Previous Page Next Page 
అరుణ పేజి 30


    
    "లోపలకూడా ఉన్నాయి ఇలాంటిమచ్చలు? ఎక్కడెక్కడున్నాయి?"    
    "కాళ్ళనిండా, తొడలనిండా, పొట్టనిండా కూడా ఉన్నాయి డాక్టరు గారు. చాలా బాధగా ఉంది. మంటలతోచచ్చిపోతున్నాను. నిద్ర పట్టడంలేదు. ఇవేమిటి డాక్టరుగారూ?" అమాయకంగా కళ్ళనీళ్ళు చిమ్ముతూండగా అడిగింది ఆ అమ్మాయి. బాధ అరుణ అమ్మాయి మొహంమీద సుస్పష్టంగా కనిపిస్తూంది.    
    "అలాపడుకో చూస్తాను. మరిమచ్చలు ఇంతఎక్కువ ఉంటే ఇన్నాళ్ళు ఎందుకు రాలేదు? ఇంతముదిరిపోయేవరకు మందుకు ఎందుకు రాలేదు? అసలు మీ ఇంట్లో వాళ్ళకి తెలుసునా నీకీ మచ్చలు ఉన్నాయని? మీ వారికి తెలుసా ఈ సంగతి?" పరీక్షిస్తూ ప్రశ్నలు వేసింది అరుణ.    
    సుబ్బులుకళ్ళలో నీరు తిరిగింది. "ఎవరికీ తెలియదు డాక్టరుగారూ: మా అత్తగారితో చెప్పడానికే నాకు భయం చెప్పినా పని ఎగగొట్టడానికి ఏదో అన్నానని తిడుతుంది ఆవిడ. మావారికి రెండు మూడుసార్లు చెప్పాను డాక్టరుగారూ ఆయన వినిపించుకోలేదు. ఓసారి చూశారు. 'ఆ ఏం లేదులే ఏదో పైత్యం చేసుంటుంది. అదేపోతుంది అన్నింటికి పెద్ద గోల చేస్తావు. నోరు మూసుకో, ఎవరితో అనక, అన్నారు. నేనూ అలాగే అనుకుని ఊరుకున్నాను. కాని రోజురోజుకి ఎక్కువవుతున్నాయి డాక్టరుగారూ: బాధ భరించలేకపోతున్నాను. ఎవరితోనైనా చెప్పడానికి భయం...... ఈవేళనూతికెళ్ళి నీళ్ళుతోడుకొస్తానని చెప్పి మీ దగ్గరికి దొంగతనంగా వచ్చాను.    
    మావారికి తెలిస్తే తిడతారేమో? మా అత్తగారికి తెలిస్తే ఈ పూట తిండి పెట్టదు. ఏదన్నా మందీయండి డాక్టరుగారూ లేకపోతే ఈ బాధ భరించలేకచచ్చిపోతాను. "కళ్ళు తుడుచుకుంటూ దైనీయంగా అంది సుబ్బులు, ఆ అమ్మాయి అవస్థ చూస్తే అరుణకి జాలి అనిపించింది. ఆ అమ్మాయికి వచ్చినరోగం ఏమిటో, ఎలా చెప్పడమో, వివరాలు ఎలా అడగడమో అరుణకి అర్ధం గాలేదు. పాపం చిన్నపిల్ల పల్లెటూరి వాళ్ళు గాబోలు, చిన్నప్పుడే పెళ్ళి చేసి పంపేశారు కాపురానికి. ఇక్కడ అత్తగారు బాధలుపెడుతుంది గాబోలు:    
    "నీ పెళ్ళి అయి ఎన్నాళ్ళయింది? నిన్ను మీ వారు బాగా చూస్తారా? ఆయనేం చేస్తారు?" భర్త ద్వారానే ఈ రోగం ఈ అమ్మాయికి సంక్రమించిందని అరుణకి తెలుస్తూంది. కానీ, స్పష్టంగా ఆ విషయం ఎలా అడగడమో తెలియలేదు అంతేకాక అసలీ పిల్లకిపాపం, జరిగిందేమిటో తెలియనంత అమాయకత్వం ఉంది ప్చ్ పాపం లోకజ్ఞానం లేదు అట్టే చదువుకున్నట్టూ లేదు అందుచేత తనరోగం ఏమిటో చూచాయగా నైనా అర్ధం చేసుకోలేదు. మొగుడు ఏమీ లేదని ఎవరికీ చెప్పద్దని అన్నాడంటే ఈ రోగం సంగతి అతనికి తెలుసన్నమాట. అందుకే నలుగురికి తెలిస్తే అతనికి సిగ్గుచేటు. తన వల్ల ఈరోగం వచ్చిందని అందరికితెలియడం పరువునష్టం కాదూ?    
    "పెళ్ళయిమూడేళ్ళయిందండీ" తరవాత ప్రశ్నకి జవాబీయకుండా తలవంచుకుంది సుబ్బులు.    
    "మీవారూ నిన్ను మీ అత్తగారిలాగే బాధపెడతారా? ప్రేమగా చూస్తారా? సుబ్బులు జవాబు చెప్పలేక నిస్సహాయంగా చూసింది.    
    అరుణకి అర్ధ అయింది "పోనీ ఏం చేస్తుంటారు? ఎప్పుడూ ఇక్కడే ఉంటారా?    
    "ఏమీ చెయ్యరండి మామామగారు దేవాలయంలో పూజారి గదండి......ఏవోభూములున్నాయి. ఇంట్లో పాడి అదీ ఉంది మాకు. బాగానే జరుగుతుంది ఇంట్లో ఆయన్ని చిన్నప్పుడు వేదం అది చదువుకోమంటే చదువుకోనని ఇంగ్లీషు చదువుకుంటానని అన్నారట. స్కూలు ఫైనలువరకు చదివి ఆపైన మానేశారు."    
    "మీవార్ని ఓసారి రమ్మను. ఆయన్ని పరీక్షించాలి మందులు నీకు ఒక్కర్తికి ఇస్తే లాభంలేదు. ఇద్దరూ ఇంజక్షనులు అవి తీసుకుంటేనే గాని తగ్గదు ఈ రోగం. ముందసలు ఆయనకి ఈయాలి మందులు ఆయనవల్లే నీకు వచ్చాయి ఈ మచ్చలు అవి. రేపు ఆయన, నీవు ఇద్దరు రండి."    
    సుబ్బులకి ఏం అర్ధం అయినట్టులేదు. తెల్లపోతూ చూసింది.    
    "అమ్మో ఆయనకి తెలిస్తే ఏమంటారో నిన్నెవరు వెళ్ళమన్నారని తిడతారండి ఆయనకీ ఉందా కృష్ణమూర్తి జబ్బు మరి ఆయనకేం మచ్చలు లేవే అసలిదేం జబ్బండీ?"    
    "చూడు ఏమనుకోకు, మీవారు మీవారికి చెడు తిరుగుడులు ఏమన్నా ఉన్నాయా? అలా ఉన్న వాళ్ళకే ఈ జబ్బు వస్తుంది. అందుకని అడుగుతున్నాను ఆయనవల్లే నీకూ వచ్చింది. అయనమందు తీసుకోకపోతే నీకు మందిచ్చి ప్రయోజనంలేదు. సిగ్గుపడితే లాభం లేదు చెప్పు."    
    సుబ్బులు ఏం చెపుతుంది? వివర్ణమయిన మొహం దించుకుంది" డాక్టరు దగ్గిర దాస్తే లాభం లేదు. నీవు చెప్పకపోతే మందెలా ఇస్తాను?"    
    "నాకుసరిగా తెలియదండి. కానీ ఆయనెప్పుడూ రెండేసి రోజులు మూడేసిరోజులు పట్నంవెళ్ళి ఉండిపోతూంటారు. మా మామగారు అప్పుడప్పుడు డబ్బడిగి నప్పుడల్లా తిడుతుంటారండి. 'నీ కిదేం పొయ్యే కాలంరా ఇంట్లో లక్ష్మీదేవి లాంటి భార్య నుంచుకుని'అని కేకలేస్తారండి. ఆ సంగతులు నాకేం సరిగా తెలియవండి. ఎప్పుడూ ఇంట్లో ఏదో ఒక పనితోనే సరిపోతుంది నాకు."    
    సుబ్బులు నిజమే చెబుతూందని అరుణకి అర్ధం అయింది, పాపం అభంశుభం తెలియనిపిల్ల పల్లెటూరి అమాయకురాలు. మొగుడుతిరిగే తిరుగుళ్ళు గురించయినా తెలియదు. తన రోగం దేనివల్లవచ్చిందో అనయినా తెలుసుకోలేకపోతుంది. రోజల్లా చాకిరితో సరిపోతుంది. మొగుడు ఊళ్ళో ఉన్న రోజుల్లో అయినా ఏ రాత్రోతప్ప మొగుడితో మాట్లాడే అవకాశం లభించదు ఇలాంటి అత్తింటికాపురంలో.    
    అరుణ చిన్నగా నిట్టూర్చింది." చూడు ఎలాగైనా మీ వారిని మెల్లగా నచ్చచెప్పి తీసుకురా. ఇంజక్షన్లు ఇస్తాను రేపటినించి ఇంజక్షన్లు తీసుకోకపోతే పూర్తిగా తగ్గదు. ఇంకొన్నాళ్ళు పోతే ఇంకా ఎక్కువయి చాలా ప్రమాదిస్తుంది ఈ రోగం ప్రస్తుతానికి నీ వీ మాత్రలు తీసుకో. రేపెలాగైనా తీసుకురా ఆయన్ని" మాత్రల సీసా ఇచ్చింది అరుణ.    
    'ఆయనేమంటారో! మా అత్తగారు ఏమంటుందో వస్తారో రారో ఆయన? తనలో తను గొణుక్కుంది సుబ్బులు ఆ పిల్లముఖంలో దైనయం చూస్తే అరుణకి జాలనిపించింది. "పోనీ మీ ఇంటికి రానానేను? వచ్చి మీ ఆయనతో అత్తగారితో చెప్పనా?" అంది.   
    "అమ్మో అయ్య బాబోయ్ వద్దు చంపేస్తారు నన్ను ఆయన కాస్త కోపంగా లేనప్పుడు నేనే చెపుతాలెండి" భయంగా వారించింది సుబ్బులు.    
    "అయితే వెళ్ళు ఆ మాత్రలు వేసుకో కాస్త మంటలు అవి తగ్గుతాయి" అరుణ కుర్చీలోంచి లేసింది. సుబ్బులు బిందె తీసుకుని నెమ్మదిగా వెళ్ళిపోయింది.    
    అరుణ లోపలికి వచ్చింది. అరుణని చూస్తూనే రుక్కు..... "సుబ్బులుకి జ్వరమా అండీ అనడిగింది రుక్కుతో చిన్నపిల్లలతో ఆ సంగతులు ఏం చెబుతుంది?    
    "కాదులే ఏదో ఒంట్లో బాగులేదనివచ్చింది. అవును గానీ, సుబ్బుల్ని అత్తగారు బాధలు పెడుతుందా? ఆ పిల్ల అంతలా భయపడుతూంది.    
    "అమ్మో సుబ్బులు అత్తగారిని చూస్తే నాకే భయం పరమ గయ్యాళి. ఇంట్లోచచ్చే చాకిరీచేయించి పాపం, సరిగా తిండయినా పెట్టదు. పాపం సుబ్బులేం చేస్తుంది? ఎంతచేసినా దేనికో దానికి సాధిస్తుందిట. తిడుతుందిట మొగుడు రాగానే చాడీలు చెప్పికొట్టిస్తుందిట. మా ఆడపిల్లలతోనైనా కాసేపు మాట్లాడనీయదు కోడల్ని. మేం ఎవరైనా సుబ్బులు కోసం వెడితే ఉరిమి ఉరిమి చూస్తుంది. పాపం, సుబ్బులు ఎప్పుడైనా నూతిదగ్గరో, చెరువుదగ్గిరో నీళ్ళకి వచ్చినప్పుడు కనిపిస్తే చెప్పుకుని ఏడుస్తుంది.    
    ఆ మొగుడు అంతకంటే చెడ్డవాడట. మా అన్నయ్య......ఆ వెధవ సకలగుణాభిరాముడు, అలాంటి తండ్రికి చెడబుట్టాడనితిడతాడు. చేసేపనేం లేదు కాని, పెళ్ళాన్ని కొట్టడం తిట్టడం మాత్రం వచ్చు. ఇంక పాపం, సుబ్బులు ఎవరితో చెప్పుకుంటుంది? మామగారు పాపం, ముసలాయనచాలా మంచివాడట కానీ తల్లీ, కొడుకుఆయన మాట పడనీయరుట ఇంట్లో మూడేళ్ళయి పెళ్ళయింది. పిల్లలు లేరని 'గొడ్డుమోత'ని కోడలిని తిడుతూనే ఉంటుంది ఎప్పుడూ అత్తగారు."

    "పాపం ఆ పిల్లని చూస్తే ఎందుకో జాలేసింది నాకు" అరుణ అంది.    
    "అవును ఊళ్ళో అందరూ సుబ్బులుని చూసి జాలిపడతారు" చక్కగా ఉంటుంది. ఇంకా ఇప్పుడు చాకిరీతో దెబ్బలతోపాడయి పోయింది గాని, పెళ్ళికి ఎంత బాగుండేదో? ఇంత చక్కని పెళ్ళాన్ని ఉంచుకుని వాడికి సానికొంపలంట తిరగటం ఎందుకో అని అందరూ వాణ్ణి తిడతారు. "పెద్ద ఆరిందలా ఆ సంగతులన్నీ చెప్పడం రుక్కు. విన్నాక సుబ్బులు మీద అరుణకి జాలితోపాటు అభిమానం కూడా పెరిగింది. ఎలాగైనా పాపం, ఆ పిల్లకి మందిచ్చి నయంచేయాలి. ఎంతబాధపడుతుందోపట్టుమని పద్దెనిమిదేళ్ళులేని పిల్లకి ఎన్నికష్టాలు:    
    "పుట్టింటివారు ఎవరైనా వచ్చి బుద్ది చెప్పకూడదూ అల్లుడికి?" అరుణ అడిగింది.    
    "అయ్యోరామ: పుట్టింట్లో సుబ్బులు గొడవ ఎవరికీ కావాలి? అక్కడ సవతి తల్లి.

 Previous Page Next Page