భుజంగరావు వృద్ధుడయిపోయాడు. రోజా పిచ్చిదయి పోయిందనే దిగులుతో కృంగిపొయ్యాడు. ఇలా వుండగా ఉన్నట్లుండి ఓ రోజు ఇంట్లోంచి మాయం అయింది. ఇది జరిగి ఆరు నెలలయింది. డబ్బు వెదజల్లి ఊరు వాడలు రోజాకోసం వెతికించాడు. రోజాను తీసుకొచ్చి అప్పగించిన వారికి లక్ష రూపాయలు ఇస్తామని ఫోటోతో సహా పేపరులో ప్రకటించాడు. కాని ఇంతవరకు రోజా జాడలేదు" ఓ నిమిషం ఆగాడు భగవాన్.
"ఇప్పుడు ఆ రోజాని నేనే అని తీసుకెళ్ళి భుజంగరావు గారికి చూపి లక్ష రూపాయలు తీసుకోవటమేనా మీ ప్లాన్" అమల అడిగింది.
"నో.నో. లక్ష నాకో లెక్క కాదు. భుజంగరావు కోటీశ్వరుడు. లంకంత ఇల్లు. నౌకర్లు, చాకర్లు, చుట్టాలు, ఫ్రెండ్స్ కళకళలాడుతుంటుంది ఇల్లు. నాకు కావలసింది భుజంగరావు మొత్తం ఆస్తీ!!
"ఎలా వస్తుంది ఆ ఆస్తి?"
"జరిగిన కధ చెప్పాను. జరగబోయేది విను. భుజంగరావు ఇంట్లో ఎందరో చుట్టాలు, నౌకర్లు ఉన్నారు. వీళ్ళలో ఎవరయినా రోజాని మాయం చేశారేమో అని భుజంగరావు అనుమానం. అందరు నమ్మకమైన వాళ్ళు ఆప్తులు. ఎవరిమీద తన అనుమానం వెళ్ళబుచ్చగలడు? ఈ మధ్య స్మాల్ గా హార్తెటాక్ వచ్చింది భుజంగరావుకి. చనిపోతానని అనుమానం పట్టుకుంది. రోజా బ్రతికుండి ఏనాటికయినా తిరిగి వస్తే, ఆ ఆస్తి మొత్తం రోజాది. రోజా కనపడకపోతే యావదాస్తీ అనాదాశ్రమాలకు పోతుంది. అలా వీలునామా రాశాడు కాబట్టి....."
"ఊ...... కాబట్టి..... ఏం చేయాలి?"
"నీవు రోజా అవతారం ఎత్తి భుజంగరావు ఇంటిలో చేరాలి."
"భుజంగరావు గారు అనుమానిస్తే నా గతేం కావాలి?"
"కొద్దిగా నీ రూపం మార్చితే నీవు రోజావి అయిపోతావు. రోజా అలవాట్లు నీకు నేర్పుతాము. నీవా ఇంట్లో పిచ్చిదానివిగానే ప్రవేశిస్తావు కాబట్టి, ఎవరూ అనుమానించరు. నీకే అపకారం జరగకుండా నీ నీడలా నేను వుంటాను."
"రోజాగా ఆ ఇంటిలో నేను ప్రవేశించినంత మాత్రాన మీకెలా భుజంగరావు ఆస్తి వస్తుంది?"
"అవన్నీ మేము చూసుకుంటాము. నే చెప్పింది చేస్తావో, లేదో చెప్పు?" భగవాన్ కఠినంగా అన్నాడు.
అమల ఓ క్షణం ఆలోచించింది.
"ఏం చేయాలో చెప్పండి చేస్తాను. కాని నా క్షేమం నా వాళ్ళకు, నా తల్లిదండ్రుల క్షేమం నాకు ఎప్పటికప్పుడు తెలియాలి."
"గుడ్ గరల్, తెలివిగల వాళ్లెప్పుడూ ప్రాణానికి ముప్పు తెచ్చుకోరు. నీ క్షేమం. నీ ప్రాణమే నా ప్రాణం సరేనా? ఇహ చేయాల్సింది, రోజా గడ్డం కింద అరంగుళం గాటు ఉంది. మెడమీద పుట్టుమచ్చ ఉంది. అలాంటి మార్పులు నీకు చేస్తాను. రోజా ప్రవర్తన అలవాట్లు నీకు నేర్పుతాము. సమయం చూచి ఆ ఇంటిలో నిన్ను ప్రవేశపెడతాము. నేను ఆ ఇంటిలోనే అనుక్షణం వెయ్యి కళ్ళతో నిన్ను కనిపెడుతూ వుంటాను. కాని నన్ను నీవు గుర్తించలేవు. ఇప్పుడు నేను మారు వేషంలో వున్నాను. ఆ ఇంటిలో సగంమంది నా వాళ్ళు. పిచ్చి పిచ్చి వేషాలు వేయవద్దు. వెంటనే నాకు తెలిసిపోతుంది జాగ్రత్త."
"అలాగే మీరు చెప్పినట్లే వింటాను. మరి మీరెవరయినదీ తెలియంది మా వాళ్ళకి నాకు మధ్య లెటర్స్ ఎలా చేరవేస్తారు?" అమల అనుమానం వెళ్ళబుచ్చింది.
"అన్ని ఏర్పాట్లు సవ్యంలా చేసి, అన్ని విషయాలు విశదీకరించి మరీ నిన్ను ఆ ఇంటిలో ప్రవెశపెడతాను. పిచ్చిదానివిగా నటించడం నీ వంతు. మిగిలిన పని పూర్తిచేయటం మా వంతు. నీ ఆమోదం పూర్తిగా ఉందిగా?"
"అలాగే. చెప్పండి" లోలోపల మండిపోతున్నా నవ్వుతూ అంది అమల.
భగవాన్ ఒక్కొక్కటీ వివరంగా చెపుతుంటే అమల "ఊ" కొడుతూ మధ్య మధ్య తనకొచ్చిన అనుమానం తీర్చుకుంటూ కూర్చుంది.