అతను ఇలాంటి ట్రీట్ మెంట్ కి మానసికంగా సిద్దంగా లేడు. స్టేషనులోకి రాగానే కనీసం ఒక రోజంతా తనని కుళ్ళబొడుస్తారనీ, హీనపక్షం కాలో, చెయ్యో విరుగుతుందనీ అనుకుంటున్నాడు అతను.
అలాంటిది...
ఇన్ స్పెక్టరు తన పక్కన కూర్చోపెట్టుకుని, తన క్యారియర్ భోజనం తినమని అడగడం.
నెమ్మదిగా తల ఎత్తి చూశాడు శివరాం.
చిరునవ్వుతో అన్నాడు జలీల్.
"తిను శివరాం!"
ముందు సంతోషంగా, ఆ తర్వాత ఆబగా గబగబ ప్లేటు ఖాళీ చేశాడు శివరాం.
అతని ప్లేటు ఖాళీ అయిన తర్వాత, తన ప్లేట్లోని వంటకాలన్నీ కూడా శివరాం ప్లేటులోకి ట్రాన్స్ ఫర్ చేసేశాడు జలీల్. అతను వాటిని ఇంకా తాకను కూడా లేదు.
మళ్ళీ జన్మలో తినడం అనేది ఉంటుందో లేదో అన్నట్లు దీక్షగా తినేస్తున్నాడు శివరాం.
అతను భోజనం ముగించబోతూ ఉండగా అన్నాడు జలీల్.
"నువ్వు ఒకప్పుడు మెకానిక్ గ్యాంగులో చాలా ఇంపార్టెంట్ పొజిషన్లో ఉండేవాడివని నాకు తెలుసు. యూ ఆర్ ఏ క్రాక్ షాట్. వంద గజాల అవతల ఉన్న వాటిని కూడా ప్రతిసారీ గురి తప్పకుండా కాల్చగలవు నువ్వు!
అయితే నీలో ఒక పెద్ద లోపముంది శివరాం!
తినడం ఆపి తల వంచుకునే వింటున్నాడు శివరాం!
"చాలా పెద్దలోపం వుంది నీలో! నువ్వు క్రాక్ షాట్ వే కానీ మనుషుల్ని చంపలేవు! ప్రాణాలని తియ్యలేవు నువ్వు! అది నీలో ఉన్న పెద్ద వీక్ నెస్. ఈ వీక్ నెస్ వల్లే నువ్వు పైకి రాలేకపోయావు.
అంతేకాదు!
ఆ కారణం వల్లే నీ పొజిషన్ చాలా తగ్గిపోయింది కూడా! అవునా?"
ఒక్క క్షణం మౌనంగా జలీల్ వైపు చూసి, తర్వాత మళ్ళీ తినడం సాగించాడు శివరాం.
"ఇప్పుడు నువొక్కపని చెయ్యబోతున్నావు శివరాం!" అన్నాడు జలీల్.
మళ్ళీ తల ఎత్తాడు శివరాం.
"ఇరవయ్యేళ్ళ క్రితం, మెకానిక్ ఇంత పవర్ ఫుల్ డాన్ కాకుండా మామూలు గ్యాంగ్ స్టర్ గా వున్నప్పుడు, నువ్వతనికి సన్నిహితుడివి. ఆ తర్వాత తర్వాత నా పరిస్థితి చెడింది.
అందుకని శివరాం! నువ్వు ఇప్పుడు మెకానిక్ గురించి అన్ని విషయాలు చెప్పబోతున్నావు. ప్రతి చిన్న విషయం కూడా! నీకూ, మెకానిక్ కీ, దేవుడికీ తప్ప మరెవ్వరికీ తెలియని అత్యంత రహస్యమైన విషయాలు కూడా నాతో చెప్పబోతున్నావు శివరాం! మొదలెట్టు!
పెదిమలు తడిచేసుకుంటూ బలహీనంగా తల అడ్డంగా ఆడించాడు శివరాం.
"మీరు ఏదేదో మాట్లాడుతున్నారు సాబ్. మెకానిక్ డబ్బులిస్తానన్నాడు. కూటికోసం నేను చెయ్యని నేరాన్ని మీద వేసుకుంటున్నా! అంతే! అంతకంటే నాకు తెలీదు ఇన్ స్పెక్టర్ సాబ్!"
"ఒహ్హో శివరాం!" అన్నాడు జలీల్ విసుగ్గా. "మంచిగా చెప్పకపోతే నువ్వు ఇంకొద్ది క్షణాల్లో ఇంకో జలీల్ ని చూస్తావు. ఆ జలీల్ ఇంత మంచిగా మాట్లాడడు. వాడు పరమ కర్కోటకుడన్నమాట! అర్దమయిందా? ఇంక చెప్పు?"
మళ్ళీ తల వంచుకున్నాడు శివరాం.
వాళ్ళకి కొద్ది దూరంలో నిలబడి ఉన్నాడు కానిస్టేబుల్. అతని చేతిలో గన్ వుంది. దాన్ని తుడుస్తున్నాడు అతను. ఆదుర్దా కనబడుతోంది అతని కళ్ళల్లో.
మెకానిక్ బదులు శివరాం లొంగిపోతే కేసు స్మూత్ గా జరిగిపోతుందని ఆ కానిస్టేబుల్ ఊహించాడు.
గూండాలూ, పోలీసులూ, రాజకీయనాయకులూ ఒక పక్షంగా, సాదా సీదా ప్రజలందరూ మరొక పక్షంగా విడివడిపోయిన రోజుల్లో, ఆ కానిస్టేబుల్ ఎవరిపట్ల విశ్వాసంగా ప్రవర్తిస్తాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
శివరాం నిజాలు చెప్పేస్తాడేమో అని ఆందోళనగా వుంది అతనికి.
చేతిలోని రైఫిల్ చుట్టూ గట్టిగా బిగుసుకున్నాయి అతని వేళ్ళు.
"చెప్పు శివరాం!" అన్నాడు ఇన్ స్పెక్టర్ జలీల్.
ఇంక తప్పదన్నట్లు చెప్పడం మొదలెట్టాడు శివరాం.
"మెకానిక్ ని గురించి ఏమన్నా చెప్పేముందు ఇంకో వ్యక్తిని గురించి చెప్పాలి!"
"ఎవరతను?"
"పొద్దున మీరు తరుముకుంటూ వెళ్ళారే! అతను!"
"ఎవరు? దినకరా?"
"అది అతని అసలు పేరు కాదు" అన్నాడు శివరాం భయంగా.
అంతలో...
'థన్'మని పెద్ద శబ్దం వినబడింది.
తక్షణం విరుచుకుపడిపోయాడు దినకర్ ని గురించి సమాచారం చెప్పడానికి నోరు తెరిచిన శివరాం.
తుపాకి శబ్దం వినబడినవైపు దిగ్భ్రమతో చూశాడు ఇన్ స్పెక్టర్ జలీల్.
తుపాకీ చేతిలో పట్టుకుని ఉన్న కానిస్టేబుల్ మొహానికి చెమటలు పట్టేసి వుంది. తుపాకిలోంచి ఇంకా సన్నగా పొగ వస్తోంది.
"రైఫిల్ ఆయిలింగ్ చేస్తుంటే యాక్సిడెంటల్ గా బుల్లెట్ రిలీజ్ అయింది సార్!" అన్నాడు కానిస్టేబుల్ బెరుగ్గా.
కానిస్టేబుల్ చెబుతున్నది నిజం కాదనీ, అతను కావాలనే శివరాంని కాల్చేసి వుంటాడనీ, ఆ విధంగా శివరాం నోరు శాశ్వతంగా మూసేసి వుంటాడని గట్టిగా అనిపించింది జలీల్ కి.
ఏది ఏమైనా చాలా ముఖ్యమయిన సమాచారం తనకి దొరక్కుండా చెయ్యి జారిపోయింది.
దానికి తోడు...
తన చేతుల్లో ఇప్పుడు ఇంకో హత్యకేసు!
లేదా, కానిస్టేబుల్ చెబుతున్నట్లు యాక్సిడెంట్ డెత్ కేసు!
తన పోలీసు స్టేషన్ లోనే, తన కానిస్టేబుల్, తనముందు కూర్చుని వున్న సాక్షిని కాల్చి చంపేశాడంటే ఈ వ్యవస్థ ఎంతగా పతనమైపోయిందో అర్ధమయింది జలీల్ కి.
అంతేకాదు! తను ఎదుర్కోవలసిన ప్రత్యర్ధి ఎంత బలవంతుడో, ఎంత కిరాతకుడో, ఎంతగా తెగించినవాడో కూడా బాగా అర్ధమయింది జలీల్ కి.
డబ్బు! డబ్బు! డబ్బు!
డబ్బు ఎంత వికృతంగా మార్చెయ్యగలదు మనుషులని!
అప్రయత్నంగా ఒక పాట గుర్తు వచ్చింది జలీల్ కి. సినిమాపాటే! కానీ చాలా అర్ధవంతంగా మొదలవుతుంది అది.
"ఈసాపీర్ న మూసా పీర్ || సబ్ సే బడా హై పైసా పీర్!"
"దేవదూత అంటే క్రీస్తూ కాదూ మెసెసూ కాదూ. అసలైన దేవదూత ఎవరయ్యా అంటే అది డబ్బే!" అని దాని భావం.
ఈనాటి లోకరీతికి అద్దం పట్టేటట్లు ఉంటుంది ఆ పాట.
డబ్బుకి లోకం దాసోహం!
అంతే!
నిట్టూర్చి తన నెత్తికి కొత్తగా చుట్టుకున్న ఈ శివరాం హత్యకేసుని టాకిల్ చేయడంలో పడిపోయాడు జలీల్.
కానిస్టేబుల్ బుల్లెట్ యాక్సిడెంటల్ గా రిలీజైందని చెబుతున్నా అది ముమ్మాటికీ హత్యే అని నమ్మకం కలిగింది జలీల్ కి.
ఆ వివరాలు తన పై అధికారులకి తెలియజేసి, శివరాం శవాన్ని హాస్పిటల్ కి తరలించే ప్రయత్నంలో మునిగిపోయాడు జలీల్.
* * *