ఇలాంటి సమయాలలో ఏ ఆడపిల్లకయినా తల్లి వుండాలి. తల్లిలేని పిల్లయితే ఏ పెద్దదిక్కో ఓ ముసలమ్మ వుంటే చాలు. వీళ్ళఎవరు లేకపోయినా వదిన గాని, అక్కగాని వుంటే చాలు సీత పెళ్లికి బాబాని పిలవటం జరిగింది. అయితే ఆ సమయంలో బాబా లేడు. పెళ్ళాంతో వారంరోజుల క్రితమే కాశ్మీర్ లాంటి సుందర ప్రదేశాలు చూడటానికి వెళ్లాడు. మరో మూడు వారాల తర్వాతగాని తిరిగి రాడని తెల్సింది. సీతకి వదిన ఉండి సమయానికి దగ్గర లేకపోయింది అక్కంటూ ఎవరూ లేరు పెళ్ళయిన చెల్లెలుంది.
ప్రతి ఇంటిలో అక్కలకి ముందే పెళ్ళిళ్ళయి ఉంటాయి. చెల్లెళ్లు అవసరానికి సలహాలిస్తారు. చెల్లెలికి ముందు పెళ్ళయి అక్కకి తర్వాత అయినా వయస్సులో పెద్ద కావటంతో వీళ్ళు వాళ్ళకి సలహా ఇవ్వలేరు సీత, రూప పరిస్థితి అలాగే ఉంది సీతకి ముందు పెళ్ళయి ఉంటే సీత విషయంలో అన్ని దగ్గరుండి చెప్పి చేసేది. రూపకి ముందే పెళ్ళికావటం కొన్ని నెలలుగా కాపురం చేయటంతో రూపకి తెలిసినవి సీతకి అనుభవపూర్వకంగా తెలియవు. అక్కా అంటూ అరిందలా రూప ఏం చెప్పగలుగుతుంది. ఇది ఇద్దరికీ సిగ్గుగా, బిడియంగా ఉంది.
ఆ చిన్న యింట్లో సీతా, రూపా ఒకరి నొకరు తప్పించుకు తిరుగుతున్నారు. రూప ఉండటమైతే వుంది గాని బిదియంతో సీతని చూడటం లేదు. సిగ్గుతో సీత రూపని చూడటంలేదు. దూరమయి పోతున్నాము కలిసి మాట్లాడుకోవాలని వాళ్ళ అనురాగం అపేక్ష రక్తస్పర్శ అనిపిస్తుంటే మౌనం నోరు కుట్టేసింది.
సీతకి పూల జడేస్తూ శాంత కబుర్లు మొదలుపెట్టింది.
రూప పేరుకి చదువుతున్నట్టు వారపత్రిక తిరగేస్తూ వీళ్ళ మాటలు వింటూ పక్క చాపమీద కూచుంది.
'మా సుందరానికి నోట్లో నాలుకలేదు ' మురిపంగా చెప్పింది సీత.
సీతకి నవ్వొచ్చింది.
రూపకి శాంతతో చనువులేదు వుంటే 'అయితే మీ తమ్ముడికి టంగ్ క్లీనర్ ఖర్చు తప్పిందన్నమాట,' అంటూ కిలకిల నవ్వేదే.
'నిజం చెప్పాలంటే ఈ కాలంలో పుట్టవలసిన వాడుకాదు. ఆ శాంతం.....ఆ వినయం పెద్దల పట్ల గౌరవం. నువ్వే చుస్తావుగా సీతా, మంచిపద్దతులు కూడాను. దైవభక్తి మాటలా వుంచు పొరపాటున కూడా సిగరెట్టు కాల్చాడు. చెడు అలవాట్లకి దూరంగా వుండాలంటాడు. ఆరోగ్యమే మహాభాగ్యం అని ఆరోగ్యం విషయంలో ఎంత జగ్రత్తో తెలుసా నువ్వే చుస్తావుగా!' శాంత ఓ పది నిముషాలు చెప్పింది చెప్పకుండా తమ్ముడు గురించి ప్రేమగా చెప్పింది.
"తమ్ముడంటే, ఎంత ప్రేమో" అనుకుంది సీత.
"పసితనంలోనే తల్లి పోవటం- ఆ బాధ పగవాడికైనా వద్దు సీతా. నీ విషయమే చూస్తే మీ నాన్నగారు మళ్ళి పెళ్ళి చేసుకోలేదు. గుడ్డి కాదు మెల్లని కొంతలో కొంత నయం, మా విషయమే తీసుకో....' అంటూ కాస్త ఆగింది శాంత.
సీతకి పెళ్ళికి ముందే తెలుసు తన భర్తకి చిన్న తనంలోనే తల్లి పోవటం ఆ తండ్రి మళ్ళి పెళ్ళి చేసుకున్నాడని మారుట తల్లికి ముగ్గురు సంతానమని పదేళ్ళ క్రితం తండ్రి పోయాడని వాళ్లకి వీళ్ళకి రాకపోకలు లేవని, అంతకన్నా వాళ్ల కధ వివరంగా తెలీదు. పెళ్ళికి సవతి తల్లిగాని ఆమె పిల్లలు గాని రాలేదు. పెళ్ళికి పిలవలేదో, పిలిస్తే రాలేదో, ఇప్పుడు శాంత తన వాళ్ళ గురించి చెప్పబోతున్నదని గ్రహించింది.
సీతకి జడ సగం కుట్టడం పూర్తయింది. ఓ గంట అల్లినా జడ సగామవటానికి సీత కురులు నిడుపాటివి కావటమే కురుపికయినా కురులు అందమంటారు. సీతది కళ గల ముఖం ఈ భాగం యింతే వుండాలని కొలిచినట్లు సీతది చక్కని అవయవ నిర్మాణం వత్తైనా నిడుపాటి కురులు అమావాస్య చీకటిని పోలిన రంగులో పట్టుకుచ్చులా మెత్తగా వుండి ముంగురులు మాత్రం కొద్ది వంకులు తిరిగి తలకట్టు అంటే ఇలా వుండాలి అనేలా వుంటుంది. పూలజడ వేయటంలో పరిపూర్ణురాలు శాంత. అందుకే సీత జడ వేయటానికి శాంత మోజు పడింది.
"విసుగేయ్యటం లేదు కదా?" అంది శాంత టాకవేస్తూ.
'ఉహూ, మీరు మాట్లాడకపోతే నిజంగా విసుగు పుట్టేదే,' అంతవరకు ఊ...ఆ...లతో ముక్తసరిగా వున్న సీత పెదవి విప్పి నిజం చెప్పింది.
"మా కధ మా చిన్నతనం చెప్పనా?"
"చెప్పండి"
"అప్పుడు నాకు ఎనిమిదేళ్ళు. సుందరానికి నాలుగు నిండాయి. మరోసారి అమ్మ గర్భావతయింది. చనిపోయిన శిశువుని కని వెంటనే వాతం కమ్మి కన్నుముయటం క్షణంలో జరిగిపోయింది. సుందరం పిలగా అనారోగ్యంగా ఉండేవాడు. ఎప్పుడూ దేనికో దానికి పేచి ఏడుపు. అమ్మ చనిపోయాక అస్తమానం ఏడుస్తూనే ఉండేవాడు. నన్నాకి మళ్ళి పెళ్ళి చేసుకోవాలని బాగా కోరిక ఉండేది. వీడి అనారోగ్యం వీడి ఏడ్పు వంకతో పిల్లలని కనిపెట్టి చూడటానికే పెళ్ళని హాయిగా పెళ్లి చేసుకున్నాడు. ఆ వచ్చినావిడ నాన్నని పూర్తిగా తన వేపు తిప్పుకుంది. చిటికి మాటికి సుందరాన్ని తిట్టను కొట్టను నేను తిట్లు మాత్రమే తినేదాన్ని, ఆవిడకి వెంటనే ముగ్గురు పెళ్ళాలు పుట్టారు. నే ఎదుగుతున్న కొద్ది ఇంట్లో నా స్థానం పనిపిల్ల. సుందరానికి ఎంతకసి ఉండేదో చెప్పలేను. నా దగ్గిర తప్ప పైకి వ్యక్తం చేసేవాడు కాదు. వాడు మౌనంగా ఉండటం వాళ్ళందరికీ లోకువయింది. సూటి పోటీ మాటలు తెగ అనేవాళ్ళు. అలాగే పెద్దవాళ్ళ మయాము నా పెళ్ళయింది, నా అదృష్టం బాగుండి నాకు దేముడులాంటివారు దొరికారు, వారు నా మాట మన్నించి సుందరాన్ని మా దగ్గరుంచుకొని చదివించటం అలా అలా జరిగిపోయింది.