వెంపటాపు11 , కైలాసం12
యీళ్ళంతా యీరాది
యీరులురా సోదరా
యీళ్ళదారి నీదిరా
యింక బయంలేదురా
యేర్రెర్రని రగతాల
యేరుల్లో యీదరా
సోదరా సహోదరా
జన భారత వృకోదరా
పతితుడివో భ్రష్టుడివో
బాధాసర్ప దష్టుడివో
దగాపడిన తమ్ముడివో
శ్రీశ్రీ ప్రియ శిష్యుడివో
చూస్తావేం నీవిప్పుడు
దాస్తావేం నీవిప్పుడు
చెయ్యి మరో ప్రస్తానం
తియ్యి బృహత్ ప్రాగ్ద్వరం
విప్పు మరో అధ్యాయం
తిప్పు మహత్ కౌక్షేయం
విప్లవం వర్ధిల్లాలి
విప్లవం వర్ధిల్లాలి
విప్లవం వర్ధిల్లాలి
రచన 2 - 12 - 1973
ముద్రణ : ఎరుపు, విరసం బులిటెన్ - 1974
పునర్ముద్రణ : మరో ప్రస్థానం, విరసం ప్రచురణ - మే 1980
1. చండ్ర పుల్లారెడ్డి (-1984): క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో (1942) గిండీ ఇంజనీరింగు కాలేజి (మద్రాసు) నుంచి వెళ్లగొట్టాక రాజకీయాల్లో పూర్తిగా మునిగిపోయారు. తెలంగాణా సాయుధ పోరాట కాలంలో అజ్ఞాతవాసం (1948 - 51) గడిపారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్ర అసెంబ్లీకి కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం నుంచి కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థిగా ఎన్నికయ్యారు (1952).
నక్సల్ బరీ శ్రీకాకుళ పోరాట రాజకీయాల నాటి (1968) నుంచి పూర్తి అజ్ఞాతవాసమే. 'వీర తెలంగాణా విప్లవ పోరాటం' లాంటి రాజకీయ గ్రంథాలు రాశారు. గోదావరి లోయపోరాటాలకు నాయకత్వం వహించారు. ఎం.ఎల్.పార్టీ ముఖ్య నాయకుల్లో ఒకరు. ఆయన నాయకత్వంలో ఒక ఎం. ఎల్. పార్టీ కూడా ఏర్పడింది. అజ్ఞాతవాసంలో ఉండగానే అనారోగ్యంతో 9 - 11 - 1984న కలకత్తాలో కన్నుమూశారు.
2. తరిమెల నాగిరెడ్డి (1917 - 76): విద్యార్థి దశనుంచే రాజకీయాల్లో నిమగ్నమయ్యారు. జాతీయోద్యమం (1940) నుంచి విప్లవ కమ్యూనిస్టు ఉద్యమం (1969) వరకు చాలా ఏళ్లు అటు అజ్ఞాతవాసంలోనూ, ఇటు జైలులోనూ ఉన్నారు. జైలులో ఉండగానే ఉమ్మడి మద్రాసు రాష్ట ఎమ్. ఎల్. ఎన్నికయ్యారు(1951). ఆనాటి రాష్ట్ర కాంగ్రెసు నాయకుడు నీలం సంజీవరెడ్డిని ఓడించారు. మంచి పార్లమెంటేరియన్ గా పలువురి ప్రశంసలు పొందారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సభ్యత్వానికి రాజీనామా (మార్చి 1969) ఇచ్చి పార్లమెంటరీ రాజకీయాలకి స్వస్తి చెప్పి అజ్ఞాతవాసానికి వెళ్లిపోయారు. ఆయన్ని అరెస్టుచేసి (డిసెంబరు 1969) హైదరాబాద్ కుట్ర కేసులో మొదటి ముద్దాయిగా పెట్టారు. 'ఇండియా మార్టుగేజ్ డ్' అనే పేరుతో ఆయన చదివిన కోర్టు ప్రకటన (ఫిబ్రవరి - మార్చి 1972) ఆ తర్వాత పుస్తకంగా వెలువడింది (1978). భారత ఆర్థిక వ్యవస్థమీద ఇది మార్క్సిస్టు లెనినిస్టు విశ్లేషణ. ఎమర్జెన్సీ ప్రకటించాక(25 - 6 - 1975) మార్క్సిస్టు - లెనినిస్ట్ పార్టీలను నిషేధించాక (4 - 7 - 75) అజ్ఞాతవాసంలోకి వెళ్లారు. ఆయన నాయకత్వంలో యుసిపిఐ. ఆర్. ఎం. ఎల్ పార్టీ ఏర్పడింది. కామెర్ల జబ్బుచేసి మారుపేరుతో ఉస్మానియా ఆసుపత్రి (హైదరాబాద్) లో చేరగా 28 - 7 - 1976న చనిపోయారు. శవాన్ని స్వగ్రామానికి కారులో తీసికెళుతూంటే నాగిరెడ్డి గారిదని తెలిసి అరెస్టు చేశారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు. విప్లవ కమ్యూనిస్టు నాయకుని శవాన్ని అరెస్టు చేసిన కీర్తి కాంగ్రెసు దక్కించుకుంది.
3. కంభం జ్ఞాన సత్యమూర్తి (1931-): ఉమ్మడి కమ్యూనిస్టు ఉద్యమం నాటి నుంచి విద్యార్థి, యువజన సంఘాల్లో క్రియాశీలంగా పనిచేసేవారు. తెలుగు స్వతంత్ర వారపత్రికలో కథలు, వ్యాసాలు రాసేవారు (1950 - 51). ఆంధ్రా యూనివర్సిటీలో పాలిటిక్స్ ఎమ్.ఏ. పాసయ్యారు. కొన్నాళ్లు విశాలంధ్ర (1960 - 61)లో పనిచేశారు. గుంటూరు రవి కళాశాలలో, తర్వాత కాజీపేట గాబ్రియల్ స్కూలులో టీచరుగా పనిచేశారు. (1963 - 66). కొండపల్లి సీతారామయ్యతో కలిసి ఎమ్. ఎల్. పార్టీ నిర్మాణంలో పాల్గొన్నారు. పార్వతీపురం, జంటనగరాలు, సికిందరాబాద్; రామ్ నగర్ నక్సలైటు కుట్ర కేసుల్లో ముద్దాయి. ఆరేళ్లు (1972 - 78) జైలులో ఉన్నారు. పీపుల్స్ వార్ కేంద్రకమిటీ కార్యదర్శిగా (1982 - 85) పనిచేశారు. ఉద్యమ స్ఫూర్తితో శివసాగర్ పేరుతో కవితలు, గేయాలు, పాటలు చాలా రాశారు. పార్టీ నిర్మాణ రాజకీయ కారణాలవలన 1985లో పీపుల్స్ వార్ నుంచి తొలగించబడ్డారు. వేరే పార్టీ ఏర్పాటు చేసుకుంటున్నారు.
4. చారుమజుందార్ (1916-72): తెభాగా ఉద్యమం (1946) నుంచి బెంగాల్ కమ్యూనిస్టు నాయకులు. సిల్గురిలో రైతాంగ ఉద్యమాన్ని నిర్మించారు. కాను సన్యాల్ తో కలిసి నక్సల్ బరీ పోరాటానికి నాయకత్వం వహించారు. ఏప్రిల్ 22న లెనిన్ జయంతి రోజు సిపిఐఎంఎల్ పార్టీని ఏర్పాటుచేసి మేడేనాడు కలకత్తాలో ఓఅక బహిరంగ సభలో పార్టీ స్థాపనను ప్రకటించాడు. సిపిఐఎంఎల్ ప్రప్రథమ కార్యదర్శి. నక్సలైట్ నాయకుల్లో విశేషంగా గౌరవాభిమానాలు చూరగొన్న వ్యక్తి. అటు తరువాత ఎమ్.ఎల్. పార్టీలో పొడసూపిన విభేదాలు, వచ్చిన చీలికలు చారుమజుందారు సిద్ధాంతాల చుట్టూ తిరిగినవే. మంచి సిద్దాంతకర్త, అన్వయశీలి కూడా. కలకత్తాలో అరెస్టయి చివరకు పోలీసు లాకప్ లో 28-7-1972న చనిపోయారు.
5. కొల్లిపర రామనరసింహారావు (193-72): మద్రాసు సినిమా రంగంనుంచి నక్సలైట్ రాజకీయాలవైపు ఆకర్షితుడయ్యారు. చారుమజుందార్ తో స్వయంగా మాట్లాడివచ్చారు. కొండపల్లి సీతారామయ్య, సత్యమూర్తిలతో చెలిమిచేసి ఎమ్. ఎల్. పార్టీ నిర్మాణంలో పాల్గొన్నారు. అతని మారుపేరు లింగన్న. ఖమ్మం, వరంగల్ జిల్లాల సరిహద్దుల్లోని గురిమెళ్ల అడవుల్లో నల్లగుట్ట కొండనేలమీద మే 11, 1972న పట్టుకుని కాళ్లుకోసేసి, వేళ్లు నరికేసి, కళ్లు పీకేసినా చెక్కుచెదరకుండా పార్టీ రహస్యాలను ప్రాణప్రదంగా కాపాడారు. పోలీసులు ఆయన్ని రకరకాల చిత్రహింసలకు గురిచేసి చివరికి అదే రోజు కాల్చి చంపేశారు.
6. పంచాది కృష్ణమూర్తి (1937 - 27 - 5 - 1969), పంచాది నిర్మల (1944 - 22 - 12 - 69): ఇద్దరూ నిరుపేద రైతు కుటుంబాల్లో జన్మించి రైతాంగ పోరాటంలో ప్రముఖ పాత్ర వహించి 32, 25 ఏళ్ల చిన్నవయస్సుల్లోనే పోలీసు తూటాలకు ఒరిగి అమరులైనవారు. కృష్ణమూర్తి ఎం.ఏ. చదివారు. పద్యాలు, పాటలు అంటే గొప్ప సరదా. నాటకాల్లో స్త్రీ పాత్రలు ధరించేవారు. 1956లో కమ్యూనిస్టు ఉద్యమంవైపు ఆకర్షితులై నాలుగేళ్ల తర్వాత దాని యువజన సంఘానికి కార్యదర్శి అయ్యారు. మందసాలో మకాం పెట్టు రైతు ఉద్యమ నిర్మాణానికి కృషి చేశారు. శ్రీకాకుళం జిల్లా పార్టీ ప్రముఖ నాయకుల్లో ఒకరు. కలకత్తా పార్టీ మహాసభల్లో పాల్గొని సిపిఐఎంఎల్ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. సిపిఐఎంఎల్ ఆంధ్రా కమిటీకి ప్రప్రథమ కార్యదర్శి. పార్టీ సాయుధ విముక్తి పోరాట పంథామ చేపట్టడంలో పంచాది ప్రముఖ పాత్ర వహించారు. స్వయంగా పోరాటంలో పాల్గొని పోలీసు కాల్పుల్లో మరణించారు. నిర్మల 1963లో కృష్ణమూర్తిని వివాహం చేసుకుని ఆయన నేర్పిన కొద్దిపాటి చదువుతోనే రాజకీయ పరిజ్ఞానం సంపాదించింది. రైతాంగ మహిళలకు రాజకీయ చైతన్యం కలిగిస్తూ పోరాటాలు నడిపింది. కృష్ణమూర్తిని కాల్చేశాక ఆమె ఎంతో నిబ్బరంగా దళ నాయకత్వం వహించి పోరాడింది. సుబ్బారావు పాణిగ్రహి, రమేశ్ చంద్ర సాహు, ఉమారావు, అంకమ్మ, సరస్వతిలతోపాటు నిర్మలని పోలీసులు రంగమెటియా కొండల్లో 22- 12 -69న కాల్చి చంపారు.
7. అల్లిపురం " శ్రీకాకుళం సాయుధ రైతాంగ పోరాటం (1967 -71) ముమ్మరంగా జరుగుతున్నప్పుడు విప్లవకారుల్ని ఎన్ కౌంటర్లలో కాల్చిచంపడమే కాకుండా, విప్లవ ప్రజానీకాన్ని కూడా అరెస్టుచేసి తీవ్ర నిర్భందానికి గురిచేసి, చిత్రహింసల పాలుచేసి జైళ్లలో చంపారు. అలా చనిపోయిన వారిలో అల్లిపురం ఒకరు. పార్వతీపురం గిరిజనుడు. ఇంతకంటే ఇతని గురించి వివరాలు తెలియవు.
8.డోరిక సింహాద్రి (- 1969): పార్వతీపురం గిరిజనుడు. వేలమంది గిరిజనులతో కలిసి అరెస్టయి, జైలులో రకరకాల చిత్రహింసలకు గురై చనిపోయాడు. అల్లిపురం, సింహాద్రి వీరంతా ఒకే విధంగా మరణించినవారు.
9. చాగంటి భాస్కరరావు (1940 - 22 - 11 - 1969): వీరిది ప్రకాశం జిల్లా పరుచూరు గ్రామం ధనిక రైతు కుటుంబంలో పుట్టారు. గుంటూరులో ఎమ్.బి.బి.ఎస్. పాసయ్యారు. నేత్ర వైద్యంలో ప్రత్యేక నైపుణ్యం సాధించారు. ఒంగోలులో ప్రజావైద్యశాల నడిపారు (1968). క్రమశిక్షణంటే ప్రాణం, శ్రీకాకుళ పోరాటంలో స్వయంగా పాల్గొన్నారు. పోలీసు కాల్పుల్లో మరణించారు.
10. తామాడ గణపతి (1934 - 22 -11 -69). తామాడ చినబాబు (1955 - 27.5.69): గణపతిది శ్రీకాకుళంజిల్లా బొడ్డపాడు. 1963 నుంచి కమ్యూనిస్టు ఉద్యమంలో పనిచేస్తూ ప్రజల మనసుల చూరగొన్నాడు. ప్రజాకోర్టు ఆదేశానుసారం ప్రజాశత్రువు కామేశుని తన దళంతో వెళ్లి ఖతం చేశాడు. సోంపేట తాలూకా ప్రాంత విముక్తి పోరాటానికి నాయకత్వం వహించి చాగంటి భాస్కరరావుతోపాటు శత్రువుచేత చిక్కాడు. 22 - 11 - 69న పోలీసులు కాల్చిచంపారు. తామాడ చినబాబు సుబ్బారావు పాణిగ్రాహి జముకుల కథలో కళాకారుడు. ఆడవేషం వేసేవారు. పేదరైతు కుటుంబంలో పుట్టారు. రైతాంగ విముక్తి పోరాటంలో కోరియరుగా కూడా పనిచేశారు. పంచాది కృష్ణమూర్తితో పాటు జలంతర్ కొండల్లో పోలీసులు అతన్ని కాల్చి చంపారు. అప్పటికి అతని వయస్సు ౧౫ ఏళ్లు కూడా నిండలేదు.
11. వెంపటాపు సత్యనారాయణ (1935 - 10 - 7 - 1970) బొబ్బిలి తాలూకా బూర్జు వలన గ్రామంలో పుట్టారు. పేద రైతు కుంటుంబం. కొండచారిడి ఊళ్లో స్కూలు మాస్టారుగా పనిచేశారు. గిరిజనులంతా ఆయన్ను 'కొండచారిడి' మాస్టరని పిలుచుకునేవారు. సంఘాలు పెట్టి గిరిజనులను సమీకరించారు. జిల్లా కమ్యూనిస్టు కమిటీ సభ్యుడయ్యారు (1960). మొట్టమొదటి గిరిజిన రైతు మహాసభను మొండెంఖల్ లో నిర్వహించారు. (జూన్, 1960). అయిదవ జిల్లా గిరిజన రైతుమహాసభ మొండెంఖల్ లో (31 - 10 - 1967) ఉద్రిక్త వాతావరణంలో జరిగింది. శ్రీకాకుళం జిల్లా కమ్యూనిస్టు కమిటీ సాయుధ రైతాంగ విముక్తి పోరాటాన్ని ప్రారంభించాలని (25 - 11 - 1968) నిర్ణయించాక గెరిల్లా పోరాటంలో వెంపటావు సత్యం ఎనలేని చొరవ, సాహనం ప్రదర్శించారు. ఆయన విరామ మెరుగని విప్లవకారుడు. కామ్రేడ్ ఆదిభట్ల కైలాసంతో కలిసి 10-7-1970న బోరికొండల్లో పోలీసు కాల్పులో చనిపోయారు.
12. ఆదిభట్ల కైలాసం(1933 - 10.7.1970): వెంపటావు సత్యంలాగా ఈయన కూడా స్కూలు మాస్టరు. శ్రీకాకుళం జిల్లారైతు ఉద్యమానికి పునాది వేశారు. రైతాంగ విముక్తి పోరాటంలో ప్రముఖ పాత్ర నిర్వహించిన విప్లవకారుడు. పంచాది కృష్ణమూర్తి అమరత్వం తర్వాత ఆంధ్ర పార్టీ (సిపిఐఎంఎల్) కార్యదర్శి అయ్యారు. సత్యంతోపాటు పోలీసు కాల్పుల్లో చనిపోయారు.