Previous Page Next Page 
మధుమాసవేళలో ... పేజి 29


    
                                                   11
    
    ఆరోజు ఆదివారం.
    
    "నాకేం తోచటంలేదే" అంది త్రిలోకసుందరి.
    
    "నాకు మాత్రం తోచిచస్తున్నదేమిటి?" అంది వైజయంతి.
    
    "ఓపని చేస్తే?"
    
    "ఓపనిచేస్తే....? గీస్తే...? అంటూ అఘోరించకపోతే విషయం చెప్పరాదా!"
    
    "నిన్ను చూస్తే భయం."
    
    "హవ్వ ఎవరయినావింటే ముఫ్ఫై రెండుపళ్ళూ కనపడేలా నవ్విపోదురుగాక. నేనేం పులినా, సింహాన్నా! సరేలే చేస్తే గీస్తే అనక చెప్పి అఘోరించు."
    
    "రామదూతగారు ఖాళీగా వున్నారనుకుంటాను. అతితేలికగా ప్రేమనవలలు రాయొచ్చు అన్న నీవే, వెధవ ప్రేమ నవలలు రాయటంకూడా కష్టమేనే ఏనవల రాద్దామని మొదలుపెట్టినా అది యిదివరకే ఎవరో ఒకరు రాసిన ప్రేమ నవలై వూరుకుంటున్నది. అన్నావా లేదా?"
    
    "అన్నాను."
    
    "కనుక ఇప్పుడు మనం రామదూతగారి దగ్గరకు వెళదాం."
    
    "ప్రేమ గురించి ఆయనేమన్నా చెపుతారనా!"
    
    "కాదే."
    
    "మరి!"
    
    "ఆయన ప్రయివేట్ డిటెక్టివ్ కదా! ఆయన అనుభవంలో డిటెక్టివ్ కధలేమయినా చెపుతారేమోనని అని విని నీవు నవలలుగా వండుదువుగాని."    

    "గుడ్ అయిడియా."
    
    "ఈ దెబ్బతో సాంఘిక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ నవలా రచయిత్రివైపోవచ్చు" అంది త్రిలోకసుందరి.
    
    వైజయంతి ఎగిరి గంతేయాల్సిందిపోయి మన్నుతిన్న పాములా వుండిపోయింది.
    
    అదిచూసి "నేనేమన్నా తప్పుగా మాట్లాడానుటే!" అంది త్రిలోకసుందరి భయపడుతూ.
    
    "లేదే క్షురకులు బురకులు ప్రేమికులు ఇలా తలో రకం పేరుబడ్డ రైటర్స్ వున్నట్లే సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ రాసే రచయిత్రికూడా వుంది. సాంఘిక నవలల్లో మిల్లిగరిటెడు క్రైమ్. పెద్దగరిటెడు సస్పెన్స్, గుప్పెడు థ్రిల్లరు కలిసి కొత్త వంటకం రాసిపారేస్తున్నదికదా!"
    
    "అవునే వైజయంతీ! ఈమాటే మర్చిపోయాను. పోనీ ఓపని చేద్దాం. రామదూతగారినుండి కధలు తీసుకుందాం. వాటినే కాస్తమార్చి నవలలు రాద్దువుగాని. నవలలు పేలితే కొత్తప్రయోగాలు చేద్దువుగాని. ముందు పాఠకులమీదకి కొన్ని పంపించాలికదా! నిన్నో రచయిత్రిగా వాళ్ళు గుర్తించాలికదా!"
    
    "ఈమధ్య నీ బుర్ర బాగానే పనిచేస్తున్నది. పోదాం పద రామదూత మందిరానికి" అంటూ ఉత్సాహంగా లేచింది వైజయంతి.
    
    త్రిలోకసుందరి లేచింది.
    
    ఇరువురూ వకరి వెనుకగా వకరు నడుచుకుంటూ రామదూత గదిలోకి వెళ్ళారు.
    
    అక్కడ...
    
    రామదూత కుర్చీలో కూర్చుని తొంభైనాలుగు తొంభై అయిదు అని వంట్లు లెక్కపెడుతున్నాడు. విషయం ఏమిటంటే కొన్ని కొన్ని తమాషాలు చిట్కాలు రామదూతకి బాగా తెలుసు. వాటిని ఆయన దగ్గర నేర్చుకోటానికి మదన్ గోపాల్ చక్రవర్తి అడగటం ఆయన సరేననటం జరిగింది. ఇప్పుడవి నేర్చుకుంటున్నారు వాళ్ళిరువురూను.
    
    మదన్ గోపాల్ కి శీర్షాసనం వేయటంరాదు. ఎలాగో అలా వారంరోజులు కష్టపడి గోడకి అనుకుని శీర్షాసనం వేయటం కొద్దిగా నేర్చుకున్నాడు. శీర్షాసనంవేసి కనుగుడ్లు గిర గిర తిప్పుతూ చేతులు తిప్పినట్లు కాళ్ళని వివిధ భంగిమల్లో తిప్పాలి. మదన్ గోపాల్ ఆపని అతికష్టంమీద చేస్తున్నాడు.
    
    మదన్ గోపాల్ సంగతి అలావుంటే ఇహ చక్రవర్తి ముక్కి మూలిగి గాలిలోతేలుతూ నడిచే ప్రయత్నం చేస్తున్నాడు. నేలకి కాళ్ళు ఆనకుండా నడవటం మహర్షులకే అసాధ్యం. భూమికి జానెడు యెత్తున నడవాలంటే అయే చక్రవర్తి పక్కకాలు పైకెత్తి రెండోకాలు కూడా పైకెత్తి నడిచే ప్రయత్నంలో కిందామీదా పడుతున్నాడు.

 Previous Page Next Page