి చెప్పాడు కానిస్టేబుల్. మీరు లేనప్పుడు ఒక యాక్సిడెంట్ అయింది సాబ్!
    
    "ఎక్కడ?"
    
    వివరాలు చెప్పాడు కానిస్టేబుల్. "ఆ యాక్సిడెంట్ లో శామ్యూల్ అనే ఆయన చచ్చిపోయుండు!"
    
    "అరెరె! ఎవరా శామ్యూల్? ఏం చేస్తుంటాడు?"
    
    "శామ్యూల్ రౌడీ షీటర్ సాబ్! నాటుబాంబులు చేస్తూ వుంటాడు."
    
    "ఎట్లా చచ్చిపోయాడు?"
    
    "యాక్సిడెంటు సాబ్!"
    
    "నిజంగా యాక్సిడెంటేనా?" అన్నాడు జలీల్. ఇదేదో గ్యాంగ్ వార్ డెత్ అనిపించింది అతనికి. కాసేపు నీళ్ళు నమిలి అన్నాడు కానిస్టేబుల్.
    
    "ఆ యాక్సిడెంట్ చేసింది చాలా పెద్దమనిషి సాబ్! ఆయన బదులుగా ఈ శివరాం లొంగిపోతున్నాడు."
    
    కరిగి నీరయింది జలీల్ గుండె.
    
    ఈ డిపార్ట్ మెంట్ లోకి వచ్చాక ఎన్నిరకాల అక్రమాలు చూస్తున్నాడు తను? ఎంత అమానుషత్వం, ఎంత అవినీతి, ఎంత అరాచకత్వం చూస్తున్నాడు?
    
    సానుభూతిగా శివరాం వైపు చూశాడు జలీల్.
    
    "నీపేరేమిటి? సివరామా? చూడు శివరాం! వాడెవడో యాక్సిడెంట్ చేస్తే నువ్వు లొంగిపోవడం ఎందుకు?
    
    "నీకు పెళ్ళాం పిల్లలు లేరా? అన్యాయంగా నువ్వు జైలుకెళితే వాళ్ళ గతి ఏమవుతుంది?"
    
    "పెండ్లాం పిల్లల కోసమే ఈ తిప్పలు సాబ్!" అన్నాడు శివరాం దీనంగా. "నాకా సంపాదించి పెండ్లాం పిల్లల్ని పోషించుకునే దమ్ములేదు. ఈ సేటు తన బదులు నేను లొంగిపోతే యాభై వేలిస్తానన్నాడు. ఏం చెయ్యాలి సాబ్! కడుపు తిప్పలు! నేను జైలుకేల్లినా కనీసం మా వాళ్ళయినా ఈ డబ్బుతో ఎట్లగో అట్ల బతుకుతారు."
    
    వింటున్న జలీల్ మొహం కఠినంగా మారిపోయింది.
    
    "ఎవరు ఆ కారు ఓనరు?" అన్నాడు కానిస్టేబుల్ వైపు తిరిగి.
    
    చాలా భక్తి శ్రద్దలతో చెప్పాడు కానిస్టేబుల్.
    
    "మెకానిక్ అంటారు సాబ్ ఆయన్ని."
    
    సాలోచనగా తల పంకించాడు జలీల్. ఈ మెకానిక్ పేరు ఇంతకు ముందు కూడా చాలా సందర్భాలలో విన్నాడు తను. అతని గురించి చాలా సమాచారం సేకరించాడు కూడా.
    
    కానీ తన పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ మెకానిక్ ఒక కేసులో ఇన్ వాల్వ్ కావడం ఇదే మొదటిసారి!
    
    ఇంతకుముందు జాగ్రత్తపడి ఉంటాడు -బహుశా తనని గురించి విని!
    
    ఇప్పుడు గ్రహచారం వల్ల తన స్టేషన్ లిమిట్స్ లో యాక్సిడెంట్ చేశాడు. అది యాక్సిడెంట్ అయి ఉండదనీ, హత్యే అయివుంటుందనీ తనకు చాలా బలంగా అనిపిస్తోంది.
    
    తను నేరం చేయడమేగాక, దానికి ఇంకొకళ్ళని బలి చేస్తున్నట్లు ఈ బక్కప్రాణిని తనకి బదులు లొంగిపొమ్మని పంపించాడన్నమాట!
    
    స్మార్ట్ బగర్!
    
    తను కేసు పట్టుకుంటే వదలడని తెలిసే వుంటుంది మెకానిక్ కి. అందుకే ముందు కాళ్ళకు బంధాలు వేస్తున్నట్లు ఇలా చేశాడు!
    
    తనకి బదులు మరొకన్ని లొంగిపొమ్మన్నాడు!
    
    స్మార్ట్! వెరీ స్మార్ట్!
    
    ఒకసారి దయగా శివరాం వైపు చూసి తర్వాత వాచ్ చూసుకున్నాడు జలీల్.
    
    "పొద్దున్నుంచి ఏమీ తినలేదు నేను. రోజూ ఇంటినుంచి మా అమ్మ కారియర్ పంపిస్తుంది శివరాం! రా! నాతో కలిసి భోజనం చెయ్!"
    
    అలాంటి చల్లని మాటలు వినడానికి అలవాటుపడని వాడిలా అయోమయంగా చూశాడు శివరాం. క్రమంగా అతని కళ్ళలో నీళ్ళు నిలిచాయి.
    
    ఈ లోగా కారియర్ తెరిచి తన తల్లి ప్రేమతో వండి కారియర్ లో పెట్టి పంపిన పదార్ధాలను రెండు ప్లేట్లలో సర్దాడు జలీల్.
    
    "తిను శివరాం! మా అమ్మ అద్భుతంగా చేస్తుంది వంట? లాగించెయ్!"
    
    చటుక్కున తల వంచుకున్నాడు శివరాం. అతని కళ్ళలోనుంచి నీటిబొట్లు టపటప రాలి ప్లేట్లో పడ్డాయి.

 Previous Page Next Page