తోటలోపూలమొక్కల మధ్యో ఏ మామిడి చెట్టుకిందో కూర్చుని కొబ్బరి నీళ్ళుతాగుతూనో, ముంజిలు తింటూనో, పనసతొనలు తింటూనో అరుణ సుబ్బారావుతో ఆ రోజు విశేషాలన్నీ ఏకరువు పెడుతుంది. సలహాలిస్తాడు.
రోజులు గడుస్తున్న కొద్దీ అరుణ, సుబ్బారావు చాలా సన్నిహితులవసాగారు.
అరుణకి సుబ్బారావు సలహాదారుడు, హితైషి. సుబ్బారావుకి అరుణ ఓ ఆదర్శమూర్తి.
అరుణతో పరిచయం పెరుగుతున్న కొలది అరుణ సుబ్బారావుని మురిపించడం మొదలుపెట్టింది. అరుణ తనపట్ల చూస్తే చనువుకి అర్ధాలు వెదుక్కోవడం మొదలుపెట్టాడు సుబ్బారావు. ఆ చూపుల్లో మాటల్లో వేరేఅర్ధాలు కనపడడం మొదలు పెట్టాయిసుబ్బారావుకి తనతో అంత చనువుగా, ఆప్యాయంగా మాట్లాడే అరుణకి తనమీద ఎలాంటి అభిప్రాయం ఉందో తెలిసినట్లు ఊహాగానాలు చేయడం ఆరంభించాడు ఏమీ లేకపోతే, ఊళ్ళో ఇంతమంది ఉండగా తన తోటే రోజూ ఎందుకు మాట్లాడుతుంది.
సలహా అడుగుతుంది? తనుచెప్పిన అభిప్రాయాలని ఎందుకు మన్నిస్తుంది? తోటకి రాకపోతే ఒక్కరోజయినా ఏమిటో లా ఉంటుంది. ఇవన్నీ ఏం చెపుతున్నాయి? అని గర్వంగా తనని తాను ప్రశ్నించుకుని, జవాబుతననే చెప్పుకుని తృప్తితో మురియడం ఆరంభించాడు సుబ్బారావు. తనది అత్యాశ ఏమో అన్న అనుమానం ఒక్కోక్షణం జొరబడినా, అరుణ అభిప్రాయాలు అరుణ ఉద్దేశాలు అన్నింటిని సమన్వయం చేసుకొని'కాదన్న జవాబుతో తనని తను సంతృప్తిపరచుకోవడం ఆరంభించాడు.
ఈ ఆరునెలలో అరుణ అతనితో ఎంత చనువుగా ఉన్నా, సుబ్బారావుకి అరుణ అంత చనువు రాలేదు. దైర్యంగా అరుణతో మాట చెప్పే సాహసం అతనికి లేదు. అరుణలేనంత కాసేపూ ఎలాగైనా ఆ రోజు అరుణని కృష్ణమూర్తి విషయంలో కదపాలని ఎన్నెన్నో ప్లాన్లు వేసేవాడు తీరా చేసి అరుణ వచ్చేసరికి నోరు పెగిలేది కాదు. అరుణ మాట తప్పమిగతా విషయాలన్నీ మాట్లాడేవాడు. అరుణ వెళ్ళిపోయాకతనని టాను నిందించుకునేవాడు. ఈ మధ్య రోజులన్నీ ఇలాగే గడిచిపోతున్నాయి ఎలా చెప్పడమో, ఏమని ఆరంభించడమో తెలియక కొట్టుమిట్టాడుతున్నాడు సుబ్బారావు.
ఈ రోజు అరుణ పెళ్ళి విషయం ఎత్తడానికి సందు దొరగ్గానే హాస్యంగా అన్నట్టే అని ఆమె ఉద్దేశం చూచాయగా రాబట్టడానికి ప్రయత్నించాడు సుబ్బారావు. అతని ప్రశ్నవిని ఆశించినట్లు అరుణ సిగ్గుపడలేదు. తలదించుకోలేదు. ముఖం ఎర్రపరుచుకోలేదు. "ఊ ఊ ఈ సంగతి తెలిసిందంటేనా పెళ్ళి ప్రెసిడెంటే చేస్తాడు" అరుణహాస్యంగా నవ్వుతూ జవాబిచ్చింది. సుబ్బారావు ఆసించిన సమాధానం ఏదీ లేదు అందులో. అంతకంటే ముందుకి వెళ్ళి అడగడం సుబ్బారావుకి చేత కాలేదు. "ఓ అరగంట కబుర్లు చెప్పిలేచింది అరుణ.
"ప్రెసిడెంట్ రేపు ఊరినుంచి వచ్చి సంగతి తెలుసుకొన్నాక అతని మొహం ఎలా ఉంటుందో చూడాలని ఉంది నాకు" నడుస్తూ అంది అరుణ.
"ఏమో బాబూ మీకంతా నవ్వులాటగా ఉందిగానీ నాకు నిజంగానే భయంగా ఉంది, ఏం చేస్తాడో ఏమిటోనని రేపు చాలాపెద్ద గొడవే జరగవచ్చు. ఇందులో మీకూ పాలు ఉందని తెలియకపోతే ఫరవాలేదు గానీ తెలిస్తే?" ఆగిపోయాడు సుబ్బారావు ఆ తరవాత ఏం జరుగుతుందో అతని ఊహకి అందలేదు.
"చూద్దాం, ఏం చేస్తాడో ఏమిటో? మీకేమన్నా విశేషాలు తెలిస్తేచెప్పండి, రేపు, అరుణ గుడ్ నైట్ చెప్పి ఇంట్లోకి వెడుతూ. ఆ మరునాడు సాయంత్రం చాలా విశేషాలే మోసుకొచ్చాడు సుబ్బారావు. రెడ్డిగారు ఊరినుంచి రాగానే భార్యగోలపెడుతూ ఎదురెళ్ళిచెప్పేసిందట......కూతురు ఇంట్లోంచి పారిపోయిందని ప్రెసిడెంట్గారు అయిదు నిమిషాలు మాటరాక నిలబడిపోయాడట. తరవాత జరగవలసిన భాగవతం అంతజరిగిందట. పనివాళ్ళని, పాలేర్లని నిలబెట్టి ఈ పని ఎలా జరిగిందో ఎవరి సహాయం ఉందో అంతు తేలుస్తానని బెదిరించి, చెప్పమని కొట్టడం ప్రారంభించాడట.
ఎంతఅడిగినా మాకు తెలియదన్నమాటే అందరూ కూడబలుక్కున్నట్టు చెప్పారట. రోజూ వెంకు గది గుమ్మం ముందు పడుకునే ముసిల్దిమాత్రం....." అమ్మాయిగారు ఒంటేలో కెడతాననిపిలిస్తే తలుపు గొళ్ళెంతీశానని, తరవాత నిద్రమత్తులో అమ్మాయిగారు రావడం చూడకుండానే పడుకుండిపోయానని, తప్పయిపోయింది క్షమించ"మని ప్రార్దించింది. ఎవరిని ఏమనడానికి నేరం రాకుండా అతి పకడ్బందీగా.
వెంకుడం ఏర్పాటు చేసింది. కొట్టినా, తిట్టినా అంతకంటే ఎవరి దగ్గిరనించి ఏం సమాచారం రాబట్టలేకపోయాడు రెడ్డి, కూతురు వీరడితో పారిపోయి ఉంటుందని ఊహించినా వీరడేక్కడున్నాడో, ఎలా పోయారో, ఇద్దరూ ఎక్కడి కెళ్ళారో......ఏం తెలుసుకోలేకపోయాడు రెడ్డి, దెబ్బతిన్నసింహంలా, బోనులో పడ్డ పులిలా తిరుగుతున్నాడు ఇంట్లో, ఓ పాలేరు సుబ్బారావు అడిగితే చెప్పాడంతా ఇదంతా నాలుగు దెబ్బలు తింటే తిన్నాం గాని, అమ్మాయిగోరు సుఖంగా ఉంటేమా కంతే సాలు' అన్నారట అంతా రెడ్డి అంటే ఎవరికీ ఇంట్లో భయం తప్ప భక్తి లేదు.
"అయితే ఇంక పరవాలేదు" అంది నిశ్చింతగా నిట్టూర్చి అరుణ.
"ఈలోపల అరుణ అమ్మాయిపెళ్ళి అయిపోతుంది. ఇంకేం చెయ్యలేడు."
"ఆకోపం అంతా మీ మీదికి తిరగ్గలదు జాగ్రత్త." నవ్వుతూ బెదిరించాడు సుబ్బారావు. పైకి నవ్వుతూ అన్నా లోలోపల ఎందుకోసుబ్బారావుకి ప్రెసిడెంట్ ఏదో విధంగా కక్ష తీర్చుకోక మానడనిపించసాగింది. అతని స్వభావం తెలిసిన సుబ్బారావుకి. రెడ్డి ఈ సంగతి అంత తేలిగ్గా వదిలేస్తాడనికాని అంత తొందరగా జరిగింది మరిచిపోతాడనికాని ప్రతీకారం తీర్చుకోకుండా వదిలిపెడతాడనిగాని అనుకోలేకపోయాడు. కాని, అరుణ మీద ఏ విధంగా ప్రతీకారం తీర్చుకుంటానన్నది అతనికి ఆలోచించినా అంతుపట్టలేదు. ఊళ్ళో వాళ్ళని బెదిరించి భయపెట్టి అరుణకి పేషెంట్లు రాకుండా చేస్తాడేమో? ప్రాక్టీసు లేకుండా చేసి కసితీర్చుకుంటాడేమో? ఏం చేసినా, ఆ తెలివిగా తనపేరు పైకి రాకుండా చేస్తాడని సుబ్బారావుకి తెలుసు.
"ఏమిటి అంతలా ఆలోచిస్తున్నారు? నాకంటే మీ రెక్కువ భయపడుతున్నారేమిటి, అతనేదో చేస్తాడని:" నవ్వింది అరుణ.
"నాగురించి ఇంత ఆదుర్దాపడే మీరు ఉండగా నా కింకేం భయం?" అరుణ మనస్ఫూర్తిగానే అంది ఆ మాట.
ఆ మాట సుబ్బారావు మనసుని గిలిగింతలు పెట్టింది. సిగ్గుపడి తలదించుకున్నాడు.
అతనలా సిగ్గుపడడం వింతగా అనిపించింది అరుణకి.
* * *
ఒమూడు రోజుల తరవాత మధ్యాహ్నం మూడు గంటలప్పుడు అరుణ రుక్కుని, మణిని కూర్చోపెట్టుకుని చదువుచెపుతూంది. ఎవరో తలుపు తడుతూంటే మణి వెళ్ళి చూసి వచ్చి "ఎవరో ఓ అమ్మాయి మీ కోసం వచ్చింది." అన్నాడు. "ఎవరు? మందుకోసమా? నాలుగు గంటలకి రమ్మను" అంది అరుణ. మణివెళ్ళి మళ్ళీవచ్చాడు.
"ఆ అమ్మాయి అర్జెంటుగా ఇప్పుడేచూడాలంటూంది అమ్మగారూ:" అన్నాడు.
అరుణలేచి బయటపడి స్పెన్సరీ రూముకి వెళ్ళింది అక్కడ బెరుకుగా భయంభయంగా మొహమాటపడుతూ ఓ పదిహేడు, పద్దెనిమిదేళ్ళఅమ్మాయి చేతిలో ఓ బిందె పట్టుకుని నిలుచుంది పచ్చగా కళకళ లాడుతూంది ముఖం. కళ్ళనిండా కాటిక, పెద్దబొట్టు, నల్లటి జుట్టు...... చాలా కళగా ఉన్న ఆ అమ్మాయిని చూస్తూ ఓ నిమిషం ఉండిపోయింది అరుణ పమిటకొంగుభుజం నిండా కప్పుకుని, కాళ్ళకి పట్టీలతో, చేతుల నిండా రంగులగాజుల్లో అచ్చుపల్లెటూరి యువతికి ప్రతిబింబంలా ఉంది. అరుణని చూసి తొట్రుపడింది ఆ అమ్మాయి. ఏదో చెప్పాలని వచ్చినా కొత్తల్లో, భయంవల్లోమాట రానట్టుంది.
"ఎవరమ్మా నీవు? ఏం కావలి?" సాదరంగా ప్రశ్నించింది అరుణ.
"నేను...... నేను....." గుటకలుమింగింది ఆ అమ్మాయి. లోపలనుంచి ఎవరొచ్చారో చూద్దామని వచ్చిన రుక్కు, ఆ అమ్మాయిని చూడగానే.
"నువ్వా సుబ్బులూ ఏం ఇలా వచ్చావు?" అంది.
ఆ యువతి రుక్కుని అక్కడ చూసి తెల్లబోయి, తడబడింది."ఆచారిగారికోడలండీ:" అంది రుక్కు అరుణతో. "ఆచారిగారంటే వేణుగోపాలాలయం పూజారిగారండి" మళ్ళీ వివరించింది రుక్కు.
"ఆహా! ఏమమ్మా ఇలా వచ్చావు? నాతో పని ఉందా? ఒంట్లో బాగులేదా? మందుకోసం వచ్చావా?" సాదరంగా అడిగింది అరుణతల వంచుకుని తల ఆడించింది అరుణ అమ్మాయి.
"కూర్చో అలా బెంచిమీద ఏమిటి సుస్తీ నీకు?" కుర్చీలో కూర్చుంటూ అడిగింది అరుణ. సుబ్బులు సందేహిస్తూచూసింది. అరుణ అదిగుర్తించి "రుక్కు నీవులోపలికెళ్ళు ఆ లెక్కలు చేస్తూండు వస్తాను" అని పంపించేసింది.
"రుక్కూ నేనిలా వచ్చినట్లు నన్నిక్కడ చూసినట్టు మా ఇంట్లో అనకేం?" వెళ్ళిపోతున్న రుక్కుతో అంది సుబ్బులు'అలాగే' అన్నట్టు తల ఊపి లోపలికి వెళ్ళింది రుక్కు.
"ఊచెప్పమ్మ ఏమిటి?" ఆ అమ్మాయి తను వచ్చినట్టు ఎవరికీ తెలియకుండా డాక్టరు దగ్గరికి రావడంలో ఉద్దేశం ఏమిటో అరుణకి అంతుబట్టలేదు. ఆ అమ్మాయి ఒక్క క్షణం ఊరుకుంది. కళ్ళలో భయం స్పష్టంగా మెదులుతూంది. "డాక్టరుగారూ ఇవి చూడండి" భుజం చుట్టూ ఉన్న కొంగు తొలగించి అరుణ ముందుకి రెండుచేతులు జాపింది" ఒకటే మంట చాలాబాధగా ఉంది డాక్టరుగారూ: మందేమన్నా ఈయండి." జంపిస్తున్న గొంతుతో రహస్యంగా అంది. అరుణ చేతులు దగ్గరగా పట్టుకుని జాగ్రత్తగా చూసింది. చేతులనిండా, తెల్లటి శరీరం మీద గుండ్రటి ఎర్రటి మచ్చలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అవి చూశాక అవేం మచ్చలో పోల్చుకోవడానికి అరుణకి అట్టేసేపు పట్టలేదు.