Previous Page Next Page 
సంకల్పం పేజి 29

 

       అందుకే వికాస్ ని చూడగానే తనలో తాను కలవరపడింది.
   
    ఆ కలవరం పయనించే దిశ మాత్రం ఆమెకు తెలీదు!!
   
                                   *    *    *    *    *
   
    ఆనందాన్నిగానీ, దుఃఖాన్నిగానీ ఎప్పుడూ బయటకు చెప్పడు వికాస్.
   
    ఆనందాన్ని ఆనందిస్తాడు. దుఃఖాన్ని దిగమింగుతాడు.
   
    కానీ ఇవాళ చాలా ఆనందంగా వుంది వికాస్ కి.
   
    ఎక్కడో పుట్టాడు. ఎక్కడో పెరిగాడు. ఎన్నో నరకయాతనలు పడ్డాడు. ప్రతిక్షణం బతుకుతో పోరాటం.
   
    జీవితపు వైకుంఠపాళీలో ఎక్కే నిచ్చెన-దిగే నిచ్చెన- నోరుసాచి ఎదురుచూసే త్రాచుపాము దురదృష్టం!
   
    ఒక్కొక్క మెట్టూ ఎక్కుతున్నాడు వికాస్.
   
                           హోటల్ డాల్ఫిన్ ...
   
    ఒక్కొక్క మెట్టూ ఎక్కుతున్నాడు వికాస్. పక్కన సన్నజాజుల దండలా లిఖిత -
   
    ఇవాళ వికాస్ ని బాగా అల్లరి పెట్టాలి.
   
    అతన్ని బాగా కవ్వించాలి. అతన్ని రెచ్చగొట్టాలి.
   
    తన మీద అతని అభిప్రాయం ఏమిటో తెలుసుకోవాలి!
   
    తెలుసుకున్నాక...       
   
    అతను ఆశ్చర్యపోయే న్యూస్ చెప్పాలి!!
   
    ఆ 'న్యూస్'ని విని వికాస్ ఎలా రియాక్ట్ అవుతాడు?
   
    ఏ.సి. రెస్టారెంట్లోకి అడుగుపెట్టరిద్దరూ. కౌంటర్లోని వ్యక్తితో మాట్లాడింది లిఖిత.
   
    "మీకు, మీరు కోరినట్టుగా టేబిల్ రిజర్వ్ చేశాం.... మేడమ్" అని వెంటనే, "బోయ" అని పిల్చాడతను.
   
    వాళ్ళిద్దర్నీ బోయ్ వాళ్ళకి 'రిజర్వ్' చేసిన టేబిల్ దగ్గరకు తీసుకొచ్చాడు.
   
    దానిమీదున్న చిన్న ప్లాస్టిక్ నేమ్ ప్లేట్ చూసి ఆశ్చర్యపోయాడు వికాస్.
   
    RESERVED FOR VIKAS.
   
    "ముందుగా అన్నీ చేసేసి నన్ను పార్టీ అడిగారా..." కూర్చుంటూ అన్నాడు వికాస్.
   
    హేండ్ బేగ్ టేబిల్ మీద పెట్టి, పైట సర్దుకుని కూర్చుంది లిఖిత.
   
    "రిజర్వ్ డ్ ఫర్ వికాస్... ఈ టేబులూ..." నవ్వుతూ అన్నా అందులో కవ్వింపు ఉంది.
   
    "లేకపోతే నేననుకున్నారా..." సడన్ గా అనేసింది లిఖిత. ఆ మాటకు ఎలా రియాక్టవ్వాలో తెలీక అటూ ఇటూ దిక్కులు చూస్తున్న వికాస్ ని చూసి మనసులోనే నవ్వుకుంది.
   
    స్పెషల్ మీల్స్ ఆర్డరిచ్చింది స్టీవార్డ్ రాగానే.
   
    "ఒక ప్రొడక్ట్ ని మార్కెట్లో సక్సెస్ చెయ్యాలంటే ఏం చెయ్యాలో, మీ సలహా ఏవిటో చెప్పండి...." సీరియస్ గా ఆమె ముఖంలోకి చూస్తూ అడిగాడు వికాస్.
   
    వికాస్ చూస్తున్న పద్దతిని అనుకరిస్తూ అలాగే చూస్తూ...
   
    "ఇక నుంచీ మీకు మార్కెట్లూ, కార్లూ.... ఇవ్వే తప్ప మరేం మీ మాటల్లో దొర్లవా? ఎదురుగా కూర్చున్నది అందమైన అమ్మాయి.... అవునా... వున్నది రెస్టారెంట్లో... అవునా... సరదాగా కబుర్లు చెప్పొచ్చుగా ఈ కాసేపైనా..." చిరుకోపాన్ని అభినయించింది.
   
    "ఆ బోన్సాయి మొక్కల్ని" నాటో అక్కడ కిటికీ పక్కన అలంకరణ కోసం ఉంచిన బోన్సాయి మొక్కల్ని చూపిస్తూ "వాటిని చూసినపుడల్లా నాకు చాలా విచిత్రంగా వుంటుందండి. అసలు బోన్సాయిని ఎలా పెంచుతారో తెల్సా... మీకు."
   
    "సరదా కబుర్లంటే ఇవ్వా..."
   
    "మరి... మొన్నో క్రయిం సినిమా చూశాను... ఆ కథ చెప్పనా..."
   
    "చె.... ప్ప....౦డి..." అంది లిఖిత ఒకింత అలాకాని అభినయిస్తూ.
   
    "కథాకాలం 1937... లండన్లో ఓ వీధి... అడుగుల శబ్దం... మనిషి నీడ.... అలా మనిషి నీడ అరగంటసేపు ఆ వీధిలో కదలాడుతుంది. ఆ తర్వాత....ఆ వీధిలో ఓ ఇంట్లోంచి ఓ ముసలావిడ... తలుపు తెరచుకుని బయటికొస్తుంది... అలా నక్కి నక్కి చుట్టూ చూసుకుంటూ వచ్చి, చీకట్లో ఆ నీడను చూసి భయపడి అరచి పడిపోతుంది. ఇంతలో ఇంట్రవెల్..." చెప్పడం ఆపాడు వికాస్.
   
    "ఆ తర్వాత కధ నేన్చెప్పనా..."
   
    "చెప్పండి..."
   
    "ఇంట్రవల్ తర్వాత.... ఆ నీడ, ఆ ముసలావిన్ని లేపుతుంది. ఆ ఓల్డ్ లేడీ ఆ నీడ మనిషిని చూసి బొటబొటా కన్నీళ్ళు కార్చి ఓ డియర్..... ఎన్నాళ్ళకు కలుసుకున్నాం అంటుంది. తర్వాత ఇద్దరి నీడలూ, ఓ అరగంటసేపు కన్పిస్తాయి.... అంతేనా..." విసురుగా గబగబా చెప్పింది లిఖిత.
   
    "అది కాదు కధ తప్పు చెప్పారు. ఆ సిన్మా మీరు చూడలేదు.... అవునా" అని సీరియస్ గా కధ చెప్పడం ప్రారంభించాడు వికాస్.
   
    "చెప్పడం ఆపుతారా వెళ్ళిపోమంటారా..."
   
    అదే సమయంలో భోజనం తెచ్చి పెట్టాడు బేరర్.
   
    ఏం మాట్లాడకుండా భోంచేస్తున్న లిఖితను చూసి-
   
    "భోంచేసేటప్పుడు మాట్లాడరా మీరు..."
   
    "ఆ మాటకు వెంటనే ఏవైనా మాట్లాడితే.... మళ్ళీ మీరేదో క్రైం కధ మొదలెడతారని" అంది లిఖిత పెదాల మాటునే నవ్వును బిగపట్టుకుంటూ.
   
    "మరి మీకు ఏ అమ్మాయితో స్నేహం లేదన్నారుగా.... ఇందాక మీ ఆఫీసులో ఆ అమ్మాయి...." ఆనంది జ్ఞాపకం రావడంతో అడిగింది లిఖిత.
   
    "ఆనంది శివమూర్తిగారమ్మాయి.... అప్పుడే వచ్చింది.... అప్పుడే పరిచయం..." చెప్పాడు.
   
    "ఇంకెప్పుడూ అక్కడే వుంటుందేమో..." లిఖిత గొంతులో ఏదో అసూయ.   
   
    "అక్కడే అంటే మీకేవైనా నష్టమా?" నవ్వుతూ అన్నాడు వికాస్.
   
    "నాకేం.... నష్టం.... ఉంటే మీకే నష్టం ఉండాలి. సరైన గర్ల్ ఫ్రెండ్ లేక విలవిల్లాడిపోతున్నారు. బోరు కొడితే సిన్మాకి కంపెనీ వుంటుంది లెండి..."
   
    "పాపం....ఆ అమ్మాయెలాంటిదో తెలీదు.... ఏవిటో తెలీదు. అభాండం ముందు పుట్టి, ఆడది తర్వాత పుట్టిందన్నారందుకే..." అంటూ చేతులు కడుక్కోడానికి వాష్ బేసిన్ దగ్గర కెళ్ళాడు వికాస్.
   
    వచ్చి కూర్చున్నాక లిఖిత వెళ్ళింది.
   
    "వస్తూ-

    "మీకెప్పుడైనా కలలొస్తుంటాయా?" అని అడిగింది.
   
    "రావు..."
   
    "ఎప్పుడూ..."
   
    "ఎప్పుడో అడపా దడపా..."
   
    "వచ్చినప్పుడు ఏం కనిపిస్తాయి కలలో...."
   
    "కార్లు" టక్కున చెప్పాడు వికాస్.
   
    ఆ మాటకు బిగ్గరగా నవ్వింది లిఖిత.
   
    "నిజమండీ.... అదేమిటో.... నాకు చిన్నప్పటి నుంచీ అంతే. సైకిల్ చక్రాలు, కార్లు, జీపులే కలలో కొస్తాయి."
   
    "పోనీయండి. ఎప్పుడైనా మీ కల్లోకి ఓ అందమైన ఆడపిల్ల వచ్చిందనుకొండి. ఏం చేస్తారు."
   
    "వెంటనే నాకు మెలుకువొచ్చేస్తుందండి" ఆ మాటకు మళ్ళీ పొట్టచెక్కలయ్యేలా నవ్వింది లిఖిత.
   
    "మెలుకువొచ్చాక ఏం చేస్తారు. ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తారా!"
   
    "మీరేవైనా కలల మీద పరిశోధన చేస్తున్నారా చెప్పండి. నన్నెందుకు ఇలా చక్కని భోజనం పెట్టి మరీ ఇబ్బంది పెట్టెస్తున్నారు..." వికాస్ అన్నాడు.
   
    "తప్పించుకోకండి. నేనడిగిన దానికి జవాబు చెప్పండి."
   
    "నాకల్లో కొచ్చింది. నువ్వేనా.... నువ్వేనా అని కాలేజీల వెంబడి, సూపర్ బజార్ల వెంబడి వెతకాలి" అన్నాడు వికాస్ నవ్వుతూ.
       
    "అమ్మాయిలు కాలేజీల్లోనూ, సూపర్ బజార్లలోనే వుంటారా! మరెక్కడా వుండరా" మరీ అల్లరిగా అడిగింది.
   
    "ఈ సృష్టిలో మొత్తం అమ్మాయిలే వుంటారు.... సరేనా నాక్కావల్సిన అమ్మాయిని నేను వెతుక్కుంటాను.... సరేనా మీ ఇంటర్వ్యూ ఆపండి."
   
    "అయిపోయింది. మీక్కావలసిన అమ్మాయిని మీరు వెతుక్కుంటా రన్నారా! ఎప్పట్లోగా వెతుక్కుంటారో చెప్పేస్తే వదిలేస్తాను."
   
    తప్పదా! అన్నట్టు చూశాడు వికాస్.
   
    'తప్పదు' అన్నట్టు చూసింది లిఖిత.
   
    "వారం రోజులు" చెప్పాడు వికాస్ ఏదో ఒకటి చెప్పాలని.
   
    "సరిగ్గా వారంరోజులు"
   
    "ఎస్."
   
    "మీరు ఆ అమ్మాయి పేరు, ఎడ్రస్సు చెప్పాలి" అంది లిఖిత తల వంచుకొని.

 Previous Page Next Page