Read more!
 Previous Page Next Page 
ముగ్ధ పేజి 2

   

   "నీలిమా, ముగ్దా, సురభీ, వినండి... ఇవాళ స్పష్టంగా చెపుతున్నాను. నా లైఫ్ ఏంబిషన్ ఏంటో నీలిమ నన్ను బాగా అబ్జర్వ్ చేసింది నీలిమ చెప్పింది కరెక్ట్. నేను ఎలిమెంటరీ స్కూల్లో చదువుతున్నప్పుడే ఫస్ట్ టైమ్ రేఖ ఫోటోని చూసాను. రాన్రానూ రేఖ గురించి తెలుసుకున్నాను. రేఖ నా ఆరాధ్య దైవం. బతికితే రేఖలా బతకాలి. మార్లిన్ మన్రోలా ప్రపంచాన్ని గజగజలాడించాలి. పామెల్లా బోర్డస్ లా సెన్సేషన్ క్రియేట్ చేయాలి. కామసూత్ర కండోమ్స్ అడ్వర్టేజ్ మెంట్ ద్వారా యిప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న పూజాబేడీలాగే ఆమె తల్లి ప్రతిమాబేడీ కూడా ఒకప్పుడు ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెల్సా... అలా వుండాలి.
    
    సెన్సేషన్ లేనిదే ప్రపంచం లేదు. నిత్యం రంగురంగుల ప్రపంచంలో బతకాలంటే, నిత్యం ఆకర్షణల వలయాలలో అద్భుతంగా తిరగాలంటే, లక్షల కళ్ళు నన్ను వాచ్ చేస్తుండాలి. పేపర్లు, పత్రికలు న ఆహ్సుట్టూ, నేను క్రియేట్ చేసే న్యూస్ ని ప్రచారం చేసుకుంటూ తిరగాలి. నా కనుచూపు, నా కదలిక, నా మాట, నా అడుగు, నేనెక్కడుంటే అక్కడ, యువతరానికి ఓ థ్రిల్ ఉండాలి.
    
    ఇది నా డ్రీమ్ కాదు. అతిత్వరలో నేను నిజం చేసుకోబోయే వాస్తవం. దానికోసం నేనేమైనా చేస్తాను. అందుకోసమే నా వేట దేని కయినా ఒక వూత కావాలి. ఆ సపోర్టుకోసమే నేను వెయిట్ చేస్తున్నాను" చాలా ఆవేశంగా, ఉద్వేగంగా చెప్పింది అలక.
    
    "అలా పైరయిపోకే తల్లీ! మనిషన్నాక ఏదో ఒక కేజీ అయినా అజ్ఞానం వుంటుంది కదా. ఆ అజ్ఞానంతోనే నీలిమ వాగింది! నీ ఐడియాలు, ఐడియాలజీలు మాకు తెలీకనా? కోటను చూడ్డానికొచ్చావా? కొట్లాడు కోడానికొచ్చావా? పదండి, పదండి" ఆ మాటతో ఆ టాపిక్ ఆగిపోయింది.
    
    అమ్మాయిలూ, ఆ వెనక అబ్బాయిలు కొంతమంది కోట వెనక నున్న కొండెక్కారు. మరికొంతమంది రాణీమహల్ వేపు నడిచారు.
    
    ముగ్ధ, సురభి, అలక, నీలిమ రాణీమహల్లోకి అడుగుపెట్టారు. ఆ వెనక 'బాడీగార్డుల్లా' కొంతమంది అబ్బాయిలు, ఏవేవో జోకులు, అల్లరి నీలిమ హేండ్ బేగ్ లోంచి కెమెరా తీసి ఫొటోలు తీస్తోంది. ఓ అరగంట తర్వాత నదరూ కిందకు దిగారు. రాణీమహల్ వేపు నడిచి, అక్కడ ఓ పావుగంట గడిపి, పాడుబడ్డ అప్పటి ఉద్యానవనం దగ్గర కొచ్చారు.
    
    అక్కడకు కొంచెం దూరంలో నీళ్ళులేని కొలనుంది. అక్కడున్న కగు చెట్టుకింద కూర్చున్నారు.
    
    "ఇంత పెద్ద కోటకు ప్రహరీగోదాలేదు చూశావా?" తనో అద్భుతమైన విషయాన్ని కనుక్కున్నట్లుగా అంది సురభి.
    
    "నిజమేనే, ఎందుకు లేదు?" ఆశ్చర్యం వ్యక్తం చేసింది నీలిమ.
    
    మన హిస్టరీ మేడమ్ ని అడగాలి. గోడెందుకు లేదో తెలుస్తుంది" అలక అంది.
    
    "ఆవిణ్ణి అడుగుతావా? ఇంతే సంగతులు ఉన్న పిసరు హిస్టరీ జ్ఞానం అటకెక్కిపోతుంది. ఎవరయినా పరిశోధకుల్ని అడిగితే ఎందుకు లేదో తెలుస్తుంది" నీలిమ అంది.
    
    "పాపం....హిస్టరీ మేడమ్ మంచావిడేనే" జాలిపడుతూ అంది సురభి.
    
    "మంచావిడే నేను కాదన్నానా? ఆవిడ చదువుకున్న హిస్టరీ ఎప్పుడో మర్చిపోయుంటుంది. ఇప్పుడు ఆవిడ పరిశోధనలన్నీ ఆవిడ భర్త శ్రీధర్ చుట్టూరా తిరుగుతున్నాయి తప్ప ఆవిడకు మరో ధ్యాసలేదు" చెప్పింది నీలిమ.
    
    "ఏం?" అడిగింది ముగ్ధ ఆసక్తిగా.
    
    "నీకు తెలీదా చాలా ఇంటరెస్టింగ్ స్టోరీలే నాకుమాత్రం హిస్టరీ మేడం కన్పించగానే, వాళ్ళాయనే గుర్తుకొస్తాడనుకో పాపం. ఆయనేదో సైంటిష్టట. ఎప్పుడూ పరిశోధనలె ఆయనకు లేబరేటరీయే ఇల్లూ, బెడ్ రూమూ వాళ్ళకి పిల్లలు లేక పోవడానికి కారణం ఏమిటో తెలీదుగానీ, ఆయన రీసెర్చ్ పేరుతో లేబరేటరీలో వుండిపోయి, అమ్మాయిలతో కాలక్షేపం చేస్తున్నాడని మన హిస్టరీ మేడంకి అనుమానం. మన సురభికి ఆయన బాగా పరిచయం, ఏమే ఆయన గురించి చెప్పవే పాపం" నీలిమ సురభివేపు చూసి అంది.
    
    "నిజంగా ఆయన సబ్జెక్టులో జీనియస్సే ఆయన ఎదురుగా కూర్చుంటే, ఒక ఐన్ స్టిన్ ముందు, ఒక ఫ్రాయిడ్ ముందు కూర్చున్నట్టుంటుంది. మన డౌట్సుని ఎంత సులభంగా క్లియర్ చేస్తారో తెల్సా రేర్ అండ్ ఎన్ చాంటింగ్ పర్సనాలిటీ...ఐ లైక్ హిమ్..." సురభి చెప్పింది.
    
    "ఐలైక్ హిమ్ ఆహా.... అమ్మగారు ఆ పరధ్యానం కాండిడేట్ ని లైక్ చేస్తున్నారన్నమాట అయితే ఇందులో ఏదో గూడుపుఠాణి వుందన్నమాట" అలక వెక్కిరింతగా అంది.
    
    "గూడుపుఠాణీ కాదే పిచ్చిమొద్దూ లికింగ్ కీ, లవింగ్ కీ తేడా తెలీదు. ఏం ప్రేమిస్తే తప్పా చెప్పు ఆయనకేం .... ఎంత డిగ్నిఫైడ్ గా వుంటాడు" సపోర్టు చేస్తూ అంది సురభి.
    
    "పర్సనల్ పొగడ్తలదాకా వచ్చిందే వ్యవహారం. చూస్తుంటే.... నువ్వు నిజంగా ప్రేమిస్తావా, ప్రేమిస్తున్నావా?" ముగ్ధ మనోహరంగా నవ్వుతూ అంది.
    
    "అవునే ముగ్దా ఏం ప్రేమిస్తే తప్పా, తప్పున్నరా ఆయనకు పరిశోధనలే పిచ్చి ఆ పిచ్చిలో భార్య, ఇల్లునీ కూడా నెలలకు నెలలు మర్చిపోయిన సందర్భాలున్నాయి. తెల్సా ఆయనకు భార్యంటే ఎంత కోపమో తెల్సా ఆవిడ్ని చాలా విసుక్కుంటాడాయన తనకు తగ్గమనిషి దొరకలేదని ఎంత బాధపడతాడో తెల్సా మొదట్లో ఆయన భార్యని ఎంతలా ప్రేమించేవాడో తెల్సా కానీ రానురాను అన్నీ తెలిసిన భార్యే తానంటే విసుగుదల ప్రదర్శించడంతో ఆవిడమీద ఇష్టాన్ని ఆయన తన పరిశోధనలమీదకు మరల్చాడు. ఇప్పుడు ఆవిడంటే ఆయనకు ద్వేషం. ఆ ద్వేషానికి పూర్తిగా ఆవిడే కారణం. ఎప్పటికయినా తన ప్రతిభను ప్రపంచం గొప్పగా గుర్తిస్తుందనీ, నోబుల్ బహుమతిని పొందే అద్భుతమయిన విషయాన్ని తను కనుక్కోగలనని ఆయనకు నమ్మకం. ఆ నమ్మకం వల్లే ఆయనలా లేబరేటరీలోనే వుంటాడు. ఆవిడనుకునే విధంగా అమ్మాయిలతో గడపడానికి కాదు. ఆయనలాంటి వ్యక్తికాదు"
    
    "శ్రీధర్ గారు నీకంత బాగా తెల్సని నాకు తెలీదే. సారీ" అంది ముగ్ధ సురభితో.
    
    "ప్రేమించక ప్రేమించాక మంచివాడ్ని ప్రేమించావే అందరూ ఆ సైంటిస్ట్ ని ఏ నిక్ నేమ్ తో పిలుస్తారో తెల్సా మాడ్ మాక్స్ అంటారు. ఆ మాడ్ మాక్స్ గారిని నువ్వు లవ్ చేసి ఆ మాడ్ మాక్స్ గ్రూప్ లో చేరుతానంటే నాకేం అభ్యంతరంలేదు. కానీ జాగ్రత్త నువ్వూ మరో హిస్టరీ మేడంలా తాయారయ్యావనుకో అంతే మరి" అలక అంది.
    
    "అలా మాట్లాడక ఇవాళ మాడ మాక్స్ అన్నవాళ్ళే రేపు ఆయన్ని ఆశ్చర్యపోవచ్చు ఇవాళ ఆయన్ని చూసి పిచ్చి సైంటిస్ట్ అన్నవాళ్ళే రేపు ఆయన పక్కన నిలబడలేకపోవచ్చు మన హిస్టరీ మేడమ్ గనక సరిగ్గా ఆయన్ని డీల్ చేస్తే ఈ పాటికే ఆయన తననుకున్నదాన్ని సాధించేవాడని నా నమ్మకం. ఇవాళ ఆయన ఫస్ట్రేషన్ లో వున్నాడనుకుంటే దానిక్కారణం ఎవరు- ఆవిడే తను సాధించాల్సిన లక్ష్యం ఆయనకు దూరమైపోవడానికి కారణం ఎవరు... ఆవిడే" సురభి చెపుతోంది. ఆ మాటలకు అడ్డుగా వచ్చింది నీలిమ.
    
    "అన్నీ ఆవిడమీద తోసేయ్యడం అన్యాయమే తప్పయినా, ఒప్పయినా భార్యకు, భర్తకూ ఇద్దరికీ సమానమైన బాధ్యత వుంటుంది."

 Previous Page Next Page