Read more!
 Previous Page Next Page 
శుభోదయం పేజి 2

 

    "శ్యామ్ .....రంగు చూసి మనుష్యుల్ని అంచనా కట్టే మనుష్యులతో నీకేం పని. అది వాళ్ళ కుసంస్కారానికి నిదర్శనం. నీ మానాన నీవు చదువుకో. అని అని వాళ్ళే వూరుకుంటారు. ఇంత చిన్న విషయానికి నీవు మనసు పాడుచేసుకుంటే యింక నామీద ఒట్టే. ఊ.....కానీయి , టిఫిను తిను. ఆలస్యం అవుతుంది కాలేజికి."
    కొడుకుని సముదాయించడానికి ఏదో అన్నా ఆమె మనసు అది సరిపెట్టుకోలేకపోయింది. శ్యామ్.....నలుపు - కాని అతని మనసు తెల్లని పాలవంటి తెలుపు అన్నది తనకి తెలుసు. ఆ తండ్రి బుద్దులు రారాదని భగవంతుని ఎంతో ప్రార్ధించింది. తన మొర విన్నాడు ఆ దేముడు. తన పెంపకంలో సహృదయుడు, సంస్కారిగా పెరుగుతున్న కొడుకుని చూసి .....నల్లటివాడని ఆమె మనసు ఇప్పుడు నోచ్చుకోవడం లేదు. శ్యామ్ పుట్టినప్పుడు అనదరి చూపులు తూటాల్లా పొడుస్తుంటే , అందరి గుసగుసలు, అందరి వ్యంగ్యపు విసుర్లు విని విని ఆ బిడ్డని చంపి తానూ చావలనుకున్నంత అవమానం కల్గింది .....కాని అన్నింటినీ మాతృత్వపు మమత జయించింది. ఎంత అనాకారి అయినా బిడ్డని తల్లి ప్రేమించకుండా వుండలేదు...... ఆ బిడ్డ తండ్రిని ప్రేమించినా, ద్వేషించినా ఆ బిడ్డని మాత్రం ద్వేషించలేదన్నది అర్ధం అయింది.
    శ్యామ్ కి ఆ తండ్రి పోలికలు వస్తే! అనుకుంటూ , భయపడుతూ చిన్నప్పటి నుంచి అతి జాగ్రత్తగా వెయ్యి కళ్ళతో బిడ్డకి మంచి అలవాట్లను , అభిరుచుల్ని పెంచుతూ పెంచింది. శ్యామ్ పెద్దవుతున్న కొద్ది తను ఎలా మలుచుకుంటే అలా మలచబడుతుంటే సంతృప్తిగా నిట్టూర్చింది. శ్యాం కోసమే తన బ్రతుకు! వాడిని సంస్కార వంతుడిగా తీర్చిదిద్దడమే తన ఆశయం!.... అదే ఆమె తపన!..... కాని ..... శ్యామ్ పెరిగి పెద్దవుతూ తన అనాకారితనాన్ని నలుగురూ హేళన చేస్తుంటే బాధపడేవాడు. ఆ బాధ మనిషితో పాటు పెరిగి పెద్దదయింది. శ్యామ్ లో ఆ భావం ఏం చేసి పోగొట్టాలా అని మదనపడేది. ఎవరు ఏం అన్నా అతి సున్నితంగా చలించి బాధపడే అతని తత్త్వం మార్చాలని , ఆత్మవిశ్వాసం కల్గించాలని తాపత్రయపడేది. ఈరోజు శ్యామ్ విషన్నవదనం చూస్తుంటే ఆమె కడుపు తరుక్కుపోయింది. భగవన్తుదా౧ నాకీ బిడ్డని ఎందుకిచ్చావు.....పుట్టగానే చంపితే నాకానాడు ఈనాడు యిన్ని సమస్యలుండేవి గాదు కదా? నా బతుకు ఈ విధంగా మారేది కాదు కదా.....ఆవేదనగా కళ్ళు మూసుకుంది.
    కళ్ళు మూసుకున్నా శ్యామ్ నల్లటి రంగు , బండ పెదాలు, వెడల్పు ముక్కు చిన్న కళ్ళు.....మోహంలో ఏ కోశాన్నా మృదుత్వం లేకుండా చూడగానే అబ్బ ఏం రూపు బాబూ అనుకునే శ్యామ్.....తన బిడ్డ! ..... ఎంత అనాకారి అయినా శ్యామ్ తన కడుపున పుట్టిన బిడ్డ ...! పురుడు వచ్చాక, మత్తులోంచి తెలివిరాగానే నర్స్ తీసుకొచ్చి చూపించిన బిడ్డని చూడగానే కెవ్వుమంది. పుట్టినాక అంత నల్లటి బిడ్డని చూడడం అదే మొదటిసారి ఆమెకి. ఆ బిడ్డ తన బిడ్డ......తను ఏనాడో చేసిన పాపం యీనాడు ఈ రూపంలో భగవంతుడు శిక్షించాడు . మూగగా రోదించింది. అంత అనాకారి బిడ్డని వడిలో వేసి నర్సు ఆమె స్తనాన్ని బిడ్డ నోట్లో పెట్టి పాలు యీయడం చూపగానే ఆ బిడ్డ పెదాలు స్థనానికి తాకగానే వెన్నులోంచి ఏదో మమత పొంగుకొచ్చినట్లయింది. ఆ బిడ్డ మొహం చూడకూడదనుకున్న ఆమె తెలియకుండానే బిడ్డని గుండెకి అదుముకుంది. తల్లి ప్రేమ, కడుపు తీపి, పేగుబంధం అనే మాటలకి అర్ధం తెల్సింది. ఆమెకి తెలియకుండానే బిడ్డ మీద అసహ్యం, ఏహ్యం, తిరస్కారం క్రమంగా మాయమయి ఆ స్థానంలో మమత, అనురాగం పుట్టుకొచ్చాయి.... శ్యామ్ బుద్దులనీ తండ్రిని పోలనందుకు అనేక దేముళ్ళకి మొక్కుకుంది. ఈనాడు శ్యామ్ ......తనకి జీవనాధారం. వాదికోసమే తన బతుకు! శ్యామ్ . బాబూ! నేను ఏం చేసి నీ దిగులు పోగొట్టనురా...." విచలిత అయి కళ్ళు ఒత్తుకుంది రాధాదేవి.
    

                        *    *    *    
    
    "అమ్మా ....అమ్మా...." హడావుడిగా లోపలికి వచ్చాడు శ్యామ్. శ్యామ్ వెంట వచ్చిన అమ్మాయిని చూసి రాధాదేవి ప్రశ్నార్ధకంగా చూసింది.
    "అమ్మా.....ఈ అమ్మాయి మా కాలేజి మెట్ రేఖ.....ఇవాళ.....యివాళ రేఖకి.....చాలా గొడవయిందమ్మా.....నల్గురు రౌడీలు వెంటపడ్డారమ్మా ....." ఎక్స్తైట్ అవుతూ గబగబ అన్నాడు.
    "ఆ....." రాధాదేవి కూడా గాభరా పడింది.
    "సరిగా ఆ సమయానికి శ్యామ్ రాబట్టి బతికిపోయాను. లేకపోతే వెధవలు ఏం చేసేవారో ...." రేఖ భయంగా అంది.
    "అసలు ఏం జరిగిందమ్మా.....ముందలా కూర్చో. మంచినీళ్ళివ్వనా?" రాధాదేవి వెళ్లి ప్రీజ్ లోంచి చల్లటి నీళ్ళు తీసుకొచ్చి యీయగానే రేఖ గడగడ తాగింది.
    "వళ్ళంతా చెమట పట్టిందమ్మా.....యింకా ఫరవాలేదు.... స్థిమితంగా కూర్చో...." అంటూ మృదువుగా ఆమె నుదురు పమిట చెంగుతో వత్తింది రాధాదేవి. ఎదురు చూడని ఆ ఆప్యాయతకి రేఖ చలించి దోషిలా శ్యామ్ వంక చూసి తల దించుకుంది. యింతటి మంచి హృదయం గల తల్లికి పుట్టిన బిడ్డనా తను యిన్నాళ్ళు చీదరించుకుంది. ఈరోజు శ్యామ్ రాకపోతే? ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి.
    "చెప్పమ్మా. ఏం జరిగిందసలు" రాధాదేవి ఆరాటంగా అడిగింది.
    "ఎవరో నల్గురు రౌడీలండీ . ఈ మధ్య ఓ నెల రోజులనించి నేను బస్సు దిగి యింటి కెళ్ళేటప్పుడు , వచ్చేటప్పుడు కిళ్ళీ బడ్డి దగ్గిర కూర్చుని వెకిలి మాటలు, వెకిలి చేష్టలు , ఒకటే నవ్వులు, వెధవ పాటలు పాడటం , ఒకటేమిటి అసహ్యంగా వేషాలు వేసేవారు. మొదట కొన్నాళ్ళు  చూసీ చూడనట్లు వూరుకొన్నాను. కొన్నాళ్ళు కోపంగా అసహ్యంగా చూసాను, నాకోపం చూసి మరింత వెకిలిగా మాట్లాడ్డం, నవ్వడం మోఅలుపెట్టారు. ఒకరోజు వళ్ళు మండి , కోపం పట్టలేక చరచర దగ్గిర కెళ్ళి 'ఏమిటి పెల్తున్నారు, వళ్ళు దగ్గిర పెట్టుకోండి' అని అరిచాను. నేను అంత ధైర్యంగా తిడ్తానని వూహించని వాళ్ళు ఒక్క క్షణం ఖంగు తిన్నారు. 'ఏరోయ్ , పిల్ల వళ్ళు జగ్రత్తంటుందిరోయ్' అని ఒకడు, 'ఎవరి వళ్ళురా , దాని వళ్ళు జాగ్రత్త చేసుకోమను .....లేకపోతే ....ఒకళ్ళకాదు యిద్దరం కాదు, నల్గురం నంజుకుని విందు భోజనం చేస్తాం అని చెప్పారా . పిల్ల దొరముగ్గిన జాంపండు లా వుందిరోయ్....కటక్కున కొరకాలనుంది రోయ్.....వరేయ్ .....అబ్బ ఏం బుగ్గలురా.....ఏపిల్ పళ్ళలా లేవూ. వెధవా బుగ్గలు ఏమిటిరా.....యింకా మంచివి వున్నాయి చూడరా సన్నాసి '- మరోడు యికిలించాడు. భరించరానంత అసహ్యం వేసింది. ఒక్కొక్క వెధవ అంబోతుల్లా వుండి వెగటు పుట్టించారు. చూడడానికే అసహ్యం వేసింది - 'ఛీ ..... పని పాటా లేక రోడ్డున పోయే ఆడపిల్లని అల్లరి పెట్టడానికి సిగ్గు లేదు. ఈసారి నా ఊసేత్తారంటే చెప్పుచ్చుకు కొట్టి పోలీసు స్టేషన్ కి లాక్కేడతాను '.... అని ఉమ్మేసి చరచర వెళ్ళిపోయాను. 'అబ్బో! పిట్ట గట్టిదేరోయ్ , పోలీసులని పిలుస్తుందట . బాబోయ్ భయం వేస్తుంది' వెకిలిగా నవ్వుతూ అంటున్న మాటలు విననట్టే వెళ్ళాను...."

 Previous Page Next Page