"సరి సరి నీ భోజనం అయితే ఆకులూ వక్కలు సర్దివుంచుకో" అంది తల్లి సరోజతో.
నాన్నగారూ బావగారూ లేచి వెళ్ళడంతో పళ్ళెంలో చేయి కడుక్కుని తాంబూలం వుంచటానికి వెళ్ళింది సరోజ అమ్మగారి అజ్ఞ ప్రకారం.
17
భోజనం చేసి పడుకుని నిద్ర లేచాక బాబుని తెచ్చి చూపించింది శ్రీదేవి.
చిన్న గడ్డం......తళతళా మిలమిలా మెరిసి పోయే నీలి రవ్వల్లా కళ్ళు, చక్కని ముక్కు, పలచని బుగ్గలు నిండుగ-బలహీనంగా వున్నా ఆరోగ్యంగా కనిపించాడు.
ప్రబందాల్లు అన్నట్టు "నడుమే పసలేదు గాని నారీ మాణికిన్" అని అన్నీ వున్నాయ్ గాని ఒత్తయిన జుత్తేలేదు.
ఆ మాటంటే కులాసగా నవ్వి శ్రీదేవి "ఆముదం ఖర్చు మిగులుగా మీకు" అంది.
"సరి!సరి! యిలాటివన్ని మిగిల్చే మా తాతగారు అగ్రహారాలు కొన్నారు. తెలిదా నీకు?"
"ఎక్కడేమిటి?"
"నిజంగా తెలిదా నీకు? కడప జిల్లాలో వుంది, మీ చీరలకు ప్రసిద్దమైన మాధవరం- ఆ అగ్రహారం మాదే."
"మీ తెలివి తెల్లారినట్టేవుంది. ఆ మాధవరం అగ్రహారం కాదు- మాములు గ్రామం. మన పేరున్న వూర్లన్ని అగ్రహారలయితే యిక ఉద్యోగం చేయాల్సిన కర్మేమిటి?"
"ఉద్యోగం చెయ్యటం ఖర్మేమిటి? ఖర్మ ఎలా అవుతుంది? ఉబుసుపోక. లేకపోతే ముష్టి మూడు వందల రూపాయలకి ఎవరైనా పనిచేస్తారేమిటి? అదో దర్జా! అంతే!"
"అబ్బ! ఏం గొప్ప! మీ గొప్పలు మీరే చెప్పుకోవాలి గానీ. ఈ రోజుల్లో ముప్పై రూపాయలిచ్చినా చాలుననుకునే ఎమ్మే గాళ్ళు చాలా మంది వున్నారు. ఉద్యోగం దొరక్క అల్లల్లాడి పోతున్నారు పాపం! రోజుకి రూపాయి వచ్చినా వాళ్ళ టేర్లిన్స్ ఉతుక్కోటానికి దిన దిన ముఖ క్షారం చేసుకోటానికయినా వస్తుందని"
"అందుకే వాళ్ళు కన్నడంలో ఎమ్మెలు"
అతని చమత్కారానికి పకపకా నవ్వింది శ్రీదేవి.
తర్వాత మాధవ్ ఓ నిమిషం ఆగి "రవి ఏడి?" అన్నాడు.
"కాన్వెంట్ కి వెళ్ళాడు. ఇంకో అరగంటలో వచ్చేస్తాడు లెండి. మీరు టిఫిన్ చేస్తారా?"
"ముఖం కడుక్కుని వస్తాను"
"అలాగే ఆపని కానివండి ముందు,"
బాబుని తీసుకుని పోబోతూ అంది "బాబుకి పేరు పెట్టేశాం"
మనస్సు చివుక్కుమన్నా ఏమి అనలేదు మాధవ్, గతించిన కార్యాన్ని గురించి ప్రాజ్ఞులు ఎవరూ దుఃఖపడరు.
"క్రిష్ణ"
"ఊ"
"బావుందా?"
"నీకు నచ్చితే చాలదూ?"
"సరి! ఇక మీరు వెళ్ళి ముఖం కడుక్కుని రండి."
వెళ్ళిపోతూ అంది.
అతడు ముఖం కడుక్కోవటానికి వెళ్ళాడు.
ముఖం కడుక్కుని వచ్చేసరికి వేడివేడి పురిలున్న ప్లేట్ తీసుకుని వచ్చింది శ్రీదేవి.
ఏం పలక్కుండా ప్లేటు ముందుకి లాక్కుని ఒక్కొక్కటి ఖాళి చెయ్యసాగాడు.
టిఫిన్ చేస్తున్నంత సేపూ శ్రీదేవి ఏవేవో కబుర్లు చెబుతూనే వుంది.
కానీ అతని మనసులొ మాత్రం శంక వదల్లేదు.
శ్రీదేవి ఎప్పటిలా వుంది.
అతనంటే అభిమానం చూపుతోంది.
ప్రేమ తగ్గలేదు.
ఉదయం బామ్మగారితో వాదించి నపుడే ఆశ్చర్యమైంది.
మరి?
ఆరోజు సంఘటనని, మరచిపోయిందా?
అలా అనుకోటానికి ఆస్కారం లేదు.
తనకి ఒక్క ఉత్తరమయినా వ్రాయలేదు.
మొదటినించి యివిడ మనస్తత్వమే యింత.
అతని కావిడ చర్యలన్నీ పద్మవ్యూహంలా తోస్తాయే తప్ప ఏనాడు సులువుగా అర్ధంకావు. అదృష్టం ఎక్కడుంటే- యింత వరకూ అతనికి అభిమన్యుడిఅవస్థ రాలేదు.
అన్నిటికంటే ఆశ్చర్యం ఆవిడ మౌనం!
ఏమో ప్రళయానికి ముందు ప్రశాంతత వుంటుందట, నిజమేనేమో?
టిఫిన్ ముగించాక వేడివేడి పాలు తీసుకుని వచ్చింది.
పాలు తీసుకోబోతొంటే అటుగా వచ్చిన సరోజ అంది 'చిక్కని పాలు బావగారూ! జాగ్రత్త వాటిలో చిక్కుకుని పోయేరు.
"ఆహా, నిజంగా చిక్కనిపాలే! ఇవి మీకు టౌనులో చిక్కనివి, నీకు హాస్టల్లో చిక్కనివిను, అయినా ఈ రోజుల్లో పల్లెల్లో కూడా చిక్కని పాలే దొరుకుతున్నాయ్. మరి, వాళ్ళు పాలల్లో నీళ్ళు, పాలపొడి కలపటం, నెయ్యిలో డాల్డా వెజిటబుల్ ఆయిల్ కలపటము, వెన్నలో మైదా కలపటము నేర్చుకుంటున్నారు . ప్చ్"
"ఇద్దరి తెలివి సంతోషించేట్టుగానే వుంది లెండి. అది మా యింటి బఱ్ఱె పాలు చిక్కగానే వుంటాయ్. వున్నాయ్ మీ శ్లేష పాండిత్య ప్రకర్ష చాల్లెండి."
అక్కగారి కంఠస్వరం బయల్పడటంతోటే కిమ్మనకుండా వెళ్ళిపోయింది సరోజ.
మాధవ్ పాలు త్రాగేసి గ్లాసు క్రింద పెట్టబోతోంటే పరిగెత్తుకుని వచ్చేశాడు రవి.
"నాన్నా" అంటూ ఒక్క అదాటున వచ్చి అతన్ని పెనవేసుకున్నాడు.
బాబుని దగ్గరగా తీసుకుని ముద్దు పెట్టుకుని ప్రేమగా అన్నాడు.