వైశాలికి ఉన్న అపారమయిన తెలివితేటలతో తన వ్యాపారాన్ని వృద్ది చేసుకోవాలి.
అదే తెలివితేటలతో ఏదో ఒకరోజున మెకానిక్ గాణ్ణి మట్టు పెట్టాలి. మెకానిక్ కంటే వైశాలి తెలివితేటలు ఎక్కువ అన్న విషయం ఇప్పటికే రెండుసార్లు రుజువయింది. తనకి తన జానకిని గుర్తు తెచ్చే వైశాలిని తను ఎలాగయినాసరే పెళ్ళి చేసుకోవాలి!
త్రీ ఇన్ వన్ స్ట్రాటెజీ!
ఆ స్ట్రాటెజీలో మొదటి భాగంగా వైశాలిని తన ఆర్గనైజేషన్ లో చేర్చుకున్నాడు.
కానీ....తన ఆలోచనలని తలక్రిందులు చేసేస్తూ....
ఈ అమ్మాయి మెకానిక్ మనిషేనని తేలిపోయింది.
మళ్ళీ ఒక్కసారిగా మెదడుని మిక్సీలో వేసినట్లు అల్లకల్లోలమైపోయింది మనసు.
ఇంతలో మహాజన్ సెక్రటరీ ఒక పొడుగాటి కవరు తెచ్చి అందించింది అతనికి. ఆమె వెళ్ళాక విప్పి చూశాడు మహాజన్.
అది ఆల్బర్ట్ పింటో దగ్గర్నుంచి. ఆ డిటెక్టివ్ దగ్గర్నుంచి వచ్చిన రెండో రిపోర్టది.
చదవడం మొదలెట్టాడు మహాజన్.
"మీరు కోరినట్లు వైశాలి రూమ్ లోకి ఆమె లేనప్పుడు వెళ్ళాను. అక్కడ దొరికిన సాక్ష్యాధారాల ప్రకారం వైశాలి మెకానిక్ మనిషి అనడంలో సందేహం ఏమీలేదు." అదీ రిపోర్టు సారాంశం!
రిపోర్టుతో బాటు కొన్ని ఉత్తరాలూ ఫోటోలూ జతచేసి ఉన్నాయి. ఆ ఉత్తరాలు చదివితే మెకానిక్, వైశాలీ తీవ్రమయిన ప్రేమలో పడ్డారనిపిస్తుంది చదివిన వాళ్ళెవరికయినా!
ఆ ఫోటోలు మెకానిక్ వి.
అతను బీచ్ లో స్విమ్మింగ్ ట్రంక్స్ వేసుకుని ఉన్నప్పుడు తీసిన ఫోటోలు అవి. కండలు తిరిగి వుంది మెకానిక్ శరీరం!
కెమేరావైపు చూస్తూ సెక్సీగా నవ్వుతున్నాడు అతను.
ఎవరు ఆ ఫోటోలు తీసి వుంటారు?
ఇంకెవరు? వైశాలి! సందేహం లేదు!
పెట్రోలు పోసి అంటించినట్లు భగ్గుమని మండింది మహాజన్ గుండె.
అదే సమయంలో స్వింగ్ డోర్ తెరుచుకుని లోపలికి వచ్చింది వైశాలి గ్రేస్ ఫుల్ గా నడుస్తూ.
అప్పుడు స్ఫురించింది మహాజన్ కి- వైశాలికీ, జానకికీ పోలిక ఎక్కడో!
అవే చూపులు...
అదే నడక...
వైశాలి చూపులూ. నడక అచ్చం తన జానకినే గుర్తుతెస్తాయి.
ఉత్సాహంగా కనబడుతోంది వైశాలి.
"ఏమిటి?" అన్నాడు మహాజన్ వైశాలివైపు పరిశీలనగా చూస్తూ, చిరునవ్వుతో ఫైలు ఒకటి మహాజన్ ముందు పెట్టింది ఆమె.
సీరియస్ గా ఫైల్లోని పేపర్స్ తిరగేసి చూశాడు మహాజన్. కొత్త డీల్ ఒకటి. మెహబూబ్ ఖాన్ అండ్ కంపెనీతో -
ఆ డీల్ వల్ల మహాజన్ కంపెనీకి ఎంత లాభం వచ్చేదీ వివరంగా రాసివుంది ఫైల్లో! ప్రతి చిన్న డిటెయిలూ జాగ్రత్తగా వర్క్ అవుట్ చేసి రాసి వుంచింది వైశాలి.
"ఇందులో నీకెంత వస్తుంది కమీషన్?" అనిపించింది మహాజన్ కి. కానీ అతనా మాటలు పైకి అన్లేదు.
పరీక్షగా ఆమె వైపు చూశాడు.
ఎత్తుగా కనబడుతోంది ఆమె వక్షం, జానకి వక్షాన్నే గుర్తు తెస్తూ.
అందాన్ని రేపట్లోగా ఒక్కసారి అనుభవించి, ఆ తర్వాత సజీవ సమాధి చేయించాలి అలనాడు అనార్కలీని చేయించినట్లు!
తను వైశాలికి సమాధి కట్టించాలి!
రేపట్లోగా!
తప్పదు!
తన భావాలు ఏవీ పైకి కనబడకుండా పేపర్స్ మీద సంతకాలు పెట్టాడు. మళ్ళీ చిరునవ్వు నవ్వి వెళ్ళిపోయింది ఆమె.
మహాజన్ ఊహించినట్లుగానే, మర్నాడు వైశాలి అకౌంట్ లో మరో లక్ష డిపాజిట్ అయింది.
అది మహబూబ్ ఖాన్ వేసి వుంటాడని ఎవరూ చెప్పకుండానే గ్రహించాడు మహాజన్. అయినా కూడా కూల్ గా అన్నాడు వైశాలితో ఆరోజు మధ్యాహ్నం.
"యూ ఆర్ ఆన్ ఎక్స్ లెంట్ వర్కర్ వైశాలీ! యూ ఆర్ ఆన్ అస్సెట్ టూద ఆర్గనైజేషన్. అందుకని నీకు ప్రమోషన్ ఇద్దామనుకుంటున్నాను. ఆ సందర్భంలో ఇవాళ మనిద్దరం గెస్ట్ హౌస్ కి వెళుతున్నాం. ప్రమోషన్ తాలూకు డిటెయిల్స్ అన్నీ అక్కడ నీకు తెలుస్తాయి. ఓ.కే?"
సంతోషంతో వెలిగిపోయింది వైశాలి మొహం.
"ఓ.కే. బాస్! అండ్ థాంక్యూ సర్! అంది ఆనందంగా.
చిరునవ్వుతో తలపంకించి, యూకెన్ గో హోమ్ నౌ! సాయంత్రం గెస్ట్ హౌస్ లో చిన్న పార్టీ వుంటుంది. డ్రెస్ అయి రా!" అన్నాడు.
తన సంతోషం అంతా తన నడకలో కనబడిపోతుండగా వెళ్ళిపోయింది ఆమె.
అంతే!
ఆ వెళ్ళడం వెళ్ళడం వైశాలి మళ్ళీ కనబడలేదు మహాజన్ కి.
ఆమె ఆ రాత్రికి గెస్ట్ హవుస్ కి రాలేదు కూడా!
ఆమె ఇప్పుడు ఓపెన్ గా మెకానిక్ పక్షంలో చేరిపోయి వుంటుందని ఊహింధాడు మహాజన్.
కానీ -
చెప్పా పెట్టకుండా అంత హఠాత్తుగా తన కంపెనీలో పనిచేయడం మానేసింది!
వాళ్ళ విషయం తనకి తెలిసిపోయిందన్న సంగతి వాళ్ళకు తెలిసిపోయిందా?
"ఏమో!"
* * *
తలుపులు మళ్ళీ దబదబ కొట్టారు ఎవరో.
"పోలీసులే అయి వుంటారు. అందులో సందేహం లేదు" అన్నాడు వామనరావు లైటు వేస్తూ.
కంప్యూటర్ ని మించిన వేగంతో ఆలోచిస్తోంది దినకర్ మెదడు, 'ఈ విపత్కర పరిస్థితిలో ఏం చెయ్యాలా?' అని. అతని కళ్ళు వేగంగా కదులుతూ ఆ గదిని అంగుళం అంగుళం పరిశీలిస్తున్నాయి. గది మధ్యలో గచ్చు లేచిపోయి, ఒక అయిదారు అడుగుల మేర, రెండడుగుల లోతున పెద్ద గుంటలా ఏర్పడివుంది. దాన్ని మనసులోనే నోట్ చేసుకున్నాడు దినకర్.
ఉన్నట్లుండి తలుపు కొట్టడం ఆగిపోయింది. బయట అయిదారు జతలకాళ్ళు అటూ ఇటూ తిరుగుతున్నట్లు సవ్వడి.
మళ్ళీ నిశ్శబ్దం.
ఊపిరి బిగబట్టి చూస్తున్నాడు దినకర్.
ఇంతలో...
ఒకవైపు గోడకి వున్న ఒక కంత దగ్గరనుంచి కొద్దిగా మట్టి రాలి కింద పడింది.
చటుక్కున తిరిగి అటువైపు చూశాడు అతను.
ఇంకో మట్టిబెడ్డ రాలిపడింది కంత దగ్గరనుంచి.
ఆ తర్వాత.
నెమ్మదిగా ఎలుకపిల్ల దొలుస్తున్నట్టు కంతని పెద్దది చేస్తూ ఒక తుపాకి బారెల్ నెమ్మదిగా లోపలికి రావడం కనబడింది.
ఒక్క ఉదుటున లేచాడు దినకర్. వృద్దుడయిన వామనరావు చెయ్యిపట్టుకుని బరబర లాక్కెళ్ళి ఆ గుంటలోకి తోశాడు.
తర్వాత, పాతకాలపు డైనింగ్ టేబుల్ ని తలక్రిందులు చేసి దాన్ని గుంట దగ్గరికి లాగాడు. వెల్లకితలా బడ్డ నాలుగుకాళ్ళ జంతువులా వుంది ఆ టేబుల్.