"ఓహో! అదా స్టోరీ....పాపం- ఆ బ్రెయన్ ని పెట్టించుకోవడం అంతగా ఇష్టం లేకపోతే ఫ్రిజ్ లోనో, ఎక్కడో పెట్టుకోవచ్చుగదా" వ్యాఖ్యానించాడు సేతురాజు.
"ఒరేయ్ సేతురాజు నువ్వు మనిషివా! ఏనిమల్ వా! అదేమయినా క్యాడ్ బారీ చాక్ లెట్ అనుకున్నావా- ఫ్రిజ్ లో పెట్టుకోడానికి" చికాకుపడ్డాడు వీర్రాజు.
"మన వాలేశ్వరర్రావు ఎందుకో తన బ్రెయిన్ ని తిరస్కరిస్తున్నాడు" ఆశ్చర్యపడుతూ అన్నాడు పోతురాజు.
"తిరస్కరిస్తున్నాడు అని పెద్ద పెద్ద సమాసాల డైలాగులు వాడక్కరలేదుగానీ, ఆ బరువుని ఎన్నాళ్ళు మోస్తాడు- అందుకని-"
"మీ డిస్కషన్ ఆపెయ్యండహె" అని ఎవరో గసిరేసరికి ముగ్గురూ నోటికి తాళం వేసేశారు.
సరిగ్గా అదే సమయంలో కిందనుంచి డాక్టర్ అరిచాడు__
"మిస్టర్ వాలేశ్వరర్రావు- ఇప్పటికే నీ బ్రెయిన్ నా ఫ్రిజ్ లో నాలుగు రోజులనుంచీ ఉంది. దీన్ని ఇంకా ఎన్నాళ్ళో నాదగ్గర ఉంచలేను. నువ్వు దీనిని ఎందుకు తీసుకోవు" గట్టిగా జబర్దస్తీగా అడిగాడతను.
"నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను. నువ్వు సరిగ్గా జవాబు చెప్తావా?" డాక్టర్ మతిమరుపుని అడిగాడు వాలేశ్వరర్రావు.
"ఆన్సర్ చెప్పాననుకో- నీ బ్రెయిన్ నువ్వు తీసుకుంటావా."
"ఓ తీసుకుంటాను."
"అయితే అడుగు."
"భారతదేశంలో అంటే మన ఇండియాలో ఎవరు బాగా బతుకుతున్నారు?"
"డబ్బున్నవాళ్ళు" విక్రమార్కుడిలా చెప్పాడు డాక్టర్ మతిమరుపు.
"పప్పులో కాలేసావు" బ్రెయిన్ లేనివాళ్ళు - ఇంకొక్క ప్రశ్న....ఇదే ఆఖరు ప్రశ్న. మనదేశాన్ని ఎవరు పాలిస్తున్నారు?"
"పొలిటీషియన్స్" వెంటనే జవాబు చెప్పాడు డాక్టరు మతిమరుపు.
"కాదు...కుళ్ళీపోయి, ముక్కిపోయిన బ్రెయిన్ గలవాళ్ళు.... అందువల్ల అంచేత బ్రెయిన్ లేకుండా సుఖంగా, చక్కగా, హాయిగా, బతుకుతున్నవాళ్ళే ఎక్కువ కాబట్టి, నేను ఆ విధంగానే బతుకుతా__యిక నుంచీ నాకూ ఆ బ్రెయిన్ కీ ఏం సంబంధంలేదు. నువ్వెళ్ళకపోతే, నేను దూకుతా."
"పోనీ ఆ బ్రెయిన్ ని వేలం వేసెయ్యగూడదూ" చటుక్కున సలహా ఇవ్వడంతో ఆ సలహా అక్కడున్న వాళ్ళందరికీ చక్కగా నచ్చింది.
బ్రెయిన్ ని వేలం వేసేశాడు డాక్టర్ వెంటనే.
సాలార్ జంగ్ మ్యూజియానికి చెందిన ఫ్యూన్ పదిరూపాయలకు ఆ బ్రెయిన్ ని దక్కించుకున్నాడు.
"చూశావా! ఆఫ్ట్రాల్ టెన్ రుపీస్ బ్రెయిన్ కాస్ట్. ఇప్పటికయినా బుద్దొచ్చిందా! నా సందేశ మేంటంటే, ప్రజలందరూ వాళ్ళ బ్రెయిన్లన్నీ టోకున అమ్మేసి, నాలా హాయిగా ఉండండి" అలా సందేశమిచ్చి బ్రెయిన్ పర్వం, లాంగ్ జంపింగ్ ఉదంతానికి స్వస్తి చెప్పేశాక అందరూ వెళ్ళి పోయారు.
ప్రపంచంలో నేనొక్కన్నే బ్రెయిను లేనివాడిననే గర్వంతోకిందకు దిగాబోయిన వాలేశ్వరర్రావు ఆ ముగ్గుర్నీ చూసి__
"అప్పుడెప్పుడో ఇంటద్డేబాకీ తీరుస్తామని వెళ్ళి, ఇప్పుడా రావడం- నా దగ్గర బ్రెయనున్నవాళ్ళలా ప్రవర్తిస్తే ఊరుకోనంతే నేను యమస్ట్రిక్టు అర్ధమయిందా" అన్నాడు.
ఏవో కల్లబొల్లి మాటలు చెప్పబోయి ఇంటిపైకి వెళ్ళబోయారు ముగ్గురూ.
మెట్లకు అడ్డంగా చాప వేసుకుని భీష్మించుకుని పడుకున్నాడు వాలేశ్వరరావు.
"అద్దె కట్టండి- లేదా మీ బ్రెయిన్లనుతీసి, ఇక్కడపెట్టి వెళ్ళండి. వాటిని అమ్ముకుని న బాకీ తీసుకుంటాను."
"నీలా మాది తుప్పుపట్టిన ఇనప బ్రెయిన్సు కావు, స్టీల్ బ్రెయిన్లు- ఆ బ్రెయిన్లతోనే మేం బ్రతుకుతున్నాం,"
"అయితే, ఆ బ్రెయిన్లను నాకు తాకట్టు పెట్టండి- కన్సిటర్ చేస్తాను."
"ఈ ఐడియా బావుంది" అని నోటుబుక్కుమీద తమ ముగ్గురి బ్రెయిన్లనూ వాలేశ్వరరావుకి తాకట్టు పెడుతున్నట్టుగా నోటు రాసిచ్చి, డాబామీద రూమ్ లోకి ప్రవేశించారు ముగ్గురూ.
"అబ్బాయిలూ ఇకనుంచీ మీ బ్రెయిన్లమీద సర్వహక్కులూ నావి. వాటితో మీరు ఆలోచించినా, వాటిని ఉపయోగించి మీరేదయినా డబ్బు సంపాదించినా అందులో టెన్ పర్సెంట్ నాకిచ్చెయ్యాలి- అర్ధమయిందా" కిందనుంచి అరిచాడు వాలేశ్వరరావు.
౦ ౦ ౦
జూబ్లీ హిల్స్...
ఆంధ్రాబ్యాంక్ కు ఎదురుగా కొంచెం దూరంలోవున్న రోడ్డుపక్క గోడమీద కూర్చున్నారు సేతురాజు, పోతురాజు.
"వీర్రాజులామనంకూడా సుల్తాన్ బజార్ వెళితే సరిపోయేది బ్యాంకేదురుగా కళ్ళప్పగించి కూర్చుంటే డబ్బెలా వస్తుందిరా" అసహనంగా ప్రశ్నించాడు పోతురాజు.
"ఈమధ్య పేపర్లు చూడ్డంలేదా నువ్వు?"
"లేదు- నేను పేపర్లు చదవను. వాటితో వేన్నీళ్ళు కాచుకుంటాను. అసలు పేపర్లలో ఏముందిరా" అడిగాడు సేతురాజు.
"ఈమధ్య మహారాస్త్రం నుంచి కొత్త దొంగల ముఠా వచ్చింది. వాళ్ళు బ్యాంకు దొంగతనాల్లో స్పెషలిస్టులన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్- ఒకడు బ్యాంకులోంచి డబ్బు తీసుకుని వస్తాడు. వాడి వెనుక ఈ దొంగవెళ్ళి, పదిరూపాయల నోట్లు ముందుగా రోడ్డుమీద జల్లేసి, సార్_ మీడబ్బు పడిపోయిందంటాడు. వాడు సూటుకేసు పక్కనపెట్టి, ఆ డబ్బుని ఏరుకోడానికి వెళతాడు. ఆ సూటుకేసు తీసుకుని వీడు ఉడాయిస్తాడు."
"చోరీ...వెరీ సింపుల్ అన్నమాట" సేతురాజు కళ్ళేగరేస్తూ అన్నాడు.
"అంచేత మనం ఇప్పుడు బ్యాంకులోంచి వచ్చే__ఒక_" ఇంకా పూర్తిగా చెప్పకుండానే కెవ్వుమని అరిచాడు పోతురాజు ఆనందపారవశ్యంతో.