Previous Page Next Page 
ప్రేమ పురాణం పేజి 30


    
    రాయలసీమలో కొన్ని జాతరలకు ఒక మనిషిని భూతపిల్లిలా చేస్తారు. ఆ భూతపిల్లి అయిన మనిషి ఒంటిమీద ఒక్క వెంట్రుక కూడా లేకుండా క్షవరం చేయించేసుకుని పూజలో కూర్చుంటాడు.
    
    అలాంటి భూతపిల్లిని ఓసారి చూశాడు జెయ్ చంద్ర. ఆ తర్వాత వెంటనే ప్రిన్సిపాల్ గారి పేరు భూతపిల్లి అని పెట్టేశాడు.
    
    రూంలోకి రాగానే భూతపిల్లిగారిని ఓసారి ఎగాదిగా చూశాడు జెయ్ చంద్ర.
    
    నున్నగా, చలిమిడిముద్దలా ఉన్న ఆయన్ని చూసినప్పుడల్లా కిసుక్కున నవ్వొస్తుంది అతనికి. ఆ నవ్వుని దగ్గుతూ తర్జుమా చేసేసి వినయం నటిస్తూ నిలబడ్డాడు.
    
    "నీకు వార్నింగు ఇవ్వడానికి పిల్చా....." అన్నాడు భూతపిల్లిగారు ఉపోద్ఘాతం లేకుండా.
    
    "నాకా? వార్నింగా? ఏమిటి?" అన్నాడతను మరింత వినయం అభినయిస్తూ.
    
    "ఇవాళ రాత్రి కాలేజ్ డే ఫంక్షన్......"
    
    "తెలుసు సార్!"
    
    "ఈ కాలేజీలో రెండు గ్రూపులున్నాయి"
    
    "అదీ తెలుసు సార్! ప్రతి కాలేజ్ లో రెండు గ్రూపులుంటాయి."
    
    "అందుకనే చెబుతున్నా! నాకు వయొలెన్స్, కొట్లాటలూ ఇవన్నీ అంటే అసహ్యం. అందుకే ఎప్పుడూ కామెడీ సినిమాలు చూస్తా. వయొలెన్స్, కొట్లాటలు, రక్తపాతం, మారణహోమం యివేమీ జరక్కుండా చూసే బాధ్యత నీ మీద పెడుతున్నాను....."
    
    "యస్సర్!"
    
    "యూకెన్ గో నౌ"
    
    "యస్సర్!"
    
    "జెయ్....."
    
    "సర్"
    
    "ఏర్పాట్లు ఎంతవరకూ వచ్చాయి?"
    
    "మావాళ్ళు అన్నీ చూసుకుంటున్నారు సార్!"
    
    "మెయిన్ ఐటెం ఏంటి?"
    
    "ఒకబ్బాయి, ముగ్గురమ్మాయిలు - నృత్యరూపకం"
    
    "ఓకే! యూ కెన్ గో"
    
    "యస్సర్!"
    
    "జెయ్....."
    
    "సర్"
    
    "ఆ నృత్య నాటకంలో నువు కూడా వున్నావా?"
    
    "యస్సర్!"
    
    "అబ్బాయిగానా? అమ్మాయిగానా?" అన్నాడాయన జోకేశాననుకుని.
    
    "లేద్సార్! కర్టెన్ గా నటిస్తున్నా!"
    
    భూతపిల్లిగారి వదనం మ్లానమయ్యింది.
    
    "ఓకే! ఓకే! యూ కెన్ గో నౌ!" అన్నాడు హడావుడిగా.
    
    ప్రిన్సిపాల్ రూంలో నుంచి బయటికి రాగానే అతనికి ముగ్గురు మూర్ఖిణులూ కనబడ్డారు.
    
    ఆ ముగ్గురూ ఒకే రకం నలుపూ, తెలుపూ చుడీదార్లు వేసుకుని వున్నారు.
    
    "నాకో డౌటు.....?" అన్నాడు అతను మొదటి మూర్ఖిణి నిమ్మీ కపూర్ తో.
    
    "ఏంటీ?" అంది నిమ్మీ నవ్వుతూ.
    
    "ముగ్గురూ పంతం పట్టినట్లు ఒకేరకం బట్టలేసుకుని వస్తారు కదా? ఒకళ్ళు ఫలానివే వేసుకుంటున్నట్లు యింకొకళ్ళకి ఎలా తెలుస్తుందసలు?"
    
    "అనుభవం ఉండాలి యార్.....! నువ్వు ఆడపిల్లవై పుట్టి వుంటే యిలాంటివన్నీ తెలిసేవి" అంది నిమ్మీ తేలిగ్గా తేల్చేస్తూ.
    
    ఈలోగా నలభై దొంగలూ మన ఆలీబాబా దగ్గరికి వచ్చేశారు. (సితార పెట్టిన పేరు)
    
    "బాస్! అన్ని ఏర్పాట్లు రెడీ" అన్నారు అచ్చం సినిమాల్లోలాగానే.
    
    "స్క్రీన్లు, కర్టెన్లు, సెట్ ప్రాపర్టీస్, కాస్ట్యూమ్స్?" అన్నాడు.
    
    "హోల్ మొత్తం రెడీ"
    
    "మేకప్?"
    
    "రెడీ"
    
    అప్పుడు హఠాత్తుగా గుర్తొచ్చినట్లు అన్నాడతను "మరి.....కత్తులూ, కఠార్లూ, ఛెయిన్లూ?"
    
    "అవీ రెడీనే! కానీ ఎందుకు బాస్?"
    
    "పిచ్చివాడా!" అని నవ్వాడు జెయ్ చంద్ర "నీకు సన్నాసీ, పాము కథ తెలీదూ?"
    
    "తెల్దు బాస్" అన్నాడు దొంగ.
    
    ఓసారి వాచీ చూసుకుని, గొంతుసవరించుకుని గబగబా చెప్పడం మొదలెట్టాడు జెయ్ చంద్ర.
    
    "ఒక ఊళ్ళో ఒక పాము వుండెను. అది అందరినీ కరిచి చంపుచుండెను. ప్రజలందరూ దాన్ని తిట్టుకొనుచుండిరి. ఓ రోజున ఓ సన్యాసి అటువచ్చెను. పామును పిల్చి తిట్టెను. ఎందుకీ పాడు జీవితము అనెను. అందరినీ ఎందుకు కరిచెదవనెను. పాము పశ్చాత్తాపపడెను. ఇక ముందు ఎవరినీ కరవననెను. అప్పటినుంచి అది ఎవరినీ కరవననెను. అప్పటినుంచి అది ఎవరినీ కరవకుండెను. జనులకి ఈ సంగతి తెలిసెను. జనులకు పాము అన్న భయముపోయెను. పిల్లలు దాన్ని కర్రలతో కొట్టీ, రాళ్ళు విసిరీ ఏడ్పించుచుండిరి. కొన్ని దినముల పిమ్మట సన్యాసి మళ్ళీ ఆ దారిన వచ్చెను. వంటినిండా గాయములతో వున్న ఆ పాముని చూసెను. ఏమి కథ అని విచారించెను. పాము వెక్కివెక్కి ఏడ్చెను. సన్యాసితో సంగతి అంతా చెప్పెను. అది విన్న సన్యాసి పాముని మందలించెను. ఓసీ! ప్రజలను కరవవద్దని చెప్పితినిగానీ బుసకొట్టి బెదిరించవద్దని చెప్పితినా?" అనెను. పాము విషయము గ్రహించి ఆ రోజునుంచి బుసలుకొట్టుట మొదలెట్టెను. ఆ రోజునుండి జనులు పాముని ఏడ్పించకుండిరి" అని ఆయాసపడుతూ ఆగాడు అతడు.    

 

    "పాముకథకీ, ఫంక్షనుకీ సంబంధమేమిటి బాస్!" అన్నాడు మైకేల్ మదన కామరాజు అనే శిష్యుడు.    

 

    "పిచ్చివాడా!" అన్నాడు అతడు మళ్ళీ "ఈ కాలేజీలో రెండుగ్రూపులున్నాయి. ఒక గ్రూపు అంటే మనం - శాంతికాముకులం రెండో గ్రూపు అంటే జనక్ రాజ్ వాళ్ళది. వయొలెన్సు గ్రూపు! వాళ్ళని కంట్రోల్ లో పెట్టడానికి మనదగ్గర మారణాయుధాలు వుంచుకోవాలి శిష్యా!"
    
    "కొట్టడానిక్కాదా?" అన్నాడు మైకేల్ నిరుత్సాహంగా.
    
    "కాదు"
    
    మైకేల్ మొహంలో వన్నె తగ్గింది "సరే! నీ యిష్టం!" అన్నాడు ఉదాశీనంగా.

 Previous Page Next Page