Previous Page Next Page 
శుభోదయం పేజి 29


    "చేస్తా, తప్పకుండా చేస్తా... యిలాగే యింకా కొన్నాళ్ళుంటే, నాకే పిచ్చిపట్టి తప్పకుండా నిన్ను చంపి నేను చస్తాను" అరిచేవాడు. ఒక్కోసారి అతన్ని చూసి రాధకే జాలిగా వుండేది. అతనివైపు నుంచి చూసి ఆలోచిస్తే అతను పడే బాధకి అర్థం వుందనిపించేది. ఆమెకి అతని బాధ తెల్సినా, ఆ బాధకి తనని దోషిని చేస్తున్నందుకు బాధపడేది. తనమీద ఇంత వైషమ్యం పెంచుకోకుండా తన నేరం లేదని గుర్తించి లాలిస్తే అన్నీ మర్చిపోయి అతను చెప్పినట్లు చేసేదాన్నికదా. అతనే ఇదంతా చేశాడు అని మరోసారి అతనిదే తప్పని నిర్ణయించుకునేది. పిల్లవాడిని గురించి అందరూ చూసే చూపులు గుసగుసలు, మొహాలు చూసుకోవడం రాధకీ బాధగా వుండేది. పనిమనిషి, "అమ్మగారు! మీరు, బాబుగారూ తెలుపు. ఇంత నలుపెక్కడనుంచి తెచ్చాడమ్మా యీ బుడ్డోడు" అంటూ ఏం తెలియనట్టే అడిగింది.
    "అమ్మో రాధమ్మగోరూ... ఏటండీ వుసిరికాయ పచ్చడి తెగ తిన్నారేటి కడుపుతూండగా" చాకల్ది హాస్యంగా అన్నట్టు అంది.
    "రాధమ్మా! నీ అందానికి దిష్టితగలకుండా యీ నల్లచుక్కలా నీ వళ్ళో పడుకోబెట్టాడు దేముడు" కూరలమ్మి సానుభూతి.
    "రాధా... ఈ దేముడెంత కఠినాత్ముడే! కాస్త మంచి బిడ్డనన్నా యిచ్చి నీ మీద దయ చూపించడానికన్నా ఆయన మనసు రాలేదుగాబోలు. ఎలా పెంచుతావే?" సరళ ఆస్పత్రికొచ్చి బిడ్డని చూస్తూనే తుళ్ళిపడింది. రాధ బాధగా గుండెల్లో గునపం దిగినట్లు చూసిన చూపు చూసి "సారీ రాధా, సారీ. నీవు తల్లివయ్యావన్న మాట మరిచిపోయానే. 'అమ్మ' అన్న పదంలోనే అన్నీ భరించేది, మమతల నిలయం అనే అర్థం వుందే. సారీ! క్షమించవే ఏదో అనేశాను. నీవేం ఫీల్ కాకూడదు" అంది చొచ్చుకుంటూ చెయ్యిపట్టుకుని.
    "లేదే... నీవు పైకి అన్నావు. అందరూ చూపులతోనే విమర్శిస్తున్నారు. సరళా... నన్నేం చెయ్యమంటావే చెప్పు. నా కర్తవ్యం ఏమిటో చెప్పవే. ఈ బిడ్డని ఏం చేయనే... ఎలా పెంచనే... పెంచగలనా చెప్పు? ఈ రెండురోజులకే వీడిమీద ఏదో మమత కల్గిందే... వీడ్ని దూరంచేసి శాంతిగా బతకగలనా... లేక పెంచుకుంటూ అన్ని విమర్శలు ఎదుర్కోగలనా... చెప్పు... చెప్పవే" కళ్ళునీళ్ళుతో నిండగా అంది.
    "రాధా... ఇట్స్ టూ లేట్... యిప్పుడీ ఆలోచనలకి అర్థంలేదు... కనిక తరువాత ఏం చెయ్యడం అన్న ప్రశ్నకే తావులేదు. ఎలాంటి బిడ్డయినా ఏ తల్లి పారేయలేదు. పారేసి శాంతిగా బతకనూ లేదు. చచ్చిపోతే ఓ ఏడ్పు ఏడ్చి వూరుకోవచ్చుగాని, ఎక్కడో బతికి వుందన్న నిజం తెలుస్తూ ఏ తల్లి హృదయం నిశ్చింతగా వుండలేదు. పిచ్చిపిచ్చి ఆలోచనలు మానేయి. ధైర్యంగా నిశ్చయించుకుని కన్నావు. యిప్పుడు పిరికిదానిలా కర్తవ్యం మరచి వీడినో అనాధని చేసే అధికారం నీకులేదు" అంది దృఢంగా. రాధ సరళ చేయి పట్టుకుని "థాంక్స్ సరళా... యీ రెండురోజులుగా అందరి చూపులు ఎదుర్కోలేక, మాధవ్ ని కాదనలేక నిజంగానే పిరికిదాన్ని అయ్యాను. సరళా! అనాధగా పెరిగిన నేను మరో అనాధని తయారు చెయ్యనే... చెయ్యను. గట్టిగా చెయ్యినొక్కి ఆవేశంగా అంది.
    ఆ తర్వాత మాధవ్ మాటలు లెక్కచెయ్యడం మానేసింది. అందరి చూపులు పట్టించుకోవడం మానేసి బిడ్డని యింటికి తీసుకొచ్చింది. రోజురోజుకీ మాధవ్ ప్రవర్తన మరీ భరించలేనిదవసాగింది. యింటి ఖర్చుకి డబ్బీయడం సగానికి సగం తగ్గించేశాడు. పిల్లవాడు ఏడుస్తుంటే "ఏమిటీ పీడ? యింట్లో కాసేపు వుండనీయవా, ముందు వాడి నోరుమూయి" అరిచేవాడు. అక్కడికీ రాధ మాధవ్ యింట్లో వున్నప్పుడు పిల్లవాడు ఏడవకుండా వళ్ళో వేసుకునే కూర్చునేది. "ఏమిటీ వెధవ వుచ్చగుడ్డలు యిల్లు వాకిలి-దరిద్రంగా", "ఏమిటీ బాత్ రూమ్ నిండా ఆ నలుగుపిండి వాసన, కడిగించు ముందు ఫినాయిల్ వేయించు. ఛా అసలీ కొంపలో వుండడం నాది పొరపాటు" యింట్లో వున్న అరగంటో, గంటో పిల్లాడిని తిడుతూ, రాధమీద విసుక్కుంటూ ధుమధుమ లాడుతుంటే రాధ ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకున్నట్టే ప్రవర్తించేది. కన్నబిడ్డ కానంత మాత్రాన యింత క్రూరంగా పసివాడిని ద్వేశించడమా అని బాధపడేది. తన రక్తం పంచుకుని పుట్టని యితరుల బిడ్డని ఎవరూ ప్రేమించరేమో, ఏ పురుషుడయినా స్త్రీ అయినా అంతేనేమో? అని మనసు సమాధానపరచుకునేది. ఎంత సమాధానపర్చుకున్నా... అంత పసివాడిని వెధవ, దరిద్రుడు, నల్లవెధవ, వాడ్ని నా ఎదురుగా తీసుకురాకు అంటూ మాట్లాడుతుంటే ఆ తల్లి హృదయం ఆక్రోశించేది. ఆ బిడ్డమీద మరింత జాలిపడేది. ఆ స్థితిలో ఎన్నాళ్ళు బిడ్డని పెంచగలదు?... యింత నిరాదరణ తిరస్కారం మధ్య పెరిగే పిల్లవాడి మానసికస్థితి ఎలా వుంటుంది? ఇప్పుడంటే పసివాడు, ఇంకో ఏడాది రెండేళ్ళు పోయాక అనుక్షణం చీదరించుకుంటుంటే వాడేమవుతాడు? మాధవ్ ని ఎదిరించి కొంతకాలం తను యీ యింట్లో బతకాలి! అలా అని అణిగి మణిగి పిల్లవాడి ఏడ్పుకూడా వినపడనీయకుండా భయంతో అదిరిపడుతూ ఎన్నాళ్ళు పిల్లాడిని పెంచాలి? ఈ యింట్లోంచి మాధవ్ పొమ్మనేముందు వెళ్ళిపోవడం మంచిదా! ఆమె మనసులో మధనపడుతూనే వేసుకునే ప్రశ్నలకి సమాధానం త్వరలోనే దొరికింది!!

 

                             17


    ఆ రోజు అర్థరాత్రి... పక్కలో పిల్లవాడు కదులుతుంటే రాధకి చటుక్కున మెలకువ వచ్చింది. కళ్ళు విప్పగానే ఏదో గుసగుస మాటలు విని తెల్లబోతూ చటుక్కున లేచి గుమ్మందగ్గరకి వచ్చింది. అప్పుడే మాధవ్ గదిలోంచి శారద, మాధవ్ యిద్దరూ చడీచప్పుడు కాకుండా నెమ్మదిగా మాట్లాడుతూ వస్తున్నారు. మనుషుల నీడలు చూసి రాధ చటుక్కున లైటు వేసింది. మాధవ్, శారద యిద్దరు గతుక్కుమని నిలబడిపోయారు పట్టుబడ్డ దొంగల్లా. లైటుకంటే యిద్దరి మొహాలు తెల్లపడ్డాయి. ఆ స్థితిలో అతడి గదిముందు ఆ యిద్దర్నీ చూసిన రాధకి ఒక్కక్షణంలో సంగతి అర్థమైంది. అతని మొహం మాడిపోయింది. అతను గిల్టీగా ఆమెవంక చూసి కళ్ళు వాల్చాడు. శారద ఏం చెయ్యాలో తోచక బిత్తరపోతూ నిలబడింది. రాధ ఒక్కక్షణం నిర్ఘాంతపోయి నిలబడిపోయింది. అంతటా నిశ్శబ్దం తాండవించింది.
    ఆఖరికి రాధ తేరుకుని అతనివంక తిరస్కారంగా చూసి "శారదా... నీవు... నీవు... యిలా... ఏం పనిచేశావు శారదా." శారద యింతపని చెయ్యడం నమ్మలేనట్టు విస్తుపోతూ అంది రాధ. శారద మొహం మరింత వంగింది..." 'మీరు... మీరింత నీచానికి దిగజారి... శారదని యిలా...' ఆమె గొంతు వణికింది ఆవేశంలో.

 Previous Page Next Page