Previous Page Next Page 
కలియుగంలో సీత పేజి 29

 

    "మీరు లోపలకొచ్చి చాలా సేపు అయింది నాన్నా! వాళ్ళేమయినా అనుకుంటారు, వెళ్ళండి." అంది సీత.

 

    "అవునవును, చాలాసేపయింది వస్తాను, అన్నట్టు జయచేత మరోసారి కాఫీ పంపించు, పోనీ నువ్వే తీసుకురా, అబ్బాయి నీకు నచ్చాడని చెపుతాను." భుజం మీద కండువాతో కళ్ళు అద్దుకుని కంగారుగా ముందు గదిలోకి వెళ్ళిపోయాడు రామచంద్రం.

 

    అంతవరకూ ఏ భావం ముఖంలో వ్యక్తం కాకుండా జాగ్రత్త పడిన సీత హృదయం బరువెక్కగా కళ్ళ నోమ్డుగా నీళ్ళు ఉబికాయి. తల్లి గుర్తుకొచ్చింది. జీవితంలో తోడుని కోల్పోయి.....పిల్లలని పెద్దవాళ్ళని చేయటానికి కొన్నాళ్ళు చేతికి ఆసరా కావాల్సిన వాళ్లు రెక్కలొచ్చిన పక్షుల్లా ఎగిరిపోతే ఆ ఆవేదన దిగమింగి.....పిల్ల పెళ్ళి కాలేదనే దిగులుతో కుంగిపోయి.....చింతలు చికాకులతో తలపండిన తండ్రి.....తన పెళ్ళి కాదేమోనని ఎన్నోసార్లు.....ఎన్నోరోజులు.

 

    సీత కళ్ళముందు గతం గిరగిర తిరిగింది.

 

    పెళ్ళి కాగానే ఈ ఇంటిని, కన్న తండ్రిని, చిన్న తమ్ముడిని, చిన్న చెల్లెలిని వదిలిపోవాలి వీళ్ళుఎలా ఉంటారు? నేను మాత్రం


    పెళ్లి కుదిరినందుకు....

 

    అనందించాలా?

 

    విచారించాలా?

 

    సీత సందిగ్దవస్థతో పడి దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండిపోయింది.

 

    
                                                                                      17

 

    రామచంద్రంకి దగ్గర బంధువులంటూ పెద్దగా ఎవరూ లేరు. కాస్త ముఖ్యులన్న వాళ్లు చాలా దూరల్లో వున్నారు. సీత పెళ్ళికి ఉన్నంతలో బంధుమిత్రుల్ని విడవకుండా గుర్తు తెచ్చుకుని పిలిపించాడు. రావటమైతే చాలామందే వచ్చారు. ఉండట మంటూనే జరగలేదు. పెళ్ళి చూసి వెళ్ళిపోయారు. ఇంతమందికి సౌకర్యాలు సమకూర్చి భరించటం రామచంద్రం తహతుకి ఎంత కష్టమో సుఖం మరిగిన చుట్టాలు ఉన్నంతలో సర్డుకుపోవటం అంతే కష్టం. పిలిచిన వాళ్లు పెళ్ళికి వచ్చారు. పెళ్ళి బాగా జరిగింది. పెళ్లికాగానే వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు

 

    సీతకి పెళ్ళయింది.

 

    సీత ఓ మగాడికి పెళ్ళామయింది.

 

    సీత మెడలో ఓ పసుపు తాడు పడింది.

 

    కక్కొచ్చిన కళ్యాణ మొచ్చినా అగదన్నది ఎందరిపట్లో నిజమైనట్లు సీతపట్ల కూడా నిజమయింది పెళ్ళి చాలామంది పెళ్లిలానేఅయింది. మార్పు ఏమంటే సగం పెళ్ళిపనులు తన పెళ్ళిపనులు సీతే స్వయంగా చేసుకుంది. పెళ్ళిపిటలమీద కూచున్న సీతవద్ద కొచ్చి చెవివద్ద నోరుంచి ఎదేక్కడుందో అడిగి, తెల్సుకుని పనిచేశారు ఇంట్లోవాళ్ళు, పెళ్ళికి సాయం చేస్తున్నవారును.

 

    పెళ్ళికొడుకు సుందరమూర్తి తరుపు ఎవరూ పెద్దగా లేరు. పెళ్ళిపెద్దలు అక్క బావ పెళ్ళికి వాళ్ళిద్దరూ మరికొందరు మిత్రులు బంధువులనబడేవారు వచ్చారు. పెళ్లిచూసి పెళ్లిభోజనం కానిచ్చి వెళ్లిపోయారు.

 

    పెళ్ళయిన తరువాత మిగిలింది పెళ్లికొడుకుతో అక్కా బావ ఇటు తరుపున యింట్లో వాళ్ళు అంతే రూప అత్తగారువాళ్ళు పెళ్ళి చూసి ఘనంగా చదివించి భోంచేసి వెళ్ళిపోయారు. ఉండి సాయం చేయకపోయినా ఫరవాలేదు. పెళ్లిలో కలిసిమెలిసి వున్నారు. ఆప్యాయంగా మాట్లాడారు. రూపతో అన్ని చుసుకునిరా అని చెప్పివెళ్ళారు. అదే వాళ్ల మంచితనం ఆ కొంచెమే వీళ్లకు పది వేలు.

 

    సుందరమూర్తి అక్కపేరు శాంత. పేరుకే కాదు ప్రవర్తనకి అమిత శాంతం. బావ రాఘవ పెద్దమనిషి ఇద్దరిద్దరు మంచివాళ్లు శాంత యింట్లో మనిషిలా మెలుగుతూ పెళ్ళయిన మూడో నాటికీ వీళ్ళలో కలిసిపోయింది. ఆడపడుచు అంటే కొన్నింటికి అర్ధం, విపరితార్ధం వుంటుంది, గయ్యాళితనానికి, గౌరవించబడటానికి అర్ధం మొగుడికి హుకుం చెలయించటానికి హక్కులు పొంది వుంటుంది. ఆడపడుచు అంటే భర్తకి తోబుట్టువు అని, సీత విషయంలో శాంత భర్త సోదరిగాని ఆడపడుచు మాత్రం కాదు. సీతకి శాంత ఎంతో నచ్చింది. అలానే శాంతకి సీత చాలా నచ్చింది.

 

    దగ్గరుండి సీతని కాపురానికి తీసుకెళ్ళి తమ్ముడు మరదలు కొత్త సంసారానికి కావలసినవి నాలుగు రోజులుండి ఏర్పరచి వెళ్ళిపోదామని శాంత వుండిపోయింది.

 


    ఆ రాత్రికి కావలసినవి ఏర్పటులు శాంత దగ్గరుండి చేయించింది. సీతకి పూలజడ వేయటానికి బజారు నుండి తనే పూలు తెప్పించింది.

 

    "ఇప్పుడు ఈ జడ ఎందుకండి." నసిగింది సీత.

 

    "వింటానంటే ఎందుకో వివరంగా చెపుతాను మాట్లాడకుండా జడేయించుకో తర్వాత నీకేతెలుస్తుంది." చిన్నగా నవ్వుతూ అంది శాంత.

 

    మారు మాట్లాడలేదు సీత.

 Previous Page Next Page