Previous Page Next Page 
మోహిత పేజి 30


    "కిందకు పద చెప్తాను....." మోహితతోపాటు, మైత్రేయకూడా కింద కొచ్చాడు. ఇద్దరూ కారు పార్కింగ్ వేపు నడిచారు.

 

    మెయిన్ గేట్లోంచి బయటకొస్తే హోటల్  వెనక్కి వెళ్ళడానికి రెండు  దార్లున్నాయి. ఒక దారి  నిర్జనంగా వుంది. ఆ దారికి  అనుకొని ప్లేగ్రౌండ్, ప్లే గ్రౌండ్ చుట్టూ ఐరన్ గ్రిల్స్ వున్నాయి.

 

    కారులో ఇద్దరూ ప్లేగ్రౌండ్ దగ్గరకొచ్చారు.

 

    "నీ ఐడియా ఏమిటో నాకర్థం కావడంలేదు" అన్నాడు మైత్రేయ.

 

    "కారిప్పుడు ఐరన్ గ్రిల్స్ కు ఢీకొంటుంది. హెడ్ లైట్సు పోతాయి. బోనెట్ డామేజ్ అవుతుంది. తీసుకెళ్ళి మెకానిక్ దగ్గర పడేయ్..... వస్తూ, వస్తూ రెంటర్స్ నుంచి అంబాసిడర్ కారుని తీసుకునిరా..... తర్వాత ఏం చెయ్యాలో నేను చెప్తాను" చెప్పింది మోహిత.

 

    "అప్పటికే ఆమె బ్రెయిన్ లో ఒక ప్లాన్ రూపుదిద్దుకుంటోంది. అంతలో గ్రిల్స్ కు ఢీకొంది కారు. హెడ్ లైట్స్ పగిలిపోయాయి. కారు కొంతమేరకు డామేజ్ అయింది.

 

    పక్కనే వున్న నాజ్ సెంటర్ లో మెకానిక్ షెడ్ లో పడేసి, రెండ్రోజుల్లోపల బాగుచెయ్యమని మెకానిక్ తో చెప్పి హుషారుగా బయటకొచ్చాడు మైత్రేయ. దారిలో కారు రెంటల్స్ ఆఫీసుకెళ్ళి, వారం రోజులకు  అంబాసిడర్ కారుని బుక్ చేసి, కారు డ్రైవర్ తో పాటు హోటల్ కొచ్చాడు.

 

    నాజ్ సెంటర్లో వున్న ఆ మెకానిక్ షెడ్ పేరు.....

 

    సూర్యా కార్ కేర్ సెంటర్.

 


                                          *    *    *

 

    సాయంత్రం 7 గంటలు.....

 

    పగటి వెలుగు మసక చీకటిగా మారుతున్న సమయం.....

 

    గుంటూరుకు సమీపంలో నున్న అమరావతి దేవాలయంలోంచి బయట కొచ్చి, దూరంగా వున్న కృష్ణానది తీరంవేపు నడుస్తున్నారు మైత్రేయ, మోహిత.

 

    గాలిస్పర్శకు మెల్లగా కదులుతున్న నీటిపాయలు......

 

    దూరంగా చిన్న చిన్న పడవలు.... మంద్రంగా వినిపిస్తున్న గుడిగంటలు. నదిఒడ్డున తడిఇసుకలో కూర్చున్నారిద్దరూ. మోకాళ్ళ వరకు చీరను పైకి లాక్కుని నీళ్ళల్లో కాళ్ళు  పెట్టుకుని చిన్నపిల్లలా కూర్చుంది మోహిత.

 

    మోహిత కాళ్ళకున్న వెండిపట్టీలు, అస్తమిస్తున్న సూర్యుని వెలుగులో వింత వన్నెతో ప్రకాశిస్తునాయి.

 

    హంపీ విజయనగరంలో మహాశిల్పులు తమ శిల్పరచనా చమత్కృతితో ఆవిష్కరించిన గొప్ప శిల్పాలు, కాలక్రమంలో తమ సౌందర్యాన్ని కోల్పోవడం సహజం. అలాగే నేటి  పుష్పాలు, రేపటికి పరిమళ రహితమై విలువను కోల్పోయి, గుడ్డిపువ్వులగా మారడం సహజం. జలపాతాలు ఎప్పటికయినా ఎండిపోతాయి. జనవాసాలు కృంగిపోతాయి. తన సౌందర్యంతో శృంగార సామ్రాజ్యాలను ఏలిన మహారాణులు నామరూపాలు లేకుండా పోయారు.... పోతారు.

 

    పగ, ప్రతీకారం తీర్చుకున్నాక, సౌందర్యరాశి మోహిత ఏమవుతుంది.....?

 

    ఆమె బతికే వుంటుందా.....? తనకు  దక్కుతుందా.....? జైల్లో వుంటుందా....?

 

    నీళ్ళలో కదులుతున్న ఆమె గంధపురంగు పాదాలవైపు చూస్తూ ఆలోచిస్తున్న మైత్రేయ......

 

    చటుక్కున వంగి, నీళ్ళల్లో వున్న ఆ పాదాలను, తన చేతుల్లో పెట్టుకుని ముద్దుపెట్టుకున్నాడు.

 

    ఆ తడిపాదాల మీంచి జారుతున్న నీటిబిందువులు అతని పొడిచేతుల్ని తడిగా చేస్తున్నాయి.

 

    ఆ ముద్దు స్పర్శకు, గొప్ప పులకింతకు లోనైన మోహిత భారంగా కళ్ళు మూసుకుంది.

 

    వేగం పెరిగి ఉచ్ఛాస, నిశ్వాసలకు ఆమె గుండెలు ఎగిరెగిరి పడుతున్నాయి. చెదిరిన పైటలోంచి కన్పించిన ఆమె ఎద లోయవేపు తమకంగా చూసి, గబుక్కున ఒంగి. ఆమె గుండెల మధ్యన మెత్తగా ముద్దు పెట్టుకున్నాడు.

 

     ఆమె వారించలేదు.

 

    నీటి అలలు  ఒక్కసారి పైకి రావడంతో, ఆమె నీళ్ళల్లోకి జారింది. రెండు దేహలమధ్య నలిగిపోతూ, భారంగా ఊపిరి తీసుకుంటున్న  నీళ్ళు.....

 

    అలా ఒకరిమీద  ఒకరు ఎంతసేపున్నారో తెలీదు.

 

    కళ్ళిప్పి, ఆకాశంవేపు చూసిన మోహిత-

 

    "ఎంత బావుంది మైత్రేయ...... ఒక్కొక్కప్పుడు శృంగార చేష్టకన్నా, శృంగార తపన బావుంటుంది....... ఒక స్త్రీ గురించి మగాడు, మగాడి గురించి స్త్రీ నిజాయితీగా ఆలోచిస్తూ, నిరంతరం కోరుకునే కాంక్షలోని మధురత్వం, శృంగార ప్రక్రియకన్నా చాలా గొప్పది..... కదా...." అతన్నుంచి నెమ్మదిగా తప్పించుకుని, ఇసుక దిబ్బమీద కూర్చుంటూ అంది మోహిత.  

 

    ఈ ఏకాంత సమయంలో మోహిత తను అడక్కుండానే తన కోరిక తీరుస్తుందని, ఆశించిన మైత్రేయ ఒక్కసారిగా నీరుగారిపోయాడు.

 

    నీరసంగా ఆమె కళ్ళవేపు చూసి చిరాగ్గా లేచి నిలబడి సిగరెట్ వెలిగించుకుంటూ "పద......వెళదాం!" అన్నాడతను.

 

    "ఇద్దరూ కార్లో కూర్చున్నారు. డ్రైవర్ కారు స్టార్ట్ చేశాడు.

 

    ఇద్దరిమధ్యా నిశ్శబ్దం.....

 

    మరో నలభై ఎనిమిది నిమిషాల తర్వాత హోటల్ రూమ్ లో వున్నారిద్దరూ.

 


                                           *    *    *

 

    రెండు గ్లాసుల్లో డ్రింక్ పోసి, ఐస్ క్యూబ్స్ వేసి, అతనికో గ్లాసు యిస్తూ అంది మోహిత.

 

    "మైత్రేయ..... కోపం వచ్చిందా?"


    
    "నాకెందుకు కోపం....." కోపంగానే అన్నాడతను.

 

    "ఇందాక..... అమరావతిలో నువ్వు నాతో గడపాలనుకొలేదూ?" అడిగిందామె.

 

    "అవును."

 

    "గుడ్ బాయ్! నిజం చెప్పావు. నిన్ను నేను మనసారా ఆహ్వానించే సమయం వుంది. అంతవరకూ నిరీక్షించే నిగ్రహం నీకు లేదా?" అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగిందామె.

 

    అతను జవాబు చెప్పలేదు.

 

    మరో పెగ్గు  తాగాక, డిన్నర్ చేస్తున్న సమయంలో అసలు ప్లాన్ చెప్పింది మైత్రేయతో.

 

    ఆమె చెప్పిన ప్లాన్ వినగానే భయపడిపోయాడు అతను.

 

    "మనం రెడ్ హేండెడ్ గా పట్టుబడిపోతాం..... నో డవుట్!" సందేహంగా అన్నాడతను.

 

    "పిరికివాళ్ళు...... పగ తీర్చుకోండి....." బెడ్ వైపు  వెళుతూ అంది మోహిత.

 

    ఓకె.... యాజ్ యూ లైక్.... నీ తెలివితేటల మీద నాకు నమ్మకం వుంది....." సిగరెట్ పొగ వదులుతూ, కుర్చీ వెనక్కి చేరబడుతూ మైత్రేయ.

 


                                           *    *    *

 

    ఎవరో వ్యక్తిని ప్లాట్ కి కాపలాగా పెట్టి బయటికెళ్ళాడు చంద్రప్ప.

 

    తల్లిదండ్రులకు ముఖం చూపలేక చంద్రప్పకి 'కీప్' గా  మారిన ఇందు, మైత్రేయ కలసిన దగ్గర్నించి తనగురించి ఆలోచించడం మొదలుపెట్టింది.

 

    బావ తనను పెళ్ళిచేసుకోకపొయినా ఫర్వాలేదు.... ఎలాంటి పరిస్థితుల్లోనైనా బావ తనకు అండగా నిలుస్తాడన్న నమ్మకంతో, చంద్రప్పని ఎదిరించడం మొదలెట్టింది.

 

    ఇంటిలో వంట చెయ్యడం మానేసింది. చంద్రపని పట్టించుకోవడం కూడా మానేసింది.

 

    ఎప్పటికైనా ఈ వ్యక్తి, తనను వాడుకున్నన్నాళ్ళు వాడుకుని సానికొంపకు అమ్మేయడం ఖాయం. అంచేత ముందుగా జాగ్రత్తపడాలి.

 

    గత రెండురోజులుగా మైత్రేయ  ఫోన్ కోసం ఎదురుచూస్తోంది ఇందు.

 

    తను ఇక్కడినుండి తప్పించుకుని వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళుతుంది? ఈ పరిస్థితుల్లో మైత్రేయ దగ్గరకు వెళ్ళలేదు.

 

    మైసూర్ లోని శ్రీమహాలక్ష్మి దగ్గరకు వెళ్ళిపొతే...... అక్కడకు వెళుతున్నానని మైత్రేయకి చెప్పి వెళ్ళిపోవాలని ఆమె ఆలోచన. ఏ క్షణంలోనయినా మైత్రేయ నుంచి తనకు ఫోన్ వస్తుంది. తను ఎక్కడ వుండేదీ అతనితో చెప్పేసి వెళ్ళాలి.

 

    సూట్ కేస్ ని సర్దుకుని, వస్తుందో, రాదో తెలీని ఫోన్ కోసం ఎదురుచూస్తోంది ఇందు!

 

    రాత్రి తొమ్మిదిగంటలు దాటింది.

 

    ఏ సమయంలోనైనా చంద్రప్ప రావచ్చు. తను త్వరగా బైటపడాలి. మెయిన్ డోర్ తెరిచింది.

 

    ఏవయ్యా మిల్క్ పాకెట్ తెస్తావా....?" కాపలా మనిషిని అడిగింది.

 

    ఒకసారి అనుమానంగా  ఆమెవేపు చూసి "సరే" అన్నాడు ఆరురూపాయల్ని తీసి అతనిచేతిలో పెట్టింది ఇందు.

 

    అతను లిప్ట్ వరకూ వెళ్ళడం చూశాక, గబగబా వెనక్కి వచ్చి , సూట్ కేస్ తీసుకుని, డోర్ లాక్ చేయకుండానే లిప్ట్ వేపు పరుగెత్తింది.

 

    కిందకెళ్ళిన లిప్ట్, రెండునిమిషాల్లో పైకొచ్చింది. వెంటనే ఆ లిప్ట్ లోకి వెళ్ళిపోయింది ఇందు.

 

    గ్రౌండ్ ప్లోర్ లోకి వచ్చిన లిప్ట్ లోంచి, ఒక్క అంగలో బైటకొచ్చి రోడ్డుమీదున్న ఆటో ఎక్కింది ఇందు. ఆటో సందుమలుపు తిరుగుతున్న సమయంలో, చద్రప్ప కాపలాగా వుంచిన వ్యక్తి పాలపాకెట్ తో ఎదురయ్యాడు.

 

    ఆటోలో వెళ్ళిపోతున్న ఇందుని చూడగానే అతని పైప్రాణాలు పైనే పోయాయి. లబోదిబోమంటూ, ఆ ఆటోవెనకే అరుచుకుంటూ పరుగెత్తి, పరుగెత్తి అలసిపోయి, సెంటర్లో ఆగిపోయాడు.

 

    ఇందు ప్లాట్ లోంచి బయటకొచ్చిన పావుగంట తర్వాత ఫోన్ మోగింది. ఆ ఫోన్ ఇందుకోసం మైత్రేయ చేసిందే. ఎవరూ  లిప్ట్ చేయకపోవడంతో, మర్నాడు చేద్దామని ఎస్.టి.డి. బూత్ లోంచి బయటికి వచ్చాశాడు.

 

                                        *    *    *

 

    ఉదయం సరిగ్గా 9 గంటలు.....

 

    హోటల్ రూమ్ లోంచి మోహిత, మైత్రేయ బయటికొచ్చారు.

 

    "ఆపరేషన్ పూర్తయ్యేవరకూ ప్రతిక్షణం జాగ్రత్తగా  వుండాలి. ప్రతి నిముషం మనకు విలువైందని మర్చిపోకు!" కారు బ్యాక్ డోర్ తెరిచి కూర్చుంది మోహిత. డ్రైవర్ పక్కన కూర్చున్నాడు మైత్రేయ.

 

    సరిగ్గా 9.20 నిమిషాలు.

 

    అంబాసిడర్ కారు, కోర్టు బిల్డింగ్స్ ముందు ఆగింది. మోహిత దిగి లోనికి నడిచింది.

 

    మైత్రేయ చెప్పిన మీదట  కారుని రివర్స్ చేసి, చెట్టుకింద పెట్టారు డ్రైవర్ గ్లాస్ విండో స క్లోజ్ చేసి, లోన కూర్చున్నాడు మైత్రేయ.

 

    సరిగ్గా 9.30 నిమిషాలు.

 

    కోర్టు ఆవరణలో కారిడార్ లో వరుసగా జడ్డీల నేమ్ ప్లేట్స్ వేపు చూస్తూ, నడుస్తూ, ఒక కార్నర్ లో వున్న రూమ్ ఎదుట ఆగింది మోహిత.

 

    "జస్టిస్ ఆదిత్య!"

 

    నేమ్ ప్లేట్ వేపు చూసింది. అది ఆదిత్య కోర్టుహాల్లోకి వెళ్ళేముందు రిలాక్సయ్యే పర్సనల్ రూమ్. రూమ్ ముందు ఎడమ పక్కన చిన్నస్టూలుమీద అటెండర్ కూర్చున్నాడు.

 

    మొహితను చూడగానే అతను లేచి నిలబడ్డాడు.

 

    "ఎవరు కావాలమ్మా....?"

 

    "ఆదిత్యగారి రెసిడెన్స్ నుంచి వస్తున్నాను. పదిగంటలకల్లా కోర్టుకొస్తానన్నారు. రూమ్ లో వెయిట్ చెయ్యమన్నారు" చెప్పిందామె.

 

    "ఉరుములు, పిడుగులు పడుతున్నా జడ్డీగారు పదిగంటలకల్లా వచ్చేస్తారమ్మా.....లోనకెళ్ళి కూర్చోండి...." డోర్ తెరిచాడు అటెండర్.

 

    లోనికి నడిచింది మోహిత చేతిలో హేండ్ బ్యాగ్ తో.

 

    విశాలమయిన రూమ్. ఎడమవేపు సోఫా. ఎదురుగా నాలుగు ఛైర్స్, బుక్స్ రాక. కుడివైపు డైనింగ్ టేబుల్, దానికి కొంచెం దూరంలో డ్రెస్సింగ్ మిర్రర్.

 Previous Page Next Page