ప్రస్తుతానికి మాత్రం ఈ విషయాన్ని మర్చిపోతే మంచిది.
అలా ఒక నిర్ణయానికి రాగానే , మాటమార్చేస్తూ - అంది మధుమతి.
"ఏమిటి డైరెక్టరు గారూ! రషెస్ వేస్తున్నారా ఇప్పుడు?"
"అవునమ్మా - ఇప్పుడే ప్రింట్స్ వచ్చాయి" అన్నాడు రఘుకుల తిలక్.
ఫిల్ముషూట్ చెయ్యగానే , బాగా వచ్చాయనుకున్న షాట్స్ ని ఒకే షాట్స్ గా మార్క్ చేస్తారు. వాటికి లాబరేటరీలో ప్రింట్స్ తీయించి, ఆ ప్రింట్స్ ని ప్రోజెక్టు చేసుకుని చూస్తారు "రషెస్" అంటారు వాటిని.
"అయితే మనమెందుకిక్కడ. మనం వెళ్ళిపోదాం!" అన్నాడు కిశోర్ మధుమతి వైపు సాభిప్రాయంగా చూస్తూ, అతనికింకా ఆశ చావలేదు.
అతన్ని కట్ చేస్తూ అంది మధుమతి - "మీకు అవసరమనుకుంటే మీరు వెళ్ళండి. నేను రషెస్ చూడాలి!"
మొహం గంటు పెట్టుకుని , ఏదో గొణుగుతూ అక్కడినుంచి వెళ్ళిపోయాడు కిశోర్.
తనకంటే వయసులో చిన్నదే అయినా తనకంటే ముందే ఇండస్ట్రిలో కాలుపెట్టింది మధుమతి. నిలదొక్కుకుని పెద్ద్ద హీరోయిన్ అయింది.
సినిమాల్లోకి రాకముందునుంచే మధుమతికి అభిమాని తను.
ఆమె నటనకే కాదు -
ఆమె సోయగానికి కూడా!
కొన్ని సంవత్సరాల నుంచి ఆమె కోసం కలలుకంటున్నాడు తను. కలలోనే వరించాడు ఆమెని కలవరించిపోయాడు.
ఇప్పుడామెకి చేరువయ్యే అవకాశం వచ్చింది. దీన్ని వినియోగించుకుంటాడు తను. వదులుకోడు!
పైగా -
మధుమతికి హరీన్ మీద మనసు వుందని తెలుసు తనకి. కానీ హరీన్ కి ఆమె మీద మనసు వుందో లేదో సరిగా తెలియదు.
వుండే వుంటుంది.
ఎందుకుండదు?
మధుమతి లాంటి అందగత్తె పొందుకోరని మొగాడంటు వుంటాడా ముల్లోకాల్లో కూడా! ఉండడు -ఉండడు!
కానీ హరీన్ సంగతి కిశోర్ కి తెలియదు. సచ్చరితుడు హరీన్. అతని స్క్రీన్, ఇమేజ్ కంటే కూడా ఉద్దత్తాంగా వుంటుంది అతని రియల్ లైఫ్ ఇమేజ్!
అది తెలియని కిశోర్ అనుకున్నాడు.
మొదటినుంచి కూడా అజ్ఞాతంగా తన మనసులో ఒక భావన గూడు కట్టుకుని వుంది.
హరీన్ తనకి ప్రత్యర్ధి! ఏనాటికన్నా అతన్ని దెబ్బతియ్యాలి! ప్రొఫెషనల్ గా, పర్సనల్ గా కూడా!
తనతో వున్న ఈ కాంప్లెక్సు చాలామందికి చిత్రంగానే తోచవచ్చు.
కానీ తన సైకలాజీ ఇది!
ప్రొఫెషనల్ గా హరీన్ స్థానంలో అతను వున్నాడు ఇప్పుడు. మధుమతిని కుడా తను వశం చేసుకుంటే, అప్పుడు హరీన్ ని అన్ని విధాల దెబ్బతీసినట్లవుతుంది. ప్రత్యర్ధిని పాతేసి, సంపూర్ణ విజయం సాధించినట్లవుతుంది.
మధుమతీ - ఇవాళ్టికి తప్పించుకోగలిగావు కానీ ఎంతకాలం నన్ను తప్పించుకు తిరగగలవో చూస్తాను. నాకు దూరంగా వుండటం అంటే సినిమారంగానికి దూరం కావడమే అని నీకు అర్ధమయ్యేలా చేస్తాను.
మధుమతీ - చూస్తూ వుండు!
విసురుగా వెళ్ళి తన కార్లో కూర్చున్నాడు కిశోర్.
కిశోర్ ప్రొజెక్షన్ రూంలోనుంచి బయటికి వెళ్ళిపోగానే మొహమొహాలు చూసుకున్నారు రఘుకుల తిలక్ , ఆదిత్య.
"ప్రొజెక్షన్ మొదలెట్టమందామా సార్?" అన్నాడు ఆదిత్య.
తల పంకించాడు డైరెక్టర్ రఘుకుల తిలక్.
ప్రొజెక్షన్ మొదలయింది. డెత్ వాలీ లో టెలిస్కోప్ కొండమీద తీసిన హెలికాప్టర్ పైటింగ్ సీన్లు కనబడుతున్నాయి స్క్రీన్ మీద.
ఆ తర్వాత తెర మీద కనబడ్డవి సినిమాకోసం తీసిన షాట్స్ కావు. యూనిట్ మెంబర్స్ అందరూ కకావికులై పరిగెడుతున్న దృశ్యం కనబడుతోంది.
లైవ్ షాట్స్ అవన్నీ.
రెప్పవేయడం మర్చిపోయినట్లు చూస్తోంది మధుమతి. సొమ్మసిల్లి కిశోర్ చేతుల్లో వాలిపోయింది తను. తనని నడిపించుకుంటూ హెలికాప్టర్ వైపు తీసుకేళుతున్నాడు కిశోర్.
తమ వెనకగా -
తరుముకోస్తున్నట్లు పరిగెత్తుకోస్తున్నారు ఆటవికులు!
ఏమిటిదంతా?
"ఏమిటిది? ఫ్రీజ్!" అన్నాడు రఘుపతి ఆశ్చర్యంగా. "ఆదిత్యా! వాటీజ్ దిస్?"
గొంతు సవరించుకుని చెప్పాడు కెమెరామేన్ ఆదిత్య -
"సార్ .......ఆరోజున టెలిస్కోప్ కొండమీదికి ఆటవికులు రాగానే మనందరం హుటాహుటిన హెలికాప్టర్స్ లో వచ్చేశాం కదా! అప్పుడు నాకో ఐడియా వచ్చింది. భయానకంగా వున్న ఆ దృశ్యాలని లైవ్ గా షూట్ చేస్తే ఎప్పటికన్నా పనికి వస్తుంది కదా అని షూట్ చేసేశాను."
"నీ సమయస్పూర్తికి మెచ్చుకోవాలి. మంచి పనిచేశావు. ఏక్స్ లెంట్ షాట్స్!" అన్నాడు డైరెక్టర్ రఘుకుల తిలక్ మెప్పుదలగా. "ఒకే........ప్రొసీడ్."
మళ్ళీ తెరమీద దృశ్యాలు కనబడటం మొదలెట్టాయి.
యూనిట్ మెంబర్స్ అందరూ హెలికాప్టర్స్ ని సమిపించేశారు. మధుమతిని హెలికాప్టర్ లోకి ఎక్కిస్తున్నాడు కిశోర్.
ఆ వెనకగా ఆటవికులు ఉరుకులు పరుగులతో కొండకొమ్ముని చేరుకోవడం కనబడుతోంది.
వాళ్ళమధ్య......ఆశ్చర్యంగా చూసింది మధుమతి . వాళ్ళమధ్య ........చీరె కట్టుకుని వున్న ఒక అమ్మాయి!
విచిత్రంగా వుంది ఇది!
ఆ అమ్మాయి పక్కన ......అది ఎవరు?
చటుక్కున లేచి నిలబడింది మధుమతి.
ఎవరు?ఎవరది?
మరుక్షణం ఆమె గొంతుని చీల్చుకువస్తున్నట్లు పెద్ద కేక వెలువడింది.
"మైగాడ్ ........హరీన్! నా హరీన్! చూశారా.........అదిగో అక్కడ! బతికే వున్నాడు నా హరీన్!"
"వాట్? వాట్? వాట్?" అన్నాడు డైరెక్టర్ రఘుకుల తిలక్.
"హరీన్! అదిగో........అక్కడ......కనబడటం లేదూ?"
అంటోంది మధుమతి ఎగ్జయిటెడ్ గా.
"ఫ్రీజ్ చెయ్యండి!" అన్నాడు రఘుకుల తిలక్.
ప్రొజెక్షన్ ఆగిపోయింది. రీలుని కాస్త వెనక్కి తిప్పి, మళ్ళీ ప్రాజెక్ట్ చేశారు.
ఆటవికులు తెరమీద కనబడగానే ఆ దృశ్యం దగ్గర మళ్ళీ ఫ్రీజ్ చేయించాడు డైరెక్టర్. అక్కడ ఫిల్ముని కట్ చేసి మూవియోలాలో పెట్టుకుని చూశారు.
"సందేహం లేదు ........అతను హరీనే!" అన్నాడు కెమెరామెన్ ఆదిత్య.
ఆ ఫిల్ముని ఎన్ లార్జ్ చేయించాడు.
ఆ పెద్ద ప్రింట్స్ లో ఇప్పుడు స్పష్టంగా కనబడుతున్నాడు హరీన్. పులితోలు మొలకి చుట్టుకుని పరమశివుడిలా వున్నాడు!
"అవును .......హరీన్ బతికే వున్నాడు!" డైరెక్టర్ రఘుకుల తిలక్ కూడా.
వెంటనే పరిగెత్తి ఫోన్ దగ్గరకు వెళ్ళిపోయింది. రఘుపతి ఇంకో నెంబరుకు డయిల్ చేసింది.
రఘుపతి సెక్రటరీ లైన్లోకి వచ్చాడు.
"నేను మధుమతిని .......సార్ వున్నారా?" అంది మధుమతి.
"లేదమ్మా! అయన వైజాగ్ వెళుతున్నారు."
"వెళుతున్నారా ........వెళ్ళారా?"
"పదినిమిషాల క్రితం ఎయిర్ పోర్టుకి వెళ్ళారమ్మా!"
వెంటనే రిసీవర్ క్రెడిల్ మీద పెట్టేసింది మధుమతి. రిస్టువాచీలో టైం చూసుకుంది. తర్వాత వేగంగా వెళ్ళిపోయి తన కారులో కూర్చుంది.
ఇరవై నిమిషాల తర్వాత ఎయిర్ పోర్టుని చేరుకుంది కారు.
సరిగ్గా సెక్యురిటీ చెక్ లోకి అడుగు పెట్టబోతున్న రఘుపతికి మధుమతి గొంతు వినబడింది. రొప్పు వినబడుతోంది ఆ గొంతులో -