Previous Page Next Page 
మిస్టర్ క్లీన్ పేజి 31

 

    క్రితం రోజు రాత్రి నిరంజనరావు యింట్లో అద్దెకి వున్నవాళ్ళు యాత్రలనుంచి తిరిగివచ్చారు. వాకిలి తలుపు చూస్తే బైట తాళం లేదు. తలుపుతట్టి పిలిస్తే లోపలనుంచి ఎవరు వచ్చి తలుపు తీయలేదు. ఆ వీధిలో అన్ని ఇళ్ళల్లో లైట్లు వెలుగుతున్నాయి. ఈ యింట్లోతప్ప. దొంగలు దొంగలు దూరారా! ఆ అనుమానంవచ్చి యింటిచుట్టు తిరిగి చూశారు అదేం లేదు.

 

    అద్దేకుండేవాళ్ళకి ఏం చేయాలో తెలియలేదు. హాలులోంచి వెళితేగాని వాళ్ళ భాగంలోకి వెళ్ళలేరు. అదే సమయంలో నిరంజనరావు రిక్షాలో వచ్చాడు. పెళ్ళి వారింట్లో వంటచేసేచోట పైన ఏ అచ్చాధనము లేదు మబ్బులు బాగా పట్టాయి. వర్షం వస్తే యిబ్బంది. లడ్డు అరిసెలు లాంటివి వాళ్ళు రాత్రి చేస్తుకుర్చున్నారు. వర్షం వస్తే పైనా కప్పడానికి టప్పాలిలులేవు. అర్ధరాత్రి అద్దె షాపులు (షామియానా) వుండవు. మా ఇంటిలోవున్నాయి తెస్తాను అని చెప్పి రాను పోనురిక్షా మాట్లాడుకుని నిరంజనరావు వచ్చాడు. ఇంటికి వచ్చేసరికి యిది పరిస్టితి.

 

    విషయం తెలుసుకుని నిరంజనరావు కంగారుపడ్డాడు. ధైర్య మొద్దునిద్దరపోదు ఆ విషయం ఆయనకి బాగా తెలుసు. పక్క యింటి వాళ్ళని లేపి టార్చిలైటు  తీసుకుని తెరిచివున్న కిటికిలోంచి లోపలికి వేసి చూశాడు. ఆమె కనపడలేదు.

 

    కటకటల్లోంచి హాలులోకి టార్చిలైటు వేసిచుస్తే ఆ వెలుతురులో మెయిన్ కనపడింది. మెయిన్ తీసినట్లు తెలిసిపోయింది.

 

    పోలీసు రిపోర్ట్ యిచ్చే దారుణ పరిస్టితి ఏమి కానరాలేదు. నిరంజనరావు అద్దెకి వుండేవాళ్ళు కలిసి పెరటి వేపువున్న తలుపు పగలగొట్టి ఇంట్లోకి వెళ్ళారు.

 

    మధ్య గదిలో ధైర్య స్పృహ తప్పి బోర్లపడివుంది. అనుమానాస్పదంగా ఏమి కానరాలేదు. ఆమెని మంచం మీదకి చేర్చి ప్రధమ చికిత్స చేశారు. తెలివిరాలేదు. ఫ్యామిలీ డాక్టరుని అ వీధి చివరవున్న ఆయన్ని పిలుచుకువచ్చారు. ఆయనకి అర్ధంకాలేదు. డాక్టరు సలహామీద కళ్యాణి నర్సింగ్ హోంలో వెంటనే చేర్పించడం జరిగింది.

 

    అ తర్వాత అన్ని చకచకా జరిగిపోయాయి. కూతురు సంగతి తెలిసి, వున్న పళన బైలుదేరి సావిత్రి పెళ్ళివారి యింటినుంచి వచ్చేసింది. ధైర్య ప్రాణానికి ప్రమాదంలేదని చెప్పినా ఆ తల్లి మనసు తల్లడిల్లిపోయింది. కంటికి మంటికి ఒకటే ఏడుపు. ఏడ్చి ఏడ్చి ఆమె ఎంతగా అలసిపోయిందంటే కిచుగా చిన్న శబ్దంతో రోదన వుండి వుండి నీరసంగా వినరావటం తప్ప మరేమీ లేదు.

 

    మర్నాడు సాయంత్రం ఈ విషయం తెలిసి ధైర్యని చూడటానికి మహానంద శ్రీవిద్య వచ్చారు.

 

    డా.కళ్యాణి వచ్చి చూసింది. నర్స్ ఇంజక్షన్ అందిస్తే చేసింది. డోంట్వర్రీ అని చెప్పి వెళ్లిపోయింది. దైర్య బెడ్ మీద నిద్రపోతున్నట్లు పడుకునివుంది. పక్కనే బెడ్ కి తలకాయ అనించుకుని కూర్చున్న సావిత్రి శోక దేవతలా వుండిపోయింది.

   

    రూంలోకి డా.కళ్యాణి వచ్చి వెళ్ళిపోయింతరువాత.

 

    "అసలు ఏం జరిగింది అంకుల్!" అక్కడేవున్న నిరంజనరావుని మహానంద అడిగింది.

 

    "డాక్టరు ఏమని చెప్పింది అంకుల్." శ్రీవిద్య ఆత్రుతగా అడిగింది.

 

    "ఎలా చెప్పాలో ఏం చెప్పాలో నాకు తెలియటం లేదమ్మా!" బాధగా అన్నాడు నిరంజనరావు.

 

    మహానంద శ్రీవిద్య ముఖముఖం చూసుకున్నారు.

 

    ఒక్కక్షణం ఆగి జరిగింది వివరంగా చెప్పాడు నిరంజనరావు చెప్పి "నాకేం అర్ధం కావటంలేదు. ధైర్య తప్ప ఇంటిలోకి ఎవరు రాలేదు. ఆమె మెయిన్ ఎందుకు అపుచేసిందో తెలియదు. కరెంటు పొతే మా ఇంటిలో అందుబాటులో హరికేన్ లాంతరువుంది. అది వెలిగిస్తాము. కాని కొవ్వొత్తి వెలిగించివుంది, ఆ పక్క గదిలో ఆమె ఎప్పుడు చదువుకోదు. అలాంటిది ఆ గదిలో .... ఏమిటో నాకంతా అయోమయంగా వుంది." అంటూ చేతులమధ్య తల యిరికించుకున్నాడు.

 

    మహానందకి శ్రీవిద్యకి విషయం చూచాయగా అర్ధం అయింది.   

 Previous Page Next Page