పక్క గదిలోంచి పదిమంది వస్తాదుల్లాంటి యువకులు వచ్చారు.
"వీళ్ళనోసారి పరీక్షగా చూడు" అన్నాడు భగవాన్.
అమల, భగవాన్ చెప్పకముందే వాళ్ళందరినీ చూచింది.
"ఊ, మీరెళ్ళవచ్చు" భగవాన్ అనంగానే వస్తాదులు వెళ్ళిపోయారు గది విడిచి.
"వీళ్ళు రేప్ చేయటంలో ప్రవీణులు," భగవాన్ అన్నాడు అదేదో సాధారణ విషయం చెపుతున్నట్లు.
అమల ముఖం చిట్లించి మౌనం వహించింది.
"నే చెప్పిన పని చేస్తావా అమలా?"
అమల ఉలిక్కిపడింది.
"నా పేరెలా తెలుసు?"
"బాగుంది. అవసరార్ధం నిన్ను తీసుకొచ్చినప్పుడు, అన్ని వివరాలు తెలుసుకోకుండా ఉంటానా? మీ అమ్మా నాన్నకు నీవు ఏకైక సంతానం అంద మొకటే కాదు, తెలివి తేటల్లో కూడా నీవే ఫస్టు. బి.ఏ. చదువుకున్నావు. ముఖ్యమైన వివరాలు ఇవి. చాలుగా మరి నా మాట వింటే నీకే అపకారం జరగదు. మా పని అయిపోయింతరువాత నీ వెళ్ళిపోవచ్చు."
"ఏం పని, ఎన్నాళ్ళు పడుతుంది?"
"ఏం పనో చెపుతాను. ఎన్నాళ్ళు పడుతుందీ అన్నది ఖచ్చితంగా చెప్పలేను. నాలుగైదు నెలలు పట్టవచ్చు."
"మా అమ్మ, నాన్నగారు నే ఇంట్లో లేకపోవటం చూచి దిగులుతో మంచం పట్టొచ్చు," అంది అమల ఓ రాయి విసురుతూ.
భగవాన్ గదంతా ప్రతిధ్వనించేటట్లు నవ్వాడు.
"నా సంగతి తెలియక తక్కువ అంచనా వేశావ్ అమలా! ఈ భగవాన్ ఏ విషయంలోను పొరపాటుపడడు.నీకే ప్రమాదము జరగదని, కొన్ని కారణాలవల్ల మీ అమ్మాయిని తీసుకెళుతున్నామని, పోలీసు రిపోర్ట్ ఇవ్వకుండా వుంటే మీ అమ్మాయి మీకు దక్కుతుంది అని మీ ఇంట్లో లెటర్ పెట్టి నిన్ను తీసుకువచ్చాను. నా మాట నీ వింటే నీ క్షేమ సమాచారాలు మీ వాళ్ళకు... మీ వాళ్ళ క్షేమ సమాచారాలు నీకు లెటర్స్ ద్వారా తెలుసుకునే ఏర్పాట్లు చేస్తాను. గోటితో పోయేదాన్ని గొడ్డలిదాకా తేవని నీ విషయంలో నాకెంతో నమ్మకం వుంది. చాటుగా నిన్నెంతో కనిపెట్టి స్టడీచేశాను."
అమల ఆలోచించింది.
ఈ భగవాన్ గాడెవడో, మారుపేరు, మారురూపం వేషధారి. తనవసరం చాలా వుంది వీడికి. కాదని మొండికేస్తే తన మాన ప్రాణాలే కాదు. తన తల్లిదండ్రులను కూడా నానాహింసలు పెట్టొచ్చు. వీళ్ళమాట వింటూనే వీళ్ళ ఎత్తుకు పై ఎత్తు వేసి, ఈ కుంభకోణంనుంచి బయట పడాలి.
అమల ఓ నిర్ధారణకొచ్చింది.
"నేనేం చెయ్యాలో చెప్పండి." అడిగింది నెమ్మదిగా.
"గుడ్. వెంటనే ఓ నిర్ణయానికొచ్చావ్. చెప్పేది జాగ్రత్తగా విను.... భుజంగరావ్ ఓ శ్రీమంతుడు. అతనికి భార్యలేదు. ఒక్కతే కూతురు. పేరు సరోజ. ముమ్మూర్తులా నీలాగానే వుంటుంది. రోజా అంటారు అందరు. రోజా అంటే పంచప్రాణాలు భుజంగరావ్ కి. రోజా, ప్రభాకర్ అనే అతన్ని ప్రేమించింది. భుజంగరావ్ ఆ ప్రేమకు ఒప్పుకుని పెళ్ళి ముహూర్తం పెట్టాడు. తెల్లారితే పెళ్ళి. తప్ప తాగున్న డ్రైవర్ కారుతోలటం. ఆ కారు యాక్సిడెంట్ కి గురికావటంతో, కారులో వున్న ప్రభాకర్ అక్కడికక్కడే మరణించాడు.
రోజా పిచ్చిదయిపోయింది ఆ షాక్ తో. ఓ మాట పలుక లేదు. ఇరవై నాలుగు గంటలు గొణుగుతూ గోళ్ళు గిల్లుకుంటూ కూర్చునేది. భోజన ఫలహారాలు తినిపించటం, స్నానం వగైరాలు దాసిది చూచేది. ఎందరో పెద్ద డాక్టర్లకి రోజాని చూపించాడు భుజంగరావు. షాక్ తో మతిపోయింది కాబట్టి, ఏదయినా షాక్ వల్ల ... అదీ అదృష్టం ఉంటే మళ్ళీ మతి రావచ్చు. ట్రీట్ మెంట్ వల్ల బాగుకాదని తేల్చారు.