"సర్..........సర్!"
వెనక్కి తిరిగి చూసి ఆశ్చర్యంగా అన్నాడు రఘుపతి.
"ఏమిటి మధూ.......ఏమయింది?"
"సర్.....హరీన్ బతికే వున్నాడు!"
అక్కడున్నవాళ్ళంతా ఆశ్చర్యంగా ఆమె వైపే చూస్తున్నారు.
"మధూ......ఏం జరిగింది? వివరంగా చెప్పు!" అన్నాడు రఘుపతి.
సగం సగం వాక్యాలతోనే, జరిగినదంతా చెప్పింది మధుమతి. అది వినగానే రఘుపతి మొహం స్టూడియోలో ఆర్క్ లైట్ లా వెలిగిపోయింది.
అతను ఎయిర్ పోర్టు నుంచే హోం మినిస్టర్ రంగారావుగారికి ఫోన్ చేశాడు.
లక్కీగా ఇంటిదగ్గరే వున్నాడు హోం మినిస్టర్. అయన రఘుపతికి హైస్కూల్లో క్లాస్ మేట్.
"రంగా .........రఘుపతి హియర్!"
"ఓరి .......నువ్వా! చెప్పరా.....ఎలా వున్నాయ్ నీ సినిమాలు?" అన్నాడు రంగారావు చనువుగా.
"రంగా! చాలా సేరియాస్ వ్యవహారం ఒకటి వచ్చిపడింది"
వెంటనే హోం మినిస్టర్ గొంతు మారిపోయింది.
"రఘూ...........వాట్ హేపెండ్డ్?" అన్నాడు జాగ్రత్తగా.
చెప్పడం మొదలెట్టాడు రఘుపతి.
తర్వాత నిదానంగా అన్నాడు రంగారావు. "మీ హీరో కనబడకుండా పోవటం గురించి నేను విన్నాను. అయితే అతను ఇంకా బతికే వున్నాడన్నమాట. రఘూ........నువ్వు రెండు హెలికాప్టర్స్ అరేంజ్ చెయ్యగలవా? నేను మెరికల్లాంటి పోలీసులని పంపుతాను. అతన్ని వెనక్కి తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలూ చేద్దాం!"
"ఆటవికుల మధ్య చిక్కుకుపోయాడు హరీన్! వాళ్ళు కోపోద్రేకంలో వున్నట్లు తెలుస్తోంది మావాళ్ళు చెప్పేదాన్ని బట్టి ఆలోచిస్తుంటే. అందుకని అయుధాలు అవీ తీసుకుని పకడ్భందీగా వెళ్ళడం మంచిదనుకుంటున్నాను."
"ఆ విషయాలన్నీ మాకు వదిలేయ్!" అన్నాడు రంగారావు.
ఆ తర్వాత కొద్ది నిమిషాలలోనే, డెత్వాలీలోకి వెళ్ళి హరీన్ ని, కరుణనీ రక్షించి తీసుకురావడానికి అన్నిరకాల సన్నాహాలు మొదలయ్యాయి.
25
హరీన్, కరుణనీ తరుముతూ వెళ్ళిన అటవికులతో బాటు చిక్ లీ కూడా పరుగుతీసింది.
అది చూస్తున్న దేశింగ్ పెదిమలు కసితో వంకర తిరిగాయి.
"ఆ జింబూరూగాడంటే చిక్ లీకి ఇంకా మోజు పోలేదు. ఇంకెన్నాళ్ళులే దీని అదిరిపాటు! నేను నాయకుడినయ్యాక ఈ చిక్ లీని సొంతం చేసుకోకపోతే నాపేరు దేశింగే కాదు!" అనుకున్నాడు కచ్చగా.
అలా గొణుక్కుంటూనే మంత్రాల మల్లయ్య దగ్గరికి వెళ్ళాడు దేశింగ్.
అతన్ని చూడగానే ఆదరంగా - "ఏమిటి దేశింగ్?" అని పలకరించాడు మంత్రాల మల్లయ్య.
జేవురించిన మొహంతో అన్నాడు దేశింగ్ -
"కులగురువా ..........జరుగుతున్నదంతా కళ్ళారా చూస్తూ కూడా నిమ్మకు నీరెత్తినట్టు ఎలా ఉండగలుగుతున్నావు నువ్వు? ఆ పట్నం పిల్లని తీసుకుని జింబూరూ రహస్య మార్గాన పారిపోయాడు. వాళ్ళని అలా పారిపొమ్మని ప్రోత్సహించింది. ఈ నాయకుడే! పుత్రవాత్సల్యంతో నాయకుడికి న్యాయాన్యాయాల విచక్షణ నశించింది! నేరాల మీద నేరాలు చేసేస్తున్న ఈ నాయకుడి విషయంలో నీ తీర్పుని వాయిదా వెయ్యడానికి ఇంకే మాత్రం వీల్లేదు. తక్షణం తేలిపోవాలి ఈ విషయం!"
చెయ్యిత్తి అతన్ని వారించాడు కులగురువు.
"ఆవేశపడకు దేశింగ్ .......జింబురూని రహస్యమార్గాన పారిపొమ్మని చెప్పింది నాయకుడే అని అంతగాట్టిగా ఎలా చెప్పగలుగుతున్నావ్?:" అన్నాడు అక్కడ మిగిలివున్న ఆటవికుల హావభావాలు ఓరకంటితో గమనిస్తూ.
"దీనికొక ప్రత్యక్ష సాక్షి వున్నాడు" అన్నాడు దేశింగ్.
"ఎవరది?"
దేశింగ్ కనుసైగనందుకుని, "నేను" అంటూ ముందుకు వచ్చాడు ఒక ఆటవికుడు.
దేశింగ్ కి నమ్మినబంటు అతను.
"జరిగినదంతా వివరంగా చెప్పు!" అన్నాడు దేశింగ్ అతనితో.
"పట్నం పిల్లని తీసుకుని రహస్య మార్గం నుంచి పారిపొమ్మని నాయకుడు జింబురూతో చెబుతుంటే విన్నాను" అన్నాడు ఆ ఆటవికుడు తేలిగ్గా అబద్దం ఆడిస్తూ. తర్వాత దేశింగ్ వైపుకి తిరిగి - "నువ్వు నేర్పిన పాఠం సరిగా ఒప్పచెప్పానా?" అన్నట్లు భావగర్భితంగా చూశాడు.
విజయగర్వంతో మంత్రాల మల్లయ్య వైపు తిరిగాడు దేశింగ్.
అక్కడ వున్న మిగతా ఆటవికులందరూ కూడా మంత్రాల మల్లయ్య వైపు ఆత్రంగా చూస్తున్నారు.
"సరే.....ప్రత్యక్షసాక్ష్యం వున్న తర్వాత ఇంక తప్పేదేముంది నాయకుడు దోషి అని తేలిపోయింది. అతనికి మన న్యాయం ప్రకారం శిక్ష విధించక తప్పదు."
"ఏం శిక్ష?" అన్నారు ఆటవికులందరూ కలిసి, "బతికి వుండగానే చర్మం వలిచేయ్యడం!"
కులగురువు తీర్పు వినగానే, అక్కడున్న కొండలన్నీ కరిగిపోయెంత దీనంగా శోకం పెట్టింది నాయకుడి భార్య "వద్దువద్దువద్దు..........నా భర్తకి అంతటి ఘోరమైన శిక్ష విధించవద్దు. మీకు అతనిమీద కోపం వుంటే , మా ఇద్దరినీ కలిసి కట్టగట్టి చంపెయ్యండి. అంతేగానీ, పగవాడికి కూడా రాకూడని ఆ దుర్భర స్థితిలోకి నా భర్తని నేట్టేయ్యకండి!"
ఆమెని గదమాయించాడు దేశింగ్ "ఆడంగుల ఏడుపులకి ఇది సమయం కాదు . ఊరుకో!"
ఇంకేం మాట్లాడకుండా , విలవిల ఏడుస్తూ నాయకుడి చెంతనే కులబదిపోయింది అతని భార్య.
కులగురువు అజ్ఞాని అందుకుని ఆటవికుడు ఒకడు చురకత్తిని తీసి దానిని రాతిమీద నూరడం మొదలుపెట్టాడు.
నాయకుడు మాత్రం జరుగుతున్నదంతా నిర్వికారంగా చూస్తూ నిలబడి ఉన్నాడు.
నాయకుడి దగ్గరికి వచ్చి కత్తినేత్తాడు ఆటవికుడు.
"అగు" అన్నాడు మంత్రాల మల్లయ్య హటాత్తుగా.
శిలావిగ్రహంలా నిలిచిపోయాడు ఆటవికుడు.
అందరూ ప్రశ్నార్ధకంగా మంత్రాల మల్లయ్యవైపు చూడటం మొదలెట్టారు.
కళ్ళపైన చెయ్యి పెట్టుకుని, కొండకొమ్ము వైపు చూస్తున్నాడు మంత్రాల మల్లయ్య.
దానితో అందరి చూపులు కొండ కొమ్మువైపుకి తిరిగాయి.
కొండకొమ్ము మీద నుంచి మహావృక్షంలా పైకి ఎగసిపోతోంది దట్టమైన పొగ.
క్రమంగా ఆ పొగ సన్నబడి నల్లటి స్థంభంలా కనబడటం మొదలెట్టింది -
మరికొద్దిసేపటి తర్వాత, ఆ స్తంభాన్ని ముక్కలుగా నరికి గాల్లోకి విసిరేస్తున్నట్లు -
వలయాకారంగా , ముక్కలు ముక్కలుగా పైకి వెళ్ళిపోవడం మొదలెట్టింది.
మరునిమిషంలో మరింత పలచబడింది. పొగ ధూమపానం చేస్తున్న వ్యక్తీ ఎవరో పొగని రింగులు రింగులుగా వదులుతున్నట్లు -
ఆ తర్వాత మళ్ళీ ఒక్కసారి గుప్పుమని ఎగసింది.