శంకరం అక్కడుంటే మరేం ప్రమాదమోనన్నట్లు పరుగున ఆ గదిలోంచి వెళ్ళిపోయాడు.
అమల చేతిలోని కత్తెర లాక్కుని అవతల విసిరేసి "నిన్నేమని కోప్పడను తల్లీ!" అన్నాడు భుజంగరావు.
అమల మాట్లాడకుండా నోట్లో వేలేసుకుని పిచ్చి చూపులు చూసింది.
* * *
17
అమల వీలయినప్పుడల్లా రోజా గదిలోని రోజావాడిన సామానులు, బుక్స్ వగైరా ఒక్కోటి తీసి పరిశోధన మొదలుపెట్టింది.
అమల పరిశోధనలో ఏమీ కొత్త విషయం తెలియలేదు.
రోజాకి డైరీలు రాసే అలవాటు వుందో లేదో తెలియదు.
డైరీ అంటూ ఎక్కడా కనపడలేదు.
గోడకున్న అలమరలో సీక్రెట్ అరవుందని దానిలో రోజా రాసిన డైరీలు వున్నాయని తెలియని అమల తన పరిశోధన దాదాపు విరమించుకుంది.
కృష్ణ లెటర్ రాశాడు తను రావటానికి కొన్నాళ్ళు పడుతుందని.
భగవాన్ కి చాలా కళలు వచ్చు. అతని దగ్గర వున్న మనుషులు ఎవరి కంఠస్వరాలయినా సరే అనుకరించి మాట్లాడగలరు. సంతకం ఫోర్జరీ చేయటం వాళ్ళకి మామూలు విషయం. ఒకసారి ఎవరి చేతి రాతన్నా చూస్తే అచ్చం అలాగే రవంత కూడా బేధం లేకుండా వెయ్యిపేజీల మేటర్ రాయగలరు. యింకా యిలాటివి చాలాచాలా చేయగలరు.
భగవాన్ నియమించిన మనిషే కృష్ణ రాసినట్లు లెటర్ రాశాడు.
అది చదివి భుజంగరావు నమ్మాడు.
అమల కూడా అనుమానించలేదు.
"ఇంకా ఎన్నాళ్ళు నాకీ శిక్ష?" భగవాన్ కి లెటర్ రాసి ఎప్పటిలా సీక్రెట్ స్థలంలో పెట్టింది అమల.
మర్నాడు రిప్లయి అదే స్థలంలో వుంచబడింది.
అమల తీసుకుని చదివింది.
"డోంట్ వర్రీ, సక్సెస్ కి రోజురోజుకీ దగ్గర అవుతున్నాము. నీవు బాగా నటిస్తున్నావు పని పూర్తి అయిం తరువాత మంచి బహుమతి పొందుతావు. మీ నాన్న రాసిన లెటర్ దీంతో జత చేస్తున్నాను చదువుకో.
భగవాన్.
అమల తండ్రి రాసిన లెటర్ చదివింది.
అచ్చం పరంధామయ్యగారు రాసినట్లే వుంది ఆ లెటర్ నమ్మాలి, నమ్మక చేసేదేం లేదు.
లెటర్ చదివి అమల భారంగా నిట్టూర్పు వదిలి వూరుకుంది.
ఆ తర్వాత అమల భుజంగరావు గదిలోకి నడిచింది.
అప్పుడే భుజంగరావు అలమరలో ఏదో సర్దుతున్నాడు.
కనురెప్పపాటులో అమల కంట్లో ఓ దృశ్యం నిల్చిపోయింది.
అమల కళ్ళు తళుక్కున మెరిశాయి.
భుజంగరావుకి కూతురుముందు సీక్రెట్స్ లేవు. అయినా కూతురు పిచ్చిదయిపోవటంతో కొన్ని విషయాలు బైటపెట్టటం లేదు అంతే.
అలమరలో మరో అర వున్నట్లు అప్పుడే తెలిసింది అమలకి.
"రాతల్లీ అక్కడే ఆగిపోయావేమిటి?" భుజంగరావు పిలిచాడు.
అమల గోళ్ళు కొరుక్కుంటూ వచ్చింది.
అమలని పక్కన కూర్చోబెట్టుకుని తల నిమురుతూ భుజంగరావు గొణుక్కోవడం మొదలుపెట్టాడు.