Previous Page Next Page 
ప్రేమ పురాణం పేజి 29

 

    "హోరి చవటాయీ......! నీ రష్యన్ జోకులు చెప్పడానికి ఇదా అదును?" అన్నాడు శేషు ఆరోపణగా.
    
    "పోనీ కాసిని ఐరిష్ జోకులు చెప్పి వుండాల్సిందా?" అన్నాడు జెయ్ చంద్ర.
    
    "నా మొహమేం కాదూ! సందర్భశుద్ధి లేకపోవడం అంటే యిదే యిదే!"
    
    "ఏదోరా! సితార కనబడేసరికి నా బుర్ర పనిచేయడం మానేసింది" అన్నాడు జెయ్ చంద్ర వున్న విషయాన్ని ఒప్పేసుకుంటూ.
    
    "ఆ తరువాయి భాగం చెప్పు సీతారామలక్ష్మీ?" అన్నాడు శేషు సీరియస్ గా.
    
    చెప్పడం మొదలెట్టింది ఆమె.
    
    "మీ అమ్మ చెప్పినదాని ప్రకారం ఆమెకి ఊళ్ళో పెద్ద నెట్ వర్క్ వుంది. దాని సాయంతో నా గురించిన సమస్తమయిన సమాచారం సేకరించేసిందటా ఆమె! నేను మిమ్మల్ని అందం ఎర చూపించి వలలో వేసుకున్నానట! నేను బొత్తిగా సిగ్గూ, లజ్జాలేని దాన్నట! డబ్బు కోసం గడ్డీ గాదం తింటానట! నీతీ జాతీ లేని దాన్నట! తను గనక తల్చుకుంటే అసలు నేను ఇండియాలోనే లేకుండా చేయగలదట! ఇంకా తలుచుకుంటే నన్ను నిలబెట్టి కొనెయ్యగలదుట! అలా అన్నేసి మాటలనేసినా మీద యిది విసిరికొట్టి వెళ్ళిపోయింది" అంది సితార కోపాన్ని ఆపుకుంటూ.
    
    "ఏం విసిరికొట్టింది?" అన్నాడు జెయ్ చంద్ర కుతూహలంగా.
    
    "ఇదిగో! ఇదీ....." అందామె చెయ్యిముందుకి జాస్తూ.
    
    ఆమె చేతిలో ఏదో కాయితం కనబడింది.
    
    అది చెక్కు! అందులోనూ బ్లాంక్ చెక్కు!
    
    కింద లేడీ డాక్టర్ గారి సంతకం మాత్రం వుంది.
    
    కానీ అంకె వేసి లేదు.
    
    "నీ ఇష్టం! నీకెంత కావాలో ఆ అంకె వేసుకుని క్యాష్ చేసుకో! కానీ నా కొడుకుని మాత్రం వదిలెయ్యి అనేగా దాని అర్ధం?" అంది ఆమె రోషంతో వూగిపోతూ.
    
    "అవును" అన్నాడతను క్లుప్తంగా.
    
    "మీరు తక్షణం ఈ చెక్కుని తీస్కెళ్ళి మీ అమ్మకు యిచ్చెయ్యండి! నేను నిప్పులాంటి మనిషినని మీ అమ్మకు అర్ధమయ్యేటట్లు చెప్పండి" అంది సితార.
    
    మారుమాట్లాడకుండా చెక్కుని అందుకున్నాడతను.
    
    విసవిసా నడిచి అక్కడ్నించి వెళ్ళబోయింది సితార.
    
    ఆమె వెనకే గబగబా వెళ్ళాడతను. "ఒక్కసారి నీతో మాట్లాడాలి" అన్నాడు.
    
    "ఇప్పుడు మాట్లాడుతూనే వున్నారుగా?" అంది.
    
    "ఇక్కడకాదు. ఏకాంతంగా"
    
    "అది కుదరదు"
    
    "అర్జెంటు! అత్యవసరం......బహుత్ జరూర్"
    
    "నాకలాంటివి ఇష్టంలేదు"    

    "నీతో మాట్లాడకపోతే నేను చచ్చిపోతాను"
    
    ఠక్కున ఆగిపోయింది ఆమె.
    
    "నిజంగానే! నువ్వు నాతో రాకపోతే నేను ఆత్మహత్య చేసేసుకుంటా" అన్నాడు స్థిరంగా.
    
    "అంతా ఉత్తదే" అంది సితార.
    
    "కాదు నిజంగానే" అన్నాడతను.
    
    "నేన్నమ్మను" అంది.
    
    "నమ్ముతావు! నా శవాన్ని చూశాక......"
    
    ఈసారి ఆమె కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
    
    "మీకు పుణ్యముంటుంది! అంత మాట అనకండి" అంది కంపిస్తున్న గొంతుతో.
    
    "మరి నీవు నాతో రావాలి" అన్నాడు.
    
    "ఎక్కడికి?"
    
    "సంజీవయ్యపార్కుకి" అన్నాడతను అట్టే ఆలోచించకుండా.
    
    "ఏమిటీ?" అంది సితార నిర్ఘాంతపోతూ.
    
    "అవును సంజీవయ్య పార్కుకి" అన్నాడతను ఈసారి స్థిరంగా.
    
    "ఎందుకు?"
    
    "వచ్చాక చెబుతా"
    
    "నాకు ముద్దులు పెట్టుకోవడం అవీ అంటే ఎలర్జీ."
    
    "మరి పెళ్ళయ్యాక ఎలా?"
    
    "అప్పటికి అలవాటైపోతుంది."
    
    "ఇప్పట్నుంచీ ప్రాక్టీస్ చేస్తేనే అప్పటికలవాటవుతుంది. నిన్ను ముద్దు పెట్టుకుంటానని ఎందుకనుకున్నావ్?"
    
    "మరి పార్కుకి తీసుకెళ్ళాక ఊరుకుంటా వేమిటి?"
    
    దానికి ఏం చెప్పాలో తోచక అటూ ఇటూ చూశాడతను.
    
    పరిస్థితులను ఆకళింపు చేసుకున్న వ్యవహారవేత్తగా అక్కడ సీన్లో లేకుండా డిస్సాల్వ్ అయిపోయాడు శేషు.
    
    జెయ్ చంద్ర తాలూకు కుక్క మాత్రం పోలీసు సెంట్రీలా వాళ్ళిద్దర్నీ పట్టిపట్టి చూస్తోంది.
    
    "ఆ మాట్లాడేదేదో ఇక్కడే మాట్లాడొచ్చుగా?" అంది సితార అర్ధవంతంగా.
    
    "మా సీజర్ కి ప్రేమ డైలాగులు నచ్చవు" అన్నాడతను కుక్కవైపు చూస్తూ.
    
    "ఇదిగో! కుక్క తోకని కదిలించాలిగానీ, తోకే కుక్కని కదిలించేలా వుండకూడదు" అంది సితార హెచ్చరిస్తూ.
    
    "సరే అయితే" అని ఒక్కడుగు ముందుకి వెయ్యబోయాడు జెయ్ చంద్ర.
    
    ఒక్క అంగలో లేచి వాళ్ళమీదికి దూకింది సీజర్ అనబడే ఆ కుక్క. ఈలోగానే అల్లంత దూరంలో రాంపండు వస్తూ కనబడ్డాడు.
    
    "రేపు మధ్యాహ్నం! బాటనీ క్లాసు - సంజీవయ్యపార్కు - నా మీద ఒట్టే" అన్నాడు జెయ్ చంద్ర టెలిగ్రాఫిక్ భాషలో.
    
    సితార ఏం జవాబు చెప్పకుండానే అక్కడ్నించి వెళ్ళిపోయింది.
    
                                                              * * *
    
    సితారకి దారుణంగా వార్నింగ్ ఇచ్చేశాక, ద్విగుణించిన ఉత్సాహంతో కాలేజీకి వెళ్ళిపోయాడు జెయ్ చంద్ర.
    
    వెళ్ళగానే అతనికి భూతపిల్లి దగ్గర్నుంచి కబురొచ్చింది.
    
    భూతపిల్లి అంటే వాళ్ళ ప్రిన్సిపాల్ గారు.
    
    ఆయనలో స్పెషాలిటీ ఏవిటంటే - ఆయన ఒంటిమీద ఒక్క వెంట్రుక కూడా వుండదు. (కనీసం అందరికి కనబడేమేర!)

 Previous Page Next Page