Previous Page Next Page 
మనసు పొరల్లో పేజి 29

 

    పెళ్ళయిన ప్రతి నిముషం భర్త సాన్నిధ్యాన్ని కోరుకుంటూ,అతని కోసం నిరీక్షిస్తూ,అతని కౌగిట్లో కరిగిపోయే మధుర క్షణాల కోసం కలవరించవలసిన వయస్సులో, భర్త నీదంటేనే భయపడే దుస్థితిలో జీవితాన్ని ప్రారంభించడం, ఎంత నరకప్రాయమో తలుచుకుంటే గుండె పగిలిపోతోంది. ఈ జీవితం ముగిసేదేన్నటికి? ఈ బాధ భరించదేలగా? ఈ ప్రశ్నలే ఆమెని పిచ్చిదాన్ని చేస్తున్నాయి-
    దాదాపు రాత్రి పది దాటాక ఇంటి కొచ్చాడు పానకాలు బ్రేవుమని తెనుస్తూ......"నేను భోం చేసోచ్చాను" అన్నాడు బట్టలు మార్చుకుంటూ.
    నిజానికి ఝాన్సీకి ఆకలిగా లేదు. మనసు చిరిగిన విస్తరిలా చిందరవందరగా ఉంది. కానీ ఒకరకమైన పంతం ఆమెలో కలిగి 'అతను పీకల దాకా మేక్కొస్తే నేనెందుకు పస్తుపడుకోవాలి?" అనిపించింది! వెంటనే వెళ్ళి కంచం పెట్టుకుని ఆకలి లేకపోయినా , తినాలని అనిపించకపోయినా మెల్లగా కూర్చుని భోం చేసింది.
    "ఎంత సేపు తిండి? నావంతు కూడా నువ్వే తింటున్నావా?" అని అరిచి అదొక జోక్ లాగా నవ్వేడు పానకాలు.
    ఆ నవ్వు అసహ్యాన్ని కలిగించింది ఝాన్సీకి.
    కావాలని మరింత ఆలస్యం చేసింది.
    పడకగదిలో కాలు పెట్టాలంటే , గుండె దడదడా కొట్టుకోసాగింది. భయపడుతూ పిల్లిలా అడుగులు వేస్తూ మంచం వద్దకి చేరుకుంది. తమలపాకులు బాగా నమలడం వల్ల నోరంతా ఎఱ్ఱగా ఉంది. మాములుగా అయితే ఆ ఎరుపు దనం ఎంతో అందంగా కనిపించేది. కానీ ప్రస్తుతం ఝాన్సీ ఉన్న మూడ్ కి అదొక రక్తపు ముద్దలా అనిపించింది.  ఝాన్సీని చూడగానే అతడు సిగరెట్టు పెట్టె తెరచి సిగరెట్టు తీసి నోట్లో పెట్టుకుని స్టైలుగా అగ్గిపుల్ల గీసి సిగరెట్టు వెలిగించాడు. ఝాన్సీ అతనికేసి చూసింది. అతను నోరంతా తెరచి నవ్వాడు . ఆ నవ్వు కూడా భయాన్ని కలిగించింది ఝాన్సికి. మెల్లగా వెళ్ళి దుప్పటీ మొహం మీంచి లాగి కప్పుకుని ముడుచుకుని పడుకుంది.
    ఒక ఐదు నిమిషాలు ప్రశాంతంగా గడిచిపోయాయి. ఆ ప్రశాంతతలో నిద్ర పట్టేసింది ఝాన్సీకి. ఉన్నట్టుండి దుప్పటీ ముసుగు లాగేసి పక్కన చేరిన పానకాలుని చూసి ఉలిక్కిపడింది . కెవ్వున కేక పెట్టింది. "ఎందుకరుస్తావ్ ఎవడో వొచ్చి 'రేప్' చేస్తున్నట్టు? నేనే! నీ మొగుణ్ణి...." అంటూ దగ్గరకు లాక్కుని సిగరెట్టు పీకని పెదవుల మీద అన్చాడు. మంటకి తట్టుకోలేక మరింత గట్టిగా అరిచింది. అరవకుండా నోరు మూసేశాడు పానకాలు. కొంతసేపు పెనుగులాడి అతని చేతులోంచి తప్పించుకున్న ఝాన్సీ అతడి చేతిలో వెలుగుతున్న సిగరెట్టుని అందుకుంది. వెంటనే ఏదో  స్పురించిన దానిలాగా అది తీసి అతని నోటి మీదా, జబ్బల మీదా చురకలు పెట్టింది. 'బాబోయ్' అని అరుస్తూ అతడు కాలుగాలిన పిల్లిలా అటూ ఇటూ తిరుగుతూ అరిచాడు. కొత్తలన్నంత కోపంతో ఝాన్సీ మీదికి చెయ్యెత్తాడు. "జాగ్రత్త! నామీద చెయ్యి చేసుకుంటే జాగ్రత్త! తిరిగి నేను కొడతాను" అంది వొణుకుతూన్న పెదవులతో! అతడు ఆశ్చర్యంగా ఆమె కేసి చూశాడు. చెరిగిన జుట్టూ, చెరిగిన బొట్టూ, ఎర్రబడిన మొహంతో కాళికాదేవిలా అనిపించింది. ఒకరకామైన వణుకు పుట్టింది వెన్నులోంచి. ఎత్తిన చేయి దింపేసి, వెనక్కి జరిగాడు. భయమూ, కాలిన చోట మంటకి బాధతో అతనికి మతిపోయినట్లనిపించింది. ఝాన్సీ కేసి చూడాలంటే భయమేసింది. అక్కడి నుంచి వెళ్ళిపోయి ఫ్రిజ్ లోంచి నీళ్ళ సీసా తీసుకుని గడగడా నీళ్ళు త్రాగేశాడు. మంటకి ఓర్చుకోలేక, వాతలు పడ్డ చోట చన్నీళ్ళు పోసుకుంటూ ఉపశమనం పొందాడు.
    ఆ రాత్రి మరింకేమీ జరగలేదు. ఒకరిని ఎడుర్కొవలసోస్తుందేమోనని ఒకరు పడుకున్నట్టు నటించినా , నిద్ర పోలేదు.
    ఝాన్సీ మాములుగా లేచి పన్లు చేసుకుంది, కాలిన చోటల్లా కొబ్బరి నూనె రాసుకుంది. పనకలుకి మాత్రం నీళ్ళు పోసుకోవడం వల్ల బొబ్బలోచ్చేశాయి. బాగా పొద్దెక్కాక లేచాడేమో బద్దకంగా ఉంది. ఝాన్సీ ఎదుటికి రావాలంటే భయపడుతూ తప్పించుకుంటున్నాడు. అంత బాధలోనూ ఝాన్సీ నవ్వుకుంది. "కుక్కకాటుకి చెప్పుదెబ్బ" 'వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి' లాంటి మాటలు గుర్తొచ్చి మళ్ళీ నవ్వుకుంది. పెద్దలు ఎంతో అనుభవపూర్వకంగా చెప్పిన మాటలివని!
    కానీసం కాఫీ అడగడానికి కూడా భయపడుతున్న భర్తని చూసి జాలిపడి, తనే కాఫీ తీసి,కెళ్ళి ఇచ్చింది. గబుక్కున కప్పు నందుకుని , గుటుక్కున తాగేసి , కప్పు నక్కడ పెట్టి జగన్నాధరావు గారింట్లో పనుందనీ మధ్యాహ్నం భోజనానికి కూడా రాననీ చెప్పి త్వరత్వరగా వెళ్ళిపోయాడు పానకాలు.
    మెత్తగా ఉంటే మొత్తుతారన్న మాట! తిరిగి కొడితే కిక్కురుమనరు. పాపం కౌసల్య! ఆవిడకి ఈ సూత్రాలు తెలీకనే , ప్రాణాలు పోగొట్టుకుంది' అనుకుంటూ నవ్వుకుంది ఝాన్సీ.
    
                                                           *    *    *    *

 Previous Page Next Page