Previous Page Next Page 
కలగంటినే చెలీ పేజి 29

    "చివరికి తిని పారేసిన విస్తర్లు కూడా లెక్కపెట్టేట్టున్నావే" అన్నది చిన్నగా.

    "ఓ అదెప్పుడో లెక్కపెట్టాను మొత్తం డెబ్బై ఆకులు ఎత్తారు పనివాళ్ళు" ప్రవీణ గొప్పగా చెప్పింది.

    చంద్రరేఖకి ఏదో అనుమానం తలెత్తింది.

    ఏమిటీ పిల్ల? ప్రతిదానినీ ఎందుకలా లెక్కబెడుతోంది. ఇదేదో అలవాటులాలేదు. అనుమానం లేదు జబ్బుకాదు గానీ మానసిక రుగ్మత అయినా ఇలా అన్నిటినీ లెక్కబెట్టడమేమిటి!

     "పెళ్ళి అయిపోయింది. ఇంక వెళదామా?" అంటూ చంద్రరేఖ కదిలింది.

    "నేనూ వస్తానక్కా, అమ్మా నాన్న కనిపించడం లేదు" అని ప్రవీణ కూడా బయల్దేరింది.

    ముగ్గురూ ఊరు దారిపట్టారు.

    చిట్టి పెళ్ళి ఏర్పాట్లు గురించి ఘనంగా చెబుతుంటే చంద్రరేఖ మౌనంగా వింటూ వస్తోంది.

    ప్రవీణ ఏమీ మాట్లాడలేకపోయేసరికి డౌట్ వచ్చి "ఏమిటి ప్రవీణా మౌనం?" అని అడిగింది.

    ఆమె ఏమీ మాట్లాడలేదు.

    చంద్రరేఖ ఆమెవంక పరిశీలనగా చూసింది. ఆమె పెదవులు మాత్రం కదులుతున్నాయి తప్ప నోరు విప్పలేదు. ఊర్లోకి ఎంటర్ అయ్యారు.

    "అబ్బ మొత్తం నూటా డెబ్బై అడుగులు. శివాలయం నుంచి వూర్లోకి. ఎన్ని అడుగులు పడతాయోనని లెక్కవేశాను. అందుకే మాట్లాడలేకపోయానక్కా"

    చంద్రరేఖ ఆమెవైపు జాలిగా చూసింది. అంత చిన్నవయసులోనే ఏమిటీ జబ్బు? ఎందుకొచ్చింది?

    ఊర్మిళ జబ్బు నయమైందన్న సంతోషం నిలవకముందే మరో కొత్త సమస్య.

    ఆమె ఆవేదనలాగే అప్పుడే వూరి మధ్యలో ఠక్కున మంటలు లేచాయి. అందరూ కంగారుపడ్డారు.

    అప్పటికే జనం హాహాకారాలు మొదలయ్యాయి.

    "ఏమైంది?"

    "వూరు తగలబడిపోతోంది" ఎవరో అరుస్తూ అటువేపు పరిగెత్తుతున్నారు.

    "ఎన్ని ఇళ్లు కాలుతాయో లెక్కవేయాలి. తొందరగా పదక్కా" అంటూ చంద్రరేఖ చేయి పట్టుకుని తొందరచేసింది ప్రవీణ.

 Previous Page Next Page