Previous Page Next Page 
కొత్తమలుపు పేజి 29

    "అంటే , ఇంకా మన ఇంటికి రావా? ఎలాగో వూరువాడా తెల్సింది. ఇంక దాచుకునేందుకు ఏముంది? పద ఇంటికి. పాపం ఆవిడని ఎన్నాళ్ళు ఇబ్బంది పెడ్తావు." పద్మావతి అంది. అందరి సంభాషణ వింది సుమతి.
    "రూప నాకేం బరువు కాదు పద్మావతిగారూ. నా ఉద్దేశం అడిగితే రూప ఇంక ఈ వూరిలో , ఈ వాతావరణానికి దూరంగా ఎక్కడైనా వుండడం మంచిది అని నా ఉద్దేశం. నేను ఇన్నాళ్లూ దాని గురించే ఆలోచించాను. రూప కిప్పుడు ఐదోనెల నిండుతోంది. ఇంక మూడునెలల్లో కనే రోజులు వస్తాయి. నెల్లూరులో మా చెల్లెలు డాక్టరుగా వుంది. అది. దాని భర్త ప్రైవేటు నర్సింగుహోమ్ నడుపుతున్నారు. రూపని అక్కడికి పంపిద్దామనుకుంటున్నాను. మా చెల్లెలికి ఇద్దరూ చిన్నపిల్లలు. ఇంట్లో చూసేవాళ్ళు ఎవరూ లేక, సరి అయిన పనివాళ్ళు లేక ఇటు పిల్లలు, అటు ఉద్యోగంతో నానా అవస్థ పడ్తోంది. రూప గురించి అంతా రాసి రూప నా కూతురులాంటిది అని, నీ సహాయం కావాలని అన్ని విషయాలు రాశాను. మా చెల్లెలు తప్పకుండా పంపించు, ఇంట్లో వుంటుంది పురుడుపోసి పంపే బాధ్యత నాది, మా ఇంట్లోనే వుంటుంది, పిల్లలకి సాయంగాను వుంటుంది అని రాసింది.
    ఈలోగా మనమూ రూపకి ఉద్యోగం చూద్దాం. అక్కడ మా చెల్లెలు ప్రయత్నిస్తుంది. రూప ప్రైవేటుగా ఏమ్.ఏ చదవచ్చు. లేదంటే బి.యిడి ట్రైనింగ్ వెడితే ఏ టిచరుగా నన్నా వుద్యోగం వస్తుంది. ఇది నేను ఆలోచించింది. మీరు అంగీకరిస్తే రూపని నెల్లూరు పంపిస్తాను...." సుమతి ఇద్దరివంక చూసింది.
    పద్మావతి చప్పున సుమతి చేతులు పట్టుకుని "దాని గురించి , దాని భవిష్యత్తు గురించి ఇంతలా ఆలోచించే మీరు వుండడం దాని అదృష్టం. దానికి ఆ భగవంతుడే మీ దగ్గరికి వెళ్ళమని దారి చూపాడు. కన్నవాళ్ళకంటే మీరే దాని బాగు గురించి ఆలోచిస్తున్నారు. దాన్ని మీ చేతులలో అప్పుడే పెట్టేశాం. మీరేం చేసినా మీ ఇష్టం...." సజలనయనాలతో అంది పద్మావతి.
    "ఎంత నల్గురికి తెల్సినా, ఇంట్లో పెట్టుకుని పెళ్ళయిన దానికి మళ్ళి పురుడు అది పోయడానికి మీకు ఇబ్బందిగా వుంటుంది. అందరూ వింతగా చెప్పుకుంటారు. ఎంత పట్టించుకోకూడదనుకున్నా యిలాంటివి తప్పవు. అంచేత ఆ పురుడు అది అక్కడ అవనిండి. మా చెల్లెలు డాక్టరు కనక ఆ గొడవంతా చూసుకుంటుంది. ఆ కొత్త వూరిలో అయితే రూప ఎవరికి తెలిదు. పురుడయ్యాక ఏదన్నా ఉద్యోగంలో ప్రవేశపెట్టవచ్చు. రూపా! ఏమంటావు?" అంది సుమతి.
    "ఆంటీ, మీరెలా చెబితే అలా చేస్తాను....నా బాగోగులు మీకంటే ఎవరికి తెలుస్తుంది. ఇంక ఈ ఊరిలొ వుండాలని నాకూ లేదు. నెల్లూరు వెడతాను. ఆవిడ పిల్లల్ని చూస్తూ అక్కడ వుంటాను. ఈలోగా బి.యిడి. సీటుకి అప్లయి చేస్తాను. డెలివరి అయ్యాక ఏదన్నా ఉద్యోగంలో చేరతాను."
    "కానీండి అమ్మా......పిల్ల పెళ్ళి చేసి పంపిస్తే ఇంట్లోంచి వెళ్ళదా? అలాగే రూప యింక మా యింటిపిల్ల కాదనుకుంటా! ఏదన్నా ఉద్యోగం చూస్తాను. దాని అదృష్టం బాగుంటే.....దాని సంగతి తెలిసీ పెళ్లి చేసుకోడానికి ఏ సహృదయుడన్నా ముందుకు వస్తే సంతోషిస్తా. దాని మార్గం అది ఎంనుకున్నాక యింక మా చేతుల్లో ఏమి లేదు. అత్తవారింటికి పంపినట్లు దానికి కావల్సినవి నాలుగు కొనిచ్చి నా శక్తి కొద్ది అది లైఫ్లో సెటిల్ అయ్యేవరకు దేనికి యిబ్బంది పడకుండా ఓ పదివేలు దానిపేర ఫిక్స్డ్ డ్ డిపాజిట్లో వేస్తాను. దాని భవిష్యత్తు ఎలా వుంటుందో కాలమే నిర్ణయించాలి" అన్నారు విశ్వనాధంగారు.
    "రూపా! నీవు యింటికివెళ్ళి ఓ నాలుగు రోజులుండి నీ సామాను అది సర్దుకో, నీకు కావలసిన బట్టలు అవి కొనుక్కో. ఈలోగా టిక్కెట్టు బుక్ చేసి, మా చెల్లెలికి రాస్తాను. ఇంట్లో నాలుగు రోజులుంటే మీ అమ్మగారికి వాళ్ళకి తృప్తిగా వుంటుంది" అంది సుమతి.
    రూపని వెంటబెట్టుకుని పద్మావతి, విశ్వనాధంగారు యింటికి వెళ్ళారు.
    పదేళ్ళు కాలగర్భంలో కలిసిపోయాయి.......ఆరోజు "శారదా బాలవిహార్" ఇంగ్లీషు మీడియం స్కూలు ఆవరణ అంతా రంగు రంగుల కగుతాల తోరణాలతో అలంకరించబడి వుంది. ఆరుబయట స్టేజి వేశారు. బ్లూ లేక ఆకుపచ్చ రంగు స్కూలు యూనిఫారం తొడుక్కుని, పచ్చని సీతాకోక చిలుకల్లా పిల్లలంతా ఇటు అటు పరుగెడుతున్నారు. టిచర్లంతా హడావుడిగా ఇటు అటు తిరుగుతూ ప్రోగ్రాం ఆర్గనైజ్ చేస్తున్నారు.
    ఆ రోజు స్కూలు వార్షికోత్సవం జరుగుతోంది. క్రితం ఏడు పరీక్షలో మంచి మార్కులతో పాసైనవారికీ బహుమానాలు ఆటలపోటిలో బహుమతులు, వినోద ప్రదర్శనలు జరుగుతాయి. గ్రీన్ రూములో పిల్లల తల్లులు, కొందరు టీచర్లు పిల్లలకి మేకప్ చేస్తున్నారు. ఆ పూట కార్యక్రమానికి ఆ జిల్లా కలెక్టరుగారు అద్యక్షత వహిస్తున్నారు. ఆ సభలోనే పిల్లలకి బహుమతులు అందిస్తారు. ఆరుగంటలకి కార్యక్రమం ఆరంభమవుతుంది.
    స్కూల్లో ఇంగ్లీషు టిచరైన రూప ఎక్కడ చూసినా తానే అయి అటు యిటూ తిరుగుతోంది. పిల్లలకి ఫాన్సీ దుస్తుల మేకప్ చేస్తుంది. స్టేజిమీద ఏయే ప్రోగ్రాం ఎలా ఆరంభించాలో చూస్తుంది. ప్రైజులు పుచ్చుకోవాలసిన పిల్లలని క్లాసులవారిగా నించోపెడుతోంది. ప్రైజులు టేబిల్ మీద సరిగా అరేంజ్ చేసి వున్నాయ లేదో చూస్తోంది.
    అందరూ రూపా, రూపా యిటు అటు పిలుస్తున్నారు. టిచర్ టిచర్ అని పిల్లలు ఏదో ఒకటి అడుగుతున్నారు. ఆ స్కూల్లో ఏ ప్రోగ్రాం అయినా, ఏ ఫంక్షన్ అయినా రూప అధర్యంలో జరుగుతుంది. అన్నింటిలో ఉత్సాహం చూపిస్తూ చలాకీగా తిరిగే రూప హెడ్ మిస్ట్రెస్  కి కుడిభుజం ఆ స్కూల్లో.
    సరిగా ఆరుగంటలకి కలెక్టరుగారు, ఆమె భర్త వచ్చారు. ప్రోగ్రాం ఆరంభమైంది. అద్యక్షోపన్యాసం అయ్యాక కలెక్టరుగారు గత ఏడాది క్లాసులలో ఫస్ట్ వచ్చిన పిల్లలకి బహుమతులు అందించడం ఆరంభించారు.
    ఆ స్కూలు మొత్తం మీద ఐదో క్లాసుకు చెందిన సుమిత్ కుమార్ ఎక్కువ బహుమతులు గెల్చుకున్నాడు. ఇంగ్లీషులో 90, లెక్కల్లో 100, మిగతా సబ్జెక్ట్స్ లో 85 శాతంతో నాలుగు సబ్జెక్టుల్లో ఎక్కువ మార్కులు క్లాసుకి ఫస్ట్, స్కూలు ఫస్ట్ వచ్చి మొత్తం నాలుగు బహుమతులు అవి కాక వ్యాసరచన పోటిలో ఒక ప్రైజు, గేమ్స్ లో రెండు ప్రైజులు పుచ్చుకున్న సుమిత్ అందరికంటే ఎక్కువ బహుమతులు పొంది స్కూలు రిలింగ్ కప్ గెల్చుకున్నాడు. పట్టుమని పదేళ్ళు లేని ఆ కుర్రాడు అన్ని బహుమతులు అందుకోడానికి స్టేజి మీదకి వచ్చినప్పుడల్లా చప్పట్లు మారుమోగాయి.
    ప్రతివాళ్ళు సుమిత్ ని చూసి ముచ్చటపడి మెచ్చుకున్నారు. అన్ని బహుమతులు గెల్చుకున్న సుమిత్ ని చూసి కలెక్టరుగారు ముచ్చటపడ్డారు. సుమిత్ భుజం చుట్టూ చెయ్యి వేసి ఆప్యాయంగా - "ఐ యామ్ వెరి హ్యాపీ మైడియర్ బాయ్, యువర్ పేరెంట్స్ మాస్ట్ బి ప్రౌడ్ ఆఫ్ యూ" అంది.
    కలెక్టరుగారు అలా తమ విద్యార్ధిని అంతగా పొగడగానే ఉబ్బిపోయి హెడ్ మిస్ట్రెస్ సంబరంగా.....స్టేజి మీద పక్కగా నిలబడి ప్రైజులు అందిస్తున్న రూపని చెయ్యిపట్టి లాగి-
    "షి ఈజ్ ది ప్రౌడ్ మదర్ ఆఫ్ దిస్ బాయ్. షి యీజ్ ఎ టిచర్ ఇన్ అవర్ స్కూల్" అంది గర్వంగా.
    "రియల్లీ, గ్లాడ్ టు మిట్ యు టిచర్" అందామె రూప చెయ్యిపట్టుకుని సున్నితంగా నిక్కి, "వాటే బౌట్ యువర్ డాడి సుమిత్" అందామె నవ్వుతూ....."వాటిజ్ హిజ్ నేమ్." సుమిత్ ఆమె వంక ఒకసారి చూసి....తలెత్తి గంభీరంగా.
    "హిజ్ నేమ్ ఈజ్ జి. సురేష్ కుమార్ " అన్నాడు.
    "ఓ! వాట్ ఈజ్ హి? అయన ఇవాళ రాలేదా ఇక్కడికి? ఎక్కడున్నాడు?" అంది.

 Previous Page Next Page