"ఆయన కాస్త మారారా అత్తయ్యా! యిప్పటికన్నా కాస్త తగ్గారా. ఆయనకి మళ్ళీ పెళ్ళికిప్రయత్నాలు చేయడం లేదా" అత్తగారికి వంటలో సాయం చేస్తూ అడిగింది అర్చన.
"అనుభవం మనిషి మెడలు వంచి సవారి చేస్తుందమ్మా! వాడిలో యిదివరకటి వాడి, వేడి తగ్గినట్టే వుంది. ముందు ఏడాదిలో పూజని ఇక్కడుంచామనే కసురుకున్నాడు. అది పోయాక దానిపిల్ల ఎందుకిక్కడ అన్నవాడు కాస్తా యీ రెండేళ్ళలో కూతురి కోసం ఆరేడుసార్లు వచ్చాడు. వచ్చాక దానితో ఆటలు పాటలు ఆదుకున్నాడు. జరిగిందానికి పశ్చాత్తాపం వాడిలో కనిపిస్తుంది కాని అది అంగీకరించడానికి అభిజాత్యం అడ్డువస్తూ వుంది వాడికి. హు.....వాడిలో యీ మార్పు......మీరు డైవోర్సు తీసుకోక ముందు వచ్చివుంటే ఆ మార్పుకి సార్ధకత వచ్చేది" ఆవిడ నిట్టూర్చింది.
"పోనీలెండి...ఈ మార్పువల్ల రేపు వచ్చే ఆవిడన్నా సుఖపడవచ్చుకదా!" అర్చన అంది. "వీలయినంత త్వరగా ఎవరినయినా చూసి చెయ్యండి అత్తయ్యా!"
"చూస్తున్నాం ఈసారి వాడి అహంకారాన్ని తృప్తిపరచే లాంటి అమ్మాయినే చూస్తున్నాను. అట్టే పెద్ద చదువులు చదవకుండా, సామాన్యంగా వున్న పిల్ల, లేనింటి పిల్లని చూసి చెయ్యాలమ్మా! యిల్లు, సంసారం, పనిపాటచూసుకుంటూ వాడు ఏమన్నా కాస్త అణిగిమణిగి వుండే లాంటి పిల్ల కావాలి వాడికి. నాలుగైదు సంబంధాలు చూసి వుంచాం. వాడీసారి రాగానే చూపించి చేయాలి."
"ఆయనకి...ఆయనకి నా పెళ్ళి విషయం తెలుసా, ఏమన్నారు" అర్చన బిడియంగా అంది.
"క్రితంసారి వచ్చినపుడు నేనే కావాలని చెప్పాను. వినగానే మొహం మాడింది. 'దాని గొడవ నా దగ్గిరెప్పుడూ చెప్పకు. ఏడవనీ' అంటూ ఎగిరాడు. ఆ రోజంతా మొహం కాస్త మాడ్చుకుని తిరిగాడు" ఆవిడ కాస్త బాధగా అంది. అర్చన మనసు ఎద్న్హుకో తెలియకుండానే మూలిగింది.
"అర్చనా, ఒక్క విషయం చెప్పు. నీవు నీకు నచ్చినవాడిని చేసుకున్నావు సంతోషం, మీ యిద్దరూ కలకాలం సుఖంగా వుండాలి. కాని......పూజ విషయం ఏమిటి.....రాజేష్ ఎంత మంచివాడయినా, తనదికాని దాన్ని కూతురిగా ఆదరించగలడా! అర్చనా పూజ మా ప్రాణం....అది ఎన్నడూ కంటతడి పెట్టకూడదు. దానికేదన్నా అయితే మాప్రాణం గిలగిల్లాడు తుంది. పూజకి ప్రేమాభిమానాలు దొరకకపోతే మాత్రం మేం భరించలేం."
"అబ్బెబ్బే! రాజేష్ చాలా మంచివారత్తయ్యా! అన్నీ మాట్లాడే వప్పుకున్నాను నేను. దానికి తండ్రి కాగలిగితేనే నేను భర్తగా అంగీకరింస్తాను అని స్పష్టంగా చెప్తాను. అసలు నేననకముందే అతనే అన్నాడు. అసలు పెళ్ళయిందగ్గిరనించి పూజని తీసుకురమ్మని అతనే చాలాసార్లు అన్నాడు."
"పోనీ...పూజని మా దగ్గిరే ఉండనీయకూడదమ్మా! మాకూ బాగా చేరిక అయింది. వదలాలంటే బాధగా వుంది. ఆశగా చూస్తూ అడిగింది వరలక్ష్మి.
అర్చన యిబ్బందిగా చూసింది. "ఎలా అండి, నేను మాత్రందాన్ని వదిలి వుండగలనా! ఏదో చదువుకోసం అని తప్పక" నసిగింది.
కన్నతల్లిని బిడ్డని మాకు వదిలేయి అని అడగడం, తల్లిని బిడ్డని వేరు చేయడం ఎలా అని ఆవిడే అంతకంటే అడగడానికి యిబ్బంది పడింది.
"నిజమేలే, నీవూ కన్నతల్లివి. కాని ఏ రోజన్నా రాజేష్ కి ఇష్టం లేని స్థితి వస్తే ఆరోజుమాత్రం పూజని మాకప్పగించాలి. దానిని నిర్లక్ష్యం చేయడం మాత్రం సహించం."
"అబ్బే! నేనుండగా దాన్ని నిర్లక్ష్యం ఎందుకు చేస్తాను. రాజేష్ అలాంటివాడు కాడని నా నమ్మకం."
"రాత్రి పడుకోడానికి వెళ్ళబోతూంటే అత్తగారు, "పూజని నా దగ్గిరే పడుకోని అర్చనా!" అంది అర్ధవంతంగా. అర్చన కాస్త ఇబ్బంది పడింది. పూజవంక చూసింది. తల్లివంక అదోలా చూసింది పూజ, "ఫరవాలేదు లెండి, నేను పూజ గదిలో పడుకుంటాను" అంది అత్తగారి వంక అర్ధవంతంగా చూస్తూ.
పూజ పక్కలో పడుకుని ఏవేవో కబుర్లు చెప్పసాగింది అర్చన. పూజ ఎప్పటిలా తల్లి వచ్చిందన్న సంబరంతో ఆగకుండా స్కూలు కబుర్లు, ఫ్రెండ్స్ కబుర్లు చెప్పలేదు మాటల మధ్యలో హఠాత్తుగా "యీ కొత్తడాడీ ఎప్పటికీ నీ దగ్గరే వుంటాడా" అనడిగింది. అర్చన ఒక్కక్షణం తెల్లబోయింది. పూజ మనసులో యింకా 'కొత్తడాడీ' అన్నమాటే తొలుస్తుందన్నమాట. అందుకే సరదాగా కబుర్లు చెప్పడం లేదు అనుకుంది అలా అని అబద్దాలు చెప్పి పూజని మభ్యపెట్టడమా ఆమె కిష్టం లేకపోయింది. "అవునమ్మా! డాడీ, మమ్మీ ఒకచోటే కలిసి వుండడంలేదా?" ఆమెకి అర్ధమవ్వాలని నచ్చచెపుతూ అంది.
"ఔను కానీ, యీ డాడి మా డాడి కాదుగా" తెలివిగా ప్రశ్నించింది యిప్పుడేం జవాబు చెప్తావన్నట్టుచూసింది. అర్చన జవాబుకి తడుముకుంది.