Previous Page Next Page 
అక్షరయజ్ఞం పేజి 30

  

     "ఇవేంటిలా బ్లాంకెట్స్ లా వున్నాయి? చీరలేనా?" మౌనిక ప్రశ్నకు బట్టల షాపతనితోపాటు మాధుర్ కూడా ఆశ్చర్యపోయాడు.
   
    ఆమె తమాషాకి అలా అంటుందో, లేక సీరియస్ గానే అంటుందో అర్ధంకాక తికమకపడ్డాడు మాధుర్.
   
    "కొనే ఓపికుంటే నాలుగువేల రూపాయల చీరలు కూడా మావద్ద వున్నాయి మామూలు మధ్యతరగతి వాళ్ళకి ఈ బ్లాంకెట్స్ చాలా గొప్ప" అన్నాడు కౌంటర్ లోని వ్యక్తి.
   
    అప్పటికిగాని తను చేసిన తప్పు గ్రహించలేదు మౌనిక. గ్రహించగానే తనలో రేగిన కంగారును కంట్రోల్ చేసుకుంటూ-
   
    "సరదాగా అన్నాను. సీరియస్ గా ఫేస్ పెట్టే షాపింగ్ చేయాలా? జోక్ చేయకూడదా?" తనకేసి ఒకింత ఆశ్చర్యపోయి చూస్తున్న మాధుర్ కేసి బుంగమూతి పెట్టి అంది మౌనిక.
   
    మాధుర్ నవ్వేశాడు.
   
    కౌంటర్ లోని వ్యక్తి ముఖం వెలిగిపోయింది.
   
    "మీ అంత అందమయిన అమ్మాయిలు జోకులేసినా అవి అందంగానే వుంటాయి" అంటూ ఓ పిచ్చి కామెంట్ చేసి ఒక్కొక్క చీర మడత విప్పదీసి చూపించసాగాడు కౌంటర్ లోని వ్యక్తి.
   
    "నీ బడాయి కబుర్లు ఎవరన్నా సడన్ గా వింటే నువ్వు నిజంగానే ఓ మిలీనర్ కూతురువను కుంటారు. మొత్తానికి భలేదానివే..." అన్నాడు మాధుర్ నవ్వుతూ.
   
    ప్రమాదం దగ్గరదాకా వచ్చి తప్పిపోయినందుకు గుండెల నిండా ఊపిరి తీసుకుంది మౌనిక.
   
                               *    *    *    *    *
   
    మరో మూడు రోజులకు విచిత్రమైన ప్రకటన మరలా అన్ని పత్రికలలో వచ్చింది.
   
    Nude Models Wanted.
    Figure : Chubby
    Chin   : Double
    Skin   : Peachp
    Haire  : Preferably
    Eyes   : Brown.
   
    అని పైన పెద్ద అక్షరాలతో వుంది. (ఒక్క రోజు ముందుకెళితే) మాధుర్ ఆ ప్రకటన రాస్తుండగానే వెనుక నుంచి చూసిన మౌనిక ముందు కళ్ళు పెద్దవి చేసికొని ఆశ్చర్యపోయింది.
   
    ఆ తరువాత "ఛీ...ఛీ సిగ్గులేదు... అలా ఇచ్చావంటే నిన్ను అరెస్ట్ చేస్తారు" అంది ఒకింత సిగ్గుపడుతూ.
   
    "మరీ అంత తొందర పనికిరాదు.... చూస్తుండు నా ఈ ప్రకటన దేశమంతటా ఎంత సంచలనాన్ని సృష్టిస్తుందో..." అన్నాడు ఆమెకి కనిపించకుండా క్రింద మరేదో రాస్తూ.
   
    అది తెలిసిన గంగాధరరావు, భార్గవ కూడా భయపడ్డారు.
   
    కానా విషయాన్ని చెప్పటానికి ఆ ఇద్దరూ ఒకింత జంకారు.
   
    వాళ్ళలో నమ్మకం...
   
    మాధుర్ చాలా తెలివికలవాడు- ఖచ్చితంగా ఏదో సంచలనం సృష్టిస్తాడని.
   
    ఆ ప్రకటన వ్రాసి ఆ సాయంత్రమే అన్ని దినపత్రికలకి పంపించాడు సీల్డ్ కవర్ లో.
   
    మాధుర్ ఒక్కడే ప్రశాంతంగా వున్నాడు. మిగతా ముగ్గురూ ప్రాణాల్ని అరచేతుల్లో పెట్టుకుని ఎదురుచూశారా రాత్రంతా.
   
    ప్రకటన చివర ఏదో రాశాడు. అదేమిటో అడిగినా చూపించకుండా చిద్విలాసంగా నవ్వాడు.
   
    అదేమయి వుంటుందని ఆ ముగ్గురూ బుర్రలు బ్రద్దలు చేసుకొని మరీ ఆలోచించారు. ఉహూ... ఫలితం లేకపోయింది.
   
    "కానందులోనే ఒక గిమ్మిక్ వుంది. అదే మనకు లైఫ్ నిస్తుంది. అందరూ ముందు వ్రాసిన మేటర్ చూసి షాక్ తింటారు. చివర లైన్ చదివి కడుపుబ్బ నవ్వుకుంటారు" అన్నాడు మాధుర్ తాపీగా.
   
    (వర్తమానంలోకి వస్తే)
   
    మౌనిక ఆరోజు దినపత్రికలన్నీ ఆత్రంగా తన ముందుకు లాగేసుకొని వేగంగా చదవడం ప్రారంభించింది.
   
    అంతా తాను అంతకుముందు రోజు చూసినట్టుగానే వుంది. చివర లైన్ కోసం ఆమె కళ్ళు వేగంగా పరుగెత్తాయి.
   
    అక్కడ....
   
    Age : 8-12 months అని వుంది. ఆమెకో క్షణం ఏం జరిగిందో అర్ధం కాలేదు.
   
    అర్ధమైన మరుక్షణం అమాంతం మాధుర్ మీదకు దూకినట్టుగా వెళ్ళి అతనివైపు అభినందనగా చూస్తూ "రియల్లీ యూ ఆర్ ఎ జీనియస్...." అంది.
   
    మాధుర్ చిన్నగా నవ్వాడు. "మరి నాకేం యివ్వవా?" అన్నాడు మాధుర్ ఆమెకేసి తొలిసారిగా ఆసక్తిగా చూస్తూ.
   
    "ఎనీ థింగ్... ఏదీ కావాలన్నా ఇస్తాను. హోండాకారు కావాలా?" అంది ఆనందోద్వేగంతో.
   
    అతను బిత్తరపోయాడు. అంతలోనే తిరిగి తేరుకుంటూ "ఆ బడాయి కబుర్లే వద్దన్నాను" అన్నాడు చిన్నగా నవ్వుతూ.
   
    ఆమె చేసిన తప్పును గ్రహించి చప్పున నాలిక్కరుచుకుంది.
   
    ఎంత జాగ్రత్తగా వ్యవహరించాలన్నా తన స్థాయికి తగ్గ మాటలే వస్తున్నాయి. ఇంకా నయం... అవన్నీ తనేదో సరదాగా, బడాయిగా అంటున్నదనుకుని తనూ సరదాగా తీసుకుంటున్నాడు.
   
    "ఛికోరా డమ్ డమ్ యివ్వనా?" అంది.
   
    అది విని మాధుర్ పెద్దగా హాయిగా నవ్వుతుంటే ఆమె అలా చూస్తుండిపోయింది.
   
    నవ్వుతుంటే ఆడపిల్ల మాదిరిగా బుగ్గలు సొట్టలు పడుతుంటాయి మాధుర్ కి.
   
    ఇప్పుడామె వాటికే తమాషాగా చూస్తోంది.
   
    అతనో క్షణం ఆలోచిస్తుండిపోయాడు.
   
    ఆ బిల్డింగ్ కి ముందు వున్న హాలు ప్రక్కనే వున్న పెద్ద గదిని తన గదిగా మార్చుకున్నాడు మాధుర్.
   
    ఆ గదికి ఆనుకొని వున్న మరో చిన్న గదిని మౌనికకు ఎలాట్ చేసాడు.
   
    దానికి ఎదురుగా ఆ వేపున వున్న పెద్దగదిని గంగాధరరావుకి కేటాయించి, దాని ప్రక్కనే వున్న గదిని భార్గవకు కేటాయించాడు.
   
    ప్రస్తుతానికి ఆ బిల్డింగ్ లో ఆ నల్గురే వున్నారు.
   
    నలుగురికి నాలుగు పాత కుర్చీలు, నాలుగు పాత టేబుల్స్ వున్నాయి.
   
    మిగతా బిల్డింగ్ అంత నిశ్శబ్దం... పేదరికం, అప్పులు, శూన్యం, నిరాశా, నిస్పృహలు... స్ట్రగుల్ ఫర్ ఎగ్జిసెన్స్... బ్రతుకు పోరాటం... అస్థిత్వపు ప్రశ్నలు... ఆశలకి నిచ్చెనలు... కలలకి సోపానాలు...
   
    గంగాధరరావు- మాధుర్ ఏదో తాపత్రయపడుతున్నాడు గానీ యిది నిలబడుతుందా! అని ఆలోచిస్తున్నాడు.
   
    భార్గవ... నిండా మునిగిన వాళ్ళకు చలేంటి...? అని యోచిస్తున్నాడు.
   
    మౌనిక-మాధుర్ జీనియస్. ఏదైనా చేయగలడు. తనకు ఎలా ఉపయోగపడతాడు? అని యోచిస్తోంది.
   
    మాధుర్- ఆఫీసయితే ప్రారంభించాం- కానీ పెట్టుబడి ఎలా? ఎలా సమకూర్చుకోవాలి? ప్రమీలారాణి.... దిగ్రేట్ వదెనమ్మ పొగరుకి ఎలా సమాధానం చెప్పాలి? అని ఆలోచిస్తున్నాడు.
   
    సరిగ్గా ఆ సమయం ఉదయం 9-30.
   
    ఈ పురాతన బంగ్లాలో వీళ్ళిలా ఎలా? ఏమిటి? ఎంత? ఎక్కడ? ఎప్పుడు? అని గుబులుగా ఒంటరితనాన్ని ఆశ్రయిస్తే...?
   
    దేశమంతటా ఆ ప్రకటన చదివి, పాఠకులు, ప్రజలు అందరూ విపరీతంగా ఆనందిస్తున్నారు.

    పెద్ద పెద్ద ఎడ్వర్టెయిజింగ్ ఏజెన్సీ బాస్ లు ఒకింత కలవరపడ్డారు. ఎవరీ జీనియస్... ఎంత సెన్సాఫ్ హ్యూమర్...? అని.
   
    ఎడ్వర్టెయిజర్స్ తమ ప్రోడక్ట్స్ కి పబ్లిసిటీ ఏ ఏజెన్సీ ద్వారా ఇప్పిస్తే బాగా క్లిక్ అవుతుందని ఆలోచిస్తున్న టైమ్ లో ఆ ప్రకటన అందరి దృష్టిని ఆకర్షించింది.
   
    ఎవరిదీ మేడిసన్ ఎవెన్యూ?
   
    కేవలం కొన్ని అంగుళాల స్థలంలో యితను సృష్టించిన సంచలనం సామాన్యమైనదేం కాదు.

 Previous Page Next Page