3
ఆ యింట్లో ప్రతిరోజూ దీపాలు వెలుగుతూనే వున్నాయి. కాని కాంతిని కోల్పోయి కళా విహినంగా వెలుగు ప్రసాదిస్తున్నాయి. ఇంటికి దీపం ఇల్లలన్నారు. ఆ యింటి దీపం ఆరిపోయి ఆరు నెలలయింది. ఇల్లలున్నా ఆ కళ ఆ కాంతి రమ్మంటే ఎక్కడినుంచి వస్తుంది?"
"నేనేం పాపం చేశాను సావిత్రి? అంటూ రామచంద్రం రోజుకి పదిసార్లయినా కళ్ళనీళ్ళు పెట్టుకుంటుంటాడు.
పిల్లలకి అనుక్షణం తల్లి గుర్తుకు వస్తూనే వుంటుంది.
ఆదివారం కావటంతో రామచంద్రం ఇంట్లోనే వున్నాడు.
రామచంద్రం సీత కలిసి పిల్లందరికి తలంటి నీళ్ళు పోశారు. ప్రతిరోజూ ఉదయం ఇద్దరూ కలిసి వంట చేస్తున్నారు. సీతకి కాఫీ కాయటం, అన్నం వండటం, కూరలు తరగటం దాకా వచ్చు. అదయినా తల్లి వూరుళ్ళినప్పుడు, ప్రతినెలా వుండే మూడు రోజుల యిబ్బందికి నేర్చుకుంది ఇప్పుడు శాశ్వతంగా తల్లి దూరం కావటంతో తండ్రి ఆఫీసుకి పరుగెత్తుతూ చాతయి చేతగానట్లు నాలుగు మెతుకులు ఉడకేస్తుంటే తండ్రితో పాటు కలిసి చేస్తూ కొంత వంట మరి కొంత యింటిపని నేర్చుకుంది.
రామచంద్రం మగాడు, మగాడు ఎడ్వడని అనుకోవటం పొరపాటు. మొదట్లో పిల్లలు భయపడతారని లోలోపల కుమిలిపోయి అర్ధరాత్రప్పుడు లేచి గుండెల్లో బరువు దిగేలా బిగ్గరగా ఏడ్చేవాడు. రెండు మూడుసార్లు సీత లేచి చూడటం జరిగింది. తనూ తండ్రిని కౌగలించుకొని పెద్ద పెట్టున ఏడ్చేది. అప్పుడు ఒకరి నొకరు ఓదార్చుకునే వారు ఆ తర్వాత లోలోపల దుఃఖాన్ని దిగమింగి ఎవరికి వారు మామూలుగా వున్నట్టు ప్రవర్తించేవారు.
"మీ అమ్మ మంచిది కాదమ్మా! మనందరినీ అన్యాయం చేసి వెళ్ళింది. ఉత్త స్వార్ధపరురాలు" అనేవాడు రామచంద్రం. ఈ మాటన్న కాసేపటికి "మీ అమ్మ దేవత సుఖపడటానికి ఏ స్వర్గానికో పారిపోయింది ఈ పాపిస్టివాడికి ఆయుస్సు ఎక్కువ" అనేవాడు.
భార్యా భర్తల అనురాగ వియోగాలకి అర్ధం అంత చిన్న వయసులో సీతకి బాగా అవగాహనమయింది.
ఆరేళ్ళ ఆఖరి పిల్లవాడు రాజుకి తలంటి పోస్తుంటే కుంకుడురసం కళ్ళలో పడింది. "అమ్మా" అంటూ రాగం ఎత్తుకున్నాడు. గంట తర్వాత కళ్ళ మంటలు తగ్గయిగాని అమ్మని మరచిపోలేదు. "అమ్మా! ఊ....ఊ....." అంటూ రాగం తీస్తూనే వున్నాడు. ఇంట్లో అందరూ వరస పెట్టి వాణ్ణి ఓదార్చారు వాడి ఏడుపు ఎక్కువయింది గాని ఏ మాత్రం తగ్గలేదు.
సరీగా అప్పుడే రామచంద్రానికి బాబాయి వరసయిన శివరావు వచ్చాడు.
"కూర్చో బాబాయ్!" అంటూ కుర్చీ వేశాడు రామచంద్రం.
"కుర్చోటానికే వచ్చా నీతో ఓ విషయం మాట్లాడాలిరా!" అన్నాడు శివరావు.
"ఓ విషయమేమిటి పాతిక విషయాలు మాట్లాడు. ఇవాళ ఆదివారం ఇంట్లోనే వింటా." అన్నాడు రామచంద్రం.
కొద్దిసేపు వాళ్ళిద్దరి మధ్య మాటలు మామూలుగా దొర్లి తర్వాత వాదనకి దిగాయి.
పక్కగదిలో వున్న సిత భయంతో జాగ్రత్తగా వినటం మొదలుపెట్టింది వాళ్ళ మాటలని.
నా శ్రేయస్సు కోరేవాడివయితే ఇంతదూరం ఈ విషయం రానిచ్చే వాడివి కాదు బాబాయ్!" అన్నాడు రామచంద్రం.
"నీ బాగు కోరేవాడిని కాబట్టి వెతికి మంచి సంబంధం చూసి వుంచాను" అన్నాడు శివరావు కాస్త గట్టిగానే.
"నా మంచి చెడ్డలు నీకు తెలియదా బాబాయ్?"
"ఆ" తెలుస్తూనే వుంది. అడిపోయినప్పటి నుంచీ చూస్తూనే వున్నాను ఇప్పుడు కళ్ళారా చూశాను. రాజుగాడు వాడేవిధంగా అమ్మో అని ఏడుస్తున్నాడా? సేత అది చిన్నదే పనితో నలిగిపోయింది బొంగరంలా ఉండాల్సిన పిల్ల టైఫాయిడ్ రోగిలా తయారయింది. మిగతా పిల్లలు అంతే, ఇహ నీ సంగతి ఇటు యింతిపని అటు ఆఫీసుపని, అది పోయిందనే దిగులు, ఎలావున్నావో తెలుసా! ఉఫ్ అంటే ఎగిరి పోయేలా వున్నావు నువ్వు కూడా అన్యాయం చేయ్యదలిచావా ఏమిటి?"
"నా గురించి దిగులు పడకు బాబాయ్, నా దసలె మొండి ప్రాణం."
"కబుర్లు చెప్పకురా. అసలిప్పుడు నీ వయసేమంతా మించిపోయిందని...?
"నా అనుభవం నా వయసుని మించిపోయింది."
"మాటలతో తప్పించుకోకు. మీ పిన్ని పొతే నేనేం చేశాను, దాంతో పాటు నేను పోయానా? మానవధర్మం రెండు రోజులపాటు విచారించాను. మళ్ళి పెళ్ళిచేసుకోలేదు"
"నీ యిష్టం నీది"
"ఇక్కడ గమనించాల్సింది యిష్టం కాదురా అవసరం మనిషికి మనిషి తోడు, మళ్ళి పెళ్ళంటూ చేసుకున్నావంటే అ వచ్చేది ఇటు యింట్లో పిల్లలని చూస్తుంది. నీకు శ్రమ తగ్గుతుంది. నామాట విను కాదన్నావంటే మళ్ళి నీ గురించి పట్టించుకోను" నచ్చ చెపుతున్న విధంగా అన్నాడు శివరావు.