"అలాగే... అలాగే.... ఒకవేళ చెప్పకపోతే దొరక్కపోతే."
"నేనే చెప్తాను. ఆ అమ్మాయెక్కడుంటుందో, ఎలా ఉంటుందో, ఎక్కడ కలవాలో, ఎలా కలవాలో."
ఇంకేదో చెప్పబోయిన లిఖిత హఠాత్తుగా, కారిడార్ వైపు చూసి ఆగిపోయింది.
అక్కడొక వ్యక్తిని చూసి, ఆ అమ్మాయికి ఊపిరి ఆగినంత పనైంది.
"ఏం ఆగిపోయారు చెప్పండి."
వికాస్ మాట వినలేదు. గబగబా హేండ్ బేగ్ లోంచి రెండు వందల రూపాయల నోట్లు తీసి, అక్కడ పెట్టేసి లేచింది.
"వెళ్ళిపోదామా" ఆ మాటంటున్న లిఖిత ముఖంవేపు చూశాడు వికాస్ ఆశ్చర్యంగా.
అంతవరకూ తుళ్ళుతూ, కేరింతలతో నవ్వుతూ విలాసంగా వున్న ముఖం ఒక్క క్షణంలో ఎందుకు అలా వెలవెల బోయిందో అర్ధం కాలేదు.
"వాట్ హేపెండ్ ఏం జరిగింది..." లిఖితతో పాటు లేచాడు వికాస్.
లిఖిత గబగబా ఆ రెస్టారెంట్ కున్న రెండు ద్వారాల్లో ఒక ద్వారం నుంచి బయటికొచ్చింది.
"అర్జంటుగా వెళ్ళాలి. మళ్ళీ కలుస్తాను" అనేసి పరుగు పరుగున పార్కింగ్ వేపెళ్ళి, అక్కడున్న కార్ దోర్ ని గబగబా ఓపెన్ చేసి రెండు నిమిషాల్లో బయటకి వెళ్ళిపోయింది.
వికాస్ విచిత్రంగా, సందేహంగా అలా నిలబడిపోయాడు.
లిఖిత ఎందుకలా వెళ్ళిపోయింది.
అదో ప్రశ్న...
ఆ ప్రశ్నకు కారిడార్లో నించున్న వ్యక్తి జవాబు చెప్పగలడు. ఏ వ్యక్తినైతే చూసి, అతన్నుంచి తప్పించుకుని వెళ్ళిపోయిందో ఆ వ్యక్తి తనని చూశాడని తెలీదు.
ఆ వ్యక్తి తనకోసమే వచ్చాడని తెలీదు.
ఆ వ్యక్తి...
మధుకుమార్.
లిఖిత అక్క లేఖిని భర్త.
జింఖానా కంపెనీని ఎప్పటికైనా స్వాధీనం చేసుకోవాలని కలలు కంటూ
వెయ్యికళ్ళతో పరిశీలిస్తూ, పరిస్థితిని తనకనుకూలంగా చేసుకుంటున్న వ్యక్తి.
మధుకుమార్ కళ్ళు లిఖితతోపాటు, ఆమె పక్కనున్న వికాస్ కి కూడా తెలీదు.
* * * * *
జగన్మోహన్ వయస్సు ముఫ్ఫై, కానీ నలభై ఏళ్లవాడిలా దృఢంగా ఉంటాడు. జగన్మోహన్ జింఖానా కంపెనీలో మెకానికల్ ఇంజనీరు ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉంటాడు. సిల్లీగా కనిపించినా చాలా సీరియస్ మనిషి వాళ్ళ నాన్న ఓ రాజకీయ నాయకుడు. తండ్రితో ఎందుకో పడక, ఇంట్లోంచి వచ్చేశాడు. ఆస్తిపరుడు. కష్టపడి పనిచేస్తాడు. వికాస్ ఫోన్ చేస్తే అర్జంటుగా వచ్చి కలిశాడు. ఇద్దరూ డాబాగార్డెన్స్ లో ఓ హోటల్లో కూర్చున్నారు.
"హైదరాబాదెళ్ళావ్... నీకేదో ప్రమోషన్ వస్తుందనుకొంటే, సడన్ గా వచ్చి రిజైన్ చేశావ్. నేను లీవు నుంచి వచ్చేసరికి నువ్వెళ్ళిపోయావని చెప్పారు. నమ్మలేకపోయాను తెల్సా. ఏంటి ఎలా వున్నావ్. ఏం చేస్తున్నావ్."
రాగానే ప్రశ్నల వర్షం కురిపించాడు జగన్మోహన్.
జగన్మోహన్ తో జరిగిందంతా చెప్పాడు భానోజీరావుతో ఛాలెంజ్ చేసిన విషయం తప్ప!
"వండ్రఫుల్ నువ్వేదో చేస్తావని నాకెప్పుడో తెల్సు. నాకు వుందిరా ఐడియా మారుతీని చూడు ఎంత అదర గొట్టేస్తోందో మిత్సుబిషి- లాన్సియా మోడల్స్ ని కలిపిగొట్టిన సుజుకీని, మారుతి సుజుకీ పేరిట మళ్ళీ ఫారిన్ కే అమ్ముతున్నారు కదరా.... మంచి డిజైన్ కారుని ఇవ్వగలిగితే మార్కెట్టంతా మనదేరా. నా దగ్గర మంచి ఐడియాలున్నాయి. కానీ మా బాబు డబ్బివ్వడు. పలుకుబడి వుపయోగించుకోవచ్చు. మనం ఆయన మాట వినమన్ ఐ కోపం చెప్పు.... చెప్పు."
"నువ్వు జింఖానా లోనే అలా వుంటావా.... బయటకొస్తావా." డైరెక్టర్ అడిగాడు వికాస్.
"మా ఫ్యాక్టరీలోకి నువ్వు రారా అని డైరెక్ట్ గా అడగొచ్చుగదరా" నవ్వుతూ అని-
"ఇప్పుడు నాకు అక్కడెంతొస్తుందో నీకు తెలుసు" మొగమాటం లేకుండా అడిగాడు జగన్మోహన్.
"నీ జీతానికేం డోకా లేదు. రేపాఫీసు కోసారి రా. డిటైల్ గా మాట్లాడదాం" చెప్పాడు వికాస్.
మరో పావుగంటలో ఎస్.ఎఫ్.సి ఆఫీసులో వున్నాడు వికాస్.
"ప్రాజెక్ట్ రిపోర్ట్ ఓ.కే. కానీ ఇయర్ ఎండింగ్ కదా... ఏప్రెల్ దాటాకైతే లోన్ కు వీలవుతుంది" మేనేజర్ అన్నాడు.
"ప్రొడక్ట్ మార్కెట్లోకి బాగా పోతుంది. డీలర్స్ కూడా ఆర్డర్స్ బుక్ చేస్తున్నారు" బిజినెస్ అన్నాక కొన్ని అబద్దాలు తప్పవు.
"ఇంతకు ముందు కూడా శివమూర్తిగారు కూడా అలాగే అన్నారు. ఏదీ బిజినెస్ లో సక్సెస్ ప్యూర్ లక్. ఓ పని చెయ్యండి ఆ డీలర్స్ ఆర్డర్స్ ఒరిజినల్ కాపీల్ని కూడా ఎటాచ్ చేసుకొని రండి. హెడ్డాఫీసుకి పంపుతాను వాళ్ళు ఓ.కే. అంటే" ఆపైన నసిగాడతను.
తర్వాత అక్కడ నుంచొచ్చి మేనేజర్ ఏలుమలైని కలిశాడు వికాస్.
మేనేజర్ అన్న విషయం చెప్పాడు.
"నేను ఆయనతో మాట్లాడుతాను లేండి..." భరోసా ఇచ్చాడు ఆయన.
టెలిఫోన్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్ మెంట్లకెళ్ళి, ఆఫీసు కొచ్చేసరికి మధ్యాహ్నం రెండుగంటలైంది.
అంతవరకూ వెయిట్ చేసి శివమూర్తి వెళ్ళిపోయాడని చయనులు చెప్పాడు.
"నువ్వు రాగానే ఎక్కడనుంచైనా ఫోన్ చెయ్యమన్నాడాయన-లేకపోతే...ఇంటికి రమ్మన్నాడు."
ఇంటికి వెళదామని నిర్ణయించుకున్నాడు వికాస్.
మధ్యాహ్నం భోంచెయ్యలేదన్న విషయం గుర్తొచ్చింది.
"నువ్వు భోంచేశావా మావయ్యా..." చయనుల్ని అడిగాడు.
"ఏం భోజనం.... నువ్వేమో ఆఫీసుని ఈ అడవిలో పెట్టావు.... ఒక్కాఫి దొరకదు.... టీ దొరకదు..." చెపుతూ ఆగిపోయి "ఒరే.... ఓ ఐడియా వచ్చిందిరా.... ఇవాళ కాకపోయినా రేపైనా ఈ ఏరియా డెవలప్ అవుతుంది....అందుకని ఇక్కడ టీకొట్టు పెడితే ఎలా వుంటుందంటావ్..."
"ఎక్కడకొచ్చినా ఈ చిల్లర బిజినెస్ ని వదలవు" నవ్వుతూ అన్నాడు వికాస్.
"ఒరేయ్...సీరియస్ గా అడుగుతున్నాను.... చెప్పరా..." సిటీ బస్టాప్ వేపు నడుస్తూ అన్నాడు చయనులు.
"టీ కొట్టు అవసరమే.... కానీ నువ్వక్కడ కూర్చుంటే ఎలా మావయ్యా"
"నేనక్కడ కూర్చుంటానేట్రా... ఎవడ్నో పెడతాను"
"సరే.... నీ యిష్టం..."
భోంచేశాక చయనులు ఫ్యాక్టరీకొస్తే, వికాస్ శివమూర్తి ఇంటికి వెళ్ళాడు.
అక్కడకెళ్ళేసరికి అయిదు గంటలయింది.
శివమూర్తి లేడు. అరగంటక్రితమే బయటికెళ్ళాడు. ఓ అరగంటసేపు వెయిట్ చేశాడు. ఇంకా రాలేదు.
అంతలో బ్యాంక్ నుంచి వచ్చింది ఆనంది.
వికాస్ ని అనుకోకుండా అక్కడ చూడడంతో ఆనంది ముఖం వికసించింది.
"డాడీ ఎక్కడికో బయటికెళ్ళార్ట... వస్తే చెప్పండి...." వెళ్ళిపోవటానికి సిద్దమౌతూ అన్నాడు వికాస్.
"కాసేపుండండి.... రావచ్చేమో..."
అతను కాసేపుంటే బావుండని అనుకుంది. అతన్ని చూసినప్పటి నుంచీ అతనితో మాట్లాడాలని తాపత్రయం.
"రేపు ఆఫీసులో కలుస్తాం.... కదా.... వెళతాను..." లేచాడు వికాస్.
"కాఫీ తాగాయినా వెళ్దురుగాని వుండండి..." వికాస్ ని కాసేపు అక్కడ ఉంచడానికి అంతకంటే మంచి మార్గం కనిపించలేదు.
ఐదు నిమిషాల్లోనే 'డ్రెస్ చేంజ్' చేసుకొని రావడం వికాస్ గమనించలేదు.
వికాస్ గమనించాలని ఆనంది కోరిక-
కాఫీ కప్పును టీపాయ్ మీద పెట్టి లేచాడు వికాస్.
"సీయూ..."
ఏవీ మాట్లాడలేకపోయింది ఆనంది. మౌనంగా గుమ్మానికి ఆనుకుని నిలబడిపోయింది.
విరగబూసిన లేత గులాబీ పూలతోటలో గులాబీ పూల కుత్తుకల్ని ఎవరో చురకత్తులతో కోస్తున్న దృశ్యం!
ఎర్రెర్రని పెదాల భూమిలోంచి మొలిచిన ఓ లేతమొక్క అందామిన ఆకుల మీద మంచు బిందువులా నిలిచిన ప్రేమ అంతలోనే జారిపోయిన దృశ్యం!!
పెట్టెలో పెట్టెలోని, పెట్టెలా- మనసులో-