మరో అరగంట తర్వాత ఇంటి దగ్గర డ్రాప్ చేస్తున్న సమయంలో-
"ఎప్పుడో ఒకప్పుడు నిన్ను ఎత్తుకుపోయైనా పెళ్ళి చేసుకుంటాను" అన్నాడు అనురాగ్ నవ్వుతూ.
కోపంగా చూసింది అతనివైపు అన్విత.
చరచరా లోనికి నడిచివెళ్ళిపోయింది.
కానీ గేటులోంచి కారు లోపలికి వెళుతున్నప్పుడు, ఫుట్ పాత్ వైపు ఆమె గనుక చూసుంటే, అక్కడ ఆమెకు సాయంత్రం నుంచీ అలాగే నిల్చున్న మధు కనిపించేవాడు.
చెట్టుకింద, వీధిలైటు క్రీనీడలో సిగరెట్ కాల్చుకుంటూ మధు లోపలకి వెళ్ళిన కారునీ, కారులోంచి దిగిన అన్వితనూ, ఆమెతో మాట్లాడుతున్న అనురాగ్ నూ ఆసక్తిగా చూశాడు.
అన్విత తనకు దక్కుతుందా? సందేహం కలిగిందతనికి.
అతనెవరు?"
విశాఖ వచ్చి, ఇరవై నాలుగు గంటలు కాకముందే కొత్త వ్యక్తితో స్నేహం, షికార్లు, అతను అన్వితకు రెలిటీవా?
ఉక్రోషంగా ఉందతనికి.
ఆ ఉక్రోషంగా కసిగా మారుతోంది.
అప్పటికి రాత్రి పన్నెండున్నర దాటింది.
* * *
బూడిదరంగు అద్దకపు పూలచీర, జాకెట్, మునికన్యలు వేసుకునే ముడిలాంటి ముడి.
నుదుటున చిన్నబొట్టు.
స్విమ్మింగ్ ఫూల్ పక్కన పచార్లు చేస్తూ రోడ్ వేపు చూస్తోంది అన్విత.
సరిగ్గా ఏడున్నర గంటలు.
లోపలికి ప్రవేశించాడు మధు.
పనిమనిషి చెప్పగా పైకొచ్చాడు.
"కూర్చోండి....." తను కూర్చుంటూ అంది అన్విత.
ఒకపక్క ఒత్తయిన చెట్ల నీడ...... పైన బీచ్ లో వేసుకునే గొడుగు. చల్లటి గాలి...... సుతిమెత్తగా వంటిని తాకుతోంది.
"నిన్న మిమ్మల్ని చూడగానే ఎంత హేపీగా ఫీలయ్యానో తెలుసా? మీతో కొంత టైమ్ స్పెండ్ చేస్తే బావుండేదనుకున్నాను. పోనీలెండి..... ఇవాళొచ్చారు..... మన ఫ్రెండ్స్ అందరూ బావున్నారా?" అడిగిందామె.
"బావున్నారు."
"మిస్టర్ మధూ! నాకో విషయం అర్థం కాలేదు. మీరు నాకోసం గిప్ట్ ని చివరి నిమిషంలోనే తేవాలా? ముందురోజు మనం కలుసుకున్నప్పుడు ఎందుకివ్వలేదు? స్టేషన్లో మీరలా ఉక్కిరి బిక్కిరైపోవడం- పరిగెత్తడం- నాకు చాలా బాధనిపించింది. నిజానికి గిప్ట్ లంటే నాకిష్టం వుండదు....." చాలా కూల్ గా అంది అన్విత.
మనసులో భోగిమంట రగిలినట్లయింది మధుకి.
"అది మీ ఫోటో....." వెంటనే అన్నాడతను.
ఆమె ఆశ్చర్యపోలేదు.
"నా ఫోటో కావచ్చు...... మీ ఫోటో కావచ్చు. స్నేహానికి భాష, మాటలు వున్నాయి కదా...." అందామె తనదైనా ధోరణిలో.
ఆ అమ్మాయి విచిత్రమైన మనస్తత్వానికి ఆశ్చర్యపోయాడతను.
"మా మేనమామ కొడుకు ఇక్కడే వున్నాడు. అమెరికా నుంచి వచ్చాడు. నేనంటే తెగ ఇష్టమట. పూర్ ఫెలో. ఇష్టాన్ని ఇష్టంగా చెప్పడం గొప్పనుకుంటాడు. ఎగ్జిబిషనిజమ్. నాకిష్టం వుండదు. సెన్సిటివ్ ఫీలింగ్స్ ఎప్పుడూ మనసులోనే వుంచుకోవాలని నేను అనుకుంటాను. అలాంటి వాళ్ళంటేనే నాకిష్టం-" విప్పారిన కళ్ళతో అంది అన్విత. ఆ కళ్ళవేపే చూస్తున్నాడతను.
"అంటే మనసెప్పుడూ రహస్యగదిలో వుంచుకోవాలా?" సూటిగా అడిగాడతను.
"ఫీలింగ్స్ ని వుంచుకోవాలి...... మనస్సుని కాదు....." అందామె మళ్ళీ.
మామూలు ఆడపిల్లలాంటి వ్యక్తిత్వం కాదు ఈమెది. ఇలాంటి వాళ్ళ ఇష్టాలు- అభిరుచులూ- సున్నితమయిన స్పందనలు కనుక్కోవడం చాలా కష్టం.
"సెన్సిటివ్ ఫీలింగ్- ఫర్ ఎగ్జాంపుల్ ప్రేమనే తీసుకుంటే, దాని గురించి కూడా ఇలాగే ఆలోచిస్తారా?" ఆ మాటకు కళ్ళెత్తి సూటిగా, మధువేపు చూసింది అన్విత.
"లవ్ ఈజ్ ద గ్రేటెస్ట్.... గ్రేస్ ఫుల్ థింగ్ ఇన్ ద యూనివర్స్. మీటింగ్ ఈచదర్..... లాఫింగ్ ఈచదర్..... స్పెండింగ్ ఈచదర్..... ఈజిట్ ఎ లవ్..... నో నిజమైన ప్రేమికులు ఆరాధనను కోరుకుంటారు. సో కాల్డ్ సినిమాల్లో లవ్ లా నిన్ను నేను ప్రేమిస్తున్నాను..... నిన్ను నేను ఇష్టపడుతున్నాను. నువ్వు లేకపోతే నేను బతకలేను. ఎంత అసహ్యంగా వుంటుందో కదా ఆ భాష...... మీకలా అనిపించదా?"
ఏమని జవాబు చెప్తాడు?
కాళ్ళని తాడుతో కట్టేస్తే మనిషి నడవలేడు. అలా అయిపోయింది మధు పరిస్థితి.
సరిగ్గా ఆ సమయంలో బ్రేక్ ఫాస్ట్ వచ్చింది.
ఇడ్లీ, వెజిటబుల్ సలాడ్, ఫ్రూట్ జ్యూస్.
ఇడ్లీ తుంచి ముక్కని నోట్లో పెట్టుకుంటూ అంది.
"వేరియస్ యాస్పెక్ట్సులో మనుషులు రకరకాలుగా బిహేవ్ చేస్తారా? క్యాజువల్ గా, కలిసిపోతూ వున్నంత మాత్రాన, ఆడపిల్లలకు వ్యక్తిత్వం వుండదని అనుకోవడం తప్పుకాదా? రవి బిహేవియర్ మంచిదైతే నాకు మంచి ఫ్రెండయి వుండేవాడు. తరువాత ఇష్టాలు, అభిరుచులు, మనసేమిటో తెలుసుకోకుండా ఆరోజు నన్నెంత అల్లరి చేశాడు? ఫూలిష్ అలా వుండటం మీ మగవాళ్ళకే చెల్లింది."
ఊహించలేని అభిప్రాయాల వెల్లువ.
ఆమెను అంచనా వేయలేకపోతున్నాడు మధు.
మగవాడు ఎలా ఉంటే ఈమెకు ఇష్టం?
ఎలా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే ఇష్టం.
ఆ సమయంలో ఎలాంటి వాతావరణం కోరుకుంటోంది.
మధులో ఎన్నో ప్రశ్నలు.
ఫ్రూట్ జ్యూస్ తాగి, గ్లాస్ టీపాయ్ మీద పెట్టేశాడు.
"నే వెళతాను" అన్నాడు.
"ఎందుకొచ్చావో చెప్పనే లేదు?" అందామె.
"మిమ్మల్ని చూడ్డానికి" వెంటనే అన్నాడు అతను.
"అబ్బా..... ఎన్నాళ్ళకి ఒక జోక్ వేశారండీ బాబూ!" పెద్దగా నవ్వుతూ అంది.
"బైదిబై! నా ఫోన్ నెంబర్ ఇది....... కళ్యాణి, విమలలకు ఇవ్వండి. ఒకసారి ఫోన్ చెయ్యమని చెప్పండి. మీరూ ఫోన్ చేస్తుంటారుగా....." అందామె కొసరగా.
"స్టడీస్ తో పాటు, బిజినెస్ స్టార్ట్ చెయ్యాలనుకుంటున్నాను" వెంటనే అబద్ధం ఆడాడు మధు.
"ఎక్కడ?"
"ఇక్కడే!"
"అయితే మనం తరచూ కలుసుకుంటామన్న మాట. వెరీనైస్....." అందామె.
ఇద్దరూ కిందకొచ్చారు.
డ్రాయింగ్ రూమ్ లో కూర్చున్న అన్నపూర్ణమ్మ సూటిగా మధునే చూస్తోంది.
పోర్టికో వరకూ వచ్చింది.
"సీ....యూ.... అండ్ థాంక్స్ ఫర్ కమింగ్."
పెదవులు విప్పకుండానే నవ్వి, వెనుదిరిగాడు మధు.
ఠీవిగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్న అతన్నే చూస్తోందామె.
తరువాత - లోనికెళ్ళింది.
"ఏలూరులోని అబ్బాయిలా వున్నాడు."
"అవును."
"పాపం దేనికొచ్చాడు?"
జవాబు చెప్పలేదు అన్విత.
"కాలేజీ కుర్రాళ్ళతో జాగ్రత్త. వాళ్ళ షోకులకి ఇంట్లో వాళ్ళిచ్చే డబ్బులు చాలవు. నీలాంటి ఆడపిల్లలతో స్నేహాలు చేసుకుని డబ్బులు అప్పు అడుగుతారు. ఇవ్వకు" ఆ మాటకు అన్విత పెద్దగా నవ్వేసింది.
"అప్పుడుగుతారా- భలేదానివే నానమ్మా!" అంది.
ఆమెకు నవ్వాగడం లేదు.
* * *
ఏం జరిగిందో మొత్తం చెప్పాడు మధు, సుల్తాన్ తో.
"చూశావా..... ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ అయిపోయిందో! అన్వితను తప్పుగా అర్థం చేసుకోకు, ఆ అమ్మాయి మనసులోని గంభీరతనూ, హుందాతనాన్నీ అర్థం చేసుకో. నాకిప్పుడు అర్థమైంది. ఆ అమ్మాయి నీ సొంతమె అవుతుందని" అన్నాడు సుల్తాన్.
"ఏం సొంతం కావడమ నాకెఅ అర్థంకావడ లేదు" అన్నాడు మధు.
"బిజినెస్ స్టార్ట్ చేస్తున్నానని అబద్దం చెప్పి మంచిపని చేశావు. నీకో ఆఫీసు గనుక వుంటే ఆ అమ్మాయి నీ దగ్గరికి వస్తుంది. అప్పుడే మన సందేహాలన్నీ పటాపంచలయిపోతాయి అర్జునా" గీతబోధ చేస్తున్న కృష్ణుడిలా అన్నాడు సుల్తాన్.
"బిజినెస్...... ఏం బిజినెస్ చేస్తాం? అంటే ఓ ఆఫీస తీసుకోవాలి. దానికి పెట్టుబడి, నేనుండటానికి ప్లాట్, డబ్బు కావాలి, ఎక్కడినుండి వస్తుంది?" కంగారుగా అన్నాడు మధు. అన్విత తన ఆఫీసుకు వచ్చి మాట్లాడే సన్నివేశాన్ని ఊహించుకుంటూ.
"భీమవరం సోమరాజు, మళ్ళీ మైదానం నారాయణకి ఫోను చేస్తాడు ఈసారి యాభైవేలకి" అన్నాడు సుల్తాన్.
"మానాన్న ఫోను చేయడురా....."
"పిచ్చిమాలోకమా...... క్రితంసారి మీ నాన్న ఫోను చేశాడేట్రా?...."
"అంటే! మళ్ళీ నువ్వే చేస్తావా? మా నాన్నకు కొంపలారిపోతాయి."
"నీకు ప్రేమ ముఖ్యమా? కొంప ముఖ్యమా..... నేనున్నాను కదా- భయం వద్దు. ఈసారికి నారాయణ, తరువాత మీ నాన్న, అమ్మ డబ్బుతో మనకు చాలా అవసరాలున్నాయి. నీ ప్రేమను ఎలాగోలా గెలిపించాలన్న కక్ష, కసి నాలో తీవ్రంగావుందిరోయ్" అన్నాడతను.
* * *
సాయంకాలం ఆరుగంటలు దాటింది.
ఉడాపార్క్ పిల్లల్తో కళకళలాడుతోంది. దూరంగా వున్న సన్ అండ్ సీ హొటల్ బాల్కనీల్లో అమెరికన్స్ సముద్రంవేపు చూస్తూ కబుర్లాడుకుంటున్నారు.
కాలక్షేపానికి పల్లీపొట్లం తీసుకున్నాడు సుల్తాన్.
"నారాయణగారికి ఫోన్ ఎప్పుడు చేద్దాం?" అడిగాడు మధు.
"ఏడు దాటాక" అంటూ పల్లీల్ని మధుకిచ్చి, మిగతా సగం పల్లీల్ని తన చేతిలో వేసుకుని పేపర్ని పారేయబోతూ, అందులో కనిపించిన ప్రకటన చదివి-