Previous Page Next Page 
మొగలిబాకు పేజి 30

   

     అతడి వేపే చూసింది జానకి తీక్షణంగా.
   
    "లేడీస్ ఫస్ట్ కాబట్టి ముందు నువ్వే దిగాలి.... దిగు...." పురమాయించాడు తండ్రి హోదాలో సరదాపటేల్.
   
    జానకి కారులోంచి దిగడానికి సన్నద్దమైన కారు డోర్ తెరిచింది సరిగ్గా అదే సమయంలో గోడవారగా వున్న దాదా తల తిప్పాడు. ఆ ముఖాన్ని చూసిన వెంటనే గుర్తుపట్టేసింది జానకి.
   
    సంధ్య అన్నయ్య సిరిపురం దాదా ఇక్కడున్నాడేమిటి? అని అనుమానంగా మనసులోనే అనుకుందావిడ పరాకుగా. తర్వాత జుత్తుల మారి జిన్నా చెప్పిన విషయం జ్ఞాపకానికొచ్చి-
   
    నారాయణరావు కలెక్టర్ వేషంలో దాదానే పంపాడన్న విషయాన్ని రూఢి చేసుకున్నది.
   
    "ఒరేయ్ పటేల్.....నేను కారు దిగానుగాక దిగను" అని పటేల్ చెవిలో చెప్పేసరికి-
   
    సడన్ గా పటేల్ ఖిన్నబోయాడు.
   
    పటేల్ గుర్రుగా జానకి వేపు చూశాడు.
   
    "చూడు జానకీ! నువ్వు నన్ను సరదాగా ఒరేయ్ పటేలని కాలేజీ రోజులలో పిలిచేదానివని నాకు తెలుసు..... ఇక్కడ నేన్నీకు తండ్రిని. పైగా గవర్నర్ వేషంలో ఉన్నవాడ్ని__ నువ్వు నన్ను పటేలని పిలవడం బాగోదని తెలుసుకో" అని,
   
    "ఈ విషయం మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ముందు నువ్వు కారు దిగు జానకీ" అని గంభీరంగా అన్నాడతను.
   
    "నేను దిగనుగాక దిగను" అందామె.
   
    "ఏం?"
   
    "నేను కారు దిగితే మన డ్రామా అంతా బయటపడుతుంది-అందుకని" నెమ్మదిగా అతని చెవిలో చెప్పింది జానకి.
   
    "ఎందుకలాగా?"
   
    "అదంతే....అక్కడ కలెక్టర్ వేషంలో ఉన్నది ఎవరో తెల్సా? దాదా__ సిరిపురం దాదా__ సిరిపురందాదా అంటే ఎవరో తెలుసా__ సంధ్య అన్నయ్య- పెద్ద రౌడీ."
   
    "సంధ్య అన్నయ్య వచ్చినా, నారాయణరావు మామయ్య వచ్చినా మనం భయపడేదిలేదు. కర్తవ్యం ముఖ్యం - నువ్వు ముందు దిగు- నేను తర్వాత దిగుతాను- అంతే."
   
    "అది కాదయ్యా సరదాపటేల్___ ఈ సంధ్య అన్నయ్య దాదాకి నేనెవరో తెలుసు___నన్ను గుర్తుపడతాడు. నేను నీ కూతుర్ని కాదని, సంధ్య ఫ్రెండ్ జానకినని తెలిస్తే...."
   
    జానకి చెప్పిన మాట విని కొంచెంసేపు నిర్ఘాంతపోయాడు సరదాపటేల్.
   
    "ని.....జ.....మా?!" అని ఆశ్చర్యపోయాడు కూడా.
   
    "మరిప్పుడెలా?" ఆలోచన మీద ఆలోచన చేసేస్తున్నాడు సరదాపటేల్.
   
    "అయిడియా.....నేను ముందెళ్ళి....ఆ బామ్మ కాంతమ్మతో మాట్లాడి నెమ్మదిగా దాదాను ఇక్కడ నుంచి తరిమేసే కార్యక్రమాన్ని చేపడతాను. ఆ తర్వాత నువ్వు కారు దిగుతావు సరేనా?" అని వెంటనే కారు దిగాడు.
   
    అప్పటికే కాంతమ్మ వరండా మీద నుంచి మెట్ల మీదకొచ్చి కారు దగ్గరగా వచ్చేసింది.
   
    "నువ్వెవరయ్యా బాబూ-గవర్నర్ వేనా?" ఆ పలకరింపుకి ముచ్చెమట్లు పోశాయి సరదాపటేల్ కి.
   
    "అది బామ్మగారు..... మీ నారాయణరావు పేరు ప్రఖ్యాతులు విని నా కూతుర్ని మీ మనవరాలిగా చేసుకుంటారని అమ్మాయితోపాటూ వచ్చాను" అన్నాడు వినయంగా చేతులు జోడిస్తూ.
   
    "వెరీగుడ్, వినయం అంటే ఇలా ఉండాలయ్యా" అని దాదావేపు చూసి నవ్వింది కాంతమ్మ.
   
    దాదాకి ఇదేం పాలుపోకుండా వుంది.
   
    ఈ గవర్నర్ ఎవరు? తనలాగే వేషగాడా? లేకపోతే నిజమైన గవర్నరేనా ఇప్పుడు అతని పరిస్థితి ఏంటో అర్ధం కావడంలేదు అంత పెద్ద రౌడీకి.
   
    అంత గుడ్లేసుకుని గుర్రు గుర్రుమంటూ సరదాపటేల్ వేపు చూశాడు కారు బ్యాక్ సీట్ వేపు చూశాడు.
   
    కారు దగ్గరగా వెళ్ళి బ్యాక్ సీట్లో ముడుచుకుని కూర్చున్న జానకి వేపు చూసి, తన చేతిలో ఫోటో వేపు హ్కోసిన కాంతిమ్మ ఆశ్చర్యంగా దాదావేపు, సరదాపటేల్ వేపు చూడడం ప్రారంభించింది.
   
    "చూడమ్మాయ్....గెట్ డవున్ ది కార్ ఫస్ట్....." అని అనగానే ఆవిడ ఇంగ్లీషుకి భయపడినదై జానకి గబుక్కున కారు దిగగానే సదరు జానకిని చూసి తను తెచ్చిన ఫోటో ఆమెదేనని గుర్తించి చెమటలు కక్కేసుకుంటున్నాడు దాదా.
   
    చేతిలోని ఫోటోవేపు, జానకివేపు మార్చి మార్చి చూసింది కాంతమ్మ.
   
    "అవునయ్యా.....కలెక్టరూ....కూతురి ఫోటోను నువ్వు తెస్తే నీ కూతుర్ని గవర్నర్ తీసుకొచ్చాడేంటయ్యా" అని అడిగిందావిడ తెగ కంగారుపడిపోతూ.
   
    దాదా, సరదాపటేల్ ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు.
   
    జానకి ఫోటో దాదా చేతిలోకి ఎలా వచ్చిందో పరదాపటేల్ కి అర్ధంకాలేదు.
   
    "ఇలా బయటికి రాతల్లీ!" కాంతమ్మ జానకిని బయటకు పిలవగానే గబుక్కున కారులోంచి బయటకొచ్చింది జానకి.
   
    "అదే ముఖం, అదే ముక్కు.....ఏవయ్యా కలెక్టరూ! నీ కూతురిని గవర్నర్ తీసుకొచ్చాడేంటయ్యా .....ఏంటీ మతలబు" అసలే ఆడ చాణక్యురాలు కాంతమ్మ-తన దీర్ఘాలోచనను కనబడనీయకుండా అడిగిందామె.
   
    ఏం జవాబు చెప్పాలి?
   
    తన ప్లాన్ కు అడ్డంగా వచ్చినందుకు సరదాపటేల్ మీద రుసరుస లాడుతున్నాడు దాదా.
   
    కాంతమ్మ జానకితో ఏదో మాట్లాడుతుండగా సరదాపటేల్ దగ్గరగా జరిగి.....
   
    "నేనెవరో తెలుసా? వైజాగ్ దాదాని. నువ్వెవరో చెప్పు......" అని గొంతు తగ్గించి భీకరత్వాన్ని నటిస్తూ అన్నాడు దాదా.
   
    "ఇక్కడ నువ్వు ఫోజులివ్వక....కాంతమ్మతో అసలు సంగతి చెప్పానంటే పిడిగుద్దులు గుద్ది మరీ చంపేస్తుంది. ఇంతకీ నిన్నెవరు పంపించారో చెప్పి తగలడు"
   
    మరి చెప్పక తప్పేట్టు లేదని.....
   
    "నారాయణరావు పంపించాడు ఆస్థికోసం" నెమ్మదిగా గొణిగాడు దాదా.
   
    "నేనూ నీ ప్లాన్ ను పాడుచేయడానికొచ్చాను. అద్సరేగానీ జానకి ఫోటో నీ దగ్గరకెలా వచ్చింది?"
   
    "అదెలా వచ్చిందో ప్లాష్ బ్యాక్ లు తర్వాత చెబుతానుగానీ.....ముందు ఈ ఉపద్రవంనుంచి బయటపడాలి. ఉపాయం ఆలోచించు"
   
    సరిగ్గా అదే సమయంలో....   
   
    కాంతమ్మ జానకిని ఒక ప్రశ్న వేసింది.
   
    ఇంతకీ నువ్వు వాళ్ళిద్దరిలో ఎవరి కూతురివని.....
   
    ఒక్కక్షణం బిక్కమొహంవేసి ఆ తర్వాత తేరుకుని సమయస్ఫూర్తి ఆడపిల్లలకు వుండాలని నిశ్చయించుకున్నదై....
   
    "గవర్నర్ మా డాడీ.....కలెక్టర్ మా చిన్నడాడీ.....అంటే మా చిన్నాన్న" అని అడ్డంగా కోసేసింది.
   
    "నేన్నమ్మను. ఎందుకంటే నువ్వు నా కూతురని ఆ కలెక్టర్ అన్నాడుగా?"
   
    జానకి సమయస్ఫూర్తికి కలెక్టర్, గవర్నర్ వేషాలలో వున్న దాదా, సరదాపటేల్ ఇద్దరూ అమిత సంతోషించిన వారయిపోయి__
   
    "అదే నిజం అమ్మాయి చెప్పిందే నిజం. మీరేం డౌట్ ఫీలవకండి. ముందు నారాయణరావు ఆస్థి విషయం ఫైనల్ చేసెయ్యండి" కంగారు కంగారుగా అన్నాడు దాదా.

 Previous Page Next Page