రామదూత వంట్లు లెక్కబెట్టటం ఎందుకంటే వాళ్ళ బుర్ర పనిచేయకుండా వుండటానికిట. బుర్రపనిచేస్తే ఏకాగ్రత వుండదుట. వకటినుంచి వందదాకా లెక్కపెట్టటం మళ్ళీ ఒకటినుంచి వందదాకా లెక్కపెట్టటం రామదూత చేస్తున్న పని అక్కడ ప్రస్తుతం అదే.
వైజయంతి త్రిలోకసుందరి రామదూతని రామదూత గారూ అంటే ఏం బాగుంటుందని "బాబాయిగారూ!" అని పిలవటం నేర్చుకున్నారు. హోటల్ బాబాయిలాగా రామదూత బాబాయిగారు అయిపోయాడు అందరికీ.
వెంటనే ఆ గదిలో ధబ్ అని ధబక్ మని రెండు శబ్దాలు వెలుబడ్డాయి.
ధబ్ అన్న శబ్దం చక్రవర్తి తాలూకాది. దబక్ మన్న శబ్దం మదన్ గోపాల్ ది. శూన్యంలోంచి భూమిమీదకి, ఆకాశాన్ని చూస్తున్న (లేక గదిలో వాసాలు) పాదాలు అంధక పాతాళానికి విచిత్రభంగిమలు వూడిపడ్డాయి.
పారిపోదామంటే ఆ గదికి మరోద్వారం లేదు అనటానికిలేదు. వుంది అది అటు తాళంవేసివుంది. కనుక ప్రస్తుతం ఒక ద్వారం కిందనే లెక్క. ఆ ద్వారానికడ్డంగా వైజయంతి కూర్చుని వుంది.
ఆమె వెనుకనే తోకలా త్రిలోకసుందరి తెల్లబోయి చూస్తూ నుంచుని వున్నారు. వాళ్ళని తోసుకునిపోవటం అసాధ్యం కాబట్టి సిగ్గుతో అష్టవంకరలూ తిరుగుతూ అక్కడే నుంచున్నారు మిత్రద్వయం.
ధబ్ ధబక్ శబ్ధాలు విన్నతర్వాతే వైజయంతి త్రిలోక సుందరి మిత్రులని చూడటం జరిగింది. వాళ్ళు కిందామీదాపడి ఆపైలేచి కాళ్ళు నిలదొక్కుకున్నాచేతులు చేతులు శరీరము అష్టవంకర్లు తిరగటం సిగ్గుపడటంలాంటి అవస్తలు చూసి వీళ్ళకి నవ్వాపుకోటం కష్టసాధ్యమే అయింది.
రామదూత 'ఇహిహీ' అని శబ్దంలేని నవ్వు ముందుగా నవ్వి "విషయమేమిటంటే అమ్మాయిలూ!" అంటూ విషయం చెప్పబోయాడు.
"మాంహిపా మాంహిపా" అంటూ అరిచినంత పని చేశారు మిత్రులు.
ఆపద వచ్చినప్పుడు "మాంపాహి మాంపాహి అనాలి. మాంపాహి అంటే అందరికీ అర్ధమవుతుంది. కనుక అవే అక్షరాలని అటూయిటూ తిప్పి "మాం పాహి మాం పాహి" అనమని రామదూత మిత్రులకి కోడ్ చెప్పాడు. నాకర్ధమైంది అనటానికి కూడా కోడ్ ఉపయోగించాలికదా! అందుకని రామదూత ఆపదలో ఆదుకునే కోడ్ "కేఓ కేఓ" అన్నాడు ఓకె కొచ్చిన దిక్కుమాలిన గోల అది. రామదూత డిటెక్టివ్ వృత్తి చేపట్టిన దగ్గరనుంచీ ఇలాంటి కోడ్ భాషనే ఎక్కువ వుపయోగిస్తున్నాడు.
అది మదన్ గోపాల్ కి చక్రవర్తికి కూడా అంటుకుంది.
వీళ్ళేదో కోడ్ భాషలో అఘోరిస్తున్నారని అర్ధం చేసుకున్న వైజయంతి. "బాబాయిగారూ! ఈ గదిలో మీరేదో పెద్ద పనిచేస్తున్నారనుకుంటాను చేసుకోండి మీ కడ్డం రాము. నేను మా సుందరి ఓ విషయంలో తల బద్దలు కొట్టుకుని అయినా తేలక సలహాకోసం మీదగ్గర కొచ్చాము."
"అడగండి అమ్మాయిలూ! అడగండి" అన్నాడు రామదూత.
"సిగ్గు ఒక్క ఆడవాళ్ళ సొత్తుమాత్రమే నంటుంది త్రిలోకసుందరి. నేనంటాకదా! ఆడామగా ఇరువురి సొత్తూనని. ఈ విషయంలో అమీ తుమీ తేల్చుకుందామని మీ దగ్గర కొచ్చాము. అదేమిటో మీగది గుమ్మం దగ్గరకు వచ్చేసరికి గెలుపు నాదే అయింది" అంటూ ఓరగా మదన్ గోపాల్ ని చూసింది వైజయంతి.
అదేపనిగా మెలికలు తిరుగుతున్న మదన్ గోపాల్, చక్రవర్తి వెంటనే బిగుసుకుపోయి స్టడీగా నుంచున్నారు.