Previous Page Next Page 
కొత్తమలుపు పేజి 30

    సుమిత్ "అయన వచ్చారండి....ఇక్కడే వున్నారు....ఇదిగో ఈయనె" అంటూ కుర్చీలో కూర్చున్న కలెక్టరు భర్తను చూపిస్తూ అన్నాడు.
    ఒక్క క్షణం అంతా నిశ్చేష్టులయిపోయారు.......హెడ్ మిస్ట్రెస్ కలవరపడిపోయి....సుమిత్ వాటిజ్ దిస్.....ఆర్ యూ జోకింగ్" అంది చాలా సీరియస్ గా.
    "నో మిస్....హి యీజ్ మై ఫాదర్ యు కెన్ అస్క్ మై మదర్" అన్నాడు మరోసారి తొణుకు బెణుకు లేకుండా.
    ఈసారి హెడ్ మిస్ట్రెస్ మొహం మరింత నల్లబడిపోయింది. జరుగుతున్న దానితో సంబంధం లేనట్టు నిశ్చలంగా నిలబడిన రూప వంక ఆవిడ కోపంగా చూసింది. కలెక్టరుగారేమో తెల్లపోయి ఆశ్చర్యంగా చూస్తూ నిలబడి పోయింది. రూప ఏ క్షణమైనా స్టేజిమీద చూశాడో ఆ క్షణంలోనే కలెక్టరు భర్త మొహం కళావిహినమయింది. ఇప్పుడది కాస్త గుర్తుపట్టలేనంతగా నల్లగా మాడిపోయింది.
    "టిచర్.....వాటిజ్ దిస్? పెద్ద మనుషులతో వేళాకొళమా, సుమిత్ కి కలెక్టరుగారి భర్త తండ్రేమిటి? ఐ విల్ టేక్ యాక్షన్ ఆన్ హిమ్ " గొంతు నొక్కిపట్టి రహస్యంగా అంటూ బెదిరించింది కఠినంగా.
    అనుపమాదేవి ఇప్పటికి తేరుకుంది. సుమిత్ వంక రూపవంక, భర్త వంక చూసింది. గుర్తుపట్టలేనంతగా మాడిపోయిన భర్త మొహం చూడగానే ఆమెకి ఏదో అనుమానం తొంగి చూసింది.
    "సుమిత్ ఆర్ యూ ష్యూర్ దట్ హి ఈజ్ యువర్ ఫాదర్" అంది సుమిత్ ని చూస్తూ.
    సుమిత్ ఆమె వంక సూటిగా చూస్తూ "యస్ మేడమ్" అన్నాడు.
    "హు టోల్డ్ యూ?"
    "మై మదర్ టోల్డ్ మీ"
    "హావ్ యూ నాట్ సీన్ హిమ్ బిఫోర్ ?" మళ్ళి అడిగింది అనుపమాదేవి.
    "నో దిసీజ్ ది ఫస్ట్ టైమ్ ఐ హావ్ సీన్ హిమ్" అన్నాడు సుమిత్.
    ఆవిడ ఈసారి నిశ్చలంగా నిలబడిన రూప వంక చూసి "టిచర్.....వాటిజ్ దిస్!? సుమిత్ చెబుతున్నది నిజమా.....మావారు మీకు ......భర్తా....ఎలా?" వచ్చిరాని తెలుగులో పట్టి పట్టి అంటు ఆశ్చర్యంగా అడిగింది.
    రూప తలెత్తి సూటిగా అనుపమాదేవి కళ్ళలోకి చూసింది. "మేడం ఐ నెవర్ సేడ్ దట్ హి ఈజ్ మై హస్బండ్.....హి ఈజ్ ఫాదర్ టు మై సన్....దట్సాల్" అంది.
    అనుపమాదేవికి అర్ధమైంది.
    "ఓ....ఐ....సీ అంది సాలోచనగా భర్త వంక చూస్తూ. సురేష్ పరిస్థితి దుర్భరంగా వుంది. అందరిముందు అంత అవం,అవమానం అయన సహించలేకపోయాడు. భార్య చూపులు ఎదుర్కోలేకపోయాడు. మాడిపోయిన మొహంతో చటుక్కున లేచి బయటికి చరచర వెళ్ళిపోయాడు. వెడుతూ వెడుతూ రూపవంక కసిగా ఒక చూపు విసిరాడు.
    'హెడ్ మిస్ట్రెస్ గాబరాపడిపోతూ ఏదో చెప్పబోయింది.
    సభలో కలకలం చెలరేగి గందరగోళం అయింది. అనుపమాదేవి చప్పున తెలివి తెచ్చుకుని మోహంలో భావం మార్చేసి ఏం జరగనట్టు నవ్వుతూ-
    "కమాన్ టిచర్ ప్రోసిడ్!" అంటూ హెచ్చరించింది, మిగతా ప్రైజులు పంచిపెట్టడం పూర్తిచేసిందావిడ. ఎ
    ఆవిడ వెళ్ళబోతూ రూపవంక చూసి "ఐ లైక్ టు టాక్ యూ వర్ టెన్ మినిట్స్ , వెర్ కేనెయ్ మీట్ యూ" అంది మర్యాద
    రూప "మీ యిష్టం" ఎక్కడైనా సరే. ఇఫ్ యూ హౌ నో అబ్జక్షన్ ఉయ్ కెన్ గో టు మై హౌస్" అంది.
    "సరే! రండి వెడదాం" అంది అనుపమాదేవి కారు వైపు నడుస్తూ, రూప హెడ్ మిస్ట్రెస్ తో చెప్పి, పర్మిషన్ తీసుకుని ఆవిడతో కారెక్కింది.
    వాళ్ళిద్దరూ కారేక్కగానే అందరూ ఒక్కుమ్మడిగా జరిగినదాని గురించి రకరకాలుగా వ్యాఖ్యానాలు ఆరంభించారు. ఆశ్చర్యంగా చెప్పుకున్నారు.
    "నౌ టెల్ మీ అల్ ఎబౌట్ దిస్. మా వారు మీ అబ్బాయికి తండ్రి ఎలా అయ్యారు.
    ప్లీజ్! టెల్ మీ ది ట్రూత్ ఐయామ్ ఇన్ ట్రస్టేడ్ టు నో అల్ దిస్" చాలా ఆరాటంగా అడిగింది అనుపమాదేవి. సుమిత్ ని పక్కగదిలో చదువుకోమని చెప్పి ఇద్దరు ముందు గదిలో కూర్చున్నారు.
    మూడుగదుల ఇల్లది. ముందు గదిలో నాలుగు గాద్రేజ్ కుర్చీలు, ఓ బల్ల, మూలగా టేబుల్ ఫాన్, అలమారలో పుస్తకాలు నిట్ గా సర్దివున్నాయి. రెండో గదిలో రెండు మంచాలు, పెట్టెలు, బట్టలు, మూడో గది వంటకి, భోజనానికి. నీట్ గా వున్న ఆ చిన్న ఇంటిని, ఆ ఇంటి ఇల్లాలు రూప పట్టి పట్టి కుతూహలంగా చూసింది అనుపమ. ఇల్లు లాగే ఇల్లాలు చాలా సింపుల్ గా , చక్కగా ఉతికి గెంజి పెట్టిన మంచి ప్రింటెడ్ చీర, అదే బ్లౌజ్, ఎడమ చేతికి వాచీ, కుడిచేతికి రెండు గాజులు, మెడలో సన్నని చెయిన్ తో జుట్టు పొట్టిగా కత్తిరించి రబ్బర్ బ్యాండ్ కట్టిన జుత్తు చాలా తేలిగ్గా లైట్ కలర్ లిప్ స్టిక్ తో వున్న రూపని గమనించింది అనుపమ.
    ఈమెకి, తన భర్తకి ఎప్పుడు, ఎలా సంబంధం వుండేదో, పిల్లవాడు ఎప్పుడు, ఎలా పుట్టాడో, మరి రూపని పెళ్ళి చేసుకోకుండా ఎందుకు వదిలి తనని చేసుకున్నాడో.....ఆమె మనసునిండా రకరకాలా ప్రశ్నలు, వాటి జవాబులు వినాలని ఆమెకి చాలా ఆరాటంగా వుంది, రూప అబద్దం చెప్పలేదన్నది భర్త మొహం చూడగానే గ్రహించగలిగింది ఆమె. ఒక్క అరగంటలో గుర్తుపట్టలేనంతగా మాడిపోయిన ఆ మొహం చూసి సుమిత్ తండ్రి అతనేనన్న దానిలో ఇంక సందేహం ఏమి లేకపోయిందామెకి.
    భర్త గెస్ట్ హౌస్ కి వెళ్ళిపోయాడని డ్రైవర్ చెప్పాడు. అతను తనింకా స్కూలు ఫంక్షన్ లో ఉందనుకుంటాడు. అతన్ని అడిగేముందు రూపద్వారా సంగతి వినాలనిపించిందామెకి. అతన్ని అడిగితే నిజం కాదని బుకాయిమచవచ్చు. అందుకే ముందు రూపద్వారా నిజాలు వినాలనుకుని ఆమె వచ్చింది.
    అనుపమాదేవిని చూడగానే రూపకు ఎందుకో సద్బావం కలిగింది. చదువు, సంస్కారాలు ఉట్టిపడే ఆమె మోహంలో సౌమ్యత వుంది.
    ఆవిడ గుజరాతీ అని,ఐ.ఎ.ఎస్. పాసయ్యాక కావాలనే ఈ ప్రాంతంలో కలెక్టరుగా వేయించుకుందని విని వుంది. సురేష్ జైలు నుండి వచ్చాక ఉళ్ళో మరి మొహం చూపలేక అహ్మదాబాద్ వెళ్లి అక్కడేదో ఫ్యాక్టరి మేనేజిమెంటులో ట్రెయినింగయి వచ్చి ఇక్కడ తనే సొంతంగా ఓ ఫ్యాక్టరి నెలకొల్పాడు. ఈ ట్రేయినింగ్ సమయంలో ఐ.ఎ.ఎస్ ట్రైయినింగ్ ఉన్న తన బాస్ కూతురి అభిమానాన్ని చూరగొని ఆమెకు భర్త అయ్యాడు. ఆవిడే ఈ అనుపమ.
    సురేష్ కి ఇంత చదువుకున్న భార్య, ఇంత పెద్ద ఉద్యోగాస్తురాలు దొరికిందనుకోగానే ఏ మూలో ఏదో అసుయో, అసంతృప్తో తొంగి చూసింది. అతను పెళ్ళి కాకుండా అవస్థలు పడాలని, ఆ విధంగా తన కసి తీరాలని ఆమె అంతరాంతరాలలోని కోరిక తిరకపోగానే ఏదో ద్వేషం కలిగింది. హు.....తన పిచ్చిగాకపోతే....ఈ దేశంలో మగాడికి పిల్ల ఏం కరువు? చిన్నప్పుడు ఏదో జరిగిందని పెళ్ళి కాకుండా పోతుందా?

 Previous Page Next Page