దానితో తిక్కరేగింది ఏలుగొడ్డుకి. అతన్ని బలంగా వాటేసుకోవడానికి ప్రయత్నించింది.
తప్పించుకోవడానికి , గాల్లోనే పల్టీలు కొట్టాడు హరీన్.
కానీ ఆ ఏలుగ్గొడ్డుకి మామూలు మనుషులకంటే నాలుగైదు రెట్లు ఎక్కువ శారీరక బలం ఉంది. హరీన్ గాల్లో ఉండగానే అతన్ని బంతిని పట్టుకున్నట్లు పట్టేసుకుంది ఎలుగుబంటి.
ఆపట్టు కూడా ఎలాంటి పట్టు?
భల్లూకపుపట్టు అది.
ఆ పట్టులో చిక్కుకుపోయిన హరీన్ ఉపిరి అందలేదు. అదేగనక మరో మనిషి అయివుంటే ఆ ప్రెజర్ కి పక్క ఎముకలు పటపట విరిగి చచ్చి ఊరుకునేవాడే.
కానీ, నిత్యం కసరత్తు చేసే దృడకాయుడు హరీన్. అందుకనే ఆ పీడనని తట్టుకోగలిగాడు.
ఎలుగుబంటి పట్టులోంచి బయటపడటానికి ప్ర్రయత్నిస్తూ అతికష్టం మీద నేలమీదకి జారాడు హరీన్.
ఎలుగుబంటి కూడా తన పట్టువదలకుండానే అతనితో బాటు నేలమీదకి జారింది. హరీన్, ఎలుగుబంటీ ఇద్దరూ కలిసి మల్లయుద్ద యోదుల్ల్లా చుట్టచుట్టుకుని నేలమీద దొర్లడం మొదలెట్టారు. దాని బొచ్చు తనకి గుచ్చుకుంటూ , దాని ముతీ చల్లగా తనని తాకుతూ వుంటే ఒళ్ళు కంపరమెత్తిపోతోంది హరీన్ కి.
దానికితోడుగా ఎలుగుబంటి దగ్గర అదేదో వాసన
ఏమిటది?
స్పురించింది హరీన్ కి.
కల్లు వాసన అది.
ఏ తాటి చేట్తో ఎక్కి ఆటవికులు కట్టిన కుండలు దింపి, కల్లు తాగేసి వుంటుందీ ఏలుగొడ్డు.
బలంగా హరీన్ ని కిందకు దొర్లించి, అతన్ని మేకుతో నేలకు దిగకొట్టేసినట్లు అతని గుండెల మీద ఎక్కికూర్చుంది ఎలుగుబంటి.
ఉపిరంతా వెలుపలికి వచ్చేసినట్లయింది హరీన్ కి. శ్వాస ఆడటం లేదు. ఎలుగుబంటి చేతులు అతని చుట్టూ బిగుసుకుంటున్నాయి.
తక్షణం ఏదో ఒకటి చెయ్యాలి తను.
ఇంక కొద్దిక్షణాలు గడిస్తే తన ప్రాణాలు పోవడం ఖాయం.
దుర్భరమైన గొంతుతో కరుణ ఎలుగుబంటిని అడిలించడం లీలగా వినబడుతోంది హరీన్ కి.
ఏదో ఒకటి చేసెయ్యాలి - ఇప్పుడే.
సినిమాల్లో తనకి అలవాటయిపోయిన స్టంట్స్ గుర్తొచ్చాయి హరీన్ కి.
వెంటనే శరీరాన్ని ఉక్కులాగ చేసేసి, చేతులతో ఎలుగుబంటి రోమ్ముని వెనక్కి నెట్టడం మొదలెట్టాడు. అదే సమయంలో ఒడుపుగా తన కాళ్ళను పోట్టదగ్గరికి లాక్కున్నాడు.
అసలే తాగి తూలుతూ వున్న ఎలుగుబంటి పట్టుదప్పి, వెనక్కి విరుచుకుపడిపోయింది. ఆ పడటం పడటం సరిగ్గా ఎక్కడ పడిందంటే,పోనుపోను ఇరకయిపోయి చిన్న కంతలా వున్న గుహదారికి అడ్డంగా పడిపోయింది. వెంటనే మైకంతో దాని కళ్ళు మూసుకుపోయాయి.
దానితో, సీసామూతికి బిరడా బిగించినట్లు మూసుకుపోయింది గుహదారి.
అది చూస్తూ, సాలోచనగా లేచి నిలబడ్డాడు హరీన్.
అప్పటిదాకా అతనికి కొద్ది దూరంలో నిలబడి భయభ్రాంతులతో చూస్తున్న కరుణ ఒక్క అంగలో అతని చెంతకు చేరి వాటేసుకుంది.
"హారీన్........నీకు ఏమీ కాలేదుకదా!" అంది ఎంతో అభిమానంతో , మొదటిసారిగా అతన్ని ఏకవచనంతో సంబోదిస్తూ.
"ఏమీకాలేదు" అన్నట్లు అనునయంగా ఆమె వెన్ను నిమిరాడు హరీన్. అతను అలా అంటుండగానే, అతని భుజానికయిన గాయం నుంచి స్రవిస్తున్న వెచ్చటి రక్తం ఆమె భుజాన్ని తడపడం మొదలెట్టింది.
"హరీన్!" అంది కరుణ బాధగా.
"గాయం చిన్నదే" అని తేలిగ్గా నవ్వాడు హరీన్.
దుఃఖాన్ని ఆపుకుంటూ ఎలుగుబంటి వైపు చూసింది కరుణ. తర్వాత బెదురుగా 'దారికడ్డంగా పడిపోయింది ఎలుగుబంటి. కదిలిస్తే మళ్ళీ లేచి మనమీద పడుతుందేమో! ఎలాగ?"
"డానికో మార్గం వుంది" అన్నాడు హరీన్ నిర్భయంగా. అంటూనే అక్కడ పడి వున్న రెండు చెకుముకి రాళ్ళను అందుకున్నాడు. వాటిని గబగబ ఒకదానికి ఒకటి తాకిస్తూ రాపిడి కలిగించాడు. ఆ రాపిడికి నిప్పు రవ్వలు ఎగసిపడటం మొదలెట్టాయి. వాటి సాయంతో నారచుట్టిన జంతువు తోకని అంటించాడు.
ఆ చీకటి గుహలో దేదీప్యమానంగా వెలగడం మొదలెట్టింది అది. దాన్ని కాగడాలా ఎడమచేత్తో ఏలుగ్గొడ్డుని అదిలించాడు హరీన్.
వెంటనే భీకరంగా ముక్కుతో శబ్దం చేసి నల్లటి జడలదయ్యంలా లేచి నిలబడింది ఎలుగుబంటి. లేస్తూనే అతని మీద విరుచుకుపడబోయింది.
తన చేతిలోని కాగడాని దానికి అడ్డంగా పెట్టాడు హరీన్.
అడవిమృగాలకి సహజంగానే నిప్పుని చూస్తే చాలా భయం.
హరీన్ చేతిలోని మంటని చూసి సంకోచంగా ఆగింది ఎలుగుబంటి. కానీ కసి పట్టలేకపోయింది అది. అందుకని తెగించి మళ్ళీ ముందుకి దూకింది.
వెంటనే చురచురమని అంటుకుని కాలడం మొదలెట్టాయి దాని వెంట్రుకలు.
దానితో బాధ భరించలేక, గగ్గోలుగా అరుస్తూ అక్కడ నుంచి వేగంగా పారిపోయింది ఎలుగుబంటి.
ధీర్ఘంగా శ్వాసతీసుకుని , "పద కరుణా!" అన్నాడు హరీన్.
వాళ్ళు అడుగుముందుకు వేసేలోపలె చిత్రమైన శబ్దాలేవో వినబడటం మొదలెట్టాయి - అతి దూరంగా.
చెవి ఒగ్గి వినడం మొదలెట్టాడు హరీన్.
* * *
"దేశింగ్!" అంది చిక్ లీ గట్టిగా. "ఈ జింబూరూ ఏడీ? కనబడడెం?"
ఉలిక్కిపడి చూశాడు దేశింగ్. "ఇప్పటిదాకా ఇక్కడే వుండేనే" అన్నాడు ఆదుర్దాగా.
ఇద్దరూ కలిసి చాలాసేపు వెదికారు. కానీ హరీన్ , కరుణా కనబడలేదు.
"నేను చెబుతూనేవున్నానా! మన కళ్ళలో కారంకొట్టి పారిపోయారు వాళ్ళు!" అంది చిక్ లీ ఆక్రోశంగా.
"పోనియ్!.....ఎంత దూరం పోగలరు - ఇట్టేపట్టేస్తాం!" అన్నాడు దేశింగ్ ధైర్యం కోల్పోకుండా.
అంతలోనే అతని దృష్టిని ఆకర్షించాయి బురదలో కనబడుతున్న రెండు జతల అడుగు జడలు. వాటిని సగర్వంగా చిక్ లీకి చూపించాడు దేశింగ్.
"అంటే, రహస్యమార్గం వైపు సాగిపోయారన్నమాట వీళ్ళు" అంది చిక్ లీ సాలోచనగా.
"అవును మరి! ఇంకెక్కడికి పోతారు?" అన్నాడు దేశింగ్. అని, అక్కడే ఉన్న టాం టాం అనే డప్పులాంటిది చేతిలోకి తీసుకుని రహస్య సంకేతాలు పంపుతున్నట్లు ఆపి ఆపి దానిమీద ఏవేవో శబ్దాలు చెయ్యడం మొదలెట్టాడు.
ఆ శబ్దాల సంకేతం ఆ లోయలో వున్న ఆటవికులందరికీ అర్ధమయింది.
"పట్నం ......పిల్లతో ......కలిసి ........
జింబురూ ......రహస్య .....మార్గాన.........
పారిపోతున్నాడు?.........
పట్టుకోండహో!"
కొద్దిక్షణాల తర్వాత, కొన్ని వందలమందికి పరిగెత్తి వస్తున్నట్లు పాదాల సవ్వడి వినబడింది.
దానితో బాటే -
కొన్ని వందల గొంతులు ముక్తకంఠంతో వేస్తున్న కేకలు నినాదాల్లా ఆ లోయలో ప్రతిధ్వనించాయి.
"కొండమకర హారమకరహ్హొహ్హొహ్హొయ్!"
"కొండమకర హారమకరహ్హొహ్హొహ్హొయ్!"
తప్పించుకుపోతున్న జింబురూనీ, పట్నంపిల్ల కరుణనీ పట్టుకుని నిలువునా చీరెయాలన్న కృతనిశ్చయంతో పరుగులు తీస్తున్నారు ఆటవికులు.
24
అక్కడ -
స్టుడియోలో ప్రొజెక్షన్ రూంలో -
తన భుజం మీద పడ్డ కిశోర్ చేతులని విసురుగా నెట్టేసింది మధుమతి. తోకతొక్కిన తాచులా చివాలున లేచి నిలబడింది.
కానీ పట్టువిడవలేదు కిశోర్. మళ్ళీ ఆమెకి చేరువకాబోయాడు.
విహ్వలంగా అటూ, ఇటూ చూస్తూ, మరింత దూరంగా జరిగింది మధుమతి. భయంతో కంపిస్తోంది తను.
చటుక్కున ఆరూం తలుపులు తెరచుకున్నాయి.
లోపలికి రాగానే భద్రంగా ఆ రూం తలుపులకి బోల్టు పెట్టేశాడు కిశోర్ - ముందు జాగ్రత్తగా . కానీ ఆ బోల్టు సరిగా పడదన్న సంగతి అతనికి తెలియదు. బయటనుంచి నెడితే చాలు తెరుచుకుపోతాయి ఆ తలుపులు.
తలుపులు తెరుచుకోవటంతోటే లోపలికి వచ్చేశారు డైరక్టర్ రఘుకుల తిలక్, కెమెరామన్ ఆదిత్యా.
వెంటనే ప్రాణం లేచివచ్చినట్లయింది మధుమతికి. కానీ కిశోర్ మొహం మాత్రం మాడిపోయింది. తను తలపెట్టిన పనికి విఘ్నం కలిగినందుకు పట్టరానంత కోపం వచ్చింది అతనికి. ఆగ్రహాన్ని అదుపులో పెట్టుకోలేక పౌరుషంగా అన్నాడు.
"మేనర్స్ అనేవి వుంటాయని అసలు తెలియదా మీకు. మేమిక్కడ మాట్లాడుకుంటూ వుంటే ముందు వెనకా చూడకుండా జొరబడి వచ్చెయ్యడమేనా? లోపలికి వచ్చేముందు పర్మిషన్ తీసుకోవాలనే జ్ఞానం లేదా?"
అతను అలా మాట్లాడతాడని ఉహించని రఘుకుల తిలక్, ఆదిత్య నివ్వెరపోయి నిలబడిపోయారు.
కిశోర్ మీద కలిగిన కోపాన్ని అణుచుకుంటూ అంది మధుమతి. "మేమేమీ రాచకార్యాలు చర్చించడం లేదులెండి! మీరు రావడం వల్ల ముంచుకుపోయిందేమి లేదు. మంచే జరిగింది."
"ఏమయిందమ్మా?" అన్నాడు రఘుకుల తిలక్ ఆదుర్దాగా.
మధుమతి ఏదో చెప్పబోతుంటే, ఆమెని చేత్తో వారించి, తన పరువు కాపాడమన్నట్లు ప్రాదేయపుర్వకంగా చూశాడు కిశోర్.
అతనివైపు ఒకసారి అసహ్యంగా చూసింది మధుమతి. ఇతను విచక్షణం, వివేకం లేని పశువులాంటి వాడు కావచ్చు.
కానీ ఎంతయినా ఇతను తన సాటినటుడు. ఇతనితో గొడవ పెట్టుకుంటే తనూ గొడవపడుతుంది. అందరికి ఇబ్బందిగా వుంటుంది పరిస్థితి. ఇతని ప్రవ్రుత్తి తెలిసింది కాబట్టి ఇకనుంచి తన జాగ్రత్తలో తను వుండటం మంచిది.