"ఇదా మోడరన్ గా ఉండడమంటే!" అనిపించింది ప్రతిమకి. నాభి కిందికి చీరె కట్టుకోవడం, బ్రాసరీ కంటే కొంచెమే పెద్దదిగా ఉండే స్లీవ్ లెస్ జాకెట్లు వేసుకోవడం, ఇదేనన్నమాట సంస్కారం వచ్చెయ్యడం అంటే! తనివితీరా విజ్ఞానం సంపాదించుకోవడం, ఆ విజ్ఞానాన్ని క్రియాత్మకంగా ఉపయోగించుకోవడం, అది మాత్రం మోడరన్ అవుట్ లుక్ కాదన్న మాట!
"నాకు అలా చీరె కట్టుకోవడం అలవాటు లేదు - చేతకాదు."
"నా మీద ఇష్టముంటే ఇక మీదయినా అలవాటు చేసుకో!"
అత్తగారికి చెప్పి వచ్చి, కారెక్కింది ప్రతిమ.
"అమ్మయ్య! ఇదే కదా మనిద్దరం కలిసి తీరిగ్గా ఒక రోజంతా స్పెండ్ చెయ్యడం! బిజినెస్ గొడవలతో ఊపిరి తీసుకోవడానికి కూడా వీల్లేకుండా పోతూంది. న్యాయంగా చూస్తే, పెళ్ళవగానే మనిద్దరం హనీమూన్ కి ఏ కొడైకో, వూటీకో వెళ్ళిపోయి ఉండాల్సింది. కానీ బిజినెస్ - స్క్రూద బిజినెస్ - చెప్పు, ప్రతిమా! ఎన్ని చీరెలు కొనుక్కుంటావ్?"
పెదిమలు విప్పకుండానే చిరునవ్వు నవ్వింది ప్రతిమ. అన్యమనస్కంగానే అతని మాటలు వింటూంది.
షాపింగ్ పూర్తయ్యాక ఒక పెద్ద హోటల్లో లంచ్ తీసుకున్నారు. తరవాత బలవంతంగా రేసెస్ కి తీసుకెళ్ళాడు శ్రీరాం.
రేసెస్ లో, ఫస్ట్ ఎన్ క్లోజర్ లో వోబెరాయ్, రజిత కనిపించారు. "హలో వోల్డ్ బోయ్!" అంటూ వోబెరాయ్ ని పలకరించాడు శ్రీరాం.
దాదాపు ఆరున్నర అడుగుల ఎత్తు ఉంటాడు వోబెరాయ్. అతని భార్య రజిత కూడా చాలా పొడుగ్గానే ఉంది. అమెజాన్ యువతుల్లాగా చాలా పుష్టిగా, ఎత్తుగా ఉంది.
ఆమె చీరె ఎంత కిందికి కట్టుకుందో గమనించింది ప్రతిమ. ఇంక అంతకంటే కిందికి కట్టుకోవడం అసంభవం! తెల్లటి జాకెట్ కింద నుంచీ నలుపురంగు బ్రా కనబడుతూంది. కావాలని మరింత ప్రస్ఫుటంగా కనపడడానికే ఆ అమ్మాయి వేరే రంగు బ్రా వేసుకున్నట్లు అనిపిస్తూంది.
వోబెరాయ్ తనవైపు భక్తిగా చూడటం గమనించింది ప్రతిమ. అది శ్రీరాం కూడా గమనించాడు. అతనికి చాలా తృప్తి కలిగింది.
వోబెరాయ్ గాడి భార్య కంటే తన భార్యే అందమైనది! వెధవ వోబెరాయ్ గాడే ఏమిటి? ఈ క్షణంలో, ఈ రేస్ కోర్ స్ లో ఉన్న మరే వెధవగాడి భార్య కంటే కూడా తన భార్యే బాగుంది!
"నా వైఫ్! డాక్టర్ ప్రతిమ!" అని ఇంట్రడ్యూస్ చేశాడు శ్రీరాం సగర్వంగా.
నిరుత్సాహంగా నవ్వుకుంది ప్రతిమ.
వూరికే 'డాక్టరు' అని చెప్పుకోవడానికేనా తను అయిదేళ్ళు ఆ కోర్సు చదివింది!
రేసెస్ మొదలయ్యాయి.
వోబెరాయ్, రజిత దూరంగా వెళ్ళారు.
"రజితని చూశావా? ఎలా ఉంది?" అన్నాడు శ్రీరాం.
"ఏం? బాగానే ఉంది." అంది ప్రతిమ.
"బాగా? నా మొహమా! సెక్సీ బీఫ్! అంతే! చీరెలు మాత్రం తగని ఫ్యాషనబుల్ గా కడుతుంది. నువ్వు అంత స్మార్ట్ గా బట్టలు వేసుకుంటే...."
ఉసూరుమంది ప్రతిమ ప్రాణం!
అదా ఆ అమ్మాయిని అంచనా కట్టే విధానం!
'సెక్సీ బీఫ్' ట!
అంటే 'అందమైన ఆవు మాంసం' అనేనా అర్ధం?
లేదా అందమైన ఆడ మాంసం అని అర్ధం!
అంతేనా ఆడదాని బతుక్కి విలువ?
అందంగా ఉందా లేదా?
సెక్సీగా ఉందా లేదా?
మైమరపించే కొలతలు, అంటే వైటల్ స్టాటిస్టిక్సు కొరత లేకుండా ఉన్నాయా లేదా?
అంతేనా ఆడదాని బతుక్కి అర్ధం?
వెగటుగా అయిపోయింది ప్రతిమ మనసు.
సెక్సీ బీఫ్!
సెక్సీ బీఫ్!
అదే మాట ప్రతిమ చెవిలో మారుమోగుతున్నట్లు అనిపిస్తూంది.
మామూలుగా ఉంటేనే మగవాళ్ళు అలాంటి దృష్టితో తప్ప చూడరని తెలిసే ఈ అమ్మాయి మరింత సెక్సీగా కనబడటానికి ఎందుకంత తాపత్రయపడిపోతూంది?
"హై గ్యాంగ్! అందరూ వచ్చారా?" అంటూ దగ్గరకొచ్చింది ఇంకో అమ్మాయి.
"హై లాలసా!" అన్నాడు శ్రీరాం.
ఆ అమ్మాయి తెల్లగా, పలచగా ఉన్న స్పోర్ ట్స్ టీస్ షర్ట్ వేసుకుని ఉంది.
"వర్జినిటీ కాజెస్ కేన్సర్!" అని పెద్ద పెద్ద అక్షరాలతో ఒక చిలిపి స్లోగన్ ప్రింట్ చేసి ఉంది దానిమీద.
"కన్నెగా ఉంటే కేన్సరొస్తుంది!" అని స్లోగన్!
షాకయిపోయి అలాగే చూస్తూ ఉండిపోయింది ప్రతిమ.
లాలస లోపల బ్రా వేసుకోలేదని స్పష్టంగా కనబడుతూంది.
ఆమె ఆశ్చర్యాన్ని గమనించింది లాలస.
"బర్న్ ద బ్రా! బ్రాసరీలని తగలబెట్టండి! అదే ఉమెన్స్ లిబ్!" అంది నిర్లక్ష్యంగా - తిరుగుబాటుదారు లాగా కనపడుతూంది తను.
తిరుగుబాటు - దేనిమీద!
ఆంక్షల మీద!
కేవలం సెక్సుకి సంబంధించిన ఆంక్షల మీదేనా తిరుగుబాటు?