"మరీ లోకజ్ఞానంలేని ఫూల్ ననుకుంటున్నావా నన్ను. చూడు కలెక్టరబ్బాయ్__రోజా అంటే సర్పయాగం సిన్మాలో రామానాయుడు ఇంట్రడ్యూస్ చేసిన అమ్మాయేకదా__చాలా మంచి పిల్ల. సీతారత్నం గారబ్బాయి సినిమాద్వారా పైకొచ్చిన పిల్లేకదా__నాకెందుకు తెలీదూ" రోజా హిస్టరీ కాంతమ్మ చెప్పేసరికి నిర్ఘాంతపోయాడు కలెక్టర్ దాదా.
"మీ వయసు వాళ్ళకి కన్నాంబ, రుషీంద్రమణి__అంజలీ వగైరాలు తెల్సుండాలికానీ ఈ కొత్తరకం హీరోయిన్ల గురించి తెలియడం నాకు చాలా వండర్ గా వుంది" మరింత ఆశ్చర్యాన్ని నటించేసాడు దాదా. యిలా ఆమెను పొగిడి పొగిడి తనొచ్చిన కార్యాన్ని పూర్తి చేసుకొని వెళ్ళిపోవాలని దాదా ప్లాన్.
"అయ్యో! పిచ్చి కలెక్టరూ__అందరూ వేరు ఈ కాంతమ్మ వేరయ్యా? చూస్తావా నా తడాఖా ప్రపంచ వ్యాప్తంగా యంగ్ హీరోయిన్స్ హిస్టరీ చెప్పమంటావా__హాలీవుడ్ లో షరోన్ స్టోన్ అని ఓ అమ్మాయి బట్టలవీ మరీ పీనాసితనంగా, అతి తక్కువవాడి అన్నీ చూపించడం ద్వారా, ఫేమస్ అయిపోయింది. మన బాలీవుడ్ లో పూజా బేడీ అనూ అగర్వాల్, మమతాకులకర్ణి ఇలా సదరు హీరోయిన్లు.....పిచ్చి పిచ్చిగా నటించేస్తున్నారు కదయ్యా. తమిళం చూడు-కుష్ బూ జనరేషన్ అయిపోయాక ఆ స్థానంలోకి మీనా, నగ్మా, రంజిత ఇలాంటి వాళ్ళు వచ్చీలేదూ ఇంకా మలయాళంలో....." అలా ప్రవాహంలా చెప్పుకుపోతున్న బామ్మ కాంతమ్మ వాక్ప్రవాహానికి అడ్డంగా వచ్చాడు దాదా.
"బామ్మగారూ మీ విశ్వరూపం చూపించెయ్యకండి అస్సలు మీరు గిన్నీస్ బుక్ వాళ్ళకి తెలీదుగానీ..... తెలిస్తే మీ దగ్గరకు వచ్చేరూ....."
"వాళ్ళకు తెలీకపోతే తెలియకపోవచ్చు. నువ్వొకసారి వాళ్ళకు చెప్పొచ్చుకదయ్యా బైదిబై__నువ్వొచ్చిన పనేదో మరచిపోయినట్టున్నావ్" ఆవిడ జ్ఞాపకం చేసేసరికి......
"హమ్మ బామ్మా___నువ్వసలు బామ్మవుకాదు బ్రహ్మ రాక్షసివి" అని మనసులో అనుకొని-
"చూడండి బామ్మగారు.....నాకు ఒక్కగానొక్క కూతురని చెప్పానుగదా. సదరు కూతుర్ని మీ మనవడు నారాయణరావుకిస్తే బావుంటుందని నా అభిప్రాయం."
"మా వాడికి అప్పుడే పెళ్ళి తొందరేంటయ్యా....వాడూ నీలాగే కలెక్టరైపోతాడు అప్పుడాలోచిద్దాం."
"లేదు.....లేదు....ఆ ఆలోచనేదో ముందుగాచేస్తే బాగుంటుంది. ఎందుకంటే.....అన్ని రోజులూ మనవి కాదుగదండీ" అలా అంటున్న దాదా వేపు తీక్షణంగా చూసింది కాంతమ్మ.
"ఏ కలెక్టరబ్బాయ్.....నువ్వలా వ్యంగ్యంగా మాట్లాడబోక......నీ మనసులోని గూడార్దమేమిటో నాకు తెల్సు. ఆ మాత్రం పసికట్టలేననుకున్నావా? వృద్దాప్యం పైబడింది కాబట్టి నేను బాల్చీ తన్నేస్థాననుకుంటున్నావా? నో.....నెవ్వర్."
"నా ఉద్దేశ్యం అధి కాదు బామ్మగారూ.....మీరు మ అమ్మాయి విషయంలో అంగీకారం తెలిపేరనుకోండి ఒక పని అయిపోతుందికదా. పెళ్లన్నది ఎప్పుడయినా మన వీలు వెంబడి చేసుకోవచ్చు. కనతమ్మ గారనే పేరు....ఈ ఒక్క జిల్లాలోనేకాదు అన్ని జిల్లాల్లోనూ మార్మోగి పోతోంది ఆ విషయం తెల్సుకునే వచ్చాను" ఆ చివరి బాణంఆవిడమీద బాగా పనిచేసింది.
"నా పేరు మెదక్ జిల్లాలో కూడా తెలుసంటావా కలెక్టరూ....." మెదక్ జిల్లా సంగతి మధ్యన అకస్మాత్తుగా ఎందుకొచ్చిందో అర్ధం కాలేదు దాదాకి.
"ఒక్క మెదక్ ఏంటి బామ్మగారూ.....మహబూబ్ నగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ వగైరా జిల్లా లన్నింటా కూడా మీ పేరు గోడలమీద రాసుంటుంది" అడ్డంగా కోసేసాడు దాదా.
"ఎందుకు రాసుంటుంది?" అలాంటి తలతిక్క ప్రశ్న ఆవిడ వేస్తుందని ఊహించలేదు దాదా.
లేనిపోని కధలన్నీ పూసగుచ్చి చెప్పేసరికి తలప్రాణం తోకకు వచ్చింది దాదాకు. దాంతో ఆవిడ ప్రసన్నంగా ముఖం పెట్టింది.
"అయితే అబ్బాయ్.....ఇంతకీ నీ కూతురు రంభ, ఊర్వశీ లెక్కల్లో వుంటుందంటున్నావ్ గదా ఫోటో తెచ్చావా?"
ఇలాంటి ముందు జాగ్రత్త చర్యను ఎప్పుడో ఊహించాడు దాదా.
అందుకే.....
ఇంట్లోంచి బయల్దేరే ముందు తన చెల్లెలు సంధ్య ఆల్బమ్ లో ఉన్న ఒక ఫోటోని తీసి జేబులో పెట్టుకున్నాడు.
ఆ ఫోటో ఎవరి తాలూకానో దాదాకు తెలీదు.
పై జేబులోనే ఉన్న ఆ ఫోటోని తీసి-
"పిల్ల కుందనపు బొమ్మ...." అని చెపుతూ ఆవిడ చేతిలో పెట్టాడు ఫోటోని.
ఆ ఫోటో వేపు తీక్షణంగా చూసింది కాంతమ్మ.
"పిల్లబాగానే ఉంది అబ్బాయ్" అనగానే ఎగిరి గెంతబోయి, కలెక్టర్ వేషంలో తనున్నానని గుర్తుకు తెచ్చుకుని-
"అయితే..... కట్నం గిట్నం, ఆస్తీ పాస్తీ, పొలమూ పుట్రా, నగా, నగదూ నట్రా..... ఇలాంటి విషయాల గురించి మాట్లాడేసుకుంటే సరిపోతుంది. కదండీ బామ్మగారూ" అని అన్నాడు దాదా కంగారును అణచుకుంటూ.
"అవ్వన్నీ ప్రత్యేకంగా ఎందుకు మాట్లాడుకోవడం.....నాకున్న యావదాస్తీ మా మనవడిదేగా.... నీకున్న యావదాస్తీ నీ కూతురుదేగా." అని అందావిడ.
"అవుననుకోండి..... కానీ...." ఎలాగయినా బామ్మ ఆస్థిని నారాయణరావుకి రాయించే కార్యక్రమానికి సన్నద్దమవుతూ, ఓ స్పెషల్ ఎట్రాక్టివ్ ప్రోగ్రామ్ గురించి బామ్మగారికి చెప్పి ఆవిడ్ని పూర్తిగా ఐసులా కరిగించేయాలని ఆలోచించిన వాడయి, ఆవిడకు దగ్గరగా జరిగాడు.
"బామ్మగారూ! మీ చెవిలా తెండి..... రహస్యం చెప్తాను" అని అన్నాడు దాదా.
"డిస్కోశాంతి జీవిత విశేషాలు చెపుతావా నాయనా" అని జోక్ వేసిందావిడ.
ఆ రహస్యం చెప్పడానికి దాదా ఉద్యుక్తుడవుతుండగా-
దూరంగా ఎవరో ఎక్కడో తుమ్మారు. దాంతోపాటు బుర్ర్ బుర్ర్ మంటూ ఏదో చప్పుడు.
అంతలోనే__
ఒక నల్లటి అంబాసిడర్ కారు ఆ యింటి ముందు ప్రత్యక్షం అయింది.
ఆ కారు వేపు నోరు వెళ్ళబెట్టి విచిత్రంగా చూశాడు దాదా.
"గవర్నర్ కూడా వచ్చాడేమో కలెక్టరూ....." లేచి నిలబడదానికి ప్రయత్నం చేస్తూ అందావిడ.
బ్లాక్ అంబాసిడర్ కారుకి వెనక గ్లాస్ డోర్స్ కారణంగా ఆ సీట్లలో ఎవరు కూర్చున్నారో కనబడడంలేదు.
బ్యాక్ సీట్ లో కూర్చున్న సరదాపటేల్ బయటికి చూసి అక్కడ కనబడిన ఏకైక వృద్దురాలిని చూసి-
'ఆవిడేనా నారాయణరావు బామ్మ.....బాగుంది.....చూడు జానకి, కారు దిగిన మరుక్షణం నుంచి నువ్వు ఈ గవర్నర్ కూతురివి అంచేత హుందాగా, గంభీరంగా ప్రవర్తించాలి. నువ్వు నీ వినయం చేత, అతి గౌరవం చేత పెద్దవాడ్ని బుట్టలో వేసెయ్యాలి.....
చూడూ..... ఆ పెద్దావిడకి కొంచెం దూరంలో గోతికాడ నక్కలా కూర్చున్నవాడేనా..... నారాయణరావు మనిషి" అనుమానంగా అడిగాడు సరదాపటేల్.
ఆ మనిషి గోడవారగా కూర్చోవడం వల్ల పూర్తిగా కనిపించడం లేదు.