Previous Page Next Page 
అక్షరయజ్ఞం పేజి 29

  

       మేధస్సు, లక్ష్యశుద్ది వున్న వ్యక్తిని ఇతరులెవరూ నాశనం చేయలేరు. ఎందుకంటే అతని నాశనం, అభివృద్ధి అతని చేతిలోనే వుంటాయి కాబట్టి, మరి నే వస్తాను. భవిష్యత్ లో మీరు ఎన్నో ఎత్తులకు ఎదగాలని అభిలషిస్తున్నాను.
   
    మౌనంగా వున్న ఆ ముగ్గురికేసి ఓసారి చూసి శెలవు తీసుకున్నాడు గంగాధరరావు.
   
                                *    *    *    *    *   
   
    "మన దగ్గరున్న ఈ యాభైవేలతో ఏం వ్యాపారం చేయగలం? పెద్ద పెద్ద ఏడ్ ఏజన్సీలు మార్కెట్ ని ఆల్ రెడీ కైవశం చేసుకుని వున్నాయి" భార్గవ ఒకింత నిస్పృహగా అన్నాడు.
   
    మౌనిక మాధురేం చెబుతాడో అని ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
   
    'Charles chaplin makes a million dollars a year out of a funny, shuffling walk and a pair of baggy-trousers, because he dose some thing different. Take the hint and individualize your self with some distinctive idea....'
   
    ఎటో చూస్తూ అన్నాడు మాధుర్.
   
    కొన్ని క్షణాల మౌనం తర్వాత-
   
    "చిన్న టోపీ, లూజ్ కోట్, లూజ్ ఫ్యాంట్, పిచ్చి షూస్, చేతిలో చిన్న కర్రతో చిటుకు చిటుకుమంటూ నడుస్తూ కొన్ని వందల కోట్లు సంపాదించాడు. ది గ్రేట్ చార్లి చాప్లిన్! ఎలాగంటావ్?" మాధుర్ భార్గవను ప్రశ్నించాడు.
   
    భార్గవ సమాధానం చెప్పలేక మౌనంగా వుండిపోయాడు.
   
    "తనను తాను ప్రత్యేకంగా తీర్చిదిద్దుకోవడం మూలంగా అలాగే మనమూ ఏదో ఒక విచిత్రంచేసి అందరి దృష్టికి  రావాలి ముందు. ఆ తరువాత వాళ్ళంతట వాళ్ళే మనల్ని గుర్తిస్తారు. ఆ గుర్తింపులోంచే వ్యాపారం, డబ్బు, పలుకుబడి, పరువు ప్రతిష్టలు పుట్టుకొస్తాయి..." మాధుర్ చిర్నవ్వుతో అని మౌనంగా పచార్లు చేయసాగాడు.
   
    మొత్తానికి ఏదో అద్భుతం చేసి సంచలనం సృష్టించే ఆలోచనల్లోనే మాధుర్ వున్నాడని గ్రహించిన మౌనిక, భార్గవ అతని ఆలోచనలకు అంతరాయం కలిగించగూడదనే ప్రక్కకు తప్పుకున్నారు.
           
                                 *    *    *    *    *
   
    సరిగ్గా ఐదురోజులకు ఒక అద్భుతం జరిగింది. అది  జరగబోతున్నట్లు చూచాయగా మాత్రమే మాధుర్ వాళ్ళకు చెప్పాడు.
   
    ఐదో రోజు-
   
    అన్ని దినపత్రికలలో ఓ ప్రకటన ప్రముఖంగా చోటు చేసుకుంది.
   
    "You Deserve a break today" అనే హెడ్ లైన్స్ మేటర్ ఇలావుంది.
   
    Better to die on your feat then live on your knees.
   
    మోకాళ్ళమీద బ్రతికేకన్నా కాళ్ళమీద చనిపోవడం మంచిది. నిరుద్యోగులైన యువతి యువకులు.... మీ కాళ్ళమీద మీరు నిలబడాలనుకుంటున్నారా? అలా అనుకుంటే ఆ అవకాశాన్ని మేం కల్పిస్తాం. మా క్లైంట్స్ తాము ఉత్పత్తి చేసిన వస్తువుల్ని గోడౌన్స్ లో అట్టే పెట్టుకోవాలనుకోవడం లేదు.
   
    వారి ఆకాంక్షను మేం నెరవేరుస్తాం. అందుకు మీరు మాకు సహకరించాలి. మీరందించే సహకారానికి మేం విలువ కడతాం.
   
    నిరాశా నిస్పృహలతో నీరసపడుతూ నీరుగారుపోయే వృద్ద యువతి యువకులు మాకు అక్కర్లేదు.
       
    వెంటనే ఈ క్రింది అడ్రస్ కు అప్లై చేయండి.
   
    పై ప్రకటన క్రింద మేడిసన్ ఎవెన్యూ అడ్రస్ వుంది.
   
    "నీ ధైర్యమేమిటి మాధుర్...? మనకే పనిలేక ఖాళీగా వుంటే, మనం మరికొంతమందికి పనెలా కల్పంచగలం?" భార్గవ విస్తుపోతూ అడిగాడు.   

    "అవును... నాకూ అదే అనిపించింది" అంది మౌనిక చేతిలో వున్న దినపత్రికలన్నీ ఫోల్డ్ చేసి పట్టుకుంటూ.
   
    మాధుర్ చిన్నగా నవ్వాడు.
   
    "బిజినెస్ ఇవ్వాళ లేకపోవచ్చు. రేపు రావచ్చు. అయినా మనం ఏ ఐదారుగురికో ఉద్యోగాలిస్తాం. కాని చూసేవారికీ మాత్రం మనం భారీ ఎత్తున మార్కెట్ లోకి అడుగిడుతున్నట్లు ప్రొజెక్ట్ అవుతుంది. అవునూ... నీకు బట్టలున్నాయా?" అన్నాడు మౌనిక వంక చూస్తూ ఆమె క్రితంరోజు కట్టుకున్న శారీనే ఆ రోజూ కొట్టుకొని వుంది.
   
    ఆమె లేవన్నట్లు తల అడ్డం ఆడించింది.
   
    "ముందు మనం బట్టల షాపుకెళ్ళాలి పదా... భార్గవా నువ్వు ఆఫీస్ లోనే వుండు- మేము గంటలో వచ్చేస్తాం" బయటకు నడిచాడు మాధుర్.
   
    వెనుకే మౌనిక బయలుదేరింది.
   
    మాధుర్ ఎక్కువగా చెప్పాలనే ఉద్దేశంలో లేనట్లు అర్ధమయింది భార్గవ, మౌనికలకు.
   
                              *    *    *    *    *
   
    మౌనిక, మాధుర్ ఒక రిక్షా ఎక్కారు.
   
    అది నెమ్మదిగా షాపింగ్ సెంటర్ కేసి బయలుదేరింది.
   
    మౌనిక కదంతా కలలో వున్నట్లుగా వుంది.
   
    ఆమె శారీరకంగా పడుతున్న బాధ, ఆమె ఫీలవుతున్న థ్రిల్ ముందు పెద్దదిగా అనిపించడంలేదు.
   
    ఒక వ్యక్తి, ఒకే ఒక్కరోజు తేడాతో విరుద్దమైన రెండు జీవిత విధానాల మధ్య జీవించటం అంత త్వరగా అనుభూతికి అందదేమో... అందితే అంతకుమించిన థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ మరొకటి వుండదు.
   
    ఇదిలా వుండగా మరోచోట-
   
    "మనిషిని బోలిన మనిషి వుంటారంటే నేనిదివరకు నమ్మేవాడ్ని కాదు. తీరా చూస్తే నమ్మక తప్పలేదు" అన్నాడు రమణయ్య వేడివేడిగా వున్న టీని కొద్దికొద్దిగా చప్పరిస్తూ.
   
    "ఎవర్ని చూశారు? ఎక్కడ చూశారు?" వైకుంఠం అనే వ్యక్తి ఆసక్తిగా అడిగాడు.
   
    వైకుంఠం జె.జె. ఎంఫైర్ లో పబ్లిక్ రిలేషన్స్ వింగ్ లో ఎం.పి.ఆర్.ఓ.గా పనిచేస్తున్నాడు.
   
    అతన్ని చాటుగా కాకి అని పిలుస్తుంటారు ఆఫీసులో.
   
    తనకేదన్నా విషయం తెలిస్తే చాలు- కనిపించిన ప్రతివాడికి అది చెప్పేదాకా ఊపిరి కూడా తీసుకోడు. అతన్ని ఎదురుగా మాత్రం ఆకాశవాణి అని ముద్దుగా పిలుస్తుంటారు. అందుకు అతను సంతోషిస్తాడు కూడా.
   
    రమణయ్య కావాలనే అతన్ని ఎన్నుకున్నాడు.
   
    "నువ్వెప్పుడయినా మన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గార్ని చూశావా?" రమణయ్య ప్రశ్నించాడు.
   
    "ఎవర్ని? ది గ్రాండ్ డాటరాఫ్ ది గ్రేట్ జె.జె. గురించేనా మీరు చెప్పేది?"
   
    "అవును... ఆమె గురించే."

    "మొన్నీ మధ్య చూశాను. ఆరోజు లక్కీగా ఆఫ్ డ్యూటీ అవుట్ డోర్ కేన్సిల్ అవడంతో ఆఫీస్ కి ఎర్లీగా వచ్చాను. నా అదృష్టం బావుండి పదడుగుల దూరంనుంచి ప్రత్యక్షంగా చూశాను.....ఆ రాసజం, ఆ అందం, ఆ సౌకుమార్యం... చాలా రేర్... బ్రీత్ టేకింగ్ పర్సనాలిటీ" వైకుంఠం మౌనికను గుర్తు తెచ్చుకుంటూ ఆమెపట్ల గౌరవాన్ని వ్యక్తపరుస్తూ అన్నాడు.
   
    "అచ్చం ఆమెలాంటి యువతీనే నేను చూశాను."
   
    "వ్వాట్...?" వైకుంఠం ఆశ్చర్యపోతూ అన్నాడు.
   
    "ఎస్... అచ్చం... ముమ్మూర్తులా ఆమెలాగే వుంటుంది. నేను పొరబడి దగ్గరకు కూడా వెళ్ళాను. తీరా దగ్గరకు వెళ్ళాక నా పొరపాటు తెల్సుకున్నాను."
   
    వాళ్ళిద్దరిప్పుడు జె.జె. ఎంపైర్ ఆఫీసర్స్ కేంటీన్ లో వున్నారు.
   
    రమణయ్య నిజాయితీపరుడు- చచ్చినా అబద్దం ఆడి ఎరుగని మంచి మనిషి ఆయనే అలా చెప్పాడంటే దగ్గరి పోలికలు లేందే చెప్పడు. ఒకవేళ నిజమేమో?!
   
    "మీరు పొరబడ్డారేమో... ఈవిడగార్ని చూసే అలా భావించారేమో?" వైకుంఠం ఇంకా నమ్మలేకపోతున్నాడు.
   
    "నీ దయ వలన నాకింకా చత్వారం రాలేదు. ఈవిడ్నగార్కి రిక్షా ఎక్కాల్సిన ఖర్మ ఏం పట్టింది. ముతక చీరలు కట్టాల్సిన గత్యంతర మేముంది? ఆమె తలుచుకుంటే అచ్చం బంగారాన్నే నేయించి చీరలు తయారుచేయించుకోగలదు. ముఫ్ఫైలక్షల సూపర్ లక్జరీ మెర్సిడస్ కారులో తిరిగే ఆమె రెండువేల రిక్షాలో తిరుగుతుందా?"
   
    "ఆమె రిక్షాలో తిరుగుతోందా? ముతక చీరలు కట్టిందా?"
   
    "అవును."
   
    "అయితే ఎండీగారు కాదు- నాకోసరి చూపించరా?" వైకుంఠానికి మేత దొరికింది.
   
    కాకిలా అరవటానికి విచిత్రమయిన కబురు తెలిసింది.
   
    రమణయ్య పెదవులపై చిర్నవ్వు క్షణకాలం మెరిసి అదృశ్యమయింది.
   
                                 *    *    *    *    *

 Previous Page Next Page