Read more!
 Previous Page Next Page 
చిత్రం భళారే విచిత్రం పేజి 2

       

                         సూపర్ హిట్ - చిత్రం భళారే విచిత్రం
    హప్పుడే బాలభానుడు తన లేలేత కిరణాలని భూమ్మీదకు ప్రసరింపజేశాడు.
    పక్షులు యథాలాపంగా వాటికి సంబంధించిన కూతలు కూసేసి తూర్పు దిక్కుకు గుంపులు గుంపులుగా ఎగరసాగాయ్.
    జగమెల్లా మేల్కొంది....
    కానీ ఆ ఇంట్లో మాత్రం ఒక్కరు కూడా మేల్కోనలేదు ఒక్క రాధ తప్ప.
    రాధ అప్పటికే తలకి స్నానం చేసేసి కంచిపట్టు చీర కట్టేసుకుని నుదుట పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకుని తలలో పువ్వులతోబాటు నానా రకాల గడ్డీగోదాం, చెత్తాచెదారం తురిమేస్కుని ఓ మొండి చీపుర్తో వాకిలి మొత్తం శుభ్రంగా ఊడ్చింది.
    తర్వాత పేడ కలిపిన నీళ్ళతో కళ్ళాపి చల్లింది.
    పేడనీళ్ళని చూడగానే ఒక్కసారిగా రాధ మేనంతా పులకరించిపోయింది.....
    అంతే.....
    ముగ్గుచిప్ప పట్టుకుని ఒక్కసారిగా గొంతెత్తి పాటందుకుంది రాధ.
    "తూరుపు తెల్లవారింది
    ఊరు నిద్రలేచింది
    నిద్ర లేచిన ఊరు ఆవుళించింది.....
    ఆవుళించింది....ఆ...."
    అరడజను లౌడ్ స్పీకర్లు పెట్టినట్టు రాధ గొంతు ఖంగున మోగింది.
    దెబ్బకి ఆ ఇంట్లోని అందరూ ఉలిక్కిపడి నిద్ర లేచారు...ఒక్క గోపీ తప్ప...! అందరూ ఒక్కొక్కరే వారి వారి గదుల్లోంచి మెల్లగా వచ్చి హాల్లో చేరారు.
    అలా హాల్లో చేరినతర్వాత కనుగుడ్లు సీలింగ్ వైపు పెట్టి పాచిమొహాలు విప్పరించి, చెవులూ రిక్కించి ఎంతో ఆనందంగా రాధ పాడుతున్న పాటని వినసాగారు.
    "ఇంటికి దీపం   
    ఇంటీ ఇల్లాలే....
    ఆ ఇల్లాలు నిద్రలేచి
    ముగ్గూ పెట్టాలి...ముగ్గూ పెట్టాలి
    ముగింట్లో ముగ్గుచూసి
    మగడూ మురియాలి
    మురిసినా మొగుడి మొహం
    బోర్లించిన మూకుడూ....
    బోర్లించిన మూకుడూ...."
    "తూరుపు తెల్లవారింది...
    ఊరు నిద్రలేచిందీ...."
    పాట పాడుతూనే వుంది రాధ, చెక చెకా ముగ్గు పెట్టేస్తూ.
    ఆమె పాడ్తున్నంతసేపూ ఇంట్లోని అందరూ ఒకరిమొహాలు ఒకరు పట్టరాని ఆనందంతో చూస్కున్నారు. రాధ పాట పూర్తయ్యేసరికి ఇంటిముందు పేద్ద ముగ్గు తయారయ్యింది.
    తర్వాత రాధ ముగ్గుచిప్ప అవతల పారేసి చెంగున పూజామందిరంలోకి దూకి దేవుడికి కొబ్బరికాయ్ కొట్టి ఠణ ఠణా గంటగొట్టి హారతిచ్చి, ఆ హారతిని హాల్లోకి తీసుకొచ్చింది.
    హాల్లో అంతదాకా దేభ్యం మొహాలు వేసుకుని ఉలుకూ పలుకూ లేకుండా నిల్చున్న గోపి పెంపుడుతండ్రి పరంధామయ్య, గోపి కన్నతల్లి సరస్వతి, గోపీ అన్నయ్య శంకరం, వదిన అన్నపూర్ణ... వాళ్ళ పాప చిన్నారి దీపా అందరూ ఎంతో భక్తి శ్రద్దలతో హారతిని కళ్ళకు అద్దుకున్నారు....
    అంతే.....
    రాధ అక్కడినుంచి లేడిపిల్లలా పెరట్లోకి చెంగున దూకింది.
    "చూశావుటే... మన కోడలు ఎంత లక్షణంగా వుందో...మన గోపి చక్కనైన అమ్మాయిని ఎన్నుకుని పెళ్ళి చేసుకున్నాడు..." అన్నాడు పరంధామయ్య సరస్వతితో రెండు కళ్ళలోంచి చెరి రెండు ఆనంద భాష్పాలు రాలుస్తూ.
    సరస్వతి భుజంమీదుగా కొంగున నిండుగా కప్పుకుని సిగ్గుపడిపోయింది.
    "ఏమిటండీ పరంధామయ్యగారూ... మీరు భలేగా మాట్లాడుతున్నారే?..... నేను గోపీ కన్నతల్లిని.... మీరేమో పెంపుడుతండ్రీ!... అయినా మీరు గోపికి కన్న తండ్రిలానో...లేదా నేను గోపికి పెంపుడుతల్లిగానో మాట్లాడుతున్నారు....హి....హిహి..." అంది నేలచూపులు చూస్తూ.
    పరంధామయ్య నాలుక కొరుక్కుని "అవును కదూ?... ఆ విషయమే మర్చిపోయా..." అంటూ నవ్వేసి ఆనందభాష్పాలు తుడుచుకున్నాడు.
    "ఏంటో ఈ కన్నతల్లులు ఏంటో, పెంపుడు తండ్రులు ఏంటో. కనినా, పెంచినా ప్రేమ ఉండడమే గొప్ప. ప్రేమలేని పెంపకం తావిలేని పూవువంటిది!" అంది దీప ఎటో చూస్తూ.
    ఇక్కడ ఇలావుంటే అక్కడ రాధ పెరట్లో అవు దగ్గర మోకాలిమీద కూర్చుని పొదుగుకింద పెద్ద బిందెపెట్టి 'చుయ్ చుయ్' అంటూ పాలు పితికెయ్యసాగింది.
    పాలు పితికేటప్పుడు "గోమాతా...నువ్వే మ బంగారు తలరాతా...." అని పాట పాడదామని అనుకుందిగానీ అంతకు క్రితమే వాకిట్లో ముగ్గేస్తూ పాట పాడిన విషయం గుర్తుకు వచ్చి ఆ ప్రయత్నం మానుకుంది రాధ.
    పాలు చక చకా పితికేసిన తర్వాత ఆవు గంగడోలుని ఓ మారు నిమిరి వీపుమీద తట్టి ఆ తర్వాత మూతిమీద మూతిపెట్టి గట్టిగా ముద్దిచ్చి "మా బంగారు గోమాత..." అని మెచ్చుకుని వంటగదిలోకి పరుగు తీసింది.
    అక్కడ....
    వంటతో సతమతమైపొతూ ఉంటుంది అన్నపూర్ణ. అన్ని సంవత్సరాలనుండి ఆమె వంటచేస్తున్నా వంటగదిలో ఏది ఎక్కడుందో తెలీక వెతుకుతూ సతమతమైపోతుంటుంది అన్నపూర్ణ.
    పాలబిందెను ఓ మూలగా పెట్టి"నువుండక్కా...వంటపని నేను చూస్కుంటాగా! ఇన్ని సంవత్సరాలూ నువ్వు శ్రమపడ్డావుగా.... ఇకనుండీ నువ్వు రెస్టు తీస్కో" అంటూ అన్నపూర్ణ రెక్క పుచ్చుకుని ఓ లాగులాగి వదిలింది రాధ.
    ఆ దెబ్బకి అన్నపూర్ణ థడేల్ మని క్రిందపడి మోకాలు చిప్పలు బద్దలయ్యాయ్. అయినాసరే రాధ మంచితనానికి ఆమె కళ్ళలో నీళ్ళు తిరిగాయ్.
    "హమ్మ...హబ్బ..." అంటూ ఆపసోపాలుపడి నేలమీంచి లేచి "నీకెందుకులే చెల్లీ...ఇంటికి కొత్త కోడలివి. అప్పుడే పనిభారం మొత్తం నీ మీద వేస్తే మా మరిది వూర్కుంటాడా? నువ్వు గదిలోకి వెళ్ళు. వంటపని చూస్కుంటాలే" అంది అన్నపూర్ణ.
    "వద్దక్కా.... నేను చూస్కుంటాగా!" అంటూ రాధ మళ్ళీ అన్నపూర్ణ రెక్క పుచ్చుకోబోయింది.
    అన్నపూర్ణ అతి మెళుకువగా చెంగున వెనక్కి దూకి "సర్లె....సర్లె....నువ్వే చెయ్"ఆ అంది. రాధవంక భయం భయంగా చూస్తూ మోకాలుచిప్పలు రుద్దుకుంది.
    రాధ కిలారున నవ్వి గిన్నెల మధ్యకి దూకింది.
    హాల్లో...
    పరంధామయ్య దేనికోసమో వెతుకుతున్నాడు. దేనికోసం వెతుకుతున్నడో ఆయనకే తెలియదు.
    కాని ఎక్కడో వంటగదిలో ఉన్న రాధ పసిగట్టేసింది. రాధ హాల్లోకి హడావిడిగా వచ్చేసింది.
    "ఏంటి మామయ్యా వెతుకుతున్నారు? భగవద్గీత కోసమేనా?" రెండు చేతులూ వెనక్కి పెట్టుకుని నవ్వుతూ అడిగింది.
    "అవునమ్మా హర్రె! నీకెలా తెలుసమ్మా..." ఆశ్చర్యంగా అడిగాడు పరంధామయ్య.
    "నేను ఈ ఇంటికోడలిని మామయ్యా. అందరి అవసరాలు ఆ మాత్రం పసిగట్టకపోతే ఎలా? అదీ దేవుడిలాంటి మామయ్యగారి అవసరం!!" అంది రాధ.
    "నాదేముందమ్మా. ఈ ఇంట్లో యీమధ్యనే ప్రతిష్టించబడిన దేవతవి నువ్వు. నువ్వే తల్లి" ఆనందంగా అన్నాడు అందించింది.
    "పిన్నీ. మరి నా బ్రష్షూ పేస్టూ ఏది?" అడిగింది దీప పానకంలో పుడకలాగా.
    "ఇదిగోనమ్మా నీ బ్రష్షూ పేస్టూ" గూట్లో ఆల్రెడి పేస్టువేసి రెడీగావున్న బ్రష్ తీసి దీపకి అందించింది రాధ.
    "మరి నా బ్రష్షూ పేస్టూనో? అన్నాడు శంకరం రాధవంక చిలిపిగా చూస్తూ.
    "మీది నేనిస్తాను రండి." అంది అన్నపూర్ణ శంకరంవంక కొరకొరా చూస్తూ.
    ఇంతలో మేడమీంచి గదిలోంచి గోపీ కేకలు వినిపించాయి.
    "చెల్లాయ్. అమ్మా చెల్లీ. చెల్లెమ్మా."
    "వీడొకడు... వాళ్ళ చెల్లెలు పెళ్ళి చేసుకుని కాపురానికి వెళ్ళి రెండువారాలై పోతున్నా వీడికింకా అలవాటు కాలేదు. నువ్వెళ్ళి వాడిసంగతి చూడమ్మా రాధా..." అన్నాడు పరంధామయ్య.

 Previous Page Next Page