నలుగురూ భోజనానికి కూచుని వుంటే మాధవ్ అత్తగారు ఒక్కతే వడ్డిస్తోంది. వంటింటి గడప నానుకుని కూర్చుని బామ్మగారు పై పై ఆర్డర్లు వేస్తోంది.
చుక్కకూర పప్పు కలుపుకుని నెయ్యి వేశాక అడిగి యింకాస్త వేయించుకుని కలుపుకుని ముద్ద నోట్లో పెట్టుకోబోతూన్నాడు. "చూశావా మాధవ్, ఎప్పుడయినా యిలాటి కూరలకి నెయ్యి కాస్త అధికంగా వేసుకుంటేనే రుచి. అసలు నెయ్యి శరీరానికి మంచి పుష్టిని యిస్తుంది. ఈ కాలం వాళ్ళు మీరు బాగా తినలేరు, జిర్ణించుకోలేరు. ఆయనెవరో అన్నట్లు మీకు ఒక యిడ్లి చాలదు రెండిడ్లిలు ఎక్కువవుతాయి."
తర్వాత తన చమత్కారానికి తానే నవ్వుకుని మాధవ్ వేపు చూశాడు. కానీ దానికి మాధవ్ సమాధాన మివకపూర్వమే సరోజ జవాబు యిచ్చింది.
"అందుకే నాన్నా పూర్వం బ్రాహ్మణులు డబ్బులు తిరిగి అమ్మకాలు జరగని రోజులలో పెరుగుకి ఓ ఎకరం, నెయ్యికి ఓ ఎకరం, పాలకి ఓ ఎకరం అని మాన్యాలు పెట్టారట. ఈ విషయాలు యిప్పటికి మా హాస్టల్లో చెప్పుకుని నవ్వుకుంటూ వుంటారు."
తృప్తిగా తేన్చి అన్నాడు "మీకేం తెలుసమ్మా! మన భోజనాల సంగతి. నన్నడుగు చెబుతాను. మనలో బ్రహ్మణ్యం అన్ని విధాల పోయినా యింకా మన బ్రహ్మాణ్యాని నిలిపేవి కొన్ని లక్షణాలున్నాయమ్మా- పిచ్చి వాళ్ళు మీకేం తెలుసు! అసలు బ్రాహ్మణుడు పుట్టకముందే వాడికి భోజన ప్రియత్వం పుడుతుంది. చెబుతా విను మన లక్షణాలు! బ్రాహ్మణ భోజన ప్రియా" ఇది మొదటిది. ఎప్పుడయినా సరే బ్రాహ్మణుడు మంచి భోజనం పెడతారంటే బాగా యిష్టపడతాడు. ఏం వున్నా లేకపోయినా మంచి భోజనం దొరికితే చాలు వాడికి పరమతృప్తి. కట్టను మంచి బట్టలేకపోయినా బాధపడడు, కానీ మంచి తిండి లేకపోతే వాడు ఓర్చుకోలేడు. అసలు అరిటాకులో వడ్డించి రెండు పచ్చళ్ళు, పప్పు, చారు కూరా వేసి యింత పెరుగు వేశారా యిహ బ్రాహ్మణుడు దేవేంద్రపదవి అబ్బినంతగా సంతోషపడతాడు- ఇహ రెండో గుణం, దీనికి సంబంధించిందే "అమంత్రనోత్సవా " ఇది మొదటిదానికి సంబంధించిందే వాడెంత ధనవంతుడయినా ఎవరయినా భోజనానికి పిలిస్తే భలే మురిసిపోతాడు, మిగతా జాతుల్లో అధికారం ప్రాప్తిస్తే తోటి వాళ్ళతో కూర్చుని భోజనం చెయ్యటానికి రారు, కానీ బ్రాహ్మణుడు భోజనానికి పిలిస్తే సంతోషంగా వెడతాడు. ఇహ మూడో గుణం "బ్రహ్మణానామనేకతమ్" అని కొంచెం మంచి నీళ్ళు త్రాగి, "ఏదో ఉపన్యాసం చెపుతున్నానని వింటూ భోజనం చెయ్యకుండా వినకండి. కానిస్తూ వినండి. ఆ ఎమన్నాను? అదో అదే ఆ మూడో గుణం వుందే అదే మనలో రాచపుండు. ఒక వూరిలో మూడిళ్ళున్నాయంటే సరి ఒకరికొకరు సరిపోరు. అదేం దుర్లక్షణమో కలిసి బ్రతికే లక్షణం లేదు మనలో" అని నిట్టూర్చి అందుకే మనవి బుద్ది జాడ్య జనితోన్మాదుల్ కదా శ్రోత్రియుల్ అంది వరూధిని" అన్నాడు.
ఎవరూ జవాబు యివకుండా భోజనం కానిస్తున్నారు ఆయనకి బ్రహ్మణ్యంపై గల ప్రేమాభిమానాలనివింటూ.
తర్వాత చారు కలుపుకుంటూ "ఇంకా ఎన్నో వున్నాయ్.....అవన్నీ ఎందుకులే. అయినా మనకి అగ్రస్థానం వహిస్తోన్న లక్షణం ముందుగా చెప్పానుగా"
అందరూ పకపక నవ్వారు.
తనూ నవ్వుతూ "నవ్వుతారేమర్రా? నిజం చెపితే మికలాగే వుంటుందిలే- మరి యీ లక్షణాలు కాకపోతే మనలో ఆచారాలు యింకా ఏం మిగిలివున్నాయ్? అనుష్టానం వుందా? ఆచారం వుందా? అసలు సంధ్యావందనం సరిగా నేర్చుకున్న బ్రాహ్మణకుర్రాడున్నాడా యీ రోజుల్లో? పేరుకి బ్రాహ్మణుడు తప్ప యీ రోజుల్లో నూటికో కోటికో ఒక్కరు తప్ప యింకా చక్కని బ్రాహ్మణుడు ఎక్కడున్నాడు? అసలు యజ్ఞం చేసే బ్రాహ్మణుడేలేడే యీ రోజుల్లో.
"చాల్లెండి నాన్నా ఎవరయినా వింటే నవ్విపోతారు. ఇంకా బి.సి. నాటి వుహలని గేలిచేస్తారు మనల్ని."
ఆమె అన్నదానికి నవ్వుతూ "బి.సి. నాటి వాళ్లమేం ఖర్మమ్మా- చాతయితే వాళ్ళని యింకాస్త వెనక్కి లాక్కుపొమ్మను. రాముని కాలం నాటి వాళ్ళమనో, కృష్టుని కాలం నాటి వాళ్ళమనో అనమను. నీకు తెలిదమ్మా మనం ఎంత వెనక్కి వెడితే ఎస్టిమేటో అంతే అంత మంచిది. మనల్ని ఎవరయినా ఏమైనా అంటే సంతోషించు, కోపమెందుకు. మనలో లేని విషయాల్ని ఎత్తి చూపే శత్రువుకన్నా మిత్రుడేవరు తల్లీ"
గంభీరంగా వుండిపోయింది సరోజ.
అటూ యిటూ చూసి అన్నారు మళ్ళీ "ఏమర్రా ఎవరూ సరిగా భోంచేయటం లేదే- ఏమేవ్ మాధవ్ కి యింకాస్త కూరవేయ్. ఇంకో అప్పడం కూడా వెయ్. మరిన్ని వడియాలు వెయ్."
"అబ్బబ్బే! ఇవే చాలండి. టౌన్ లో హోటల్ కూడుతినేవాళ్ళకి ఇవి తినాలంటే కష్టమండి"
"అవున్లే నిజమే! నిన్నటి సాంబారు, యీరోజు, ఈరోజు కూరముక్కలు మరుసటి రోజు సాంబార్లో తినేవాళ్ళకి యీ రుచేం తెలుస్తుంది!" అని బిగ్గరగా నవ్వాడు ఆయనే.
మళ్ళీ ఓ క్షణం ఆగి అన్నారాయన" అన్నట్లు నీవు హోటల్ తిండి అంటే గుర్తుకి వస్తోంది. నీ పద్దతేం బావులేదయ్యా అమ్మాయ్ వచ్చి మూడు మాసాలైంది, బాబుకి రెండో నెల కూడా వెళ్ళింది. ఎన్ని జాబులు రాశాను- ఒక్కదానికి జవాబు లేదు. మనిషివి రాలేదు అయినా నీ కిదేదో కొత్తగా అలవాటైనట్టుందిలే! లేకపోతే జాబు వ్రాసి పోస్ట్ ఆఫీసులో వేసి యింటికి తిరిగి వచ్చేసరికి జవాబు వచ్చేదే మీనించి! అదేం యీ సారి యిలా చేశావు?
మౌనంగా తలవంచుకొని ఒక్కో మెతుకే నములుతూ ఆలోచించసాగాడు.
"ఏం చెప్పాలి?"
తనకు వుత్తరం రాలేదు.
ఆ విషయం చెపితే అబద్దం చెప్పి బుకరిస్తున్నాననుకుంటారు.
ఏమైనా సరే వచ్చిన అపవాదు ఎలాగూ వచ్చింది. ఈ కాస్త సేపు మౌనం వహిస్తూ గండం కూడా గడిచిపోతుంది.
అలా అనుకుని మౌనంగా వుండిపోయాడు.
"పోనిలే అన్నిటికి సరే అబ్బాయికి పేరు పెడుతున్నామన్నా రాలేదేం?"
అసలు విగ్రహలకే పూజ లేకపోతే ఉత్సవ విగ్రహాలు వుసురోమన్నాయట తమకు పూజ లేదని అలా వుంది; అసలు వుత్తరాలే రాలేదంటే నామకరణానికి రాలేదనటం! అయినా అతను దానికి జవాబు చెప్పలేదు.
'అంత తీరని రాజకీయాలేమిటో నాకేమి అర్ధం కాదు. పోనిలే అవన్నిను ఎలాగైతేనేం యిప్పుడైనావచ్చేవ్."
ఇంతలో పెరుగు తీసుకునివచ్చింది అత్తగారు.
కలుపుకుంటూ అన్నారాయన "మీగడ పేరుగోయ్ ఇంకాస్త వేయించుకో, నీ కిష్టమేగా?"
"నాన్నా" పిలిచింది సరోజ మెల్లగా.
"ఓ"
"అది కాదు నాన్నా. బావకి నీవు చెప్పకపోతే దీని రుచి తెలియదా ఏమిటి? అలా అనుకున్నాయి రోజు నీవు దగ్గరుండి అన్నీ చెప్పావ్. తర్వాత కర్నూల్ వెళ్ళాక అక్కడేవరు చెపుతారు?"
ఉత్తరాపోసనం తీసుకుంటుండంతో అయన జవాబు చెప్పలేదు.
కానీ శ్రీదేవి గుఱుగా చూసింది.