Previous Page Next Page 
మొగలిబాకు పేజి 3

   

   పెరటి వాకిట్లో నిలబడ్డ నారాయణరావు కిచెన్ రూమ్ లో వున్న ఆంటీకి స్పష్టంగా కనబడడం లేదు.
   
    ఎవరో తనని పిలిచారన్న విషయం అర్ధమైన ఆమె__
   
    "ఈ మధ్య అడుక్కునేవాళ్ళు పెరట్లోకి కూడా వచ్చేస్తున్నారు_ అందుకే చెప్పాను..... ఆ గోడకో గేటు తగలెట్టమని....." అని గట్టిగా అనేయడంతో నారాయణరావు ముఖం బ్లాక్ అండ్ వైత ఇంద్రధనస్సులా అయిపోయింది.
   
    రెండోసారి పిలవబోయి ఆగిపోయాడు__ అంతలో ఆంటీగారి రెండో పాప సుదేష్ణ వచ్చి నారాయణరావుని రక్షించింది.
   
    "అమ్మా.....రావంకులమ్మా.... బెగ్గర్ కాదు......"
   
    "అవునండీ.... నేను బెగ్గర్ని కాను.... రావంకుల్ని...." కిచెన్ దగ్గరకెళ్ళి అన్నాడు.
   
    "ఈ మధ్య అందరి పిలుపులూ ఒక్కలాగే ఉంటున్నాయ్ బాబూ...... సరేకానీ.... నువ్వెందుకొచ్చావో చెప్పు.... ఫైవ్ రూపీస్ అప్పు కావాలా?"
   
    పూర్వాశ్రమంలో ఆవిడ దగ్గర అడపా, దడపా ఫైవ్ రూపీస్ తీసుకునేవాడతను.
   
    "లేదండీ.... రెండు కప్పుల కాఫీ కావాలి"
   
    డంగ్ మని తలెత్తి ఆశ్చర్యంగా అతనివేపు చూసిందామె.
   
    "కాఫీ కావాలా? కాఫీపొడి కావాలా?" మళ్ళీ అడిగింది మరింత ఆశ్చర్యపోతూ.
   
    "కాఫీయేనండి.... రెండు కప్పులు....."
   
    ఆమెకి ఏం మాట్లాడాలో అర్ధంకాక రెండు కప్పుల్నిండా కాఫీని పోసి, ఆ కప్పుల్ని అతనికి అందించింది. ఆ కప్పుల్ని తీసుకుని తన పోర్షన్ వేపు కదిలాడు నారాయణరావు.
   
    "రావంకుల్..... ఏది కావాలన్నా సిగ్గు లేకుండా అడుగుతాడు కదు మమ్మీ" సుదేష్ణ కామెంట్ చేసింది. ఆ పిల్ల ముఖంలోకి కోపంగా చూసి తన పోర్షన్ మెట్లెక్కాడు నారాయణరావు.
   
    సరిగ్గా అదే సమయంలో-
   
    అతని చూపులు రోడ్డు చివర టర్నింగ్ పాయింట్ దగ్గర ఉన్నాయి.
   
    వరసగా ఎనిమిది అంబాసిడర్ కార్లు సర్రు సర్రున అక్కడ మలుపు తిరిగి సూటిగా వచ్చేస్తున్నాయి.
   
    మధ్యనొక బ్లాక్ అంబాసిడర్ కారు, మిగతావన్నీ వైట్ అంబాసిడర్లు. ఆ కార్లను, ఆ హడావుడిని చూసి జనం అటూ ఇటూ తప్పు కొంటున్నారు. ఇంకొంత మంది పారిపోతున్నారు.
   
    "ఎలక్షన్ లా?" అనుమానంగా అడిగాడు నారాయణరావు.
   
    "ఇప్పుడెలక్షన్లేటి.....మొన్నే అయ్యాయి కదా! నాకయితే ఏదో సినిమాలో విలన్, విలన్ గ్యాంగ్ తో వస్తున్న తీరులా వుంది."
   
    "మనకు సిటీలో తెలీని విలన్ లు ఎవరున్నారబ్బా?" పిట్టగోడ మీద చెయ్యేసి ఆలోచిస్తున్నాడు నారాయణరావు.
   
    "అయ్యబాబోయ్.....రౌడీలు....." కుళాయిల దగ్గరున్న మహిళలు బిందెల్తో ఒకపక్క పరిగెత్తడం, కూరగాయలవాళ్ళు సందుల్లోకి జారుకోవడం, కొంతమంది ఎక్కడ స్కూటర్లను అక్కడ ఆపేసి నిలబడి పోవడంతో-
   
    "మకకెందుకు గురూ.....రా పోదాం" నారాయణరావు చేతిని పట్టుకుని లోపలకు తీసుకెళ్ళబోయాడు హనుమాన్లు.
   
    సరిగ్గా అదే సమయంలో-
   
    ఆ కార్లన్నీ వరసగా, నారాయణరావు ఇంటిముందే ఆగాయి. సర్రు సర్రుమని ఒక్కోకారు డోర్ తెరచుకోవడం, అందులోంచి అంతంత కండలు, ఇంతింత మీసాల్తో జనాలు దిగి, వరసగా నిలబడడం జరిగింది.
   
    అప్పుడే బ్లాక్ అంబాసిడర్ కారులోంచి ఒక వ్యక్తి అటూ ఇటూ చూసి డోర్ తెరచుకొని నెమ్మదిగా బయటికొచ్చాడు. అతను పెద్ద పహిల్వాన్ లా వున్నాడు. ఖద్దరు కమీజ్ వేసుకున్నాడు. దానికింద ఖాకీ నిక్కరు, చేతులకు వెండి కడియాలు, నుదుటన రూపాయకాసంత బొట్టు, దుబ్బు మీసాలు, సంజయ్ దత్ టైపులో జుత్తు.....
   
    "ఈ ఖాకీ నిక్కరేటి-ఆ ఖద్దరు కమీజేటి-ఆ బొట్టేటి-మీసాలేటి-వీడు రౌడీలా లేడు గురూ....భూతాల మాంత్రికుడులా ఉన్నాడు....." కిటికీ సందులోంచి అంతంత కళ్ళేసుకుని చూస్తున్న హనుమాన్ లు అన్నాడు.
   
   
    "వాడెవడో మనకేంటిగానీ, వాడు మనింటిముందే ఎందుకాగాడు? నాకేదో భయంగా ఉంది..... హౌసోనర్ కోసమా" గుండెలు బితుకు బితుకు మంటున్నాయి నారాయణరావుకి.
   
    ఇలా చర్చా కార్యక్రమం జరుగుతుండగానే సదరు ఖాకీనిక్కరు మనిషి నారాయణరావు ఇంటి మెట్లమీద ఠీవీగా ఓ అడుగువేసి-
   
    "ఒరే అబ్బాయ్.....ఇలా రారా" కిటికీలోంచి తొంగి తొంగి చూస్తున్న హనుమాన్ లు వేపు చూసి కేకేసాడు.
   
    హనుమాన్ లు ఒక్కసారి ఖంగు తినేసాడు. ఓరకంట కోపంగా నారాయణరావు వేపు చూశాడు.
   
    "నావేపు అలా చూస్తావేం....వాడివేపు చూడు.....వాడు నిన్ను పచ్చడి చెయ్యడానికే వచ్చినట్టున్నాడు" నవ్వుతూ అన్నాడు నారాయణరావు.
   
    "నిన్నే....రారా" ఈసారి గట్టిగా పిలిచాడు ఆ ఖాకీ నిక్కర్ విలన్.
   
    నెమ్మదిగా డోర్ తెరచుకొని బయటి కడుగేసాడు హనుమాన్ లు.
   
    ఆ ఖాకీ నిక్కరు మనిషి, హనుమాన్ లు దగ్గరగా వచ్చి, అతని భుజమ్మీద చెయ్యివేసి రహస్యంగా -
   
    "ఇక్కడ కుక్కలుగానీ ఉన్నాయా?" అని అడిగాడు.
   
    ఆ మనిషివేపు ఎగాదిగా చూసి "ఈ వీధిపేరే కుక్కలవీధి.....కుక్కలుందకుండా కుక్కలుంటాయా.... ఇందుకేనా నువ్విక్కడ కొచ్చింది?" అడిగాడు హనుమాన్ లు ఒకింత ధైర్యాన్ని ప్రోగి చేసుకొని.

 Previous Page Next Page