Previous Page Next Page 
వెన్నెల మెట్లు పేజి 29

 

    "కానీ ఇప్పుడు రోజులు మారలేదా? మెడిసిన్ చదివి వూరికే కూర్చోవడం..."
    
    "అసలు నువ్వు ఉద్యోగం చెయ్యాల్సిన అవసరం ఏమిటి? పుష్కలంగా రెండుచేతులా సంపాదిస్తున్నాను నేను! ఇంక నువ్వు గూడా హైరానా పడిపోతూ, ఒళ్ళు విరుచుకుని సంపాదించటం ఎవరి కోసం? నో! ప్రతిమా! నేను సంపాదిస్తాను! ఇంకా ఇంకా సంపాదిస్తాను. మనమే కాదు, మన పిల్లలూ, మన పిల్లల పిల్లలు కూడా కాలు మీద కాలు వేసుకు కూర్చుని, కారు మీద కారు కొనుక్కోవడానికి సరిపోయేటంత సంపాదిస్తాను. అంతేగానీ, నిన్ను ఉద్యోగం చెయ్యనివ్వను! నెవర్!"
    
    నిశ్చలంగా వింటోంది ప్రతిమ.
    
    "నువ్వు మహారాణిలాగా ఇంట్లోనే కూర్చోవాలి, ప్రతిమా! రేపు మనకీ పిల్లలు పుడతారు. వాళ్ళకీ నీ శ్రద్ద కావాలి. సంరక్షణ కావాలి. నాతో సమంగా నువ్వు కూడా బయట ఎక్కడెక్కడో తిరిగి, రాత్రికి నీరసంగా, తోటకూరకాడలా వడిలిపోయి వచ్చి విసుక్కుంటూ, కసురుకుంటూ ఉంటే ఏమయిపోతారు మన పిల్లలు?"
    
    సర్వస్వం పోగొట్టుకున్న దానిలా ఉంది ప్రతిమ మొహం.
    
    "అంతేకాదు, ప్రతిమా! బజారున పడ్డ ఆడదాని మీద మొగాళ్ళు ఎలాంటి కామెంట్స్ చేస్తారో నాకు తెలుసు. ఈ మనుషులది, కామెంటాలిటీ ప్రతిమా!" అన్నాడు శ్రీరాం ఆవేశంగా సౌందర్యని చూపించి కన్ను కొడుతూ, "దీని సీటు చూడు! టెంప్టింగ్ కర్వ్స్ యార్!" అని అహ్లువాలియా కామెంట్స్ చెయ్యడం గుర్తొచ్చింది అతనికి. సౌందర్య కోసం ఏదో ఒక పని కల్పించుకుని తన ఆఫీసుకి వచ్చే కస్టమర్సు గుర్తొచ్చారు.
    
    ఎక్కడుందో సౌందర్య ఇప్పుడు!
    
    "డాక్టరుగా పని చెయ్యడమంటే అది చాలా నోబుల్ ప్రొఫెషన్. బజారున పడటం ఎలా అవుతుందీ?" అంది ప్రతిమ ఆశ్చర్యంగా.
    
    "డాక్టరైనా, యాక్టరైనా అంతే! ఆడది ఒకసారి బతుకు తెరువు కోసం గడప దాటిందంటే....చులకన అయిపోతుంది. చదువు కోసం కాలేజీకి వెళ్ళడం అది వేరు."
    
    "నిజంగా అంటున్నారా?"
    
    "ముమ్మాటికీ నిజం!"
    
    శూన్య దృక్కులతో కాసేపు చూస్తూ ఉండిపోయింది ప్రతిమ. తర్వాత నెమ్మదిగా అంది.    
    
    "మరి అయిదేళ్ళ చదువు వృధా అయిపోదా"
    
    "వృధా ఎందుకవుతుంది? నా భార్య ఎం.బి.బి.ఎస్ చదివింది అని చెప్పుకోవడం నా హోదాని పెంచుతుంది. సికింద్రాబాద్ క్లబ్బులో నా స్టేటస్ నీ డిగ్రీవల్ల మరో వంద డిగ్రీలు పెరుగుతుంది. జీవితంలో కొన్ని అంతే! అవసరాలను తీర్చడంకంటే స్టేటస్ ని పెంచడానికే ఎక్కువ పనికివస్తాయి, ప్రతిమా! నిజం! కిలో కూర కొనుక్కోవడానికి తూగలేని వాళ్ళు ఇన్ స్టాల్ మెంట్సు మీద ఫ్రిజ్ కొని పెట్టుకుంటున్నారే! ఎందుకు? స్టేటస్ కోసం! అలాగే ఇది! నిజానికి మనకి కారు అనవసరం! స్కూటరు చాలు! కానీ కొన్నాం ఎందుకు? పరపతి పెరగడానికి! డ్రాయింగ్ రూంలో మంచి పేము కుర్చీలు ఉంటే కాలం గడిచిపోతుంది కానీ చిప్పన్ డేలు సోఫాలు కొన్నాం. ఎందుకు? స్టేటస్ మరింత పెరగడానికి! మనకి డాబాయిల్లు చాలు! కానీ మేడ ఉన్న బంగళా కట్టించుకున్నాం! ఎందుకంటావ్, మన అంతస్థు పెరగడానికి! గారేజులోకి కారూ, డ్రాయింగ్ రూంలోకి చిప్పన్ డేల్ ఫర్నిచరూ ఎలాగో -బెడ్ రూంలోకి డాక్టర్ భార్య అలాగే స్టేటస్ పెంచడానికి! దట్సాల్!"
    
    "అంతేనా?" అంది ప్రతిమ నిస్పృహగా.
    
    "అంతే మరి! నువ్వు చదివిన చదువు వృధా ఏమీ అయిపోదు. మన పిల్లలకి జలుబు చేస్తే మందు వెయ్యడానికీ, నాకు ప్రేమజ్వరంతో టెంపరేచర్ పెరిగిపోతే తగ్గించడానికీ పనికివస్తుందిలే!" అన్నాడు నవ్వుతూ.
    
    "మీరు చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు. నా చదువు మన ఇంటికే పరిమితమైపోతే..."
    
    "ప్రతిమా! నీకు నిజంగా జాబ్ చెయ్యాలని ఉందా?"
    
    వెంటనే అవునన్నట్లు తల వూపింది ప్రతిమ.
    
    "మనస్ఫూర్తిగా?"
    
    "అవును."
    
    "నాకు మనస్ఫూర్తిగా నువ్వు ఉద్యోగం చెయ్యకూడదని ఉంది. మరి ఎవరి ఇష్టం నెగ్గాలి?"
    
    కొద్ది క్షణాలు ఆగి, "మీ ఇష్టమే!" అంది ప్రతిమ. ఆ గొంతులో స్పష్టత లేదు. నిరుత్సాహంగా ఉంది.
    
    సిగరెట్ వెలిగించుకున్నాడు శ్రీరాం. మళ్ళీ అతను ప్రతిమ వైపు తిరిగేసరికి, ఆమె మోకాళ్ళ మీద తల ఆనించి ఉంది. లోకంలో ఉన్న విచారమూ, బాధా, నిరుత్సాహమూ అంతా ఆమె కనురెప్పలకిందా, కనుబొమల ముడిలో, పెదవి వంపులో కనబడిపోతున్నాయి. సన్నగా వణుకుతున్నాయి ఆమె పెదవులు.
    
    వెంటనే ప్రతిమని దగ్గరికి లాక్కున్నాడు శ్రీరాం. ప్రేమగా ఆమె వెన్ను నిమురుతూ, "ఐ లవ్ యూ! ఐ లవ్ యూ డియర్!" అన్నాడు.
    
    ప్రతిమ మాట్లాడలేదు.
    
                                                                * * * * *
    
    మరునాడు-
    
    కొంచెం ముభావంగా ఉన్న ప్రతిమని ప్రసన్నం చేసుకోవాలనుకున్నాడు శ్రీరాం. అందుకని బుంగమూతి పెట్టుకుని అలిగి కూర్చున్న చిన్న పిల్లని వూరడిస్తున్నట్లు -
    
    "కమాన్ ప్రతిమా! టుడే ఐ విల్ టేక్ ఇట్ ఈజీ! ఆఫీసుకి డుమ్మా కొట్టేస్తాను. నువ్వు నాతో రా! నీకు ప్రపంచం చూపిస్తాను. నేరుగా వెళ్ళిపోయి కొత్త కప్ బోర్డు కొందాం. ఆ తరవాత అబిడ్స్ అంతా తిరిగి కప్ బోర్డ్ పట్టనన్ని చీరెలు కొందాం! తరవాత నగల షాపులో మంచి నెక్లెస్ కొనిస్తాను నీకు. వోకే? ఆ తరవాత రేసెస్ కెళదాం! ఆ తరవాత ముందే చెప్పడం ఎందుకు? కమాన్ యార్! వీ విల్ పెయింట్ ద టవున్ రెడ్! చెడతిరిగేద్దాం కమ్!" అన్నాడు.
    
    ఉత్సాహం లేని చిరునవ్వు నవ్వింది ప్రతిమ. "ఇంకోరోజు వెళదాం."    

    "ఎందుకని?"
    
    "ఇవాళ ఎందుకో నాకంత బాగులేదు."
    
    "అందుకే మనం బయటికెళ్ళి సరదాగా తిరగాలి. లే!"
    
    "......"
    
    "లే!" అన్నాడు అతను ఖచ్చితంగా.
    
    పెద్ద ఇంట్రెస్టు లేకుండా లేచింది ప్రతిమ. చీరె మార్చుకుంది.
    
    శ్రీరాం పెదిమ విరిచాడు.
    
    "ఇలా కాదు కట్టుకోవాల్సింది. ఇంకొంచెం కిందికి, ఫ్యాషనబుల్ గా కట్టుకో! స్మాషింగ్ గా కనపడాలి నువ్వు! మన ఫ్రెండ్సందరూ హైబ్రో సొసైటీ! వాళ్ళని మించిపోయేంత మోడరన్ గా ఉండాలి నువ్వు!"

 Previous Page Next Page