Previous Page Next Page 
డైమండ్ రాజా - ఆఠీన్ రాణీ పేజి 2

 

    రాజా అలా ఆలోచిస్తుండగానే,

 

    లోపల-

 

    గ్రీన్ రూంలో అపర కాళికాదేవిలాగా ఉగ్రంగా నిలబడి ఉంది "ఆఠీన్ రాణీ". ఆమెకి ఎదురుగా కుర్చీలో కూర్చుని ఉన్నాడు హోటల్ మేనేజర్ మల్ హోత్రా.

 

    ఆఠీన్ రాణీ అసలు పేరు మీనాక్షి.

 

    "హోటల్ వాళ్ళు ఆ అమ్మాయికి పెట్టిన పేరు ఆఠీన్ రాణీ!

 

    "డైమండ్ రాజా" అనే పేరుకి సూటవ్వాలని మీనాక్షి పేరుని అలా మార్చారు వాళ్ళు.

 

    డైమెండ్ రాజా- ఆఠీన్ రాణీ!

 

    మాంచి క్యాచిగా ఉన్న క్రేజీ నేమ్స్!

 

    ఆ "ఆఠీన్ రాణీ" మీనాక్షి నిప్పులు కక్కుతున్నట్లు మల్ హోత్రా వైపు చూస్తూ నిలబడి ఉంది.

 

    "నీ శాపనార్ధలకి నేనేం భయపడను - నేను చెప్పినట్లు నువ్వు చెయ్యక తప్పదు" అంటున్నాడు మల్ హోత్రా.

 

    "నేను ఎవరిననుకుంటున్నావ్? బజారుదాన్ని అనుకుంటున్నావా? మంచి ఫ్యామిలి మాది! కూచిపూడి డాన్సు ఆరేళ్ళపాటు నేర్చుకున్నాను. - ఫోక్ డాన్సులు చేసే ఉద్యోగం అంటే వచ్చాను గాని ఇలా.......

 

    "టాప్ లెస్ గా , న్యూడ్ డ్యాన్సులు చేయ్యబోనంటావ్! అవునా?" అన్నాడు మేనేజర్ మల్ హోత్రా ఎకసెక్కంగా.

 

    "నా గొంతులో ప్రాణముండగా........." అనబోయింది మీనాక్షి.

 

    "కానీ ఈ లోగా మీ అమ్మ ప్రాణాలుపొతే?" అన్నాడు మల్ హోత్రా. అతని గొంతులో నిర్దయ ధ్వనిస్తోంది.

 

    "అమ్మ" అన్నమాట చెవినబడగానే ఒక్కసారిగా తగ్గిపోయింది మీనాక్షి. నిప్పులు కురిపించిన కళ్ళలో నీళ్ళు నిలిచాయి.

 

    నవ్వాడు మల్ హోత్రా.

 

    "మీ అమ్మకేం రోగం అన్నావు? హార్టు పేషెంటు కదూ! మీ అమ్మకి బైపాస్ సర్జరీ చేయించాలి. దానికి కనీసం లక్ష రూపాయలు ఖర్చువుతుంది. నీకు డాన్సు చెయ్యడం తప్ప ఇంకేం రాదు. కాబట్టి నీకు ఇంకెక్కడా ఉద్యోగం దొరకలేదు కాబట్టి ఈ హోటల్లో చేరావ్! చేరినదానివి చెప్పినట్లు చెయ్యక మొండికేస్తావెం?

 

    "జాలరిపిల్ల- ఎంకి - నాయుడు బావ లాంటి డాన్సులు మాత్రమే చెయ్యవలసి వస్తుందని చెప్పారు - అగ్రిమెంట్ అలాగే రాసుకున్నాం"

 

    అగ్రిమెంటుకి అగ్గిపెట్టు! అది నిన్ను రక్షిస్తుందా?"

 

    "అయితే నాకీ ఉద్యోగం అక్కర్లేదు"

 

    "మానేయ్!"

 

    "నాకు రావలసిన చీటీ డబ్బు ఇచ్చెయ్యండి - నేను వెళ్ళిపోతాను.'

 

    "ఏం చీటీ?" అన్నాడు మేనేజర్ ఏం ఎరగనట్లు.

 

    దెబ్బతిన్నట్లు చూసింది మీనాక్షి.

 

    "మీ హోటల్ వాళ్ళకే ఒక చిట్ ఫండ్ కంపెని ఉందిగదా! అందులో నన్ను బలవంతంగా చేర్చారు గదా!" అంది .

 

    మేనేజర్ నవ్వాడు.

 

    "ఓ అదా! జీతం డబ్బులు ఆ చీటికి కడితే ఒక్కసారిగా లక్ష ఇస్తామన్నారు. అమ్మ ఆపరేషన్ కి పనికి వస్తుందని అత్యాశకి పోయి అందులో ఇరుక్కున్నావు! అవునా?"

 

    "అయితే నా డబ్బు నాకు ఇవ్వరా!" అంది మీనాక్షి కోపంగా.

 

    "ఇస్తారు" అన్నాడు మేనేజర్.

 

    "ఇచ్చెయ్యండి"

 

    "ఇప్పుడు కాదు - నువ్వు ఈ రాత్రికి న్యూడ్ డాన్సు చేశాక!"

 

    చచ్చినా చెయ్యను! అంది మీనాక్షి.

 

    "ఆలోచించుకో! మేం ఆడించినట్లు ఆడితే ఆఠీన్ రాణీగా వెలిగిపోతావు ........కాదని ఎదురు తిరిగితే ఉన్న ఉద్యోగం పోతుంది. నువ్వు ఇన్నాళ్ళు కట్టిన చిట్టి డబ్బు యాభైవేలు పోతుంది" అన్నాడు మల్ హోత్రా.

 

    "ఇలా మాట్లాడ్డానికి నీకు సిగ్గు లెదూ?" అంది మీనాక్షి.......కంపిస్తున్నా స్వరంతో.

 

    "నీకు సిగ్గు మరి ఎక్కువలాగా వుందే.........ముందు అది పోగొట్టడానికి నేను కాస్త రిహార్సల్స్ చేయిస్తా సరేనా!" అన్నాడు మల్ హోత్రా, లేచి నిలబడుతూ........

 

                                                            * * *

 

    ఇక్కడ ఇది ఇలా జరుగుతుండగా.......

 

    అక్కడికి దగ్గరగా వున్న ఒక పోలిస్ స్టేషన్ లో........

 

    సర్కిల్ ఇన్ స్పెక్టర్ చిరచిరలాడుతూ కూర్చుని ఉన్నాడు. అప్పుడే లోపలికి వచ్చాడు హెడ్ కానిస్టేబుల్.

 

    "ఎమతున్నాడు " అన్నాడు సర్కిల్ ఇన్ స్పెక్టర్.

 

    "పారడైజ్ హోటల్ కి వెళ్ళాను సార్! పైసా కూడా ఇవ్వనన్నాడు" అన్నాడు హెడ్ కానిస్టేబుల్.

 

    "ఏం రోగమంట?

 

    గొంతు సవరించుకున్నాడు హెడ్ కానిస్టేబుల్.

 

    "ఆ మల్ హోత్రా వున్నాడే ఆయనతో మంచిగా వుంటే మంచి, చెడ్డగా వుంటే చెడ్డ సార్! వెళ్ళి మీరు చెప్పమన్నట్లే చెప్పిన! గరం అయిపోయిండు!"

 

    "ఏం చెప్పావు?" అన్నాడు సర్కిల్.

 

    "పోలిస్ వాకాలో కానిస్టేబుల్స్ ఎవ్వరు లేరు ......బందోబస్తుకి రావాలంటే పదివేలు ఇస్తే ఎట్లయినా సాబ్ అరేంజ్ చేస్తాడంట అని చెప్పినా !"

 

    "ఎమన్నాడూ?"

 

    "చాలా గరమైండు సార్! మీరు వచ్చి, నక్కగ పనిచేసి అడిగితే పదివేలు కాదు........పదిహేనువేలు ఇచ్చేమాట! మీ సర్కిలు టెషన్ లో కూచుని పైసలు తెమ్మంటాడు? నేనివ్వ! వెళ్ళి చెప్పు! అన్నాడు సార్" అన్నాడు హెడ్ కానిస్టేబుల్..........

 

    "అట్లనా! నాయాలికి బలిసింది! హోటల్ ని రెయిడ్ చేసి దొరికిన ఆడపిల్లలందరిని బొక్కలో తోయ్!" అన్నాడు సర్కిల్ కోపంగా లేచి నిలబడుతూ.

 


                                             * * *

 

    గ్రీన్ రూంలో మీనాక్షి వున్న పరిస్థితి ఏమిటో తెలియని రాజా యధాలాపంగా , అక్కడ కూర్చుని వున్న కస్టమర్స్ వైపు చూశాడు.

 

    ఇంకా ఈ ఆఠీన్ రాణీ రాదేం?

 

    అసహనంగా మళ్ళీ గిటార్ మీటాడు రాజా.........

 

    దానికి ప్రతిధ్వనిలాగా........

 

    ఆకాశంలో నుంచి మరో ధ్వని వినబడింది.

 

    అంత గందరగోళంలో, అంత కోలాహలంలో కూడా ఆ ధ్వని వినగలిగింది రాజా ఒక్కడే!

 

    అతని గ్రహణ శక్తి అతి నిశితం!

 

    అతను తక్షణం బయటికి వచ్చేసి , పైకి చూశాడు.

 

    ఆకాశంలో అతనికి కనబడింది ఒక విమానం!

 

    అది ఎగురుతున్న పద్దతి చూడగానే గ్రహించాడు రాజా.....

 

    ఆ విమానం ప్రమాదంలో ఉందని!

 


                                                * * *

 

    ఆకాశంలో.......

 

    ఆ ఎయిర్ బస్సు విమానం కంట్రోలులో లేకుండా అటూ ఇటూ తూలుతూ వెళ్తోంది.

 

    అయితే....

 

    లోపల కూర్చున్న ప్రయాణికులు ఎవ్వరు కూడా ముంచుకొస్తున్న ప్రమాదాన్ని ఇంకా గ్రహించినట్లుగా లేరు......

 

    విమానంలో ముందు వరసలోని ఒక సీట్లో కూర్చుని ఉన్నాడు విక్రమదేవరావు.

 

    అతని సీటు ఓ సింహాసనం మోడల్లో చేయబడి ఉంది......కాదు.....అలా అతడు దాన్ని చేయించుకున్నాడు .

 

    ఆ విమానం అతని సొంతం?

 

    ఆ విమానాలని నడిపించే కంపెని "ద గ్రేట్ ఎంపరర్ ఎయిర్ లైన్స్" కూడా అతని సొంతమే!

 

    సింహాసనం లాంటి ఆ సీట్లో నక్కలా కూర్చుని ఉన్నాడు విక్రమదేవరావు......

 

    అతని పేరులో ఉన్న గంభీర్యం అతని వ్యక్తిత్వంలో లేదు........

 

    కానీ దర్పం తెచ్చి పెట్టుకుని, తనలో తనే ఏవో స్తోత్ర పాటాలు వల్లించుకుంటున్నాడు విక్రమదేవరావు....

 

    అప్పుడే అటూ వైపు వచ్చిన ఎయిర్ హోస్టస్ కి అతని గొణుగుడు వినబడింది.

 

    "రాజా విక్రమదేవరావ్. రాజా ఆఫ్ రాణిపురే! ఆర్డర్ ఆఫ్ బ్రిటీష్ ఎంపయిర్. ఫెయిత్ ఫుల్ అల్లే ఆఫ్ ద బ్రిటీష్......"

 

    వళ్ళు భగ్గున మండింది ఎయిర్ హోస్టెస్ అంజలికి.

 

    విక్రమదేవరావు వెర్రికళలని గురించి అతని భేషజం గురించి అంజలికే కాదు- అందరికి తెలుసు!

 

    విక్రమదేవరావు ఒక సెల్ఫ్ మేడ్ మాన్. వ్యాపారంలో కోటానుకోట్లు సంపాదించాడు. డబ్బు అన్ని రకాలుగా తృప్తి నిస్తుందని అతను నమ్మేవాడు - తన దగ్గర డబ్బు చేరకముందు! తీరా డబ్బు చేరాక ఆ డబ్బు అప్టరాల్ అన్ని రకాల సుఖాలని తెచ్చి ఇవ్వలేదని అతను గ్రహించాడు.

 Previous Page Next Page