జీవితంలో వేగంగా ముందుకు పోగల భర్తకు జీవితపు లోతులు కూడ చూపించగల భార్య కావాలి! మనం సరైన జోడీ! మేడ్ ఫర్ ఈచ్ అదర్!"
"అంతా బాగానే ఉంది. నీ అభిప్రాయంతో నేను ఏకీభవిస్తాను. కాని డార్లింగ్ తొలిరాత్రి యిలా గడిచిపోవటం తలుచుకుంటేనే బాధగా ఉంది!"
"మీరు నా ఒడిలో పడుకున్నారు. ఇంకేం కావాలి?
గుడి చుట్టూ ప్రదక్షణాలు చేస్తేనే మ్రొక్కు తీరి పోతుందంటావా? ఆలయమ్లోకి వెళ్ళి అమ్మవారిని చూస్తే కదా పుణ్యమూ పురుషార్దమూ దక్కుతాయి?"
"ఛీ చిలిపి! మీరు మొరటుగా మాట్లాడుతున్నారు!"
"ఉద్యోగ ధర్మం కొంత నేర్పింది! నువ్విప్పుడు మిగిలింది నేర్పావు? అవునూ! నేనిలా ఉండి పోవటం ఎంతకాలం జరగాలంటావు"
"త్వరగా థీసిస్ పూర్తి చేస్తాను. లెక్చరర్ అవుతాను. ఆ తరువాత చెప్పేది మీరు, వినేది నేను! అందాకా లాలిజో పాపాయీ! నిద్దరోవాలా! లాలీ!" అంటూ అతని చెంపలమీద పెదవులానించి కళ్ళలోకి చూచింది.
రెప్పలు వాలిపోయి ఉన్నాయి, ఊర్పులు దీర్ఘంతరాలయినాయి.
చల్లని తెల్లని వెన్నెల! చెలిబడి! అతడు ఆదమరచి నిద్రపోయాడు వక్షస్సు మీద చేయి ఆనించి నెమ్మదిగా తట్టి అతన్ని మేల్కొలిపింది.
"మీరు వెళ్ళి మంచంమీద పడుకోండి!" అంది. చిన్నపిల్లాడులా లేచి వెళ్ళి పడుకున్నాడు. క్షణంలో నిదురపోయాడు.
తెరదింపేసి ఆమెకూడా అతని ప్రక్కనే పడుకుంది.
తొలిరాత్రి పురి విప్పిన కోర్కెలతో, ఎన్నో ఆశలతో వస్తాడు. మగవాడుని ఒడ్డు లొరిసి పొంగులు వారుతూ పరుగెత్తే తరంగాలకు అడ్డుకట్ట వేయటాన్ని భరించాడంటే అతనికి తనమీద ఉన్న ఆప్యాయత ఎంత అపారమయినది? అశ్రువులు చెంపలమీదికి జారాయి.
జల సింధువులాంటి మగాడు! అతనిలో కన్పించిన చిలిపితనం కేవలం తీరాన కన్పించే తరంగాలవంటిది! ఎంత గంభీరమయిన మగవాడు తనకి భర్తగా లభించాడు?
అంతలో ఆదమరచి నిదురించాడంటే ఎంతటి ధీరముద్ర అది!
ఒకరికోసం ఒకరు సర్దుకుపోవాలనేది దాంపత్యపు తొలిపాఠం! ఎంతో ప్రశాంతమయిన పద్దతిలో ప్రబోదించాడు! తన జీవితాశయాన్ని తీర్చుకునేందుకు చక్కని దారి కల్పించాడు.
చివాలున లేచి నెమ్మదిగా అతని పాదాలు ఒత్తడం ప్రారంభించింది! ఆమె మనసులో కొద్ది రోజులుగా జరుగుతూ వచ్చిన సంఘటనలు కదలాడటం ప్రారంభించినాయి. శివరాజ్ కపటంలేని మనిషి!
ఇంటర్ చదువుతూ ఉండగా పరిచయం అయింది.
ఒకరింటికి ఒకరు రాకపోకలు ప్రారంభించినా పెద్దలు అభ్యంతరం పెట్టలేదు. పెళ్ళి ప్రస్థావన ఎలావచ్చిందోకాని ఎవరూ కాదనలేదు.
కాని డిగ్రీ తరువాత దారులు వేరు అయినాయి!
పెళ్ళి గురించి అందరూ మర్చిపోయినట్లుగానే అనిపించింది.
హఠాత్తుగా రెండు నెలల క్రితం కలిశాడు శివరాజ్? పోలీసు దుస్తుల్లో అతనిలో వచ్చిన మార్పు.
ప్రస్పుటమవుతున్న హుందా తనం చూచి నివ్వెరపోయింది. ఎంతో చనువుగా పలకరించాడు.
కేవలం కొద్ది గంటల క్రితం విడిపోయిన మనిషిని పలకరించినట్లు! అతని ఆలోచనల్లో తన రూపం రవంతయినా మాసిపోలేదనిపించింది.
"ఇలాంటి సమయం కోసమే ఎంత త్వరగా వస్తుందా అని ఎదురుచూచాను. వచ్చింది. థాంక్ గాడ్!" అన్నాడు టైమ్ గ్యాప్ ని పూడ్చేస్తూ!
"ఇంతకాలం నువ్వేం చేశావో నీ డ్రెస్ చెపుతోంది. కంగ్రాచ్యులేషన్స్" అంది.
"ఇంక పెళ్ళి గురించి మాట్లాడు కోవటమే తరువాయి!"
"త్వరగా చేసుకో! సెటిల్ అయిపోయావు కదా?"
"నన్ను వేరుగాచేసి మాట్లాడకు. నిన్ను చేసుకోవాలని నా నిర్ణయం!"
"నేనింకా చదువు పూర్తిచేయలేదు"
"పోలీసు ఆఫీసర్స్ ఎక్కువసమయాన్ని ఉద్యోగానికే ఖర్చు పెట్టాలి! బోర్ కొట్టకుండా నువ్వు చదువుని పూర్తి చేయవచ్చు! నాకేమి అభ్యంతరం లేదు"
"రెండు వైపులా ఆలోచించుకుని నిర్ణయించుకోవాలి!"
"నేను ఆలోచించుకుని నిర్ణయించాను. నువ్వు కాదంటావనే అనుమానం రాలేదు నాకు. ఒకప్పుడు మన మధ్య వున్న ఆర్ధిక వ్యత్యాసాన్ని ప్రస్తావనకు తీసుకురావచ్చని? అనుమానించాను.
ఇప్పుడు నా ఉద్యోగం ఆ గ్యాప్ ని తగ్గించింది కదా!?"
"ఆర్ధిక విషయాలు నేను ఆలోచించను. చదువు గురించే!"
"మన వివాహమనేది నీ ఆలోచనకు ఆటంకంకాదు. ఎంకరేజ్ మెంట్ అవుతుంది. ఇది నా ప్రామిస్" అన్నాడు.
శివరాజ్ మనస్తత్వం రావ్వంతయినా మారలేదు. కపటంలేకుండా కావాలనుకున్నది అడిగే వారిని కాదనగల వారు ఎవరుంటారు??
మొదటి సంభాషణలోనే తాను పూర్తిగా లొంగిపోయింది.
అయినా సాధించాలను కున్న జీవితాశయానికి తిలోదకాలిచ్చుకునేందుకు మనసు అంగీకరించలేదు.
తొలి స్నేహితురాలు అయినా తల్లి దగ్గిర ఈ ప్రస్థావన తీసుకువచ్చింది.
"బేబీ! మీ తండ్రి మనకు విడిచిపెట్టి వెళ్ళిపోయినా సంపదలు చాలఉండొచ్చు! కాని మనసువిప్పి మాట్లాడగలిగిన మగవాడు దొరకటం అరుదైన విషయం! నువ్వు కావాలి అని ఆపేక్షపడిన మగవాడిని కాదని మరోవైపు పరుగుతీయటం ఆడపిల్లకు క్షేమం కాదమ్మా! ప్రధమ నించి నీకు కావసినంత స్వేచ్ఛ యిచ్చాను.
దాన్ని నువ్వు ఎప్పుడు దుర్వినియోగపర్చుకోలేదు!