"ఇదేమిటి? భూస్థాపితం చేసేస్తావా ఏమిటి? నీకు చావాలని ఉందేమో! నాకు లేదు. నన్ను పోనీ" అన్నాడు వామనరావు కీచుగా.
"అరవకు! బయటికి వెళితే తుపాకీకి బలైపోతావ్" అన్నాడు దినకర్.
"వాళ్ళు పోలీసులు! ఎందుకు కాలుస్తారు?" అన్నాడు వామనరావు.
"వాళ్ళు పోలీసులు కారు! హంతకులు! నాకోసమే వచ్చారు. అడ్డం వస్తే నిన్నూ చంపేస్తారు."
"ఎరక్కపోయి ఎదురింటి తద్దినం నా ఇంటికి తెచ్చుకున్నట్లయిందే! నాయనా! బుద్ది తక్కువై నిన్ను నాతో రమ్మన్నాను. నువ్విచ్చిన అయిదు రూపాయల్లో సగం తిరిగి ఇచ్చేస్తా! ఇంకా నీదారిన నువ్వుపో!" అన్నాడు వామనరావు.
"షటప్! వెర్రిగా మాట్లాడకు! ముందు ప్రాణాలు దక్కించుకోగలిగితే, ఆ తర్వాత నీ ఇష్టం వచ్చినంతసేపు గొణుగుదువుగాని!"
"చూస్తే శేరు బియ్యం ఒక్కడివే తిని అరగించుకునే వాడిలా ఉన్నావు. గుంటనక్కలా దాక్కుంటావేం! వెళ్ళి కలియబడరాదూ?" అన్నాడు వామనరావు మంటగా.
విసుగ్గా అన్నాడు దినకర్ "చూడు బాబాయ్! సూపర్ మాన్ లాగా వెళ్ళి నలభైమందినో నాలుగొందల మందినో మట్టి కరిపించడానికి ఇదేమన్నా సేవన్టీ ఎమ్మెమ్ సిన్మా అనుకున్నావా ఏమిటి? మొండిగా ముందుకు పోవడం అన్నివేళలా మంచిది కాదు. సమయం వచ్చేదాకా తగ్గి వుండి, తగిన టైంలో దెబ్బతీయడం కూడా శౌర్యంలో ఓ భాగం! నేను వున్న స్థితిలో గనక నువ్వు వుంటే, మంచినీళ్ళడక్కుండా, మారు మాట్లాడకుండా, కుక్కిన పేనులా ఎప్పుడో చచ్చి ఉండేవాడివి! అర్దమయిందా?" అన్నాడు.
అర్ధమయిందన్నట్లు బలహీనంగా మూలిగాడు వృద్దుడు.
గుంటమీద రైటింగ్ టేబుల్ ని తలక్రిందులుగా బోర్లించడం వల్ల మూతపడినట్లయి లోపల ఊపిరాడ్డం లేదు. వుక్కపోస్తుంది. కన్ను పొడుచుకున్నా కానరాని చీకటి.
అప్పుడు వినపడింది తుపాకి తూటాల శబ్దం.
ఠఠఠఠ....ఠఠఠఠ....ఠఠఠఠ...
ఆ చప్పుడుని బట్టి బులెట్స్ రిలీజ్ అవుతున్న వేగాన్నిబట్టి అది నిశ్చయంగా మెషిన్ గన్ అయి వుండాలని ఊహించాడు దినకర్.
మళ్ళీ తూటాల శబ్దం.
ఠఠఠఠ....ఠఠఠఠ....ఠఠఠఠ...
బుల్లెట్ ధాటికి ఆ గదిలో ఉన్న చెంబూ తప్పేలాలు ఎగిరెగిరి పడ్డాయి. బల్లకి ఉన్న నలుగు కాళ్ళూ నరికేసినట్లు కళ్ళు విరిగి చతికిలబడిపోయింది.
కొద్ది క్షణాలు శ్వాస తీసుకుంటున్నట్లు ఆగింది మెషిన్ గన్. తర్వాత మళ్ళీ కాల్పులు మొదలయ్యాయి. ఈ సారి బుల్లెట్ల బెల్టు అంతా ఖాళీ అయ్యేటట్లు నిర్విరామంగా - ఠఠఠఠఠఠఠఠఠ....
వడగళ్ళ వాన కురుస్తున్నట్లు గదిలో అన్నివైపులకి దూసుకొస్తున్నాయి బుల్లెట్లు.
అప్పుడు బుల్లెట్ల తాకిడికి ఆ పాతకాలపు గది తాలూకు గోడ ఒకటి కొద్దిగా ఒరిగి, ఆ తర్వాత భళ్ళున నేలకూలింది.
ఒక గోడ కూలగానే రెండో గోడ కూలింది.
ఆ తర్వాత మూడోది. నాలుగోది -
గోడలన్నీ పడిపోగానే దభేలుమని కుప్పకూలిపోయింది కప్పు!
నిజంగానే సజీవ సమాధి అయిపోయినట్లు గుంటలో ఉండిపోయారు వామనరావు, దినకర్.
ఆ గుంటమీద బల్ల తాలూకు చెక్క!
ఆ చెక్కమీద కూలిపోయిన కప్పు!
మట్టి.....రాళ్ళు.... సిమెంటు అచ్చులు - ఇనపకడ్డీలు - కొయ్య దూలాలు!
కాల్పులు సాగిస్తున్న దుండగులు లేచి, తాము జరిపిన విధ్వంస కాండవైపు తృప్తిగా చూశారు.
"ఇంక దీనిలోంచి బయటికి రాలేడు వెధవ!" అన్నాడు ఒకడు కసిగా.
"నీ బొంద! ఇంకా బయటికి రావడమేమిటి? ఎప్పుడో చచ్చి వుంటాడు. బుల్లెట్లు తగిలో, కప్పుమీదపడి మెడ విరిగో" అన్నాడు ఇంకొకడు.
"అవునవును" అన్నాడు ఇంకోడు.
అంతలో...
దూరంనించి ఏదో శబ్దం వినబడింది.
వాళ్ళలో ఒకడు చెవులు రిక్కించి విని, "ఇక్కడ కాంప్లెక్సు కడుతున్న సేటుగారి బుల్ డోజర్! ఈ ప్రాంతాన్నంతా చదును చెయ్యడానికి వస్తుందనుకుంటా కేసు సేటుకి అనుకూలంగా అయిందిగా!" అన్నాడు.
తర్వాత వాళ్ళందరూ కలిసి, త్వరత్వరగా ఒక పాత అంబాసిడర్ కారులో ఎక్కి అక్కడనుంచి వేగంగా వెళ్ళిపోయారు.
ఆ స్థలాన్ని అంతా సొంతం చేసేసుకున్న సేటుగారు పంపిన బుల్ డోజర్, వామనరావు ఉన్న ఇంటిని సంపూర్ణంగా నేల మట్టం చేసేసి చదును చెయ్యడానికిగానూ స్పీడుగా వచ్చేస్తోంది అటువైపు!
* * *
ఎర్ర ఆర్టీసీ బస్సులో ఎక్కి దినకర్ పారిపోయి వుంటాడని భ్రమపడి, ఆ బస్సుని వెంబడించి వెళ్ళి ఇన్ స్పెక్టర్ జలీల్ తను మోసపోయానని గ్రహించాక అతి కష్టంమీద కోపాన్ని నిగ్రహించుకున్నాడు. ఆ తర్వాత, అంతకు ముందు దినకర్ కనబడ్డ స్పాట్ కి తిరిగి వచ్చి అక్కడ వెదికాడు. అయితే అది వృధా ప్రయాస అని అతనికి ముందే తెలుసు. మెరుపు వేగంతో ఎత్తులకి పై ఎత్తులు వేస్తున్న దినకర్ ఇంకా అక్కడ ఉండి ఉంటాడనే ఆశ అతనికేమాత్రం లేదు. అయినా, డ్యూటీ డ్యూటీనే! ఆ స్పాట్ కి వెళ్ళి అక్కడ దినకర్ లేడని నిర్ధారణ చేసుకోక పోవడం అంటే విధి నిర్వహణని నిర్లక్ష్యం చేసినట్లే!
అందుకని తిరిగి ఆ స్పాట్ కి వచ్చి చూశాడు ఇన్ స్పెక్టర్ జలీల్. అక్కడ దినకర్ లేడు. దినకర్ అక్కడ నుంచి పారిపోవడానికి సవాలక్ష మార్గాలు ఉన్నాయి. ఇంతవరకు తను దినకర్ ని దాదాపు వెన్నంటుతూ వచ్చాడు.
కానీ ఇప్పుడింక ట్రాక్ పూర్తిగా తప్పిపోయింది. దినకర్ ని ఈ పరిస్థితులలో వెదికి పట్టుకోవడం తన వక్కడివల్లా అయ్యేపని కాదు. అందుకని ముందు పోలీస్ స్టేషన్ కి వెళ్ళి అక్కడ పరిస్థితులను బట్టి ఒక నిర్ణయం తీసుకోవాలి.
జలీల్ ఇన్ని విధాలుగా ఆలోచించాడేగానీ దినకర్ ఇంకాస్త వెనక్కి వెళ్ళి ఆ హోటల్ ప్రాంతంలోనే ఉండి ఉంటాడని ఊహించలేక పోయాడు.
పోలీసు స్టేషన్ కి రాగానే అప్పటిదాకా జరిగిన విషయాలన్నీ తూచా తప్పకుండా డైరీలో రాయడం మొదలెట్టాడు ఇన్ స్పెక్టర్ జలీల్.
అతను నాలుగు పంక్తులు రాసీ రాయకముందే పోలీస్ స్టేషన్ లోకి అడుగుపెట్టాడు ఒకడు. లాల్చీ పైజామా వేసుకుని, పాన్ నముల్తూ జబర్దస్తీగా వచ్చాడు లోపలికి. అతనికి ఇరవై మూడు ఇరవై నాలుగేళ్ళ కంటే ఎక్కువ ఉండవు. నల్లగా వున్నాడు. బీరు తాగడానికి బాగా అలవాటు పడిన వాడిలాగా అప్పుడే పొట్ట వచ్చేస్తోంది అతనికి.
అతని పక్కన కేతిగాడిలాగా ఇంకోడున్నాడు. చీల మండల పైకి ఉన్న పైజామా అరగాజం వెడల్పున పరికిణీలా కనబడుతోంది. పైజామా కంటే వదులుగా ఉన్న చొక్కా వేసుకుని ఉన్నాడు అతను.
చూసీ చూడగానే, ఆ కుర్రాడెవరో గుర్తుపట్టాడు ఇన్ స్పెక్టర్ జలీల్.
అతని పేరు నాగేందర్. రాజకీయాల్లోకి అతి త్వరలో రంగప్రవేశం చేయబోతున్న ఛోటా నాయకుడు.
ఇదివరకటి రోజుల్లో రాజకీయాల్లోకి రావాలంటే కొద్దో గొప్పో దేశసేవ, కనీసం సంఘసేవ చేసి ఉండడం కనీస అర్హతగా భావించబడుతూ వుండేది. ఇప్పుడదంతా అవుటాఫ్ ఫేషను!
ఈ రోజుల్లో, త్వరలో గుర్తింపు కావాలంటే అల్లర్లు చేయించాలి. అజిటేషన్లు చేయించాలి. అరెస్టు కావాలి. ఇవన్నీ చేస్తూనే అంతో ఇంతో మిగుల్చుకుంటూ, ఆ మిగుల్చుకున్న దానిలో తినిపించవలసిన వాళ్ళకి తినిపిస్తూ ఉండాలి.
దేశసేవా, సంఘసేవా పక్కన పెట్టేసి నాయకులకి సేవ చేస్తూండాలి!
ఈ ధర్మ సూక్ష్మాలన్నీ చిన్నతనంలోనే బాగా వంటపట్టించుకున్నాడు ఆ ఛోటా నాయకుడు, నాగేందర్.
లోపలికి వస్తూనే అసభ్యమైన పదాలతో తిట్లు లంకించుకున్నాడు నాగేందర్. అక్కడున్నవాళ్ళ అమ్మలనీ, అక్కలనీ పరమ పరుష పదాలతో నిందించాడు. తర్వాత రుబాబుగా వచ్చి ఇన్ స్పెక్టర్ జలీల్ ముందు వున్న కుర్చీలో కాలుమీద కాలు వేసుకుని కూర్చున్నాడు.
తనని తాను నిగ్రహించుకుంటూ, నాగేందర్ క్రియేట్ చేస్తున్న సీన్ ని అబ్జర్వ్ చేస్తున్నాడు ఇన్స్ పెక్టర్ జలీల్.
మరొక్కసారి అన్యాపదేశంగా అందర్నీ తిట్టి, తర్వాత అన్నాడు నాగేందర్.
"ఏమి ఇన్ స్పెక్టర్ సాబ్! మా బస్తీ వాళ్ళనిద్దరినీ తీసుకొచ్చి లాకప్పుల పెట్టినావంట ఏమిటి ముచ్చట? నేనెవరినో ఎరికలేదా? చక్కగా వాళ్ళని వదిలెయ్యి! లేకుంటే మంచిగుండదు!
"మీ వాళ్ళిద్దరూ గుడుంబా కాస్తుంటే దొరికారు. ఇల్లిసిట్ డిస్టిలింగ్!" అన్నాడు జలీల్ కూల్ గా.
"అయితే ఏమంటావు? విడవనంటవా? అట్లయితే అన్నకు చెప్పబడ్తది" అన్నాడు నాగేందర్.